వరద బాధితులకు వడ్డన యజ్ఞంలో వేలాయుధన్, భార్య పార్వతి, కొడుకు రాజీవ్
వెయ్యి మందికి భోజనం పెట్టడానికి అదేమీ ఉన్నవాళ్ల పెళ్లి ఇల్లు కాదు, పందిళ్లు లేవు. బాజా భజంత్రీలూ లేవు. ఆ ఇంట్లో ఉన్నదల్లా ఆత్మీయత, సాటి మనిషి ఆకలితో ఉంటే తనకేం పట్టనట్లు వేడిగా వడ్డించుకుని తినలేని నిస్వార్థ హృదయం మాత్రమే. ఆ హృదయమే.. కాలం కాని కాలంలో ఆకలి కడుపులను ఆదుకుంది.
ఇటీవలి వరదలు కేరళతోపాటు కర్నాటకలోని కొంత ప్రాంతాన్ని కూడా అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కొడగు (కూర్గ్) ఈ ప్రకృతి బీభత్సం బారిన పడింది. రాష్ట్రం నలుమూలల నుంచి కొడగుకు సహాయపు గొడుగును పట్టుకున్నారు. సాటి వారి కష్టాలను చూసి స్పందించిన అనేక మంది బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఉడిపితోపాటు ఇతర ప్రాంతాల నుంచి దుస్తులు, తాగునీటితోపాటు అత్యవసరమైన వస్తువులను పంపిస్తున్నారు. పదిహేడు వందల మంది పునరావాస సిబ్బంది తమ ప్రాణాలడ్డు వేసి నాలుగు వేల మందిని కాపాడారు. నిర్వాసితులు శ్రీరామ్ ఆలయం, సెయింట్ ఆంటోనీ స్కూల్, మదర్సాలలో తలదాచుకుంటున్నారు. వరదల్లో చిక్కుకున్న వాళ్ల కోసం ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. అయితే కూర్గ్‌లోని ఒక వృద్ధ దంపతులు మాత్రం వరద బాధితులకు అన్నం వండి పెడుతున్నారు. అన్నం అంటే ఏ పది– ఇరవై మందికో కాదు. ఏకంగా రోజుకు వెయ్యి మందికి వండి పెడుతున్నారు. వారం రోజులుగా అక్కడి మాదాపురలో తలదాచుకున్న వారందరికీ ఈ దంపతులే క్షద్బాధ తీర్చారు.
ఇప్పుడిక తరలింపు సేవ
వరదలను చూసి చలించిపోయింది వేలాయుధన్ కుటుంబం. భార్య పార్వతి, కొడుకు రాజీవ్‌తో కలిసి ఓ వారం రోజులుగా వరద బాధితులకు వండి వడ్డిస్తూనే ఉన్నారు వేలాయుధన్. నలుగురు స్నేహితులు, ఇద్దరు పనివాళ్ల సాయంతో ఇంటి ఆవరణలోనే పెద్ద పొయ్యిల మీద ఉదయం నుంచి రాత్రి వరకు వండుతూనే ఉన్నారు. వచ్చిన వాళ్లకు కాదనకుండా వడ్డిస్తూనే ఉన్నారు. ‘‘వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి రెండు –మూడు రోజుల్లో నిర్వాసితులను సొంత ప్రాంతాలకు తరలించడంలో సాయం చేస్తాను’’ అంటున్నాడు రాజీవ్. తమ మూలాలు కేరళలోనే ఉన్నాయని, తమ తాత (వేలాయుధన్ తండ్రి) యాభై ఏళ్ల కిందట కూర్గ్‌లోని మాదాపురకు వచ్చి స్థిరపడ్డారని రాజీవ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment