![So long, the feet are so round - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/5/chettu-needa-5.jpg.webp?itok=RWSKozZH)
తల్లి ఒంటె, పిల్ల ఒంటె విశ్రాంతిగా ఉన్నాయి. ‘‘అమ్మా.. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగొచ్చా?’’ అంది పిల్ల ఒంటె. ‘‘తప్పకుండానమ్మా... అడుగు, చెప్తాను’’ అంది తల్లి ఒంటె. ‘‘వీపు పైన మనకు ఎందుకిలాగా ఉంది?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘దీన్ని మూపురం అంటారు. ఇందులో నీళ్లు నిలువ ఉంటాయి. అవసరం అయినప్పుడు వాటితో దాహం తీర్చుకోవచ్చు. ఎడారిలో నీళ్లు దొరకవు కాబట్టి దేవుడు మనకు ఈ ఏర్పాటు చేశాడు’’అని చెప్పింది తల్లి ఒంటె. ‘‘మరి మన కాళ్లు ఎందుకు ఇంత పొడవుగా, పాదాలు ఇంత గుండ్రంగా ఉన్నాయి?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘ఎడారిలో నడిచేందుకు వీలుగా దేవుడు మనకీ ఏర్పాటు చేశాడమ్మా.’’ అని చెప్పింది తల్లి ఒంటె. ‘‘మరి కనురెప్పలు ఎందుకమ్మా ఇంత పెద్దవిగా ఉన్నాయి?’’ అని అడిగింది పిల్ల ఒంటె. ‘‘ఎడారి గాలుల నుంచి, ఇసుక తుపాన్ల నుంచీ ఈ కనురెప్పలు మన కళ్లను, చూపును కాపాడేందుకు దేవుడు మనకీ ఏర్పాటు చేశాడమ్మా..’’ అని చెప్పింది తల్లి ఒంటె.
పిల్ల ఒంటె అలా ఒక్కో ప్రశ్నా అడుగుతుంటే తల్లి ఒంటె ఉత్సాహంగా సమాధానాలు చెబుతోంది. పిల్ల ఒంటె కొద్దిసేపు మౌనంగా ఉండి, మళ్లీ ఒక ప్రశ్న అడిగింది. ‘‘ఎడారిలో జీవించడానికి కదా అమ్మా.. దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు. మరి ఇక్కడ ఎందుకున్నాం.. ఈ ‘జూ’ లో..’’ అని అడిగింది పిల్ల ఒంటె. తల్లి ఒంటె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయింది. పిల్ల ఒంటెను దగ్గరకి తీసుకుని హత్తుకుంది. ‘దేవుడు అలా చేస్తే, మనిషి ఇలా ఎందుకు చూస్తాడో’ అనుకున్నట్లుగా ఆలోచనలో పడిపోయింది. నేర్పు, నైపుణ్యం, తెలివి, అనుభవం.. ఇవన్నీ అనువైన చోట మాత్రమే ఉపయోగపడతాయి. అనువుకాని చోట వాటి వల్ల ప్రయోజనం ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment