
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డెలివరీ పార్ట్‌నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్‌రూమ్స్, విశ్రాంతి ప్రదేశం ఈ కేంద్రాల్లో ఉంటాయని వివరించింది.
ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబైలో ముందుగా ఇవి రానున్నాయి. తాము కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 1,800 డెలివరీ స్టేషన్స్ ఉన్నాయని చెప్పారు.
ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ ప్రతినిధులు సైతం ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకేసారి 15 మంది వరకు విశ్రాంతి పొందవచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో డెలివరీ ప్రతినిధి రోజులో 30 నిముషాలు మాత్రమే ఇక్కడ గడపవచ్చు. ప్రాజెక్ట్ ఆశ్రయ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో సైతం విశ్రాంతి కేంద్రాలను నెలకొల్పాలని అమెజాన్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment