డాండ్ రఫ్పాడించండి | sakshi speical story to Dandruff | Sakshi
Sakshi News home page

డాండ్ రఫ్పాడించండి

Published Wed, Oct 12 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM

డాండ్ రఫ్పాడించండి

డాండ్ రఫ్పాడించండి

గట్టిగా కొట్టకూడదు.
ఊహూ... తిట్టకూడదు.
ప్రేమగా హ్యాండిల్ చేయాలి.
రక్కినా, గీకినా రివర్స్ కొడుతుంది.
కామ్‌గా డీల్ చేయాలి.
ఎక్కువ హాట్ వద్దు... ఎక్కువ కూల్ వద్దు.
వెచ్చగా బుజ్జగించాలి.
భుజాలు దులుపుకోవడం ఆపి...
లౌలీగా డాండ్ఫ్ఫ్రాడించండి.

 

గమనిక: చుండ్రు ఒకసారి వచ్చిందంటే దానిని రకరకాల పద్ధతుల ద్వారా తగ్గించవచ్చు. కాని పూర్తిగా నివారించలేం  అన్నది గుర్తుంచుకోవాలి. జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చుండ్రు మళ్లీ మళ్లీ బాధించే అవకాశమూ ఉంది.  నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే మన వేళ్లు మన జుట్టులోకి దూరిపోతాయి. అదంత డీసెంట్ కాదని కాసేపు ఆగాక తెలుస్తుంది. అదీ కాకపోతే జుట్టులోంచి పొడి రాలుతుంది. ఒక్కోసారి కొందరిలో గోళ్లలోకి జిడ్డు చేరుతుంది. ఏదైనా... పదిమందిలో మనకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే జరుగుతుంది. కారణం... చుండ్రు.


చుండ్రు కారణంగా మన దేశంలో చాలా మంది బాధపడుతుంటారు. ప్రధానంగా 20 - 40 ఏళ్ల మధ్య వయసువారిలో ఈ సమస్య ఎక్కువ. అదీ స్త్రీలలోకన్న పురుషులలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు. 

 
పుట్టుకొచ్చే విధం ఇదీ...
చర్మంలో ఎపిడెర్మిస్, డెర్మిస్ అనే రెండు పొరలు ఉంటాయి. పై పొరను ఎపిడెర్మిస్ అని, కింది పొరను డెర్మిస్ అని అంటారు.  మాడుపైన ఉండే డెర్మిస్ పొరలో నుంచే వెంట్రుకలు పుట్టుకువస్తాయి. ఈ హెయిర్ ఫాలికల్స్(వెంట్రుకల కుదుళ్లు) పక్కనే సెబేసియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్రంథులు సీబమ్ అనే ఆయిల్‌ని ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ ఆయిల్ వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచటానికి దోహదం చేస్తుంది. దీని ఉత్పత్తి కొంతమందిలో సాధారణంగా ఉంటే, మరికొందరిలో అసాధారణంగా అంటే.. ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఎపిడెర్మిస్ పొర త్వరగా జిడ్డుగా మారుతుంది. ఈ జిడ్డుపై ఫంగస్ (మెలస్సీజియా) చేరుతుంది. సహజంగానే ఈ ఫంగస్ కూడా అందరి తలలోనూ ఉంటుంది. కాకపోతే జిడ్డు చర్మం ఉన్నవారిలో ఈ ఫంగస్ అధికంగా చేరి స్కిన్‌సెల్స్ (చర్మకణాల), సీబమ్‌పై దాడి చేసి, కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రసాయనాలు మృతకణాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తాయి. ఫలితంగా తలలో దురద, చికాకు కలుగుతుంది. దురద అనిపించగానే గోళ్లతో తలను గీకుతుంటారు. దీంతో మృతకణాలు పైకిలేస్తాయి. పొడిగా మారిన మృతకణాలు జుట్టు నుంచి రాలి పడతాయి. దానిపేరే ‘చుండ్రు.’

 
ఎక్కడెక్కడ?

మాడుపైనే కాదు కనుబొమలు, కనురెప్పలు, ముక్కుకు ఇరువైపులా, బాహుమూలాల్లోనూ (చంకల్లోనూ) చుండ్రు కనిపించవచ్చు.

 
లక్షణాలు
చుండ్రును గుర్తించడం చాలా సులువు. మాడు విపరీతమైన దురదగా ఉంటుంది. తెల్లటి పొట్టులాంటి పదార్థం మాడుపైన, భుజాలమీద, దుస్తుల మీద కనిపిస్తూ ఉంటుంది. ఈ కండిషన్ మరీ తీవ్రమైతే ఆ పరిస్థితిని ‘సెబోరిక్ డర్మటైటిస్’ అంటారు.

 
కొన్నిసార్లు హెచ్‌ఐవీ, విటమిన్లలో లోపాలు, పార్కిన్‌సన్ వంటి నరాలకు సంబంధించిన వ్యాధులు (న్యూరలాజికల్ డిజార్డర్స్) ఉన్నవారిలో ఈ సీబమ్ అనే నూనెలాంటి స్రావాలు ఎక్కువవుతాయి. దీన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటారు.

 
పిల్లల్లో దీన్ని పొరబడటం తగదు

ఇక చుండ్రు సమస్యను పసిగట్టి, అది సోరియాసిస్ కాదని గుర్తించడం కూడా ప్రధానమే. చాలా సందర్భాల్లో పిల్లల తలల్లో పొలుసులు రాలే ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను (టీనియా కాపిటిస్)ను చుండ్రుగా పొరబడి తల్లిదండ్రులు చికిత్సకు తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది. దాని వల్ల పిల్లల్లో శాశ్వతంగా జుట్టు రాలిపోయి... తలలో ప్యాచెస్ వచ్చే అవకాశం కూడా ఉంది.

 
వింటర్‌లో కీలకం

చలికాలం వాతావరణంలో తేమ తక్కువగా ఉంటుంది. దీని వల్ల చర్మం పొడిబారుతుంది. మృతకణాలు పెరగడంతో పాటు, పొడి పొడిగా మారి పైకి లేస్తుంటాయి.

 
చుండ్రు - ఆహారం
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలోని పోషకాలు చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని నివారించడానికి  సహకరిస్తాయి.   రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి, ఆరోగ్యంగా ఉంటుంది.  చుండ్రు సమస్య ఉన్నవారు మాంసం, పంచదార, మైదా, స్ట్రాంగ్ టీ, కాఫీ, పచ్చళ్లు, నిల్వ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

 
జుట్టు - దువ్వెన

రక్తప్రసరణ కుదుళ్లకు సరిగ్గా అందాలంటే దువ్వెన మంచి మార్గం. వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో జుట్టును పాయలుగా విడదీస్తూ, ముందుకు వేసుకుని కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు దువ్వాలి. ఇలా చేయడం వల్ల తలలో దుమ్ము, చుండ్రు ఉంటే రాలిపోతుంది. చుండ్రు వేధించకూడదంటే పొగ, దుమ్ము, వేడి మాడుకు తగలకుండా, తడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

 
డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి?

హెయిర్ ఫాల్ వేరు, చుండ్రు వేరు. చుండ్రు ఉందని ఆందోళన చెందితే సమస్య మరింతగా పెరగవచ్చు. కొన్ని వారాల పాటు వ్యక్తిగతంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా చుండ్రు తగ్గకపోయినా, దీనితో పాటు మాడుపై చర్మం ఎర్రగా మారినా, పెచ్చులు పెచ్చులుగా ఊడుతున్నా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

 
షాంపూలు

మార్కెట్లో రకరకాల యాంటీ డాండ్రఫ్ షాంపూ ఉత్పత్తులు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి...  జింక్ పైరిథ్రోన్, సెలీనియమ్ సల్ఫేడ్, కోల్‌తార్, కెటోకొనజోల్, శాల్సిలిక్ యాసిడ్... లాంటి యాంటీడాండ్రఫ్ షాంపూల్లో ఏదైనా వాడుకోవచ్చు. నాలుగు వారాల పాటు ఒక షాంపును వాడినప్పటికీ తగ్గకపోతే మరో షాంపూని మార్చి చూడాలి. వీటి వల్లా తగ్గకపోతే మైల్డ్ కార్గికో స్టిరాయిడ్స్ లోషన్స్‌ని మాడుకు రాసుకుని, కడిగేయాలి. షాంపూ లేబుల్స్‌పై ఉన్న నిబంధనలను పాటించడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.


ఏ షాంపూ అయినా తగినంతగా తీసుకుని నీటిలో కలిపి జుట్టు తడపాలి. ఆ తర్వాత తలంతా రుద్దుతూ శుభ్రపరుచుకోవాలి. చుండ్రు ఉన్నవారు తప్పనిసరిగా రోజూ యాంటీ డాంఢ్రఫ్ షాంపూతో  తలస్నానం చేయాలి. కేశాలు పొడిబారుతున్నాయి అనుకునేవారు స్నానం చేయడానికి అరగంట ముందు గోరువెచ్చని నూనెతో మర్ధనా చేసుకోవాలి. అయితే నూనెలు (హెయిర్ ఆయిల్ రాసుకోవడం వల్ల తల మరింత జిడ్డుగా మారి చుండ్రు సమస్య ఎక్కువ కావచ్చు. అందువల్ల చుండ్రు సమస్య ఉన్నవారు జుట్టుకు నూనె రాసుకోకపోవడమే మంచిది).


చుండ్రు సమస్య మరీ తీవ్రంగా ఉన్న సమయంలో నోటి ద్వారా తీసుకోవాల్సిన ఫ్లుకోనజోల్ వంటి ఓరల్ యాంటీఫంగల్ మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కండిషనర్‌ను రూట్‌లెవల్ నుంచి పెట్టుకోకూడదు. కేవలం కాస్త పై నుంచి జుట్టు పొడవునా (హెయిర్ లెంత్ పొడవునా) పెట్టుకోవాలి.                  ఒకవేళ ఎవరిలోనైనా తల నుంచి చుండ్రు పొలుసులుగా రాలుతుంటే వెంటనే డాక్టర్‌ను కలిసి చిన్నపిల్లలైతే టీనియా కాపిటిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యగానీ పెద్దవాళ్లైతే సోరియాసిస్ ఏదైనా ఉన్నాయేమోనని నిర్ధారణ చేసుకోవాలి. దీని కోసం డర్మటాలజిస్ట్‌ను కలవాలి.


చుండ్రు... మరికొన్ని ఇతరత్ర అంశాలు...
చలి అని తలస్నానానికి బాగా వేడినీళ్లు వాడుతుంటారు. దీంతో మాడుపై చర్మం పొడిబారి చుండ్రు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తలస్నానానికి గోరువెచ్చని నీళ్లే వాడాలి.

 
మెంతులతో...  చుండ్రు నివారణకు మెంతులు మంచి ఔషధం. మెంతులను రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలంతా పట్టించి అరగంట అలాగే ఉంచి, కడిగేయాలి. పదిహేను రోజులకు ఒసారి ఇలా చేస్తే చుండ్రు తగ్గుతుంది. కేశాలు పొడిబారకుండా ఉంటాయి.

 
నిమ్మకాయతో... చుండ్రు అనగానే నిమ్మచెక్కతో బరాబరా జుట్టును రుద్దేస్తుంటారు. అలా కాకుండా తలంటుకున్న తర్వాత టీ స్పూన్ తాజా నిమ్మరసాన్ని మగ్గునీళ్లలో కలిపి ఆ నీటితో జుట్టు తడిసేలా కడగాలి. ఈ విధంగా నెలకు ఒకసారి చేయాలి.  పెసర పిండితో... చుండ్రును తగ్గించడానికి పెసరపిండి కూడా ఉపయోగపడుతుంది. రెండు టేబుల్‌స్పూన్ల పెసరపిండిని అరకప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

 

చుండ్రు - చిట్కాలు
మూడు వంతుల గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో ఒక వంతు ఆపిల్ సిడార్ వెనిగార్‌ను కలిపి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఆ మిశ్రమం తలకు పూర్తిగా పట్టాక డాక్టర్ సలహా మేరకు సరైన పీహెచ్ ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి.  మార్చి మార్చి వేణ్నీళ్లు, చన్నీళ్ల స్నానం వల్ల మాడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో చుండ్రు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి వల్ల చుండ్రు పెరిగే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల నిండుగా బాగా గాలి పీల్చే వ్యాయామాల వల్ల ఒత్తిడి తగ్గి... తద్వారా చుండ్రు కూడా తగ్గే అవకాశం ఉంది.

 
తలస్నానానికి ముందే ఒకసారి జుట్టును బాగా దువ్వుకోవడం వల్ల అప్పటికే తలలో ఏర్పడి ఉన్న పొట్టు వదులైపోయి మాడు మరింత శుభ్రంగా అయ్యే అవకాశం ఉంది. షాంపూలు, మంచి పోషకాహారం, కొన్ని రసాయన ఆధారిత యాంటీ-డాండ్రఫ్ షాంపూలు చుండ్రును ఎదుర్కోవడంలో బాగా సహాయపడతాయి. వైద్య నిపుణుల సహాయంతో ఈ సమస్యను సమర్థంగానే ఎదుర్కోవచ్చు.

 

అపోహలు - వాస్తవాలు
అపోహ: చుండ్రు వల్ల జుట్టు రాలుతుంది.
వాస్తవం: సాధారణ చుండ్రు వల్ల జుట్టు రాలదు. ఫంగస్ వల్ల చుండ్రు ఎక్కువయితే కొద్దిగా జుట్టు రాలవచ్చు.
అపోహ: చుండ్రు ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఉదా: దువ్వెనలు,  దుస్తులు ఒకరివి ఒకరు వాడుకోవడం మూలంగా.
వాస్తవం: అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశాలు తక్కువ.
అపోహ: అన్ని కాలాల్లోనూ విసిగిస్తుంది.
వాస్తవం: చలికాలంలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
అపోహ: పిల్లల్లోనూ చుండ్రు ఉంటుంది.
వాస్తవం: చాలా వరకు పిల్లల్లో చుండ్రు సమస్య ఉండదు. (ఏడాది లోపు పిల్లల్లో ఉండే చుండ్రును క్రెడిల్ క్రాప్ అంటారు. ఆ తర్వాత తగ్గిపోతుంది).
అపోహ: మాటిమాటికీ గుండు చేయించుకోవడం వల్ల చుండ్రు తగ్గుందనేది ఒక అపోహ.
వాస్తవం : ఒకసారి గుండుతో సమస్య తగ్గుతుంది. మాటిమాటికీ చేయించాల్సిన అవసరం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement