సృజన... సంచలనం! | she is inspiration to all womans | Sakshi
Sakshi News home page

సృజన... సంచలనం!

Published Tue, Sep 23 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

సృజన... సంచలనం!

సృజన... సంచలనం!

పెప్సీ అన్న పేరు వినగానే అలవోకగా అందరి పెదాలపై పలికే మాట... ‘యే దిల్ మాంగే మోర్’! చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరినీ అంతగా ఆకట్టుకుంది ఆ క్యాప్షన్. ఇంతకీ దాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా... అనుజా చౌహాన్. అడ్వర్టయిజింగ్ రంగంలో రెయిజింగ్ స్టార్ అంటూ తొంభైల్లో అందరితో అనిపించుకున్న వ్యక్తి ఆమె. అతి చిన్న వయసులోనే పెద్ద విజయాలు సాధించిన అనుజ... నేటి మహిళలెందరికో స్ఫూర్తిప్రదాత!
 
‘నీ మనసు చెప్పింది విను, అపజయాలకు భయపడకు’... అనుజా చౌహాన్ అందరితోనూ చెప్పే మాట ఇది. అది చెప్పేటప్పుడు ఆమె చూపులు సూటిగా ఉంటాయి. ముఖంలో ఆత్మవిశ్వాసం తెచ్చిన హుందాతనం కనిపిస్తుంది. ఎందుకంటే... అవి ఏవో చెప్పాలని చెప్పిన మాటలు కాదు. ఆమె సాధించిన విజయాలకు పునాదిరాళ్లు!
 
క్రియేటివ్ క్వీన్...
మీరట్‌లోని రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టారు అనుజ. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఆమె చిన్నతనమంతా ఉత్తర భారతదేశంలోని కంటోన్మెంట్లలో గడిచింది. ఆయన రిటైరయిన తర్వాత వారి కుటుంబం ఆస్ట్రేలియాకు తరలి వెళ్లింది. అక్కడి రాయల్ మెల్‌బోర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్ కమ్యునికేషన్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు అనుజ. ఆ తర్వాత భారతదేశానికి తిరిగొచ్చి, 1993లో ఢిల్లీలోని ‘జె.వాల్టర్ థామ్సన్’ కంపెనీలో ట్రెయినీగా చేరారు. నాటి నుంచీ సృజనాత్మక రంగంలో ఆమె ప్రయాణం అత్యంత వేగంగా సాగింది.
 
త్వరగా గ్రహించే తత్వం, వేగంగా ఆలోచించే లక్ష్యం, సృజనాత్మకత, నిబద్ధత, క్రమశిక్షణ... ఇలా చాలా విషయాలు అనుజను ఉన్నత స్థాయికి చేర్చాయి. జేడబ్ల్యూటీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డెరైక్టర్‌ని చేశాయి. అది కూడా ముప్ఫై మూడేళ్లకే. ఆ కంపెనీకి ఉపాధ్యక్షులైనవారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు అనుజ. అది అంత తేలికగా ఏమీ సాధ్యపడలేదు. పదిహేడేళ్ల పాటు తన తెలివితేటల్ని, క్రియేటివిటీని ఆ కంపెనీకి ధారపోశారు అనుజ. పెప్సీ యాడ్ కోసం... యే దిల్ మాంగే మోర్, మేరా నంబర్ కబ్ ఆయేగా, నథింగ్ ఆఫీషియల్ అబౌట్ ఇట్, ఓయ్ బబ్లీ అంటూ ఆమె సృష్టించిన క్యాప్షన్లు కాసులు కురిపించాయి. అలాగే... డర్‌కే ఆగే జీత్ హై (మౌంటెన్ డ్యూ), తేడా హై పర్ మేరా హై (కుర్‌కురే), బీ ఎ లిటిల్ దిల్లాజికల్ (లేస్ చిప్స్), బ్రేక్ తో బన్‌తా హై (కిట్‌క్యాట్)... ఇలా ఆమె రాసిన క్యాప్షన్లు ఆయా ఉత్పత్తులకు మార్కెట్లో తిరుగు లేకుండా చేశాయి. అందుకే క్రియేటివ్ క్వీన్ అంటూ ఆ కంపెనీ ఆమెకు పట్టం కట్టింది. అత్యున్నత పదవిని అప్పజెప్పింది.
 
ఊహించని అడుగు...
ఉన్నత స్థాయికి చేరడమనేది అదృష్టం. ఆ అదృష్టాన్ని ఎవరైనా వదులుకుంటారా? వదులుకుంటే వారిని అందరూ పిచ్చివాళ్లలా చూస్తారు. అనుజని కొందరు అలానే చూశారు... జేడబ్ల్యూటీ వైస్ ప్రెసిడెంట్ పదవిని వదులుకున్నప్పుడు! అడ్వర్టయిజింగ్ రంగంలో ఆమె సృష్టించిన సంచలనాలు వ్యాపార ప్రపంచంలో ఆమెను ఓ పెద్ద సెలెబ్రిటీని చేశాయి. ఎకనమిక్ టైమ్స్‌లో తరచుగా ఆమె శీర్షికలు కనిపించేవి. మన దేశంలోని పదిమంది హాట్ క్రియేటివ్ డెరైక్టర్స్‌లో ఒకరు అంటూ పత్రికలు ప్రశంసలు కురిపించాయి. 2010 సంవత్సరపు క్రియేటివ్ ర్యాంకింగ్స్‌లో 26వ ర్యాంకును ఆమెకు కట్టబెట్టాయి. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ప్రకటనా రంగం నుంచి తప్పుకుంది. అలా ఎందుకు చేశారు అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం... ‘నా మనసు చెప్పింది విన్నాను’ అని! ఇంతకీ ఆమె మనసు ఏం చెప్పిందో తెలుసా... రచయిత్రి అవ్వమని!
 
అవును. అనుజకి మొదట్నుంచీ రచయిత్రి కావాలని కోరిక. ఆ కోరికను తీర్చుకోవడానికే అంతవరకూ ఉన్న ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అందులోనూ విజయం సాధించారు. ఆమె రాసిన ‘ద జోయా ఫ్యాక్టర్’ అనే పుస్తకం బోలెడు అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత రాసిన ‘బ్యాటిల్ ఫర్ బిటోరా’, ‘దోజ్ ప్రైసీ ఠాకూర్ గాళ్స్’ కూడా ఆమెకు రచయిత్రిగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక్కడ కూడా మీ ముద్ర చూపించారుగా అని ఎవరైనా అంటే... ‘‘నాకు తెలుసు నేను సక్సెస్ అవుతానని, ఆ నమ్మకం లేకపోతే నేను అడుగే వేయను’’ అంటారు అనుజ. ఆ మాట ఎంత నిజమో... ఆమె కెరీరే చెబుతోంది కదా!
 
ఓ పక్క తన ప్రతిభకి, మరోపక్క తన అందానికి సమానంగా ప్రశంసలు పొందిన వ్యక్తి అనుజ. 2011లో ఫెమినా పత్రిక ఎంపిక చేసిన యాభైమంది భారతీయ సుందరీమణుల్లో అనుజ ఒకరు. అలాగే భారతదేశంలోని యాభైమంది శక్తిమంతమైన మహిళల జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించారు. 1994లో... ఇండియన్ ఐడల్, పర్‌ఫెక్ట్ బ్రైడ్ లాంటి ప్రతిష్టాత్మ టెలివిజన్ షోలను నిర్మించిన నిరేత్ అల్వాని పెళ్లాడారు అనుజ. వారికి ఇద్దరు కూతుళ్లు (నీహారిక మార్గరెట్, నయనతార వయొలెట్)... ఒక కుమారుడు (దైవిక్ జాన్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement