ఛేంజ్ కోరుకుంటోంది! | Society want to change | Sakshi
Sakshi News home page

ఛేంజ్ కోరుకుంటోంది!

Published Sat, Aug 1 2015 1:06 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

ఛేంజ్ కోరుకుంటోంది!

ఛేంజ్ కోరుకుంటోంది!

'ఒక అమాయకురాలైన ఆడపిల్లకు న్యాయం చెయ్యలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత.. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం..! ఇది కాదండీ ప్రజలు కోరుకునేది. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు'  ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తున్న, కనిపిస్తున్న డైలాగ్ ఇది.  'లీడర్' చిత్ర దర్శకుడు పలికించినట్టుగా నిజంగానే యువత మార్పు కోరుకుంటోంది. ఒకప్పుడు ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టుండే యువతరం ఇప్పుడు ఉగ్రనరసింహావతారం ఎత్తుతోంది. ప్రభుత్వాలను, వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఛేంజ్.ఆర్గ్ లాంటి వెబ్‌సైట్లు వీరికి వేదికగా నిలుస్తున్నాయి.
 
 పదిహేనేళ్ల లక్ష్మి పేరుకు తగ్గట్టు లక్ష్మీదేవిలా ఉండేది. ఆమె అందం, అమాయక చూపులు పదిమందిలోనూ ఆమెను ప్రత్యేకంగా నిలిపేవి. ఈ ప్రత్యేక గుర్తింపు టీనేజీ అమ్మాయిలను సంబరపెట్టేదే. అయితే లక్ష్మి విషయంలో జీవితాంతం వేదన మిగిల్చింది. ప్రేమిస్తున్నామంటూ, పెళ్లిచేసుకోవాలంటూ ఇద్దరు వ్యక్తులు వెంటపడేవారు. వారిని లక్ష్మి తిరస్కరించింది. అంతే.. సమీపంలోని మెడికల్ షాపులో యాసిడ్ కొన్నారు. తర్వాత జరిగేది మన ఊహకు అందని విషయమేమీ కాదు.

 ఏడేళ్లు గడిచాయి. లక్ష్మి చూస్తుండగానే వందల సంఖ్యలో యాసిడ్ దాడులు. వందల మంది లక్ష్మిలు! ఆమె గుండె రగిలింది. ఈ సమాజం మారదా అంటూ తనను తాను ప్రశ్నించుకుంది. లోలోపలే కుమిలిపోతే లాభం లేదనుకుంది. తన వ్యథను పంచుకుంటూ 'ఛేంజ్.ఆర్గ్' వెబ్‌సైట్ వేదికగా ఓ పిటిషన్ దాఖలు చేసింది. యూపీఏ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను ఉద్దేశిస్తూ.. 'భారత్‌లో యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ కావాలి' అంటూ గళమెత్తింది. పిటిషన్ పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే 27 వేల మంది మద్దతుగా సంతకాలు చేశారు. సుప్రీం కోర్టు జోక్యంతో నాటి యూపీఏ ప్రభుత్వం యాసిడ్ అమ్మకాలను నియంత్రిస్తామంటూ 2013, జూలై 16న ప్రకటించింది. లక్ష్మి విజయం సాధించింది.

 పరిణామాలు..
నెటిజన్ల ఆదరణ చూరగొన్న పిటిషన్లు ప్రభుత్వాలను సైతం కదిలించగలుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలే కాక, ప్రైవేటు వ్యవస్థల మీద కూడా ఈ సోషల్ ఉద్యమాల ప్రభావం ఉంటోంది. దీనికి నిదర్శనం అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ దేశాల్లో నెటిజన్లు సాధించిన విజయాలే. తన జననాంగాల కోతను (ఫీమేల్ జెనిటల్ మ్యుటిలైజేషన్) అడ్డుకోవాలంటూ లండన్‌కు చెందిన ఓ మైనారిటీ చిన్నారి చేసిన విజ్ఞప్తి, బాస్కెట్‌బాల్ క్రీడలో తలపాగాలు తొలగించబోమన్న ఓ సిక్కు క్రీడాకారుడి ప్రతిఘటన, ఫ్లిప్‌కార్ట్‌లో లింగ నిర్ధారణ పుస్తకాల విభాగాన్ని తొలగించాలంటూ చేసిన ఆందోళన, కేరళలో వీధి కుక్కలను చంపొద్దంటూ తెలిపిన నిరసన.. ఇవన్నీ ఛేంజ్.ఆర్గ్‌లో కనిపిస్తాయి. వేల సంఖ్యలో సంతకాలు పోగుచేసి విజయఢంకానూ మోగిస్తాయి.

భారత్‌లో..
ఫేస్‌బుక్, ట్వీటర్ హవాలో నెగ్గుకురావడం కొంత కష్టమైన పనే అయినప్పటికీ మన దేశంలోనూ ఈ మధ్యే ఛేంజ్.ఆర్గ్ లాంటి సంస్థలు పుంజుకుంటున్నాయి. ఉబెర్ క్యాబ్స్ ఉదంతం, కర్ణాటకలో పాఠశాల విద్యార్థుల భద్రత, వేలాది చెట్లను నరికివేతకు కారణమైన హుబ్లీ ధర్వార్డ్ హైవే నిర్మాణం వంటి సమస్యలు ఈ ఆన్‌లైన్ వేదికపై విజయం సాధించాయి. కేరళలో వీధి కుక్కల సంహారం లాంటి అంశాలు విజయం సాధించనప్పటికీ, దేశంలో చర్చలకు కారణమవుతున్నాయి. తెలుగు విద్యార్థిని రిషితేశ్వరి పేరున కూడా ఈ వెబ్‌సైట్‌లో ఓ పిటిషన్ ప్రారంభమైంది.

 వివాదం..
 ఈ వెబ్‌సైట్ ద్వారా సంఘ విద్రోహక పిటిషన్లకు కూడా మద్దతుదారులు పెరగడం లాంటి సంఘటనలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే, దీన్ని సున్నితంగా ఖండిస్తున్నారు నిర్వాహకులు. ఏదైనా అంశం ప్రజలకు నచ్చితేనే మద్దతు తెలుపుతారని, ఒక వర్గం ప్రజలకు మంచి అనిపించేది మరో వర్గానికి చెడుగా అనిపించవచ్చని వివరణ ఇచ్చుకుంటున్నారు.
 
 ఏంటీ ఛేంజ్.ఆర్గ్..?
 ఫేస్‌బుక్, ట్వీటర్, గూగుల్ ప్లస్.. ఇలా సామాజిక వెబ్‌సైట్లు ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటి కోవలోకి వచ్చేదే ఈ ‘ఛేంజ్.ఆర్గ్’. సామాజిక ఉద్యమాలే దీని ముఖ్య ఉద్దేశం. 2007 ఫిబ్రవరి 7న అమెరికాలో ప్రారంభమైన ఈ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం 11 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఈ సైట్‌లో ఎవరైనా పిటిషన్ దాఖలు చేయవచ్చు. సమకాలీన అంశాలపై ప్రశ్నించవచ్చు. అధినాయకులను, సంస్థలను, ప్రభుత్వాలను విన్నవిస్తూ, నిలదీస్తూ పిటిషన్ ప్రారంభించవచ్చు. మద్దతుదారులు దీనిపై సంతకాలు చేస్తారు. తాము సంతకం చేసిన పిటిషన్‌ను ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో షేర్ కూడా చేస్తారు. భారీ సంఖ్యలో సంతకాల సేకరణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయపడతారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement