బెంగళూరు : కొత్త సంవత్సరం పేరుతో జరిగే వేడుకల ద్వారా సెక్స్, డ్రగ్స్, మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని, తద్వారా దేశ సంస్కృతి, సంప్రదాయాలను దిగజార్చుతున్నారని హిందూ అతివాద సంస్థలు మండిపడుతున్నాయి. అందుకే డిసెంబర్ 31న అర్ధరాత్రి 12లోపే అన్నీ మూసుకోవాలని హోటళ్లు, పబ్‌ల యాజమాన్యాలకు హుకుం జారీచేశాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం హిందూ సంస్థల బెదిరింపులు పట్టించుకోవాల్సిన అవసరంలేదని భరోసా ఇస్తోంది. గతంలో పబ్‌లపై దాడి, మహిళలపై దారుణకాండ ఇత్యాది ఘటనల నేపథ్యంలో కర్ణాటకలోని మంగళూరు, బెంగళూరు నగరాల్లో జరగబోయే ఈవెంట్లపై భయాందోళనలు నెలకొన్నాయి.
హోటల్, పబ్ యాజమాన్యాలకు సందేశాలు : వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, కేఆర్‌వీవైఎస్ లాంటి సంస్థలు ఇప్పటికే మంగళూరు నగరంలోని ప్రముఖ హోటళ్లు, పబ్‌లకు సందేశాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12లోగా మూసివేయాలని ఆయా యాజమాన్యాలను కోరినట్లు పేర్కొన్నారు. అయితే కర్ణాటక హోం మంత్రి రామలింగారెడ్డి మాత్రం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ‘‘భజరంగ్ దళ్ లాంటి సంస్థలు ప్రతి ఏడాది ఇలాంటి ప్రకటనలు చేయడం మామూలే. అసలు ఇలా శాసించే హక్కు వాళ్లకి లేదు. వేడుకలు జరిగే చోట బందోబస్తు ఏర్పాటుచేస్తాం’’ అని చెప్పారు.
గత ఏడాది కీచకపర్వం : సరిగ్గా ఏడాది కిందట బెంగళూరులోని ఎంజే రోడ్డులో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో మద్యం, డ్రగ్స్ సేవించిన కొందరు యువకులు మహిళలపై కీచక పర్వాలకు దిగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. శ్రీరాంసేన కార్యకర్తలు కొందరు మంగళూరులోని ఓ పబ్‌లోకి చొరబడి మహిళలను చితకబాదిన ఉదంతం గుర్తే. ఈ గత అనుభవాల దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. వేడుక వేళ భద్రతా చర్యల్లో భాగంగా ఎంజీ, బ్రిగేడ్ రోడ్లలో 30 శాతాన్ని కేవలం మహిళల కోసం కేటాయించనున్నారు. ఇక్కడకు ఎట్టి పరిస్థితుల్లోనూ పురుషులను అనుమతించరు. అదే విధంగా 70 శాతం రోడ్డును పురుషులకు కేటాయిస్తారు. ఇక్కడ పురుషులతో పాటు మహిళలకూ ప్రవేశం ఉంటుంది. దంపతులు, స్నేహితులు తదితరులు ఇక్కడకు వచ్చి వేడుకల్లో పాల్గొనవచ్చు.
తాగినోళ్లకు తాగినంత..: న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరు నగరంలో పబ్బులు, రెస్టారెంట్లు, బార్ల క్లోజింగ్ టైమ్‌లో ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. బార్లు, పబ్బులును ఉదయం రెండు గంటలకు వరకూ తెరిచివుంచేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బార్లు, పబ్బుల్లో స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులను కేటాయించడంతో పాటు, పిల్లలతో వచ్చే తల్లులకు రిజర్వ్‌డ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని బెంగళూరు పోలీసులు బార్లు, పబ్బులు, రెస్టారెంట్ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment