
కళాత్మకం : శిశిర వర్ణాల వసంతం
శిశిర రుతువు ఆకులను రాలుస్తుంది. వసంతం రుతువు చివురిస్తుంది. శిశిరంలో వసంతం తేవడం సాధ్యమా! ‘ఎందుకు కాదూ’ అంటున్నారు రాలిన ఆకులతో కొత్త చిగుర్లు వేయించి, వాడిన పువ్వులను వికసింపజేస్తోన్న ముక్తవరం వసంతకుమారి.
శిశిర రుతువు ఆకులను రాలుస్తుంది. వసంతం రుతువు చివురిస్తుంది. శిశిరంలో వసంతం తేవడం సాధ్యమా! ‘ఎందుకు కాదూ’ అంటున్నారు రాలిన ఆకులతో కొత్త చిగుర్లు వేయించి, వాడిన పువ్వులను వికసింపజేస్తోన్న ముక్తవరం వసంతకుమారి. రాష్ట్ర టూరిజం శాఖ వరుసగా నాలుగవ ఏడాది కూడా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో శనివారం నుంచి సోమవారం వరకూ ‘చిత్రమేళా-2013’ నిర్వహించింది. మూడు ఫ్లోర్లలోని అన్ని గ్యాలరీలు దేశవ్యాప్తంగా విచ్చేసిన రెండువందల మంది కళాకారులతో, నాలుగువేల కళాకృతులతో ‘కళకళ’లాడాయి. ఈ మేళాలో ‘పచ్చనాకు చిత్రకళ’ అనే అచ్చతెలుగు పేరుతో స్టాల్‌ను ఏర్పాటు చేసి సందర్శకులను ఆకట్టుకున్న వసంతకుమారితో సంభాషణా సారాంశం...
ఇంటి పెరడే ప్యాలెట్!
హైదరాబాద్ విజయనగర్ కాలనీలో మా ఇల్లు. తెలుగులో ఎం.ఎ చేసినా గృహిణిగానే జీవితం బిజీగా గడచిపోయేది. కాస్త తీరుబడి దొరికాక పెరట్లో గడపడం ఆనందాన్నిచ్చేది. ఆ సమయాల్లో రాలిన ఆకులు ఆకర్షించాయి. ‘సమాజం అనే వృక్షంలో రాలిన ఆకే చెట్టుకు సత్తువ ఇస్తుంది. కొత్త చిగుర్లు వేయిస్తుంది’ వంటి జపాన్ బౌద్ధ భిక్కుల హైకూలు గుర్తొచ్చేయి. వేప, కరివేప, మందార, గన్నేరు, గడ్డిపరకలతో ఏవైనా ఆకృతులు చేయవచ్చు కదా అనిపించింది. అలా 2002లో పెరడే ప్యాలెట్‌గా హేండ్‌మేడ్ పేపర్లపై నా ప్రయత్నం మొదలైంది. గణపతి-తల్లి బిడ్డ-సంక్రాంతి-వర్షం- సీతఅగ్నిప్రవేశం-గాంధీ-చార్లీ చాప్లిన్ వంటి బొమ్మలు చేసి చుట్టపక్కాలకు చూపించేదాన్ని. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని వాసుదేవరావుగారు 2004లో ఈ బొమ్మలను చూసి పాఠకులకు పరిచయం చేశారు. ఆ ప్రోత్సాహంతో లీఫ్ ఆర్ట్‌ను విస్తృత పరచాను.
సహజత్వానికి ప్రాధాన్యత !
ఎండుటాకులతో కళాకృతులను చేసే ప్రక్రియను ‘డ్రైడ్ లీఫ్ ఆర్ట్’ అంటారు. సేకరించిన ఆకులను, పువ్వుల రేకలను తాము ఆశించిన ఆకృతులకు అనుగుణంగా కట్ చే సే పద్ధతులూ ప్రాచుర్యంలో ఉన్నాయి. నేను ఆకులను, రేకలను కట్ చేయను. యథాతథంగా వాడతాను. మనం ఎంచుకున్న ఆకృతికి అనుగుణంగా కత్తిరించని ఆకును, పువ్వును ఎంపిక చేసుకోవాలంటే మన సేకరణ విస్తృతంగా ఉండాలి. ఉదాహరణకు ‘వర్షం’ అనే చిత్రంలో వర్షపు ధారకు లేక బిందువులకు తగిన ముడి పదార్థాన్ని ఎంచుకోవాలంటే చిన్ని చిన్ని గడ్డిపరకలను, పువ్వులను ఎంచుకోవడంలో ఎంతో నిపుణత, మరెంతో సమయం అవసరమవుతాయి. వీటిని కట్‌చేసే విధానంలో అంత శ్రమ ఉండదు కానీ, సేకరించిన వాటిని నిల్వ ఉంచడంలో మాత్రం శ్రద్ధ అవసరం. ఎండిన ఆకులు, పువ్వులు పెళుసుబారి విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ‘సిలికాన్ జెల్’లో నానబెడతాను. ఆకుల బిరుసుతనాన్ని బట్టి ఆశించిన మృదుత్వాన్ని సాధించే క్రమంలో కొన్నిటిని కొన్ని గంటలు, కొన్నిటిని ఒకటి రెండురోజులు నానబెడతాను.
అంతర్జాతీయ ‘గిల్డ్’ పురస్కారం
అమెరికాలోని ఫెయిరీలాండ్, ఇల్లినాయిస్ తదితర ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ జరిగింది. ‘తానా’ ఆదరించింది. ఈ కళ ప్రాధాన్యతను గుర్తించి ‘వరల్డ్ వైడ్ ప్రెస్స్‌డ్ ఫ్లవర్ గిల్డ్’ సంస్థ పురస్కారాన్ని, సభ్యత్వాన్నీ ఇచ్చింది.
అందమైన ఆంగ్ల పుస్తకం!
ఇటీవల వికాసం బుక్స్ ద్వారా పబ్లిష్ అయిన ‘ఎటర్నల్ లీఫ్ ఆర్ట్ : ఏసోఫ్ ఫేబుల్స్’ (శాశ్వత పత్ర కళ: ఏసోబు కథలు) అనే పుస్తకం విదేశాల్లో మంచి ఆదరణను పొందుతోంది. విశ్వజనీనత కలిగిన నీతి సూత్రాలను పిన్నలకు పెద్దలకు ఆసక్తికరంగా చెప్పే తొమ్మిది కథలకు ఎండుటాకులు, పువ్వులతో రూపొందించిన చిత్రాలు సమకూర్చాను. చీమా-పక్షి, కాకి-కుండ, కాకి-నక్క, తాబేలు-కుందేలు తదితర అందరికీ తెలిసిన కథలకు ఆకులు, పువ్వుల ద్వారా సమకూర్చిన చిత్రాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ‘చేమంతి సూర్యుడిని, వేప ఆకు రెక్కల కాకిని, గులాబీ రేక పండు, చింత ఆకుల ముక్కు గల పక్షులను, బాదం ఆకు కుండ’ను పోల్చుకోవడం బాలలకు పర్యావరణం పట్ల ఆసక్తిని కలుగజేస్తుందని రివ్యూలు వచ్చాయి.
- పున్నా కృష్ణమూర్తి