ఫ్యామిలీ 2015 | speccial to sakshi family -2015 | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ 2015

Published Wed, Dec 30 2015 10:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

ఫ్యామిలీ 2015

ఫ్యామిలీ 2015

365 రోజులు. అంటే ఎన్నో గంటలు. ఇంకెన్నో నిమిషాలు. లెక్కపెట్టలేనన్ని సెకండ్లు. అంతకంటే లెక్కలేనన్ని ఆవిష్కారాలు... జయాలు... అపజయాలు... కలగలిస్తే 2015.  ఒక్కసారి చేయి కదిలిస్తే దాని వల్ల కదలిన గాలి... కొన్నేళ్ల తర్వాత తుపానుగా మారుతుందని ఒక మహాశయుడు చెప్పాడు.  ఈ ఏడాదిలో జరిగిన ప్రతి చిన్న ఘటన...  అలాగే ఎదిగి పెద్ద అలై ఈ ప్రపంచ స్వభావాన్ని మారుస్తుంది. మనమందరం మంచే కోరుకుంటాం. మంచే జరగాలని ప్రార్థిస్తాం. అవసరమైతే పోరాడతాం. 2015లో అలాంటి జయాలు, అపజయాలు కొన్ని మీ కోసం...
 
మరింత రక్షణ

షీ క్యాబ్స్
మహిళల భద్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ క్యాబ్స్ సేవలు హైదరా బాద్‌లో ప్రారంభం అయ్యాయి. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షీ క్యాబ్స్‌ను పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానం చేశారు. దాని వల్ల క్యాబ్‌ల కదలికలు ఎప్పటికప్పుడు ఈ కేంద్రంలో నమోదు అవుతాయి. సెప్టెంబర్ 8న ‘షీ క్యాబ్స్’ ప్రారంభం అయ్యాయి.
 
మరింత  న్యాయం
కట్నం ఎప్పుడు అడిగినా నేరమే!
వరకట్నం అనేది ఎప్పుడైనా అడిగే అవకాశముందని, పెళ్లి తర్వాత అడిగినా అది నేరమేనని ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యకు విషమిచ్చి, కాల్చి చంపిన కేసులో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కింది కోర్టు గతంలో విధించిన జీవితఖైదును సుప్రీంకోర్టు సమర్థించింది. పెళ్లికి ముందు తాను ఎలాంటి కట్నం అడగలేదని, పెళ్లి తర్వాతే అడిగినందున దానిని పరిగణనలోకి తీసుకోరాదని భీమ్‌సింగ్ అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు ఎం.వై.ఇక్బాల్, పినాకీ చంద్రఘోష్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.
 
మరింత తెగువ
యుద్ధ విమానాల పైలట్లు
దేశంలోని సైనిక దళాల్లో నేరుగా యుద్ధక్షేత్రంలో పనిచేసే విభాగాల్లో మహిళా పైలట్లను నియమిస్తామని అక్టోబర్ 24న రక్షణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందుతున్న బ్యాచ్‌లోంచి తొలి మహిళాయుద్ధ విమాన పైలట్లను కేంద్రం ఎంపిక చేస్తుంది. 2017 జూన్ నాటికి వారికి పూర్తిస్థాయిలో పైలట్ బాధ్యతలు అప్పగిస్తారు.
 
ముందడుగు

హర్యానాలో 21 మహిళా పోలీస్ స్టేషన్‌లు
మహిళలకు మరింత భద్రత కల్పించే చర్యలో భాగంలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం 21 జిల్లాలో పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేసే పోలీస్‌స్టేషన్‌లను ఆగస్టు 28న ప్రారంభించింది. ఈ స్టేషన్‌లలో స్త్రీలకు సబంధించిన వివిధ నేరాలు, కేసుల దర్యాప్తును మహిళా పోలీసులే నిర్వర్తిస్తారు.
 
మేలిమి సంతకం
నీతి ఆయోగ్ సీఈవో గా సింధుశ్రీ
ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటు అయిన ‘నీతి ఆయోగ్’ (భారత జాతీయ పరివర్తన సంస్థ)కు సీఈవోగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సింధుశ్రీ ఖుల్లర్ నియమితులయ్యారు. సింధుశ్రీని నియమించినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ జనవరి 10న వెల్లడించింది. అప్పటివరకు ఆమె ప్రణాళికా సంఘం కార్యదర్శిగా పని చేశారు.
 
ఐరాస శాంతిస్థాపన ప్యానెల్‌లో సరస్వతీ మీనన్
 ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ బాన్‌కీ మూన్.. శాంతి స్థాపన కార్యక్రమాల సమీక్ష ప్యానల్‌లో భారత సామాజికవేత్త సరస్వతీ మీనన్‌ను నియమించారు. ఈ నియామకం ఐరాస జనరల్ అసెంబ్లీ, భద్రతా మండలి ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా జరిగింది. ప్యానెల్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ సలహా బృందం బురుండీ, దక్షిణ సూడాన్ తదితర దేశాల్లో పర్యటించి, శాంతిస్థాపన చర్యలను సమీక్షిస్తుంది.
 
అమెరికా విద్యామండలి అధిపతిగా భారతీయ మహిళ

అమెరికా విద్యామండలి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ల ఛైర్‌పర్సన్‌గా భారతీయ అమెరికన్ మహిళ రేణూ కట్టర్ ఎన్నికయ్యారు. మార్చి16న వాషింగ్టన్‌లో జరిగిన విద్యామండలి 97వ వార్షిక సమావేశంలో ఆమెను ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రేణు 2008 నుంచి యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అధ్యక్షురాలిగా ఉన్నారు.
 
మరెన్నో నవ్వులు
బేటీ బచావో.. బేటీ పఢావో
బాలికా సంక్షేమం, లింగ వివక్ష నిర్మూలన లక్ష్యాలుగా ‘బేటీ బచావో బేటీ పఢావో’ (ఆడపిల్లల్ని కాపాడండి... ఆడపిల్లల్ని చదవించండి) ప్రచార ఉద్యమాన్ని హరియాణలోని పానిపట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 22న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ‘సుకన్య సమృద్ధి యోజన’నను మోదీ ప్రారంభించారు. దీనిని బాలికలు తక్కువగా ఉన్న 100 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. ఇది పదేళ్ల లోపు బాలికలకు ఎక్కువ వడ్డీ (9.1శాతం), ఆదాయపు పన్ను రాయితీ లభించే డిపాజిట్ పథకం. పుట్టినప్పటి నుంచి పదేళ్ల లోపు కనీసం వెయ్యి రూపాయల డిపాజిట్‌తో బ్యాంకుల్లోగానీ, పోస్టాఫీసుల్లోగానీ అకౌంట్ ప్రారంభించవచ్చు. అందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయలను డిపాజిట్ చెయ్యొచ్చు.  ప్రారంభించిన నాటి నుంచి 21 ఏళ్లపాటు లేదా ఆ బాలికకు వివాహం అయ్యేంత వరకు ఆ అకౌంట్ క్రియాశీలంగా ఉంటుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం పాక్షికంగా డబ్బును తీసుకోవచ్చు.
 
మనో  ధైర్యం

మూడు మంచి ఆలోచనలు
హిమ్మత్: మహిళల భద్రత కోసం ‘హిమ్మత్’అనే మొబైల్ అప్లికేషన్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జనవరి 1న ఢిల్లీలో ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను రూపొందించారు. మహిళలు అత్యవసర పరిస్థితిలో వీలైనంత త్వరగా పోలీసులను అప్రమత్తం చేయడానికి ఇది పనికొస్తుంది.
 అభయం: ఆపదలో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు ఏపీ పోలీసులు ‘అభయం’ అనే నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీని కింద టోల్ ఫ్రీ నెంబర్ 040-7101-1800ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా మిస్డ్‌కాల్ ఇచ్చిన రెండు నిమిషాల్లోనే బాధితులకు ఆపన్నహస్తం అందుతుంది.
 
ఆరోగ్యలక్ష్మి: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ‘ఆరోగ్యలక్ష్మి’గా నామకరణం చేశారు.  
 
శిశు వికాసం

ప్రతి నెలా టీకాల వారం
 వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి చిన్నారికీ టీకాలు అందేలా మిషన్ ఇంద్రధనుష్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి 23న ఢిల్లీలో ప్రారంభించింది. ఈ ఏడాది తొలి విడతలో దేశవ్యాప్తంగా 201 జిల్లాల్లో ఈ సంపూర్ణ టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలను, ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేశారు.
 
బుజ్జి అడుగు
శిఖరంపై చిచ్చర పిడుగులు
ఇద్దరు భారత చిన్నారుల అరుదైన రికార్డును నెలకొల్పారు. పిన్న వయసులో ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్‌ను అధిరోహించిన వారిగా రికార్డుల కెక్కారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన కందర్ప్ శర్మ, రిత్విక 5380 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు శిఖరం బేస్‌క్యాంపు వద్దకు ఆగస్టు 10న చేరుకున్నారు. కందర్ప్ వయసు 5 ఏళ్ల 10 నెలలు. రిత్విక  వయసు 8 ఏళ్ల 11నెలలు. ఆగస్టు 2న వీరు ప్రయాణం మొదలు పెట్టారు.
 
మహా విజయం
ప్రపంచ  నెంబర్ వన్ సైనా నెహ్వాల్
హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మహిళల విభాగంలో ప్రపంచ నెంబర్ వన్  ర్యాంక్‌ను దక్కించుకున్నారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే 1980లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నారు.
 
మరువలేని విషాదం
విలవిలలాడిన పసిప్రాణం
విజయవాడ కృష్ణలంకలో నివసిస్తున్న చావలి నాగ చిరుద్యోగి. బట్టల షాపులో గుమస్తా. భార్య లక్ష్మి రెండో కాన్పుకు సిద్ధమైంది. ఆగస్టు 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టుకతోనే ఆ పసికందులో అసాధారణ శారీరక సమస్య... కన్‌జెనిటల్ ఎనామలీ కనిపించింది. వైద్యులు చూసి శస్త్ర చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. అదొక నరకమనీ, యమభటులు అక్కడ ఎలుకల రూపంలో తిరుగుతుంటారనీ తెలియని ఆ అమాయక తల్లితండ్రులు ఎన్నో ఆశలతో బిడ్డను తీసుకు వెళ్లారు. ఆగస్టు 16న ఆపరేషన్ జరిగింది. బిడ్డను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. బాలింతరాలైన తల్లి కూడా అక్కడే ఉంది. ఐసీయూ అంటే ఇరవై నాలుగు గంటలూ సిబ్బంది పర్యవేక్షణలో ఉండే అత్యవసర చికిత్సా గది. డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ఆయాలు తిరుగుతూనే ఉండాలి. కానీ ఆగస్టు 23 న బాబు కాలి వేళ్ల నుంచి, చేతి వేళ్ల నుంచి రక్తం కారుతూ కనిపించింది! ఎలుకలు కొరికాయి. తల్లి గమనించి, ఫిర్యాదు చేస్తే... ఆ రోజుల పసిగుడ్డు ఎలుక కాటు వల్ల ఎంత బాధ పడి ఉంటాడో, ఎంత నొప్పిని అనుభవించి ఉంటాడో అన్న కనీస స్పందన కూడా లేకుండా... డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు. ఆశలు వదులుకోండి అన్నారు. వైద్యం చేయకుండా వదిలేశారు. ఆ పసికందు చనిపోయాడు. ఈ అమానుష ఘటన రాష్ర్టవ్యాప్తంగా సంచలనం రేపింది.
 
ఆ నవ్వు గుర్తొస్తూనే ఉంటుంది!

ముంబైతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దోషి చంద్రభాన్ సానప్ అలియాస్ లౌక్యాకు ఉరిశిక్ష పడింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 30న న్యాయమూర్తి వృషాలీ జోషీ శిక్షను ఖరారు చేశారు. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16వ తేదీన కంజూర్ మార్గ్-ఖండూప్‌ల మధ్య శవమై తేలింది. ఈ కేసులో నిందితుడైన చంద్రభాన్‌ను అక్టోబర్ 27న కోర్టు దోషిగా నిర్ధారించి, 30న శిక్ష ఖరారు చేసింది.
 
 
ఆ కార్టూన్లు మరి లేవు!
తన కార్టూన్లతో నవ్వులు పూయించిన రాగతి పండరి (50) అనారోగ్యంతో విశాఖపట్నంలో ఫిబ్రవరి 19న మరణించారు. పోలియో వల్ల రెండు కాళ్లూ బలహీన పడినా తెలుగునాట ఆమె కార్టూన్ మాత్రం దిటవుగా బలంగా నిలబడగలిగింది.
 ఉమన్ కార్టూనిస్ట్‌గా ఆమె విజయం స్ఫూర్తిదాయకం.
 
ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి
జులై 14 గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఎం. రిషితేశ్వరి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీనియర్స్ వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తన డైరీలో రాసుకుంది రిషితేశ్వరి. జడలు విప్పిన ర్యాగింగ్ భూతం రిషితేశ్వరిని పొట్టనపెట్టుకున్న తీరు తెలుగురాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన మురళీకృష్ణ, దుర్గాబాయిల ఏకైక కూతురు రిషితేశ్వరి. కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలలో ఆమె సీనియర్ల వేధింపులకు గురైంది. ఆ తర్వాత వాళ్లు కొన్ని రోజుల పాటు రిషితేశ్వరి వెంటపడి మానసికంగా, శారీరకంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పుకోలేక హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది.
 
మహానటి మరణం
ప్రముఖ తమిళ నటి మనోరమ (78) అక్టోబర్ 10న అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో సుమారు 1500 చిత్రాల్లో ఆమె నటించారు. అత్యధిక చిత్రాల్లో నటించిన నటిగా గిన్నిస్ రికార్డు సృష్టించారు.
 
అస్తమించిన అరుణ
లైంగికదాడికి గురైనప్పుడు తీవ్రంగా గాయపడి 42 ఏళ్లుగా కోమాలో ఉన్న మాజీ నర్సు అరుణా షాన్‌బాగ్ (65) మే 18న తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొన్ని రోజులుగా న్యూమోనియా తీవ్రం కావడంతో వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ముంబైలోని కేఈఎం ఆసుపత్రి నర్సుగా పని చేస్తున్న అరుణపై 1973 నవంబర్ 27న వార్డుబాయ్ సోహన్‌లాల్ లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాడు. ఇనుప గొలుసుతో బంధించాడు. గొలుసును విడిపించుకునే ప్రయత్నంలో తలకు గట్టి దెబ్బ తగలడంతో మెదడుకు రక్తసరఫరా నిలిచిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె కోమాలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు కోమాలో ఉన్న అరుణను కేఈఎం ఆసుపత్రి నర్సులు 42 ఏళ్ల పాటు అనుక్షణం కంటికి రెప్పలా చూసుకున్నారు. మృత్యువుతో ఆమె చేసిన పోరాటానికి వాళ్లంతా అండగా నిలిచి అన్ని రకాల సేవలు అందించారు.
 
ప్రాణం తీసిన నిర్లక్ష్యం...
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పుష్కరాల్లో తొలిరోజు విషాదం చోటు చేసుకుంది. జూలై 14న రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 24మంది మహిళలే.
 
ఇంటికి కొడుకు...పర్వతానికి ముద్దుబిడ్డ
పర్వతారోహకుడు మల్లె మస్తాన్‌బాబు (40) అర్జెంటీనా, చిలీ మధ్య ఉన్న ఆండిస్ పర్వతాల్లో మరణించినట్లు ఏప్రిల్ 4న గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన మస్తాన్‌బాబు ఇంజినీరింగ్ పట్టభద్రుడు. 7 ఖండాల్లోని 172 దేశాల్లో 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement