కాస్త కదలండి బాస్‌ | Singer Atif Aslam rescues girl from getting harassed, stops show midway | Sakshi
Sakshi News home page

కాస్త కదలండి బాస్‌

Published Fri, Jan 20 2017 12:22 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

Singer Atif Aslam rescues girl from getting harassed, stops show midway



బ్రిగేడ్‌ రోడ్‌

మనెకిన్‌ అంటే బొమ్మ. బట్టల షాపుల్లో కనిపించే మనిషి లాంటి బొమ్మ. ‘మగాళ్లూ! అలా మనెకిన్‌లా ఉండిపోవద్దు’
అని విజ్ఞప్తి చేస్తూ, కొన్నిరోజులుగా నెట్‌లో నిమిషమున్నర నిడివిలో ఒక వీడియో కనిపిస్తోంది. కొన్నిరోజులుగా అంటే...
బెంగుళూరులో, ఢిల్లీలో కొత్త సంవత్సరం రోజున అమ్మాయిల మీద పడి కొందరు మూకుమ్మడిగా టీజ్‌ చేసినప్పటి నుండి.
టీజ్‌ చేసిన వారి కంటే కూడా, ఆ రోజు టీజింగ్‌ని మనెకిన్‌లా చూస్తూ ఉండిపోయినవాళ్లే ఎక్కువ. దీనిపై స్పందిస్తూ ఈ వీడియో
అప్‌లోడ్‌ అయ్యింది. వీడియో చూడడానికి పెద్ద టైమ్‌ పట్టదు. చూశాక దానికి గురించి ఎవరు ఎంత టైమ్‌ ఆలోచిస్తారో తెలియదు.


వీడియో ఇలా స్టార్‌ అవుతుంది!
పట్టపగలు ఒక అమ్మాయిని ఒకడు ఈ రెక్కా, ఒకడు ఆ రెక్కా పట్టుకుని టీజ్‌ చేస్తుంటారు. ఆ అమ్మాయి ‘హెల్ప్‌ హెల్ప్‌’ అని అరుస్తూ ఉంటుంది. చుట్టూ జనం ఉంటారు. చూస్తూ ఉంటారు. చూస్తూ, ఎవరి పనుల్లో వాళ్లు, ఎవరి ఫోన్లలో వాళ్లు ఉంటారు. మొత్తానికి ఆ అమ్మాయి వాళ్లిద్దర్నీ వదిలించుకుంటుంది. ఒక్క క్షణం అలా ఉండిపోతుంది. ఉండిపోయి, స్క్రీన్‌లో నుంచి మనల్ని చూస్తూ ఉంటుంది. మనమూ ఆమెనే చూస్తూ ఉంటాం. కొద్ది క్షణాల తర్వాత ఆ అమ్మాయి తన హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి మెల్లిగా మూడు ప్లకార్డ్స్‌ తీస్తుంది. అవుటాఫ్‌ 60,000 పీపుల్‌ హు వర్‌ ఆన్‌ బ్రిగేడ్‌ రోడ్‌ (మొదటి కార్డు), పాజిబుల్లీ 1000 వర్‌ మోలెస్టర్స్‌ (రెండో కార్డు), ది రెస్ట్‌ 59,000 వర్‌ మనెకిన్స్‌ (మూడో కార్డు) అని వాటిపై ఉంటుంది. బెంగుళూరులోని బ్రిగేడ్‌ రోడ్డులో ఆ రోజు ఉన్నది అరవై వేల మంది అనుకుంటే, వారిలో వెయ్యి మంది టీజ్‌ చేసినవాళ్లు ఉంటే.. మిగతా యాభై తొమ్మిది వేల మంది బొమ్మల్లా చూస్తుండిపోయినవారు అని ఆ ప్లకార్డ్‌ల సారాంశం. ఆడపిల్లను ఏడిపిస్తుంటే అలా చూస్తూ ఉండిపోకండి అని సందేశం.

లోకం మొద్దుబారి పోయిందా?!
నడివీధిలో ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారీ దేశమంతా డిబేట్‌ జరుగుతుంది. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రదర్శనలు జరుగుతుంటాయి. బయటికి వచ్చే అమ్మాయిలు ఎప్పుడూ తమ దగ్గర పెప్పర్‌ స్ప్రేలు రెడీగా ఉంచుకోవాలని చెప్పేవారూ ఉంటారు. స్ప్రే ఉంటే సరిపోయిందా, స్ప్రేని కొట్టే ధైర్యం ఉండొద్దా అనేవాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో తెచ్చిన చర్చలోని ఒక యాంగిల్‌ ఏంటంటే... ‘ఆడపిల్లను ఏడిపిస్తుంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. లోకం ఇంకా అంత మొద్దుబారిపోలేదు’ అని. ‘మరి ఆ రోజు బెంగుళూరులో...’ అని ఎవరైనా ఆశ్చర్యంగా ప్రశ్నిస్తే అందుకు సహజంగానే వచ్చిన సమాధానం... అంత రాత్రప్పుడు 2.30 నిమిషాలకు ఒక అమ్మాయిని రక్షించడానికి తాగుబోతులతో ఎవరు తగాదా పడతారు అని! తగాదా పడనవసరం లేదు.

ఇక్కడ మేమున్నాం అన్న సంకేతం పంపిస్తే సరిపోతుంది. ఏమైనా ఇదంతా స్పాట్‌లో ఉన్నవాళ్ల ధైర్యం మీద, స్వభావం మీద, శక్తి మీద, సామర్థ్యం మీద, క్రియాశీలత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒక అమ్మాయిని అంత రాత్రప్పుడు కానీ, పట్టపగలు కానీ కాపాడ్డానికి వీటిల్లో ఏ ఒక్కటైనా ఉండాలి మగాళ్లకు. అసలు ఇవేవీ లేకున్నా ఫరవాలేదు... ఆమెను రక్షించాలి అన్న స్పృహ ఉన్నా.. చాలు, ఏం చెయ్యాలో తడుతుంది.

పాట ఆపేసిన పాకిస్తానీ సింగర్‌
అతిఫ్‌ అస్లామ్‌ పేరు వినే ఉంటారు. పాకిస్తానీ సింగర్‌. అతడి పాటలు కూడా వినే ఉంటారు. ఇటీవలే యూట్యూబ్‌లోకి తను, ఇలియానా కలిసి చేసిన ‘పెహ్లీ బార్‌’ సింగిల్‌ సాంగ్‌ను అప్‌లోడ్‌ చేశాడు. విషయం అది కాదు. జనవరి 14న అతడు పాకిస్థాన్‌లో మ్యూజిక్‌ కన్సర్ట్‌ ఇస్తున్నాడు. స్టేజ్‌ మీద ఉన్నాడు. మైక్‌లో పాడుతున్నాడు. అర్ధరాత్రయింది. ఆడియన్స్‌లో ఏదో కలకలం. పాడుతూనే అటు వైపు చూశాడు. ఆడియన్స్‌లో ఓ రౌడీ గ్యాంగ్‌ ఓ అమ్మాయిని టీజ్‌ చేస్తోంది!  అది టీజింగ్‌ కాదు. వేధింపు. అది గమనించాడు అస్లామ్‌. వెంటనే పాట ఆపేశాడు. సెక్యూరిటీ గార్డ్స్‌ని పిలిపించాడు. ఆ రౌడీలను చూపించాడు. వెంటనే వాళ్లు స్టేజి మీది నుంచి కిందికి దూకి ఆ అమ్మాయిని భద్రంగా స్టేజ్‌ మీదకు తీసుకొచ్చారు. నో ఫైటింగ్‌. నో న్యూసెన్స్‌. నో పోలీస్‌. నో అనౌన్‌మెంట్స్‌. నో వార్నింగ్స్‌. సింపుల్‌గా ఆ అమ్మాయిని అక్కడి నుంచి తప్పించారు.

‘మనెకిన్‌’ సందేశం కూడా ఇదే!
అస్లామ్‌ తను ఉన్నచోటు నుంచి కదల్లేదు. అలాగని ఓ ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోలేదు. తను ఏం చెయ్యగలడో అది చేశాడు. ఆలోచిస్తే ప్రతి ఒక్కరికీ.. వేధింపుల నుంచి అమ్మాయిని బయట పడేసే ఆలోచన ఏదో ఒకటి తడుతుంది. పెద్దగా అరిచి నలుగురినీ పోగెయ్యొచ్చు. పోలీసులకు ఫోన్‌ చెయ్యొచ్చు. కాస్త కండబలం ఉన్నవాళ్లయితే... ఆ అమ్మాయి దగ్గరికి అన్నయ్యలానో, ఆప్తుడిలానో వచ్చేయొచ్చు. బహుశా మనెకిన్‌ వీడియో సందేశం ఇదే కావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement