ఊళ్లు పట్టుకు తిరిగితే ఆరు కోట్లిస్తారా!
విడ్డూరం
మంచి జీతం, సౌకర్యాలు, ఆఫీసులో కాస్తంత స్వేచ్ఛగా ఉండగలగడం, కోరినన్ని సెలవులు... ఇవి ఏ ఉద్యోగికైనా ఉండే కొన్ని ప్రాథమికమైన కోరికలు. అయితే ఉద్యోగం కోసం ఆఫీసుకే వెళ్లనవసరం లేకపోతే? హ్యాపీగా ఊళ్లన్నీ తిరుగుతూ ఆనందంగా గడపడమే ఉద్యోగమైతే? పైగా అలా గడిపినందుకు ఏడాదికి ఆరు కోట్ల రూపాయల ప్యాకేజీ కూడా ఇస్తే? అంతకన్నా ఆనందం, అదృష్టం ఉంటాయా ఎవరికైనా! ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, అసలలాంటి ఉద్యోగం ఉంటుందా అనుకోకండి.
ఉంటుంది... కాదు ఉంది. బ్రిటన్‌కు చెందిన ఒక లగ్జరీ టూరిస్టు కంపెనీ అలాంటి ఉద్యోగాన్నిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లోని వివిధ రిసార్టులను సందర్శించడం, అత్యంత ఖరీదైన వాటిల్లో బస చేయడం, రకరకాల వంటకాలు రుచి చూడటం, ఆయా నగరాల్లోని అన్ని ప్రముఖ ప్రాంతాలన్నీ సందర్శించడం... స్థూలంగా చెప్పాలంటే ఏ ఒక్క సౌకర్యాన్నీ వదలకుండా అనుభవించడమే ఆ ఉద్యోగం! అందుకు అయ్యే ప్రతి రూపాయినీ ఆ ట్రావెల్ సంస్థే భరిస్తుంది.
అందుకు ప్రతిగా చేయాల్సింది ఒకటే... మీరు అనుభవించిన సౌకర్యాలు, సదుపాయాల గురించి సమీక్ష రాయడం! అలుపు లేకుండా వెనిస్, నెక్ ఐలాండ్, బ్యూనస్ ఎయిర్స్, మియామీ, లాస్‌వెగాస్, మాల్దీవులు తదితర ప్రాంతాలు పట్టుకు తిరిగితే కోట్లకు కోట్లు ముట్టజెబుతామంటోంది. ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడ్డం, సృజనాత్మకంగా రాయడం వస్తే చాలంటోంది. మీకుగానీ ఆ అర్హతలుంటే ఒక్కసారి http://www.veryfirstto.com వెబ్‌సైట్ చూడండి. ఎంపిక అయితే ఇక మీ పంట పండినట్టే!