అమరిక : స్పాత్ రూమ్!
బాత్‌రూమ్ ప్రతి ఇంటికీ ఉంటుంది. కాని, దానిని ఉపయోగించుకోవడంలోనే బోలెడంత క్రియేటివిటీ అవసరం. స్నానం అంటే... టైమ్ చూసుకుంటూ ఆదరాబాదరాగా నాలుగు మగ్గుల నీటిని ఒంటి మీద పోసుకుని, ఆ తొందరలో రెండు మగ్గుల నీటిని నేలమీద ఒలకబోసి ఈ పూటకి అయిందనిపించుకునేది కాదు. ఒక్కో నీటి చుక్క ఒంటి మీద నుంచి జారుతూ ఉంటే ఆ హాయిని ప్రశాంతంగా ఆస్వాదించాలి. అలా ఆస్వాదించాలంటే బాత్‌రూమ్ తీరుగా ఉండాలి. అందుకోసం బాత్‌రూమ్‌కు స్పా లుక్ తీసుకువస్తే ఎలా ఉంటుంది?
ఈ ప్రశ్నకు చాలామంది నుంచి తక్షణం ‘చాలా ఖర్చవుతుంది’ అనే సమాధానమే వస్తుంది. నిజానికి ఇది పెద్ద ఖర్చేమీ కాదు. కొంచెం పొందిగ్గా ప్లాన్ చేసుకుంటే సింపుల్ బాత్‌ర్యాక్స్‌తో బాత్‌రూమ్‌కి స్పాలుక్ తీసుకురావచ్చు. సాధారణమైన బాత్‌రూమ్‌లోని ఒక మూలగా చిన్నస్టాండు ఏర్పాటు చేసి టవల్స్ చక్కగా రోల్ చేసి సర్దాలి. అలాగే గోడకు చిన్న ఉడెన్ ర్యాక్ చేయించుకుంటే షాంపూలు, లోషన్లు, ఇతరత్రా సౌందర్యసామగ్రి మొత్తం అందులో అమర్చేయవచ్చు. సింక్ పక్కనే టవల్స్ కోసం ఒక రాక్, షవర్ దగ్గరగా కొంచెం ఎత్తులో షాంపూ ర్యాక్ అమర్చుకుంటే సౌకర్యంగా ఉంటుంది. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కొన్ని ర్యాక్స్‌ను బాత్‌రూమ్ తలుపుకి వెనుక కూడా తగిలించుకోవచ్చు. ఇలా చేసుకుంటే టవళ్లు, సబ్బులు, షాంపూల వంటివి బెడ్‌రూమ్ షెల్ఫుల నుంచి వెళ్లిపోతాయి, ఇక ఆ ఖాళీని మనకు నచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు.