ఆ కాపురంపై మీ కామెంట్‌? | Social Media Effect on Family Awareness Special Story | Sakshi
Sakshi News home page

ఆ కాపురంపై మీ కామెంట్‌?

Published Thu, Aug 1 2019 8:04 AM | Last Updated on Thu, Aug 1 2019 8:04 AM

Social Media Effect on Family Awareness Special Story - Sakshi

భార్యాభర్తలు మొదట స్నేహితులుగా మారితే బయటి స్నేహితుల అవసరం ఉండదు. భార్యాభర్తలు మొదట ఒకరినొకరు అర్థం చేసుకుంటే అపార్థానికి తావు ఉండదు. కుటుంబంలో సంఘంలో ఇద్దరికీ సమాన ఉనికి ఉండాలని భావించినప్పుడు ఏం చేయాలో చర్చించుకొని మార్గం వెతుక్కోవాలి. లేదంటే అకారణంగా వంట చెడుతుంది. అనవసరంగా కాపురం చెడుతుంది.

లేడీ సైకియాట్రిస్ట్‌ దగ్గరకు ఆమెను తీసుకొచ్చారు. ముప్పై అయిదేళ్లు ఉంటాయి. నిండు బొట్టు ఉంది. చక్కగా చీర కట్టుకుని ఉంది. ముఖం చక్కగా ఉంది. కొంచెం కళ్ల కింద నలుపు ఉంది కాని మనిషి ఏమీ పట్టనట్టుగానే ఉంది. తోడు ఉన్నది తల్లిదండ్రులు అని వారి వాలకం చూడగానే అర్థమవుతోంది. తండ్రికి యాభై పైనే. తల్లి వయసు యాభై లోపు.

‘చెప్పండి’ అంది లేడీ సైకియాట్రిస్ట్‌.
‘కాపురానికి వెళ్లట్లేదు డాక్టర్‌. ఇంట్లో నుంచి రెండుసార్లు పారిపోయి మా దగ్గరకు వచ్చేసింది పిల్లలతో. ఆ ఇంట్లో ఉండదంట. కొత్త పెళ్లి కూతురు ఏదో పడలేదు.. వచ్చేసింది అంటే అర్థముంది. పెళ్లయ్యి పన్నెండేళ్లయ్యాక ఇదేం పాడు రోగం. ఈ జబ్బుకు గట్టి మందేయ్యండి డాక్టర్‌’ అంది తల్లి.

‘ఏమ్మా ఏమిటి కష్టం?’ అడిగింది సైకియాట్రిస్ట్‌.
తండ్రికి కోపం వచ్చింది.
‘అలా మెత్తగా అడుగుతారేంటి డాక్టర్‌ నాలుగు అంటించక. ఏముంటుంది కష్టం? అల్లుడు బంగారం. మంచి ఉద్యోగం చేస్తాడు. ఇల్లు ఉంది. కోరింది తెచ్చిస్తాడు. ఏమిటి దీనికి కొవ్వు. ఈ వయసులో మాకు ఈ టెన్షన్‌ తెచ్చి పెడుతోంది’ అన్నాడు.

‘చెప్పమ్మా... ఏమిటి కష్టం?’ మళ్లీ అడిగింది సైకియాట్రిస్ట్‌.
‘ఆయనకు నా వంట నచ్చట్లేదండీ. రోజూ తిడుతున్నాడు’
‘బాగానే చేసేదానివి కదే. నీ వంటకేమిటి లోపం?’ అంది తల్లి.

‘అది ఆయన్నడుగు’
‘అయినా వంటకూ వేణ్ణీళ్లకు తగాదా పడి పుట్టిల్లు చేరడం ఏమిటి డాక్టర్‌’ అన్నాడు తండ్రి.
‘సరే. మీ ఆయనకు చెప్పి వంట పని నుంచి తప్పిస్తాను. చక్కగా వంటి మనిషిని పెట్టుకోండి. లేదంటే స్విగ్గీ నుంచో జొమాటో నుంచో తెప్పించుకోండి. అప్పుడు వెళతావా కాపురానికి?’ సైకియాట్రిస్ట్‌ అడిగింది.
ఆమె నిశ్చయంగా తల ఆడించింది.

‘ఊహూ’
‘వెళ్లవా?’
‘అసలెప్పటికీ వెళ్లను’
ఆ సమాధానానికి తల్లిదండ్రులతో పాటు సైకియాట్రిస్ట్‌ కూడా తలపట్టుకుంది.

మరోవారానికి భర్తను పిలిపించింది సైకియాట్రిస్ట్‌. అతను మార్కెటింగ్‌ ఫీల్డ్‌లో సీనియర్‌ ఆఫీసర్‌. మనిషి నెమ్మదస్తుడిగానే ఉన్నాడు.
‘నాకు వేరే హ్యాబిట్స్‌ ఏమీ లేవు డాక్టర్‌. పని అవడంతోటే ఇల్లు చేరుతాను. చిన్నప్పటి నుంచి నాకు తినేదేదో నోటికి హితంగా తినాలని కోరిక. తిండిపోతును కాదు. కాని కొంచెం తిన్నా సరైనది తినాలని అనిపిస్తుంది. నా భార్య బాగా వంట చేసేది. కొన్నాళ్లుగా బాగానే చేస్తూ ఉంది. ఇటీవల అలా అలా చేస్తోంది. ప్రస్తుతం చెత్తగా వండుతోంది. అలా వండితే ఎలా అని మందలించాను. రెండుమాడు సార్లు గట్టిగా చెప్పాను. అంతే. ఇందులో నా తప్పు ఉందంటారా?’ అన్నాడు.

కేసేమిటో అర్థం కాలేదు.
‘సరే.. మీరు వెళ్లండి’ అని పంపించేసింది.
మరి నాలుగు రోజులకు మళ్లీ ఆమెను రమ్మనింది. ఈసారి ఒక్కర్తినే.
‘చెప్పు ఏమిటి ప్రాబ్లమ్‌?’ అడిగింది.
‘నా ఫోన్‌ లాక్కుంటున్నాడు డాక్టర్‌’
‘ఫోన్‌ లాక్కుంటున్నాడా?’
‘అవును’
‘ఎందుకు?’

ఆమె కొంచెం ఆలోచించింది చెప్పాలా వద్దా అని. మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది.
‘పెళ్లికి ముందు నేను ఉద్యోగం చేసేదాన్ని డాక్టర్‌. హెచ్‌ఆర్‌లో డిప్లమా చదివాను. హెచ్‌ఆర్‌లోనే పని చేసేదాన్ని. కాని ఈయనకు ఉద్యోగం ఇష్టం లేదు. పెళ్లి సమయానికే మానిపించేశారు. కొన్నాళ్లు కాపురంలో నాకు ఏ కంప్లయింట్స్‌ లేవు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్లను, ఇంటిని, భర్తను చూసుకోవడం అలా గడిచిపోయింది. ఇప్పుడు ఉదయాన్నే పిల్లలు స్కూల్‌కు వెళ్లిపోతున్నారు. ఈయనా తొమ్మిదిన్నరకు వెళ్లిపోతారు. పదకొండుకంతా ఫ్రీ అయిపోతున్నాను. ఏం చేయాలో తోచలేదు. అప్పడు ఈ ఫేస్‌బుక్‌ అలవాటైంది’

సైకియాట్రిస్ట్‌ వింటూ ఉంది.
‘మొదట అదో సరదాగా దానిని చూడటం మొదలెట్టాను. ఆ తర్వాత వాట్సప్‌ కూడా అలవాటైంది. అవి ఎక్కువగా చూస్తున్నాని వంట మీద వంక పెట్టి తిడుతున్నాడు. ఫోన్‌ లాక్కుంటున్నాడు. ఇలా విసిగిస్తే కాపురం ఏం చేయమంటారు?’ అని ముగించింది.

ఆమెను పంపించాక సైకియాట్రిస్ట్‌ ఆమె భర్తకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది.
‘డాక్టర్‌. చెప్పుకుంటే సిగ్గుచేటని మీకు చెప్పలేదు. ఆమెకు ఫేస్‌బుక్‌లో మూడువేల మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. వాళ్లెవరో ఏమిటో కూడా ఆమెకు తెలియదు. ఆ పోస్ట్‌లకూ ఆమెకు కూడా సంబంధం ఉండదు. ఈమె మా వరండాను, టీవీని, అప్పుడే కొని తెచ్చిన దువ్వెనలని, కొత్తగా కుండీలో పూచిన పువ్వుని ఫొటోలు తీసి పెడుతుంది. దానికో వంద లైకులు వస్తాయి. ఈమె సెల్ఫీలు పెడుతుంటుంది. ఈ మధ్య టిక్‌టాక్‌లు నేర్చి అవి పెడుతోంది. అదీ భరించాను. తాజాగా స్మ్యూల్‌లో పాటలు పాడి వాటినీ పెడుతోంది. ఆమె గొంతు ఏమీ బాగుండదు. పాడుతుంటే నవ్వొస్తూ ఉంటుంది. అవన్నీ పోనివ్వండి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఫోన్‌ చూస్తూ ఉంటే వంట పాడు కాకుండా ఏమవుతుంది. అది గమనించి గమనించి ఫోన్‌ లాక్కుని పక్కన పడేశాను. ఏవో చిన్న చిన్న టైమ్‌పాస్‌లు ఉండాలని నాకూ తెలుసు డాక్టర్‌. కాని ఇది ఉన్మాదం స్థాయిలో ఉంది. దారుణమైన అడిక్షన్‌. నాక్కూడా చాలా విసుగొస్తోంది’ అన్నాడతను.

కేసు పూర్తిగా అర్థమైంది.
సైకియాట్రిస్ట్‌ భార్యను భర్తనూ కూచోబెట్టి చెప్పింది.
‘చూడండి మిస్టర్‌. మీరు మొదట మీ భార్యతో టైమ్‌ కేటాయించాలి. ఆమెకు ఏదైనా పనికొచ్చే వ్యాపకం, ఉద్యోగం చేసే వీలు కల్పించాలి. ఆమె తనకొక ఉనికి ఉంది అని తనను తాను గౌరవించుకునే ఏర్పాటు చేయాలి. భార్య ఉనికి, తల్లి ఉనికి ఆమెకు ఇంట్లో గుర్తింపు ఇవ్వొచ్చేమోకాని సంఘంలో ఇవ్వడం లేదు. సంఘంలో తన ఉనికి కోసం ఇలా ఫేస్‌బుక్‌ వంటి మాధ్యమాల్లోపడి కొట్టుకుపోతోంది. కనుక మీరిద్దరూ కూచుని మాట్లాడుకుని దీనికి సమాధానం వెతుక్కోండి’ అంది సైకియాట్రిస్ట్‌.

అలాగే భార్య వైపు చూస్తూ ‘ఫేస్‌బుక్‌లు వాట్సప్‌లు కాలక్షేపంగా ముందు అనిపించినా ఎవరైనా అక్కరలేని అపరిచితుల స్నేహంలోకి వెళితే ఏం చికాకులు వస్తాయో తెలియదు. కుటుంబ సమస్యలు తలెత్తడమే కాక మానసికంగా కూడా స్ట్రెస్‌ పెరిగిపోతుంది. ఇవాళ రేపు ముగ్గురు నలుగురు స్నేహితులకే టైమ్‌ ఇవ్వలేకపోతున్నాం. మూడు వేల మంది ఫ్రెండ్స్‌ నీకు అవసరం అంటావా?’ అంది.
భార్యాభర్తలు ఇద్దరూ తలలు ఆడించారు. జుకర్‌బర్గ్‌కు ఏమాత్రం సమాచారం లేకుండానే ఒక కాపురం కూలిపోతూ నిలిచిన ఘటన ఒకటి ఈ అసంఖ్యాక జీవితాల నడుమ సంభవించి ముందుకు కదిలిపోయింది.
– కథనం: సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement