
కలగూర దుంప
సూప్ చేసుకోవచ్చు... కూర చేసుకోవచ్చు... పులుసు చేసుకోవచ్చు... స్వీట్ చేసుకోవచ్చు...
గంపెడు చిలగడ దుంపలు తెచ్చుకుంటే... ఘుమఘుమలాడే కూరల గంప చేయచ్చు.
ద మోస్ట్ ఫేమస్ మల్టీపర్పస్ దుంప. కలగూర దుంప.
సూప్
చైనీయులు చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఈ సూప్‌ను సేవిస్తారు.
కావల్సినవి: చిలగడ దుంపలు – 2, అల్లం – చిన్న ముక్క (సన్నగా తరగాలి), నీళ్లు – 3 1/2 కప్పులు, ఎండు ఖర్జూరాలు – 8, బ్రౌన్‌షుగర్ – 60 గ్రాములు
తయారీ: ∙చిలగడదుంపలను శుభ్రపరిచి, ముక్కలుగా తరిగి ఉడికించాలి. దీంట్లో అల్లం ముక్కలు, తరిగిన ఖర్జూరం వేసి సన్నని మంట మీద కనీసం 12–15 నిమిషాలు ఉడికించాలి. పైన షుగర్ వేసి కరిగేంతవరకు మరిగించి దించాలి. మంచి బంగారు రంగులో ఉండే ఈ సూప్ సేవిస్తే చాలా తేలికగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది.
గులాబ్ జామూన్
బెంగాలీల తీపి వంటకం.
కావల్సినవి:
చిలగడదుంపలు – 3 (400 గ్రాములు), కోవా – నిమ్మకాయ పరిమాణం లేదా 2 టేబుల్ స్పూన్లు, యాలకులు (పచ్చవి) – 6–8, మైదా – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – చిటికెడు, నూనె – వేయించడానికి తగినంత, పిస్తాపప్పు (తరిగినది) – టీ స్పూన్
పాకం కోసం :
పంచదార – 2 కప్పులు, నీళ్లు – 2 కప్పులు
తయారీ: ∙చిలగడ దుంపలను శుభ్రం చేసి, ఉడికించి, పై తొక్క తీసి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమం 3 కప్పులు అవుతుంది. lమందపాటి గిన్నెలో పంచదార, నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద మరిగించాలి. పంచదార పాకం కొద్దిగా చిక్కబడేంతవరకు ఉంచాలి. ∙చిలగడదుంప ముద్దను నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న ముద్దలు చేయాలి. lఒక్కో చిలగడ దుంప ముద్దలో సమానంగా కోవా, యాలకుల పొడి, పిస్తాపప్పుతో స్టఫ్ చేయాలి. ∙మొత్తం బాల్‌లా చేతులతో రోల్ చేయాలి. ∙ఇలాగే అన్నీ సిద్ధం చేసుకోవాలి. మొత్తం 14 గులాబ్ జామూన్‌లు అవుతాయి. ∙కడాయిలో నూనె పోసి, కాగాక సిద్దం చేసుకున్న జామూన్‌లను వేసి బాగా వేయించాలి. ముదురు గోధుమరంగు వచ్చేంతవరకు వేయించిన గులాబ్‌జామూన్‌లను వేడి వేడి పంచదార పాకంలో వేయాలి. ∙పంచదార పాకంలో 20–30 నిమిషాల సేపు ఉంచి, సర్వ్ చేయాలి.
నోట్: 5–6 గంటల కన్నా ఎక్కువసేపు గులాబ్‌జామూన్‌లను పాకంలో ఉంచకూడదు. అలా ఉంచితే జామూన్‌లు గుజ్జుగా అయిపోతాయి. తయారుచేసేటప్పుడు జామూన్‌లను ఆరిపోయేంతవరకు ఉంచకుండా ఒక్కోజామూన్ తయారీకి 20 సెకన్లు మాత్రమే టైమ్ తీసుకోవాలి.
వేపుడు
అస్సామీయుల వేపుడు.
కావల్సినవి:
చిలగడ దుంపలు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత
తయారీ: ∙చిలగడ దుంపలను శుభ్రపరిచి సన్నని ముక్కలు(ఫింగర్ చిప్స్)గా కట్ చేయాలి. ఆవిరి మీద ఉడికించాలి. పొయ్యి మీద పెనం పెట్టి, నూనె వేసి వేడి చేయాలి. సిద్ధం చేసుకున్న చిలగడ దుంప ముక్కలను పెనం మీద వేసి వేయించాలి. చిటికెడు ఉప్పు(తగినంత ఉప్పు చల్లుకోవచ్చు) పైన చల్లి, దించాలి. వేడి వేడిగా సర్వ్ చేయాలి. చిలగడ దుంపలను చక్రాలుగా కట్ చేసి, పై విధంగానే వేయిస్తారు.
పులుసు
కావల్సినవి: చిలగడదుంపలు – 2 (పెద్ద సైజు దుంపలు తీసుకొని శుభ్రం చేసి, చక్రాలుగా కట్ చేయాలి), ఉల్లిపాయలు – 2 (పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. లేదా సాంబారు, ఉల్లిపాయలు – 12 తీసుకోవాలి, టొమాటోలు – 2, పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – నిమ్మకాయ పరిమాణం (కప్పు వేడినీళ్లలో నానబెట్టాలి), బెల్లం – అర టేబుల్ స్పూన్ లేదా పంచదార, ఉప్పు – తగినంత, కొత్తిమీర తరుగు – టీ స్పూన్, మసాలా పొడి – అర టీ స్పూన్ (దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు), ఎండుమిర్చి – 2, ధనియాల పొడి – 1 1/2 టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – టీ స్పూన్, మినప్పప్పు – టీ స్పూన్, మెంతిపిండి – చిటికెడు, నవ్వుల పొడి – టీ స్పూన్
పోపు: నూనె – టేబుల్‌స్పూన్, ఆవాలు – 1/2 టీ స్పూన్, జీలకర్ర – 1/2 టీ స్పూన్, మినప్పప్పు – అర టీ స్పూన్, మెంతులు – చిటికెడు, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – 2 (ముక్కలు చేయాలి), కరివేపాకు – రెమ్మ
తయారీ: ∙మందపాటి గిన్నెలో చిలగడదుంప ముక్కలు, ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి, పసుపు 4 కప్పుల నీళ్లు పోయాలి. దీనిని పొయ్యి మీద పెట్టి, కూరగాయ ముక్కలు సగం సగం ఉడికేదాక ఉంచాలి. దీంట్లో చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం వేసి మరిగించాలి. మంట తగ్గించి మరో పది నిమిషాలు ఉడికాక మసాలా వేసి కలపాలి.
∙విడిగా మూకుడు పొయ్యి మీద పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి, ఈ పోపు మరుగుతున్న మిశ్రమంలో పోసి కలపాలి. చివరగా కరివేపాకు వేసి కలపాలి. ∙నిమిషం లేదా రెండు నిమిషాలు ఉంచి మంట తీసేయాలి. కొత్తిమీర వేసి మూత పెట్టి 10 నిమిషాల తర్వాత వేడి వేడి అన్నంలో అప్పడంతో పాటు వడ్డించాలి.
నోట్: నువ్వుల పొడి లేదా వేయించిన నువ్వులు కలుపుకోవచ్చు. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు.
హల్వా
కావల్సినవి:
చిలగడదుంప – 1 (పెద్దది), బెల్లం – కప్పు, నెయ్యి – టీ స్పూన్, జీడిపప్పు – 4, కిస్‌మిస్ – 4
తయారీ: ∙చిలగడ దుంపలను కడిగి, తొక్క తీసి, చివర్లను కట్ చేయాలి. తర్వాత తురమాలి. ఈ తురుము 1 1/2 కప్పు అవుతుంది. ∙ జీడిపప్పు, కిస్‌మిస్‌లను నెయ్యి వేసి వేయించాలి. lగిన్నెలో బెల్లం, కప్పు నీళ్లు పోసి కరిగించాలి. పాకం కాస్త చిక్కబడ్డాక చిలగడదుంప తురుము వేసి కలపాలి. మిగతా అన్ని పదార్థాలు∙వేసి 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత మంట తీసేసి సర్వింగ్ బౌల్‌లో వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయాలి.
టిక్కీ
కావల్సినవి:
చిలగడ దుంపలు – 4, అల్లం ముద్ద – అర టీ స్పూన్, పచ్చిమిర్చి ముద్ద – అర టీ స్పూన్, కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూన్, చాట్‌మసాలా – టీ స్నూప్, ఆమ్చూర్ పౌడర్ – అర టీ స్పూన్,
నిమ్మరసం – టీ స్పూన్, జీలకర్ర (కచ్చాపచ్చాగా దంచాలి) – టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నల్లుప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత
తయారీ: ∙చిలగడదుంపలను శుభ్రపరిచి, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి, ఉడికించి పక్కనుంచాలి. నీళ్లను ఒంపేయాలి. చల్లారిన తర్వాత పై తొక్క తీయాలి. ముద్ద చేయాలి. దీంట్లో నూనె మినహా పై పదార్థాలన్నీ వేసి కలపాలి. చిన్న చిన్న ముద్దలను చేసుకొని, అరచేత్తో అదిమి టిక్కీలను తయారు చేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి టీ స్పూన్‌తో నూనె వేసి, సిద్ధంగా ఉంచుకున్న టిక్కీలను రెండువైపులా వేయించాలి. కొత్తిమీర ఆకుతో అలంకరించి, సాస్ లేదా టొమాటో చట్నీతో వడ్డించాలి.