
.‘పోపులపెట్టె’ గుర్తుందా!
ఆడవాళ్ల డబ్బంతా పోపులపెట్టెలో ఉంటుందనే మాట గుర్తుందా! మన ముందుతరం మహిళలంతా డబ్బు విషయంలో ఎంతో ముందు జాగ్రత్తగా ఉండేవారనడానికి ‘పోపులపెట్టె’ పెద్ద నిదర్శనం.
ఎలాంటి ఆదాయంలేని రోజుల్లో ఆడవాళ్లు పోపులపెట్టెలో ఎంతోకొంత డబ్బు దాచుకునేవారు. ఇంట్లో ఖర్చులకిచ్చిన సొమ్ములో నుంచి నాలుగు ైపైసలు పక్కనపెట్టి ఆపదొచ్చినపుడు, అత్యవసరమైనపుడు మగవారికి సాయపడ్డ జ్ఞాపకాలు...మన ముందుతరంవారిని ఎవరినడిగినా చెబుతారు. పాలమ్ముకున్న డబ్బులు, కోళ్లమ్ముకున్న డబ్బులు...అంటూ పల్లెల్లో ఆడవాళ్లందరికీ ఉండే పర్సనల్ ఎకౌంట్ ఇప్పటికీ కొనసాగుతోంది. మరి నెలొచ్చేసరికి వేలకు వేలు సంపాదిస్తున్న నేటి తరం మహిళలు ఎంత డబ్బుని దాచుకుంటున్నారు అంటే... అందరూ తెల్లమొహాలు వేస్తారు. సంపాదనతో పాటు వేగంగా పెరుగుతున్న ఖర్చుల చిట్టాకే పట్టం కడుతున్న మహిళలు డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీ సంపాదన పది వేలయితే ఖర్చు కూడా దానికి సమానంగా ఉంటోంది. కారణం ఏమంటే ధరలంటారు. నూటికి కనీసం ఇరవైశాతం డబ్బు పక్కన పెట్టకపోతే భవిష్యత్తు విసిరే సవాళ్లకు మీ దగ్గర సమాధానం ఉండదు.
ముందుగానే మీ ఖర్చులకు కళ్లెం వేయకపోతే ఎంత సంపాదనైనా నీళ్లలా ఖర్చయిపోతుంది. తోటివారితో సంపాదనలో పోటీ పడాలి కాని ఖర్చులో కాదన్న విషయాన్ని ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. లేదంటే... ఇంట్లో, ఆఫీసులో క్షణం తీరికలేకుండా కష్టపడే మీ శ్రమకు ఫలితం ఏంటి?
ఉద్యోగులైన మీరు ఆర్థికంగా మరొకరిపై ఆధారపడకూడదు. అలా ఆధారపడ్డారంటే ఖర్చుల విషయంలో మీ లెక్కలు తప్పని అర్థం. నేటితరం మహిళలు సంపాదన, ఖర్చు సమానంగా ఉంటోందనడానికి కారణం...ప్లానింగ్ లేకపోవడమే. పాతికవేల జీతం ఉన్నప్పుడు స్కూటర్‌పై వెళ్లేవాళ్లు మరో పదివేలు జీతం పెరగ్గానే కారు కావాలని ఆశపడడమే మీ ఆదాయం మాయమవడానికి కారణం.
సంపాదనలకు తోడు రోజురోజుకీ పెరుగుతున్న షాపింగ్ మిమ్మల్ని మరింత గందరగోళంలో పడేస్తుంది. షాపింగ్ విషయంలో పరిమితులు పెట్టుకోకపోతే నెలాఖరులోగా పర్సు ఖాళీ అయిపోవడం ఖాయం.మన ముందుతరం మహిళల ‘పోపులపెట్టె’ సూత్రం నేటితరం మహిళలు గొప్ప ఆదర్శం. ఆ సూత్రాన్ని పాటించకపోతే కష్టపడుతూ కూడా కష్టాలు కొనితెచ్చుకున్నవాళ్లమవుతాం.
- సుజాత బుర్లా
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అండ్ ఫండ్ మేనేజర్