ఒక పడవ ఏడు తుపానులు | Seven storms in a boat | Sakshi
Sakshi News home page

ఒక పడవ ఏడు తుపానులు

Published Mon, Feb 29 2016 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

ఒక పడవ  ఏడు తుపానులు

ఒక పడవ ఏడు తుపానులు

తుఫాన్లు తీరం దాటుతాయి. కాని 2004లో వచ్చిన ఆ తుఫాను ఆ ఏడు కుటుంబాలను వదల్లేదు. తీరం దాట లేదు. తెరిపెన ఇవ్వలేదు. గుండెల్లో దుఃఖం. కక్కడానికి లేదు. మింగడానికి లేదు. మునిగిన కుటుంబాలను అధికారులు పైకి తేల్చరు. మన మధ్య ఉండే జీవితాలే ఇవి. మనం చూడని తుఫాన్లు. వస్తారని చూసే ఎదురుచూపులకు ఒక అర్థముంది. కాని వస్తారో రారో తెలియని ఎదురుచూపులలో ఉండేది నరకమే. ఆ శిక్ష పగవారికి కూడా వద్దు.
   
పదకొండేళ్లుగా వాళ్ల దినచర్య ఇదే. భార్యలు తమ భర్తల కోసం వస్తారు. తల్లులు తమ కొడుకుల కోసం వస్తారు. పిల్లలు తమ తండ్రుల కోసం వస్తారు. వచ్చి సముద్రం ఒడ్డున నిలబడతారు. ప్రతి ఉదయం నిలబడతారు. దూరాన పడవలు కనిపిస్తుంటాయి. ప్రతి పడవ తమవారిలాగే అనిపిస్తుంటుంది. ప్రతి పడవలోని మనిషి తమ మనిషిలానే అనిపిస్తూ ఉంటుంది. ఆశ... మినుకుమినుకుమంటున్న ఆశ....  కాని సమయం గడిచే కొద్దీ అది నీరుగారిపోతుంది. ఆ పడవలు వాళ్లవి కాదు. ఆ మనుషులు వాళ్ల మనుషులు కారు. అలల మీద అలలను విసిరే సముద్రం నంగనాచిలా మొహం పెడుతుంది. వీరు వెతుకుతున్న మనుషుల ఆచూకీ తనకు తెలియదన్నట్టుగా ఉంటుంది. దేవుడా... ఈ శిక్ష ఇంకా ఎంత కాలం. తూర్పుగోదావరి జిల్లా.. ఉప్పాడ సమీపంలోని సుబ్బంపేట తీరంలో కొనసాగుతున్న విషాదం ఇది.  అసలు ఏం జరిగింది?
   
2004 జూన్ 2. తెల్లవారుజాము.  ఆకాశం కబళించడానికి సిద్ధంగా ఉన్న సొరచేపలా ఉంది. సముద్రం ఆకలి దాచుకుని ఉన్న క్రూరమృగంలా ఉంది. కొన్ని శకునాలు వెంటనే అందవు. వేట ఉత్సాహంలో ఉన్నవారికి దృష్టి లక్ష్యం మీదే ఉంటుంది. ఆ రోజు ఎప్పటిలానే సుబ్బంపేటకు చెందిన తిర్రి మరిడియ్య, మేరుగు మసేను, మారిపల్లి ప్రకాష్, కోడ తాతబాబు, తిర్రి నూకరాజు, తిర్రి కొండయ్య, మేరుగు కొండయ్య ఇంట్లోవాళ్లకు వీడ్కోలు చెప్పి వేటకు బయలు దేరారు. వీళ్ల ప్రత్యేకత సొరచేపల వేట. అందుకే మరబోటులో చాలాదూరం వెళతారు. ఐదురోజుల వరకు తిరిగి రారు. ఇలా చాలాసార్లు చేశారు. కాని ఈసారి అలా జరగలేదు. వీళ్లు బయలుదేరిన మర్నాడే అర్ధరాత్రి నుంచి అకస్మాత్తుగా సముద్రంలో వాతావరణం మారిపోయింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం! ఆ వెంటనే అది వాయుగుండంగా మారింది. సముద్రమంతా అల్లకల్లోలం. తీరప్రాంతాలలో అలజడి. వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. వేటకు వెళ్లిన పడవలన్నీ అది విని సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాయి. కానీ వీళ్ల బోటు మాత్రం తిరిగి రాలేదు. మరో రెండు రోజులు గడిచాయి. అయినా వాళ్ల జాడ లేదు. ఇంట్లో వాళ్లకు కలవరం మొదలైంది. మరునాటికి వాతావరణం కుదురుకుంది. సముద్రమూ శాంతించింది. ఆ ఏడుగురు మాత్రం తీరం చేరలేదు. నెల రోజులైంది. ఇంట్లోవాళ్ల కలవరం బెంగగా దిగులుగా భయంగా ఆందోళనగా మారింది. గల్లంతైన వాళ్ల జాడ కనుక్కోవాల్సిందిగా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

నెలలు సంవత్సరాలుగా మారాయి. అయినా వేటకు వెళ్లిన వాళ్ల ఊసు లేదు. కాలం గడుస్తూనే ఉంది. నేటికి పదకొండేళ్లు. వాళ్లేమయ్యారన్నది నేటికీ ప్రశ్నార్థకమే. వాళ్లలోని కోడ తాతబాబుకు పెళ్లయి ఐదునెలలే. వేటకు వెళ్లేముందు ‘ఈసారి చేపలు బాగా పడితే నీకు బంగారు తాడు చేయిస్తాను’ అంటూ భార్యకు బాస చేశాడు. బంగారుతాడు సంగతి దేవుడెరుగు ఈ పసుపుతాడు గట్టిదో కాదో తెలియని పరిస్థితి అంటూ కన్నీరు మున్నీరవుతోంది అతని భార్య. ఇక తిర్రి మరిడియ్య, తిర్రి నూకరాజు తండ్రీ కొడుకులు. భర్తను, కొడుకును ఒకేసారి ఆచూకి కోల్పోయిన తిర్రి కాశమ్మ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసి చూసి బెంగతో రెండేళ్ల కిందట ప్రాణం విడిచింది. తిర్రి కొండయ్య భార్య కొయ్యమ్మకు భవిష్యత్తు తెలియడం లేదు. మేరుగు కొండయ్య భార్య కొండమ్మ, ముగ్గురు పిల్లలు నవ్వు మర్చిపోయారు. మేరుగు మసేను భార్య నాగమణి, పిల్లలకు తమ ఇంటి పెద్ద వస్తాడన్న ఆశ తప్ప వేరే ఆధారం లేదు. మారిపల్లి ప్రకాష్‌కు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, వారి పరిస్థితీ అదే.
   
ఈ ఏడుగురూ కనిపించకుండా పోయినప్పుడు సంబంధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వాధికారుల హామీలు నీటిమూటలే అయ్యాయి. సామాన్యంగా ఎవరైనా సముద్రంలో గల్లంతై ఏడేళ్ల తర్వాత కూడా తిరిగి రాకపోతే వాళ్లు మరణించినట్లుగా భావించి ప్రభుత్వం మరణ ధ్రువీకరణపత్రం జారీచేస్తుంది. తద్వారా ఆయా కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక సహాయం అందుతుంది. పింఛను వస్తుంది. కానీ ఈ మత్స్యకారులు గల్లంతయి పదకొండేళ్లయినా ఇంతవరకు మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయలేదు. గల్లంతయిన ఐదోరోజు అందిన అరకొర సాయం తప్ప ఎలాంటి ఆర్థిక ప్రయోజనమూ ఇంతవరకు ఈ కుటుంబాలకు అందలేదు. సంపాదించే కుటుంబ పెద్దను కోల్పోయి ఆదుకునే ఆసరాలేక ఇటు మానసికంగా అటు ఆర్థికంగా ఈ ఏడు కుటుంబాలు చితికిపోయాయి. ఎదిగిన ఆడపిల్లల పెళ్లిళ్లు, చదువుకోవాల్సిన పిల్లల చదువులు అన్నీ అలాగే ఆగిపోయాయి. ఈ ఆడబిడ్డల సంపాదన ఇల్లు గడవడానికే సరిపోవడం లేదు. ఇక ఈ బాధ్యతలన్నీ తీరేదెప్పుడు?
   
 ఒక మనిషి వస్తాడో రాడో తెలియకపోవడం నరకమే. కాని అందాల్సిన సాయం అందకపోవడం ఇంకా నరకం. మొదటిదాని విషయంలో ఆ స్త్రీలకు విధి సాయం చేయాలి. రెండవదాని విషయంలో ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించాలి.
 - వెలుగుల సూర్య వెంకట సత్య వరప్రసాద్,
 సాక్షి, పిఠాపురం
 
మాగోడు వినే నాథుడు లేడు
కనిపించకుండా పోయిన మావారిని చనిపోయినట్లుగా గుర్తించండి లేదా వారి ఆచూకీ అయినా కనుగొనండి అంటు అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ ఇప్పటికి కొన్ని వందలసార్లు ప్రదక్షిణలు చేశాం. అయినా పట్టించుకోవడం లేదు. అన్నీ కోల్పోయి..  ఏదిక్కు లేక వీధినపడ్డాం. మాగోడు వినే నాథుడే లేడు.
 - తిర్రి కొయ్యమ్మ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement