కృష్ణంరాజు – శ్యామల
పెళ్లయి ఇరవై మూడేళ్లయింది. అప్పుడే తీసి కడిగిన పెళ్లి ఫొటోలా ఫ్రెష్‌గా ఉన్నారు! ఇన్నేళ్ల బాధ్యతలు, ఒత్తిళ్లు, పిల్లల పెంపకం.. ఇవేవీ.. వీళ్ల అనురాగ బంధాన్నిచెక్కు చెదరనివ్వలేదా! ‘‘ఎందుకు చెదరనిస్తాయి?’’ అని అడుగుతున్నారు ఈ దంపతులు. క్రెడిట్ ఎవరిది? రెబల్‌స్టార్‌దా, శ్యామలగారిదా?! ‘‘చిన్నచిన్న విషయాలను పెద్దవిగా చేసుకోకుంటే.. ఆ క్రెడిట్ ఇద్దరిదీ అవుతుంది’’ అని అంటున్న మిస్టర్ అండ్ మిసెస్ కృష్ణంరాజుతో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ఈ సండే మీకోసం.
ఇటీవల కృష్ణంరాజుగారికి ఆరోగ్యం బాగాలేదని విన్నాం.. ఏం జరిగింది?
శ్యామల: ఏం లేదు.. జస్ట్ వైరల్ ఫీవర్. దానికే ఎవరికి వాళ్లు ‘క్రిటికల్’ అని ఊహించుకున్నారు. మనిషి బాగున్నప్పుడు అలా అనుకుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా.
కృష్ణంరాజు: ఆ బాధ, కోపంతోనే నేను గన్ షూట్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోను తను సోషల్ మీడియాలో పెట్టింది. అనవసరమైన గాసిప్పులు ప్రచారం చేస్తే షూట్ చేస్తానని అర్థం (నవ్వులు).
మరి... పెళ్లి రోజుని (నవంబర్ 20) ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?
శ్యామల: వైరల్ ఫీవర్ అని చెప్పాను కదా. అందుకని ఇంట్లోనే చేసుకున్నాం. మామూలుగా అయితే లంచ్‌కో, డిన్నర్‌కో బయటకు వెళతాం. పిల్లలు మంచి హోటల్స్‌లో మాకోసం పార్టీ ఎరేంజ్ చేస్తారు.
మీ పెళ్లయి 23 ఏళ్లు అట కదా... ఇన్నేళ్ల వైవాహిక జీవితం గురించి...
కృష్ణంరాజు: ఇన్నేళ్లయిందా అనిపిస్తోంది. రోజులు అంత వేగంగా వెళ్లిపోయాయనిపించింది అంటే జీవితం హ్యాపీగా ఉన్నట్లే. ఒక మంచి కలలా సాగిపోతోందంటే.. మా మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్ కారణం. కోపాలు ఎవరికైనా ఉంటాయి. అలా కోపం వచ్చినప్పుడు కాసేపు మాట్లాడుకోం. కోపం తగ్గి, కొంత గ్యాప్ ఇచ్చాక మాట్లాడుకుంటాం చూడండి.. అది మాత్రం భలే ఉంటుంది.
పెళ్లి రోజుకి కానుకలు ఇచ్చుకుంటారా?
శ్యామల: కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్. నేనేం కొనుక్కున్నా కాదనరు. నేను పెట్టుకునే నగలు, కట్టుకునే చీరలు అన్నీ ఆయన కొనేవే. అన్నింటికీ మించి ఆయనే నాకు పెద్ద బహుమతి.
మరి.. శ్యామలగారు ఇచ్చిన బహుమతుల గురించి?
కృష్ణంరాజు: నేను ‘మెటీరియల్ గిఫ్ట్’లని నమ్మను. తనే నాకు గిఫ్ట్.
శ్యామల: నేను మాత్రమే కాదు.. బుద్ధిమంతులైన ముగ్గురు పిల్లలను గిఫ్ట్‌గా ఇచ్చా(నవ్వుతూ).
కృష్ణంరాజుగారికి మీరు అభిమాని. అభిమాన హీరోతో పెళ్లి విశేషాలు చెబుతారా?
శ్యామల: పెళ్లిరోజున కృష్ణంరాజుగారి వైపు తలెత్తి చూడాలంటే వణుకు. అలా తలొంచుకుని కూర్చున్నాను. ఎలాగో ధైర్యం కూడదీసుకుని ముందు కాళ్ల నుంచి మెల్లిగా చూసుకుంటూ ముఖం చూశాను. నాకసలు కలా? నిజమా? అర్థం కాలేదు. పెళ్లికి ముందు రోజు విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చాం. మాకు మంచి విడిది ఏర్పాటు చేశారు. నాకు చిన్నప్పటినుంచీ జామకాయలంటే ఇష్టం. విడిదింట్లో జామచెట్టు ఉంది. నేను వెళ్లి కోసుకుంటుంటే ‘పెళ్లి కూతురివి.. అలా కొయ్యకూడదు’ అని అమ్మ మందలించింది.
మీ మీద ‘రెబల్ స్టార్’ ట్యాగ్ ఉంది. మీ ఆహార్యం చూస్తేనే వణుకు సహజం. మరి.. శ్యామలగారికి మీరు ధైర్యం చెప్పారా?
కృష్ణంరాజు: ఏం భయపడొద్దు అన్నాను.
శ్యామల: వీళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ. అందుకని అమ్మ భయపడింది. అంతమందిలో నేను ఇమడగలుగుతానా లేదా అని భయం. కానీ కృష్ణంరాజుగారు నాతో ‘ఎవరో ఏదో అంటారని నువ్వు భయపడొద్దు. ఏ పని చేసినా చక్కగా చెయ్’ అని బాగా ధైర్యం ఇచ్చారు.
మరి.. పెళ్లి చూపుల గురించి?
శ్యామల: వాళ్ల కజిన్‌ని పంపించారు. అమ్మాయిని బలవంతంగా ఒప్పించి, పెళ్లి చేస్తున్నారా? ఇష్టపడే చేసుకుంటుందా? అడిగి తెలుసుకోమన్నారు. ‘నాకిష్టం’ అని చెప్పాను. ఆయన కజిన్ వచ్చేసరికి మా ఇంటి చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటున్నాను. ‘నేను వెళ్లేసరికి వదినగారు పిల్లలతో ఆడుకుంటున్నారు’ అని ఆయన చెబితే, ‘అయితే ఓకే.. మనస్తత్వం కూడా పిల్లల్లానే ఉంటుంది. మంచిదే’ అని నా ఫొటో చూసి, ఓకే చేశారు.
కృష్ణంరాజుగారి మొదటి భార్య చనిపోయాక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు... బాగా చూసుకుంటారో లేదోననే డౌట్ ఏమైనా ఉండేదా?
శ్యామల: అస్సలు లేదు. ఆయన మంచితనం గురించి ముందే మాకు తెలుసు. ఆ కుటుంబానికి ఎంతో మంచి పేరుంది. అయితే పెద్ద ఫ్యామిలీలో ఇమడగలనా? అనే భయం అమ్మకి ఉండేది. కానీ నేను వచ్చిన కొన్నాళ్లకే అందరికీ దగ్గరయ్యాను.
ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుంది?
కృష్ణంరాజు: బేసిక్‌గా నా అభిప్రాయాలను వేరేవాళ్ల మీద రుద్దడం నాకు ఇష్టం ఉండదు. వారి అభిప్రాయాలను తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా నడుచుకుంటాను. ఒకరి అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే అండర్‌స్టాండింగ్ ఉండదు. తన విషయంలోనే కాదు.. నా పిల్లల విషయంలోనూ నేను అంతే చేస్తాను. ముందు వాళ్లేమనుకుంటున్నారో వింటాను. ఒక్కరి మాటే నెగ్గాలనుకోం. పిల్లలను నమ్మాలి. వాళ్లు ఎక్కడికెళ్లినా ప్రశ్నలు అడగడం, ఇంటికొచ్చాక ఎక్కడికెళ్లావని అడుగుతుండడం వల్ల ఎలాగూ అమ్మానాన్న మనల్ని నమ్మడం లేదు.. చేస్తే ఏం పోతుందిలే అన్నట్లుగా పిల్లల మనస్తత్వం మారుతుంది. ఆ స్కోప్ ఇవ్వకూడదు.
శ్యామల: మనం నమ్మితే పిల్లలు ఆ నమ్మకాన్ని నిలబెడతారన్నది మా ఇద్దరి అభిప్రాయం.
కృష్ణంరాజు: ‘జీన్స్’ అంటారు కదా.. అది నిజమే. ఆ ఫ్యామిలీ తాలూకు జీన్స్ పిల్లలకు కచ్చితంగా వస్తాయి. నా చిన్నప్పుడు మా నాన్నగారికి ఆరోగ్యం బాగా లేకపోతే నన్ను పిలిచి ‘మన కుటుంబం ఇలాంటిది. మన పూర్వీకులు ఇలాంటివారు’ అని చెబితే, నా మనసులో నాటుకుపోయింది. మా నాన్నగారు ఎన్నో వందల కుటుంబాలను ఆదుకున్నారు. ఓసారి వరద వస్తే.. ఆ ఊరి చుట్టూ గట్టు కట్టించారు. వరద నీళ్లు ఇళ్లల్లోకి వస్తే.. ఆ ఊళ్లో ఉన్నవాళ్లను మా ఇంట్లోనే ఉండమని, వాళ్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఏప్రిల్, మేలో కొంతమందికి పనులు ఉండేవి కాదు.
వాళ్లకు బస్తాలు బస్తాలు బియ్యం ఇచ్చేవారు. పని చెప్పాలి కదా అని ఏదో పని చెప్పేవారు. అయితే ఎంతమందికి చెబుతారు. అందుకని పని చెప్పలేనివాళ్లకు కూడా సహాయం చేసేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. అవన్నీ తెలిసిన వ్యక్తిగా నాకూ సహాయం చేయడం అలవాటైంది. అలాగే కుటుంబ పరువుకి నష్టం కలగకూడదనేది డెవలప్ అయింది. అప్పుడు మా నాన్నగారు నాకు చెప్పినట్లుగా ఇప్పుడు నేను నా పిల్లలకు చెబుతుంటాను. అలాగే మా నాన్నగారికి ఉన్న సహాయ గుణం నాకు వచ్చినట్లుగా నా పిల్లలకూ వచ్చింది. ‘కుటుంబ గౌరవం’ అనే విషయాన్ని నా పిల్లలు కూడా తెలుసుకున్నారు.
పిల్లలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తిలతో కృష్ణంరాజు దంపతులు
మీకు ముగ్గురు ఆడపిల్లలు... చదువుల విషయంలో, ఇతర వ్యక్తిగత విషయాల్లో వాళ్లకు మీరు ఇస్తున్న గైడెన్స్ గురించి?
కృష్ణంరాజు: మా అమ్మాయిలు ఎప్పుడైనా డౌన్ అయితే ‘యు ఆర్ కృష్ణంరాజుస్ డాటర్.. యు ఆర్ గ్రేట్. డోంట్ వర్రీ. భయపడొద్దు. మీ గురించి ఎవరో ఏదో చెబుతారని అనుకోవద్దు. నేను నమ్మను’ అని చెబుతుంటాను. అలా నమ్మి పెంచడంవల్ల ముగ్గురూ చదువులో బెస్ట్. మా పెద్దమ్మాయి సాయిప్రసీద లండన్‌లో మెరిట్ మీద ఎంబీఏ సీట్ సంపాదించుకుంది. ఇప్పుడు ప్రొడక్షన్ వైపు రావాలనుకుంటోంది. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ప్రొడక్షన్ కోర్స్ చేస్తోంది. చిన్న పాప సాయి ప్రకీర్తి ఆర్కిటెక్చర్ చదువుతోంది. మంచి పర్సంటేజ్ రావడంతో జేఎన్‌టీయులో సీట్ వచ్చింది. ఇంకో దాంట్లో కూడా వచ్చింది.
తను బొమ్మలు బాగా గీస్తుంది. వాళ్ల ప్రభాస్ అన్నయ్య బర్త్‌డేకి బొమ్మ గీసి ఇస్తుంది. మూడోపాప సైకాలజీ చదువుతానంది. సరే.. మూడు నాలుగు లక్షలు డొనేషన్ కడతా అన్నాను. ఒకరోజు వచ్చి ‘నా మూడు లక్షలు నాకు ఇవ్వండి’ అంది. ఏంటని అడిగితే ‘నాకు మేనేజ్‌మెంట్ కోటా అక్కర్లేదు.. ఇదిగో నేను మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నాను. సీట్ నేనే తెచ్చుకుంటా. డొనేషన్ కట్టాలనుకున్న డబ్బు నాకివ్వండి’ అంది. తండ్రి పేరుని వాడుకోవడం తప్పు కాదు. అయితే వాళ్లంతట వాళ్లు సీట్ సంపాదించుకోవాలనుకున్నారు. నటుడిగా నేను చాలా గొప్పవాడిని అయ్యుండొచ్చు. కానీ వ్యక్తిగా కూడా నాకు చెడ్డ పేరు లేదనే అనుకుంటాను. గౌరవంగా బతకాలన్నది నా అభిప్రాయం. పిల్లలు కూడా అదే అనుకుంటారు.
పిల్లలు ఇంత చక్కగా పెరగడంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంది?
కృష్ణంరాజు: తన పాత్రే ఎక్కువ ఉంటుంది. నిద్ర లేచిన దగ్గర్నుంచి వాళ్లకి ఏం కావాలి? ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే చదువుకోగలుగుతారు? ఇలా అన్నీ తనకు తెలుసు. తనకి నాతో కలిపి మొత్తం నలుగురు పిల్లలు.
మరి.. ముగ్గురు అమ్మాయిలను పెంచడం కష్టంగా ఉందా? బాబునా?
శ్యామల: (నవ్వుతూ).. నాకు ఈయన్ని పెంచడమే చాలా ఇష్టం. కంటికి రెప్పలా చూసుకుంటాను. పిల్లలు పుట్టాక చాలామంది భర్త మీద ప్రేమ తగ్గిందని, శ్రద్ధ తగ్గిందని అంటారు. కానీ నాకు మాత్రం ముందు ఆయనే. ఆయన్ను చూసుకుంటూ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటాను. పిల్లల సెలవులప్పుడే నేను గుడికి వెళుతుంటాను. ఆ సమయంలో వాళ్ల నాన్న దగ్గర పిల్లల్ని పెట్టి నేను పూజలకు వెళతాను. ఒంటరిగా ఆయన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను.
మీ పుట్టింటికి కూడా వెళ్లలేదా? మీ అత్తింటివాళ్లు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు?
శ్యామల: వెళ్లాలన్నా ఆ టైమ్‌కి ఎవరైనా ఆయన దగ్గర ఉంటేనే వెళతాను. అది కూడా ఒకటీ రెండు రోజులు మాత్రమే. మా పెళ్లికిముందు మా మామయ్యగారికి నేను కలలో కనిపించానట. ఆ అమ్మాయే మన ఇంటికి కోడలిగా వస్తుందని అన్నారట. నేను అత్తింటికి రాగానే ‘నాకు కలలో కనిపించిన అమ్మాయి తనే. నా కొడుకుని బాగా చూస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అన్నారు. అత్తింట్లో ప్రేమకు లోటు లేదు. కృష్ణంరాజుగారికి అందరి ఆకలి తెలుసు కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. ఆ విషయంలో అత్తింట్లో వాళ్లకి భార్య ఎలా చూస్తుందో అని కాస్త టెన్షన్ ఉండేది. కానీ నేను వచ్చి, చూసుకోవడం మొదలుపెట్టాక ఆ టెన్షన్ పోయింది. (మధ్యలో కృష్ణంరాజు అందుకుంటూ).. మా అమ్మ అయితే చాలా టెన్షన్ పడేది. ఆకలైనా చెప్పేవాడిని కాదు. నీరసం వచ్చి అలా నిద్రపోయేవాడిని. అందుకని వాడు అడగడు.. మనమే పెట్టాలని పెట్టేది. ఇప్పుడు ఈవిడ అలానే పెడుతుంది.
మరి.. షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఎలా?
శ్యామల: ఆయన కోసం పని చేసేవాళ్లను కూడా ట్రైన్‌చేసి పెట్టాను. ‘సార్ అడగరు.. మధ్యలో మీరే అడుగుతూ ఉండండి’ అని చెప్పాను. వాళ్లు కూడా అలానే చేస్తారు.
కృష్ణంరాజుగారు భోజనప్రియుడు.. మీరు చేసే వంటల్లో ఆయనకు బాగా నచ్చినవి?
శ్యామల: అన్నీ ఇష్టమే. ముఖ్యంగా నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. అయితే ఇంతకుముందుకన్నా ఇప్పుడు తక్కువ తింటున్నారు. ఈ మధ్య ఎవరో ‘ఏంటి సార్.. మరీ తక్కువ తింటున్నారు?’ అని అడిగితే ‘మేం ఏడుజన్మలకు సరిపడా తినేశాం’ అన్నారు (నవ్వులు). ఆయనకు పెసరట్టు అంటే ఇష్టం. వాళ్ల పెద్దక్కగారు బాగా చేసేవారు. ఆవిడ దగ్గర్నుంచి ఆయన నేర్చుకుని, నాకు నేర్పించారు. ఆయన చేపల కూర కూడా
మీరు వంట ఎలా నేర్చుకున్నారు?
కృష్ణంరాజు: నేను వేటకు వెళ్లేవాడిని. పచ్చ పావురాలు అని ఉండేవి. చాలా రుచిగా ఉంటాయి. పొద్దున్నే అవి వేటాడి తీసుకు వస్తే.. అక్కడే అడవిలో వండి పెట్టేవాళ్లు. కొండ గొర్రె అంటారు. అది కూడా బాగుంటుంది. లంచ్‌కి కొండ గొర్రె. ఒక్కోసారి పులి గాండ్రింపులు వినపడినప్పుడు వంట చేసేవాళ్లు భయపడి పారిపోయేవాళ్లు. అప్పుడు నేనే వంట చేసేవాడిని. అయితే నాకు అన్నం వార్చడం వచ్చేది కాదు. రెండు మూడు సార్లు చేతులు కాల్చుకున్నాను కూడా. రామారావుగారు నిషేధం విధించాక వేట మానేశాను.
ఎప్పుడైనా పులిని వేటాడారా?
కృష్ణంరాజు: లేదు. అయితే నా వెనకాల నుంచి ఒక్క పరుగుతో ముందుకు వెళ్లింది. పులి మహా పిరికి. తననెవరైనా ఎటాక్ చేస్తారనే అనుమానం కలిగితేనే అది ఎటాక్ చేస్తుంది. లేకపోతే చేయదు.
శ్యామల: మీకు ఓ పులి ఫ్యాన్ కదా..
కృష్ణంరాజు: అవును. ఒక పులి ఉండేది. ‘కటకటాల రుద్రయ్య’ కోసం ఆ పులిని తీసుకొచ్చారు. అది గాండ్రించడం మొదలుపెట్టింది. నేను దాని మెడ దగ్గర మెల్లిగా అలా నిమురుతూ మచ్చిక చేసుకున్నాను. ఆ పులితో నాకు ఫైట్‌సీన్ ప్లాన్ చేశారు. అంతకుముందు నేను దాని మెడ పట్టుకుంటే విసిరి కొట్టింది. అంతదూరం పడ్డాను. అయితే మచ్చిక చేసుకున్న తర్వాత ఫ్రెండ్లీ అయిపోయింది. నేను దాని మెడ పట్టుకుంటే అది అలా చూస్తూ ఉండిపోయింది. చివరికి మేమే అది ఫైట్ చేసినట్లు మ్యానిపులేట్ చేశాం (నవ్వుతూ). అదే పులిని ఏడాది తర్వాత వేరే సినిమా కోసం తీసుకొస్తే.. నన్ను గుర్తుపట్టేసి, ఫ్రెండ్లీ అయిపోయింది. లాభం లేదని దాన్ని పంపించేసి, వేరే పులిని తీసుకొచ్చి, ఫైట్ సీన్ తీశాం.
మీ విషయాలు వింటుంటే భలే ఉంది... ఫైనల్లీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్‌కి కొన్ని టిప్స్?
ఇద్దరూ: ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి చదువుకుంటున్నారు. ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అయితే పెళ్లయ్యాక కొంతమంది మగపిల్లలు మారిపోతున్నారు. ఆంక్షలు పెడుతున్నారు. ఫ్రెండ్లీనెస్ పోతోంది. అది తప్పు. అది తెలుసుకోలేక గొడవలు పడి విడిపోతున్నారు. అలాగే ఇప్పుడు ఇద్దరూ సంపాదించుకుంటున్నారు కాబట్టి కొన్ని జంటలు ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అంటున్నట్లు ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య ఆ పోటీ తప్పు. ఇద్దరూ సమానం అనుకోవాలి. అలాగే ‘ఈగో’ సమస్యలు ఒకటి. కొంచెం మనసు పెట్టి ఆలోచించి, చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకోకుండా ఉంటే కాపురం హాయిగా ఉంటుంది.
– డి.జి. భవాని
మీ ఇంటి నుంచి వేరే సెలబ్రిటీల ఇంటికి క్యారేజ్‌లు వెళుతుంటాయట కదా?
శ్యామల: వెళుతుంటాయి. వస్తుంటాయి కూడా. కృష్ణంరాజుగారి కోసం షూటింగ్ లొకేషన్‌కి భోజనం తీసుకెళ్లేదాన్ని, మొత్తం యూనిట్‌కి సరిపడా పట్టుకెళ్లేదాన్ని. చిరంజీవిగారి ఇంట్లో దోసెలు బాగుంటాయి. ఆ మధ్య చిరంజీవిగారిని కలిసినప్పుడు ఆ మాట అంటే.. ‘అన్నయ్యా.. నువ్వు బ్రేక్‌ఫాస్ట్ ఎన్నింటికి చేస్తావో చెప్పు.. ’ అని అడిగి, ఒక ఆదివారం దోసెలు, రెండు రకాల చట్నీలు పంపించారు. ఎంజాయ్ చేస్తూ తిన్నాం. సురేఖ (చిరంజీవి సతీమణి) గారు అంత బాగా చేస్తారు. మా ఇంట్లో బిర్యానీ చేసి, ఆవిడ పంపిన క్యారియర్‌లో పెట్టి పంపించాం. చిరంజీవిగారు మధ్యాహ్నం తిని, సాయంత్రం కూడా తింటానని ఉంచమన్నారట. ఆ మధ్య మోహన్‌బాబుగారింట్లో జరిగిన పార్టీకి వెళ్లినప్పుడు చిరంజీవిగారు ఆ విషయం చెప్పారు.
ప్రభాస్ గురించి?
శ్యామల: మా ఆయన్ను ‘పెద్ద బాజీ’ అని బాబు పిలుస్తాడు. నన్ను ‘కన్నమ్మా’ అని పిలుస్తాడు. ప్రభాస్ మాకు కొడుకే. ఇప్పుడు మా ప్రభాస్ ఏమంటాడంటే.. ‘ఇన్నేళ్లు కష్టపడ్డారు. ఇప్పుడు మీరు సుఖపడాలి. మిమ్మల్ని మేం హ్యాపీగా చూడాలి’ అని వాళ్ల పెదనాన్నతో అంటాడు. పెదనాన్న అంటే.. ఆయనకు సుప్రీమ్ అన్నమాట. అంత ప్రేమ. చెల్లెళ్లతో కూడా చాలా ప్రేమగా ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment