మా చెడ్డ ప్రేమ | sakshi special love story | Sakshi
Sakshi News home page

మా చెడ్డ ప్రేమ

Published Tue, Jun 14 2016 11:54 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

మా చెడ్డ ప్రేమ - Sakshi

మా చెడ్డ ప్రేమ

ఒకప్పుడు ఇంట్లో అందరికీ ఒకే ఫోన్ ఉండేది.
ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక ఫోను!
అప్పుడు ఫోన్ మోగితే ఎవరు ఎత్తినా పర్లేదు.
ఇప్పుడు ఫోన్ మోగితే ఎవరూ ఎత్తడానికీ వీల్లేదు.
పెళ్లి ప్రమాణాల్లో...‘యు అండ్ మీ.. నథింగ్ ఇన్ బిట్వీన్’ - అంటే..
నువ్వు, నేను... మధ్యలో ఇంకేం లేదు అంటాం..
దాపరికాలు, అరమరికలు, రహస్యాలు ఉండవని!
తస్సాదియ్యా.. మొగుడికి మేకు, పెళ్లానికి ఏకై...
స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.
నమ్మకం నుంచి పుట్టాల్సిన ‘కన్‌సర్న్’ కాస్తా...
అనుమానం నుండి పుట్టుకొస్తోంది!
ఏమైనా... ఒకరి ఫోను ఇంకొకరు చూడ్డం మా చెడ్డ ప్రేమ!

 

 

ఆలు మగలుగా ఒకరికొకరు తోడూ నీడగా ఉంటామని, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని, అరమరికలు లేకుండా కడదాకా కలిసే ఉంటామని పెళ్లినాడు ప్రమాణం చేయిస్తారు పురోహితులు. అంతవరకూ బాగానే ఉంది. భార్యాభర్తల మధ్యకి మూడోవ్యక్తి ఎవరైనా వస్తే..? అది వారి అన్యోన్య దాంపత్యఫలంగా పుట్టిన పిల్లలే తప్పించి మరొకరు కాకూడదు. అయితే ఇప్పుడు మొగుడూ పెళ్లాల మధ్యకు అనివార్యంగా మూడో శాల్తీ వస్తోంది. అది ఆడ కాదు, మగకాదు. అయినా సరే, వారి మధ్య చిచ్చురేపుతోంది. దాని మూలంగా కాపురాలు కూలిపోతున్నాయి. బంధాలు మాసిపోతున్నాయి. ఇంతకీ అదెవరో తెలుసా? ఫోనండీ! పోనీండీ, ఫోనేంటీ కాపురాలు కూల్చడమేంటీ అని కొట్టిపారేయొద్దు. తేలిగ్గా తీసిపారేయొద్దు. ఫోన్.... అదీ స్మార్ట్‌ఫోన్ సృష్టిస్తున్న కలతలు అన్నీ ఇన్నీ కావు. కాదేదీ కవిత్వానికనర్హం అని అన్నట్టు కాదేదీ కలతలకు అనర్హం... ప్రాణం లేని ఫోన్‌తో సహా అంటున్నాయి విశ్లేషణలు. ఎవరి ఫోన్ వారికే సొంతం అనే ధోరణి స్థిరపడింది. ఎంత భార్యాభర్తలైనా సరే ఒకరి ఫోన్‌లో కాంటాక్ట్స్‌ను, మెసేజ్‌లను మరొకరు ఓపెన్ చేయడం వంటివి సహించబోమనే పరిధులు బలపడ్డాయి.

 
ఈ మధ్య బెంగుళూరులో సునీతా సింగ్ అనే అమ్మాయి... కూరగాయలు తరిగే చాకు తీసుకుని భర్తమీద వీర విహారం చేసింది. ఎందుకో తెలుసా? అతగాడు తన ఫోన్ తీసుకుని తనకొచ్చిన మెసేజీలను చాటుగా చదువుతున్నాడని. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా, వివరాల్లోకి వెళితే మాత్రం కర వమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఎవరినీ త ప్పు పట్టలేని పరిస్థితి..!

 

మెకాఫీ అనే ఆన్‌లైన్ వ్యవహారాల భద్రత సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... 42 శాతం మంది తమ భార్య లేదా భర్త ఈమెయిల్ అకౌంట్‌ను చెక్ చేస్తుంటారని తెలిసింది. మిగిలిన వాళ్లు కనీసం నెలకు ఒకసారి అయినా అవతలి వారి ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి వెళ్తుంటారట! స్వైప్ బూస్టర్, ఫ్లెక్సి స్పై, ఎమ్‌స్పై అనే యాప్‌ల సాయంతో జంటలు తమ భాగస్వామి అకౌంట్‌ను తెరిచి, అందులో ఏముందోనని వెతికే ప్రయత్నాలు చేస్తుంటారట.

 
రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలలో ప్రతి ఐదుగురు పురుషులలో ఒకరు, ప్రతి ఐదుగురు స్త్రీలలో సగం మంది, తరచు తమ భాగస్వామి ఫోన్లను చెక్ చేస్తుండటమే పనిగా పెట్టుకుంటారని యూఎస్‌లో 13,132 జంటలపై సర్వే నిర్వహించిన అవాస్ట్ అనే మరో సంస్థ తెలిపింది.

 
గూఢచారులలో కనీసం 25 శాతం మంది తమ ప్రియుడు లేదా ప్రియురాళ్ల కదలికలపై కన్నేసి ఉంచే పనికే తమ వృత్తిని అంకితం చేయవలసి వస్తోందని నివేదిక తెలిపింది. మరో 12 శాతం మంది తమ భాగస్వాములు చెప్పేది నిజమో అబద్ధమో నిర్ధారించుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారని కూడా ఆ సర్వేలో తెలిసింది.

 

నమ్మకం లేదనేగా...?!
ఫోన్ చెక్ చేయడం అపార్థాలకు దారితీస్తుంది... బాంధవ్యాన్ని దెబ్బతీస్తుంది అనేది నటుడు గౌతమ్ గులాటి అభిప్రాయం. ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడం, చేయకుండా ఉండటమనేది వారిలో ఒకరిపట్ల మరొకరికి  ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి చిహ్నం. తన  భర్త లేదా భార్య తప్పు చేయరు అనే నమ్మకం ఉంటే వారి ఫోన్ చెక్ చేయాలన్న ఆలోచనే ఉండదు. మీ భాగస్వామి ఫోన్‌ను రహస్యంగా చెక్ చేస్తున్నారంటే వారి మీద మీకు నమ్మకం లేదనే అర్థం. అనుమానం కొద్దీ కాకపోయినా ఒక్కోసారి ఏదైనా ఇన్‌ఫర్మేషన్ కోసం అవతలివారి ఫోన్ చెక్ చేసినా కూడా అది అపోహలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.

 

 

పాస్‌వర్డ్స్ పంచుకోవడం  ప్రేమకు ప్రతీకేమీ కాదు!
‘‘గూఢచర్యం చేయడం బాంధవ్యానికి హాని చేయకపోవచ్చు. మీ భాగస్వామి రహస్య ఫోన్ నంబర్లు లేదా మెయిల్ ఐడీల మీద కూడా ఓ కన్నేసినా, వారు మీకు ఎక్కడా దొరక్కపోవచ్చు. అయితే అలా చేసినందువల్ల మీకు ప్రత్యేకంగా ఒరిగే ప్రయోజనం, తృప్తి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మరోకోణం చూద్దాం... కొందరు తమ ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ అకౌంట్లకు, ఫోన్లకు ఒకే పాస్‌వర్డ్ పెట్టుకుంటారు. ఎంత జీవిత భాగస్వాములైనప్పటికీ, ఒకరి పాస్‌వర్డ్స్ మరొకరికి తెలిసేలా పెట్టుకున్నంత మాత్రాన వారి మధ్య పొరపచ్ఛాలు లేవనీ, రావనీ చెప్పలేం. దానికంటే కూడా టెక్నాలజీని మీ ప్రేమను పంచుకోవడానికి, పెంచుకోవడానికీ వాడుకోవడం బెటర్. అంతేకానీ, నిఘాలు, గూఢచర్యాల వల్ల ఒరిగేదేమీ లేద’’ంటారు ప్రీతీ షెనాయ్ అనే రచయిత్రి.

 

పర్సనల్ స్పేస్ ఉండాలి
మేము భార్యాభర్తలమే.. అయితే ఎవరి ఇండివిడ్యువాలిటీ వారిది. అంటున్నారు నటి షాజహాన్ పదామ్సీ. భార్యాభర్తలు ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి మరొకరు తలదూర్చనక్కరలేదు. ముఖ్యంగా ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి పర్సనల్ స్పేస్ వారికి ఉండాలి. అప్పుడే వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఎవరి వ్యక్తిగత జీవితం వారికి ఉంటుంది. అసలు ఎవరి ఫోన్ వారికి ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఒకరి ఫోన్‌లోని కాల్‌డేటా, మెసేజ్‌లు చెక్ చేయాల్సిన పనేంటి? అన్నది పదామ్సీ వాదన.

 

 

ఇదే అక్కడయితేనా..!
యూఎస్, యూకేలలా కాదు...భారతీయులు తమకంటూ ఒక ప్రైవసీ ఉంటుందని ఇంకా పూర్తిగా గుర్తించలేదంటున్నారు అడిషినల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్. మన పరిధులు దాటి అవతలి వారి వ్యక్తిగత విషయాల్లో, ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం భారతీయులలో చాలా సాధారణం. అసలు తాము అవతలివారి పర్సనల్ స్పేస్‌లోకి అడుగుపెడుతున్నామన్న విషయం చాలామందికి తెలియదు కూడా! దీని మీద అవగాహన రావాలి. అవతలి వారి పర్సనల్ ఫైల్స్‌లోకి, పత్రాలలోకీ, ఫొటోగ్రాఫుల్లోకీ తలదూర్చడం వల్ల వారితో అనుబంధం పెరగకపోగా, బలహీనపడుతుంది. ఒక్కోసారి వారి బంధాలు పుటుక్కున తెగిపోతాయి కూడా!

 
యూఎస్, యూకేలలో అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా ప్రాధాన్యముంది. భార్యాభర్తలు, తల్లీకొడుకులు, తండ్రీకూతుళ్లు, తల్లీకూతుళ్లు, తండ్రీకొడుకులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఆప్తమిత్రులు, దగ్గర బంధువులు... ఇలా వారి మధ్యన ఉండే బంధం ఏమిటనేది పక్కన పెడితే, అలా వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం చాలా తప్పుగా భావిస్తారు. తమ వ్యక్తిగత విషయాలను కాపాడుకోవడం అక్కడి వాళ్లు హక్కుగా చూసుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం గురించి రాజ్యాంగపరమైన కట్టుబాటు ఏమీ లేకపోయినప్పటికీ, దానిని ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకోవాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అంటున్నారు పింకీ ఆనంద్.

 

ప్రైవసీ కోసం కాదు... అంతకన్నా ఎక్కువే!
మీ భాగస్వామి ఫోన్ చెక్ చేయడం, ఫోన్‌లోకి తొంగిచూడటం మీ హక్కు కాదు, సరికాదు కూడా! అది తప్పొప్పులకూ, నమ్మకం, అపనమ్మకాలకూ సంబంధించిన సమస్య కూడా కాకపోవచ్చు. కానీ అది లేనిపోని అపార్థాలకు చోటిస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను అంటున్నారు రాజకీయ వేత్త వాణీ త్రిపాఠి.

 

సదుద్దేశ్యమే అయితే ఫరవాలేదు కానీ...
అవతలి వారి ఫోన్ చెక్ చేయడమనేది ఏదైనా బలమైన కారణం ఉంటే తప్పించి, ఉబుసుపోక జరగకూడదు. అదీకూడా తమ భాగస్వామి ఫోన్‌ను  సదుద్దేశ్యంతో చెక్ చేస్తే తప్పులేదు. కానీ తప్పులు ఎత్తి చూపడానికో, నిందలు వేయడానికో, అభాండాలు మోపడానికో అయితే మాత్రం చాలా అసంబద్ధంగా, హేయంగా ఉంటుంది. ఒకవేళ రహస్యాలు ఏమైనా ఉంటే అవి తమ ఇద్దరికీ తప్పించి, మూడోవ్యక్తికి తెలియకూడదనే ఉద్దేశ్యంతో అవతలి వారి కాల్ హిస్టరీనో, మెస్సేజులో, ఫొటోలో చెక్ చేసి, వాటిని ఎవరి కంటా పడకుండా దాచేయడం కోసం చూడటంలో తప్పులేదు. ఒకవేళ నాకే గనుక ఇటువంటి సంఘటన ఎదురయిందనుకోండి, నేను వీలయినంత నమ్రతగా, మర్యాదగా నా భాగస్వామికి ఆ విషయం చెప్పి, తన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నేను ఫోన్ చెక్ చేస్తాను అంటున్నారు రచయిత్రి ప్రాచీ గార్గ్.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement