అంచు పట్టు
► కొమ్మ చివరనే విరిసే పువ్వులు...మాను చివరనే మామిడి పిందెలు
► చిటారు కొమ్మన మిఠాయి పొట్లం అవి ఎలాగో...
► పట్టు చీరకే జరీ జిలుగులు... చీర అంచునే వెలుగుల రేకలు. ఇవీ అలాగ!!
ఆకుపచ్చని చీరంతా బంగారు పువ్వుల కాంతి. రెండు అంచెలుగా ఆకట్టుకునే పెద్ద అంచు. ఆ అంచు మీద మాటలకుఅందని వైభవం ఈ చీర సింగారం.వంగపండు, ఆకుపచ్చ కాంబినేషన్లతో చూపు తిప్పుకోనివ్వని విధంగా రూపుదిద్దుకున్నది ఈ పట్టుచీర. పెద్ద అంచు మీద ఎరుపు రంగు డిజైన్లలో కనువిందు చేస్తున్న నెమళ్ల అందం వర్ణనాతీతం. చీరంతా వచ్చిన జరీ బుటా ప్రత్యేక ఆకర్షణ.వినీలాకాశానికి బంగారు రంగు అద్దితే వచ్చే అందం ఈ పట్టుచీర సొంతం. బంగారు జరీ జిలుగులతో చీరంతా బుటా, జరీ అంచుతో మెరిసి పోతున్న ఈ పట్టుచీర వేడుకలో ఓ ప్రత్యేక ఆకర్షణ.
పర్పుల్ కలర్ చీరపై మామిడి పిందెల డిజైన్ కళ్లను కట్టిపడేస్తుంటే మరో వైపు పెద్దంచు జరీ మెరుపు అబ్బురపరుస్తుంది. నీలిరంగు పల్లూ ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతుంది.ఎరుపు రంగు పట్టు చీర వేడుకలో ఎప్పుడూ ఎవర్‌గ్రీన్‌గానే నిలుస్తుంది. చీరంతా బంగారువర్ణంతో అద్భుతంగా మెరిసిపోతుంది. సింపుల్ డిజైన్ అనిపిస్తూనే గ్రాండ్‌లుక్‌తో వెలిగిపోతున్న పల్లూ, పెద్ద జరీ అంచు ఈ చీరకు అదనపు హంగుగా అమరాయి.