ఒంటరి మహిళ ఒడిలో వరాల మూట
సర్వే
జీవితం.. మనిషిని ఒంటరిగా ఉంచదు.
ఉదయాన్నే సూర్యుడొచ్చి లేపుతాడు.
రాత్రవగానే నక్షత్రాలు పలకరిస్తాయి.
పక్షుల పరవశ రాగాలొచ్చి వాలిపోతాయి.
పూల పరిమళాలు మెత్తగా హత్తుకుంటాయి.
ఇవి మాత్రమే కాదు..
అనాథ బాలల నవ్వులూ ఉన్నాయి!
ఆ నవ్వులకు ఒడిపడుతున్న వారిలో ఇప్పుడు
మహిళలదే ముందడుగు.
‘ఒంటరి మహిళ ఈ సమాజంలో బతకడమే కష్టం.’ ఇటీవల సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే ఈ అభిప్రాయం మెల్లమెల్లగా దూరమవుతోందనిపిస్తోంది. ఒంటరి మహిళ తాను జీవించడంతోపాటు మరో అనాథ బిడ్డను దత్తు తీసుకొని ఆ బిడ్డకు తల్లిలా ప్రేమను పంచుతోంది. మంచి భవిష్యత్తును ఇవ్వగలదని నిరూపిస్తోంది. సమాజంలో వస్తున్న మార్పులకు ఇదో మంచి సూచిక. ఇటీవల భారత ప్రభుత్వ దత్తత గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.
రెండేళ్ల క్రితం అంటే 2015 ఆగస్టు నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దత్తత కోరే తల్లిదండ్రుల వివరాల నమోదు తప్పనిసరి చేశారు. దీంట్లో భాగంగా 412 మంది ఒంటరి మహిళలు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి,, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ శాఖవారికి తమ వివరాలను పొందుపరుస్తూ నమోదు చేసుకున్నారు. 2015లో 75 మంది ఒంటరి మహిళలు పిల్లలను దత్తత తీసుకోగా వీరి సంఖ్య కిందటేడాది అంటే 2016లో 93కి పెరిగింది. భారతదేశం మొత్తం మీద 2015 – 2016 సంవత్సరంలో 2,903 మంది పిల్లలు దత్తత వెళ్లారు. 2011 జనాభా గణన సంఖ్యను పరిశీలిస్తే ఒంటరిగా ఉండే మహిళలు (పెళ్లికానివారు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు) 71 లక్షల పైచిలుకు ఉన్నారు. సమాజంలో ఎదుగుదల, ఒత్తిడి పరిగణనలోకి తీసుకుంటే ఇటీవల వీరిలో ఎంతో అవగాహన, ఆత్మవిశ్వాసం పెరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అవగాహన కల్గి ఉండే ఒంటరి మహిళల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
మగువలే ముందడుగు..
ఒంటరి మహిళలతో పోల్చితే ఒంటరి మగవారు పిల్లలను దత్తత తీసుకోవడంలో వెనుకబడే ఉన్నారు. 2015–2016లో ఒంటరి మగవారు దత్తత కోసం తమ పేర్లను నమోదుచేసుకున్నవారి సంఖ్య 25 ఉండగా కేవలం ఐదుగురు పిల్లలను మాత్రమే దత్తత స్వీకరించారు. దత్తత నమోదు పట్టికలో ఒంటరిగా ఉండే మహిళలు లేదా మగవారికీ కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. అయితే, ఒంటరిగా ఉండే మగవారు అమ్మాయిలను దత్తత తీసుకునే సౌలభ్యం లేదు. 55 ఏళ్లు వస్తే ఒంటరి మగవాడు దత్తత తీసుకునే అర్హతనూ కోల్పోతాడు.
వివక్షకు వీడ్కోలు
‘‘ఒంటరి మహిళ పిల్లలను దత్తత తీసుకోవడానికి సాంఘిక వైఖరిలో వస్తున్న మార్పులు సహకరిస్తున్నాయి. అదేవిధంగా పారదర్శక విధానాలూ ఇందుకు సహాయపడుతున్నాయి’’ అంటున్నారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సెక్రటరీ కొలొనెల్ దీపక్ కుమార్. మాతృహక్కు అర్హత ప్రమాణాలను నెరవేర్చితే సమాజంలో వివక్ష తగ్గిపోతోందని, అయితే, ఒంటరి మహిళలకు దత్తత ఇవ్వడానికి దత్తతసంస్థలు ఇంకా అంత సుముఖంగా లేవని స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులంటున్నారు.
అయినప్పటికీ నిరాకరణ...
అక్టోబర్ 2015 నుంచి ఒంటరి మహిళకు బిడ్డను దత్తత ఇవ్వడానికి మదర్ థెరిస్సా మిషనరీస్ స్వచ్ఛంద సంస్థలు నిరాకరిస్తున్నాయి. కొత్త స్వీకరణ మార్గదర్శకాలను పాటించడానికి వీరు నిరాకరిస్తున్నారు. సైద్ధాంతిక కారణాల వలన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలోని అనాథ శరణాలయాల్లో ఈ దత్తత స్వీకరణను నిలిపివేసింది. అయినప్పటికీ దేశం మొత్తమ్మీద 2016–2017 (మార్చి వరకు) పిల్లల దత్తతు సంఖ్య 2,671గా ఉంది. సర్వే ప్రకార ంగా దేశం మొత్తం మీద చూస్తే వివిధ స్వచ్ఛంద సంస్థలలో 50 వేలకు పైగా అనాథలు ఉన్నారు. వీరి నుంచి కూడా డేటా సేకరిస్తే దత్తత సంఖ్యలో మార్పు ఉండవచ్చు.
చట్టబద్ధత లేని దత్తత... సమస్యే...
చట్టబద్ధంగా దత్తత తీసుకునే తల్లితండ్రుల నమోదు సంఖ్య 14,000 మంది ఉన్నారు. దత్తతు ఇచ్చే పిల్లల సంఖ్య మాత్రం 1,800 మంది ఉన్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలు అనాథ పిల్లల పూర్తి వివరాలను నమోదు చేయడం లేదు. ఈ విషయమే ప్రస్తావిస్తూ స్త్రీ శిశు శాఖా మంత్రి మనేకా గాంధీ ఇటీవల యూనియన్ హెల్త్ మినిస్టర్‌కు కొన్ని సూచనలు ఇచ్చారు. యోగ్యతలేని నర్సింగ్‌హోమ్‌లు, ఆసుపత్రులలో పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేరు నమోదు చేయరని, ఇక్కడి నుంచే దత్తత కార్యక్రమాలు అనధికారికంగా జరుగుతుంటాయని తెలియజేసేవారు. ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టసమ్మతికాని దత్తత ఎప్పటికైనా సమస్యలకు కారణమే అవుతుందని, దీనిపట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
– ఎన్.ఆర్