
వాగ్వాదానికి దిగిన యువకులు
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో మళ్లీ కీచకపర్వం కొనసాగింది. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో యువకులు విచక్షణ మరిచిపోయారు. గతేడాది మాదిరే ఈ సారి కూడా యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది బెంగళూరులో యువతులపై పెద్ద ఎత్తున లైంగిక వేధింపులు జరగడం, దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి బెంగళూరు నడిబొడ్డున ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్డులో పెద్ద ఎత్తున యువతీయువకులు చేరి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఇళ్లకు తిరిగివెళ్లే సమయంలో తాగిన మత్తులో కొంతమంది యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అమ్మాయి కాళ్లు పట్టించిన ఖాకీలు
విదేశీ వనితను అదేపనిగా తాకేందుకు యత్నించిన ఓ యువకుడిని పోలీసులు పట్టుకుని ఆ యువతికి క్షమాపణ చెప్పాలని కోరారు. మొదట నిరాకరించిన యువకుడు, అటుపై క్రిమినల్ కేసు పెడతామని పోలీసులు హెచ్చరించడంతో యువతి కాళ్లపై పడి క్షమాపణ కోరాడు. మరో ఘటనలో భర్త ఎదురుగానే అతడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగలేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. మద్యం మత్తులో కొంతమంది మాత్రం దురుసుగా ప్రవర్తించారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment