నిజమే సుమా! | special chit chat anchor suma | Sakshi
Sakshi News home page

నిజమే సుమా!

Published Wed, Sep 6 2017 12:04 AM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

నిజమే సుమా!

నిజమే సుమా!

నేను  నా దైవం

దేవుడున్నాడు... ప్రతి మంచి పనిలో దేవుడున్నాడు.
మంచివాళ్ల కోసమే కాదు..
అందరిలో మంచిని పెంచే దేవుడున్నాడు.
మనం ఒక మంచి పని చేస్తే... అది మన మంచి అవుతుంది.
కానీ మనల్ని చూసి మరో పదిమంది...
మంచి పనికి ముందడుగు వేస్తే? అది.. దైవత్వం అవుతుంది.
మనిషిలోనే దేవుడున్నాడు... నిజం సుమా!


గల గల మాట్లాడే మీకు ఈ నేర్పు దేవుడిచ్చిన వరంగానే భావిస్తారా?
నూటికి నూరు శాతం దేవుడి వరమే. నా చిన్నప్పుడు దేవుడి శ్లోకాలు బాగా వల్లెవేయడం, గుళ్లో భజనల్లో పాల్గొనడం ఎక్కువగా జరిగింది. అమ్మానాన్నలకు ఒక్కత్తే కూతురునవడం వల్ల మా అమ్మ ఎప్పుడూ నా వెంటే ఉండేది. ఆ రోజుల్లో టీవీ సీరియళ్లు లేవు. మిక్సీలు గట్రా మా ఇంట్లో లేవు. దీంతో అమ్మ పప్పు రుబ్బుతూనో, వంట చేస్తూనో నా చేత విష్ణు, లలిత సహస్ర నామాలు అదేపనిగా చెప్పిస్తూ ఉండేది. ఎప్పుడూ ఖాళీగా ఉండనిచ్చేది కాదు. దీంతో ఏ పద్యమో, శ్లోకమో అప్పజెబుతూనే ఉండేదాన్ని. ఈ అలవాటు తర్వాత తర్వాత నా యాంకరింగ్‌కి బాగా పనికొచ్చింది.
     
దైవం గురించి ఎప్పుడు తెలిసింది?
మొదట గోడ మీద తెలిసింది. అమ్మా నాన్న గోడమీద దేవుడి పటం చూపించి దణ్ణం పెట్టుకోమనేవాళ్లు. నా చిన్నతనం  చాలామటుకు గుళ్లోనే గడిచింది. మేం కేరళవాళ్లం అయినప్పటికీ నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని మెట్టుగూడలో ఉండేవాళ్లం. నాన్న, ఆయన స్నేహితులు కలిసి ఒకరింట్లో అయ్యప్ప పటం పెట్టి పూజలు, భజనలు చేసుకునేవాళ్లు. తర్వాత విరాళాలు సేకరించి, ఆలయం కట్టించి, కేరళ నుంచి అయ్యప్ప స్వామి విగ్రహం తెచ్చి ప్రతిష్టించారు. ఇప్పటికీ ఆ గుళ్ళో వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. స్కూల్‌ అయ్యిందంటే చాలు దాదాపుగా ఆ గుళ్లోనే ఉండేదాన్ని అమ్మానాన్నలతో పాటు. అలాగే, మా ఇంటి నుంచి ఆ గుడికి వెళ్లేదారిలో అమ్మవారి దేవాలయాలు ఉండేవి. వరుసగా అందరికీ దణ్ణం పెట్టుకునేదాన్ని. ప్రతీ మంగళవారం లాలాగుడ చౌరస్తా దగ్గర ఉన్న అమ్మవారి గుడిలో అమ్మ నా చేత నిమ్మకాయ దీపాలు పెట్టించేది.

ఇక మెట్టుగూడలోని ఆంజనేయ స్వామి టెంపుల్‌కి ప్రతి శనివారం వెళ్లేవాళ్లం. టెన్త్‌ క్లాస్‌ వరకు సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో చదివాను. అక్కడ క్రీస్తు ప్రార్థనల్లో పాల్గొనేదాన్ని. మా అమ్మ ఏ దేవుణ్ణీ తక్కువ చూడకూడదు అని, అందరికీ దణ్ణం పెట్టమని చెప్పేది. మెట్టుగూడలోని చర్చికి వెళ్లి క్యాండిల్స్‌ వెలిగించి, బ్రెడ్‌ పంచిపెట్టేవాళ్లం. గుడి, మసీదు, దర్గా, చర్చి..  ఇలా నా చిన్నతనం అంతా బీభత్సమైన భక్తిలో పెరిగాను. అమ్మవాళ్లు చెప్పేవారు కాబట్టి చేసినా మనస్ఫూర్తిగా అనుసరించేదాన్ని.   

దైవం అనుగ్రహం కలిగిన సందర్భాలు...
నా పెళ్లికి ముందు ‘చిట్టిబాబు’గారు శిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర పుస్తకం ఇచ్చారు చదవమని. బాబా జీవిత చరిత్ర చదువుతూ దాంట్లో బాగా లీనమైపోయాను. సాయిబాబా కల్లోకి కూడా వచ్చేవారు. ఒకసారి మరుసటి రోజు దర్గా దర్శనానికి వెళ్లాల్సి ఉంది. ఆ రోజు రాత్రి గతంలో నేనెప్పుడు చూడని ఆ దర్గా కల్లోకి రావడం, అక్కడ ద్వారం ముందు బాబా నిల్చొని లోపలికి రమ్మని చెప్పడం .. ఆ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడే సాయిబాబాతో నాకు స్నేహం ఏర్పడింది. పిలిస్తే పలికే దేవుడు బాబా అనే ముద్ర మనసులో బలంగా నాటుకుపోయింది. దీనికి ఓ కారణమూ ఉంది. పెళ్లికి ముహూర్తం కుదిరి, బంధువుల పిలుపుల కోసం కేరళలోని మా మేనత్త ఇంటికి నేను, అమ్మానాన్న బస్సులో బయల్దేరాం. అక్కడన్నీ ఇరుకురోడ్లు. కోత కోసిన తర్వాత నీళ్లతో నిండి ఉన్న పొలాలు. మా అమ్మ ఉన్నట్టుండి ‘ఈ రోజు గురువారం కదా, బాబాకు దణ్ణం పెట్టుకున్నావా?’అని అడిగింది. అది కో ఇన్సిడెంట్‌ అవ్వచ్చు. ఈ లోపు ఎక్కడ నుంచో ఎగిరి వచ్చి నా ఒళ్లో కుంకుమ ప్యాకెట్‌ పడింది.

దాన్నే చూస్తున్నాను. ఏమైందో ఏమో.. మా బస్సు రోడ్డు మీద నుంచి పొలాల్లోకి అటు నుంచి అడ్డంగా పడిపోయి కొంతదూరం వెళ్లింది. చాలా పెద్ద యాక్సిడెంట్‌ అది. కానీ, నేను ఆ సమయంలో ప్రశాంతంగా ఉన్నాను. కష్టపడకుండా పోతే చాలు బాబా అనుకున్నాను. కిటికీలో నుంచి బయటకు పడిపోతున్న నన్ను నాన్న పైకి లాగారు. ఆ తర్వాత నాకు స్పృహ వచ్చి చుట్టూ చూసి, టాప్‌ పైకి వెళ్ళి కొంతమందిని పైకి లాగాను కూడా! ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. కొంతమందికి బాగా గాయాలయ్యాయి. అప్పుడు భయమనిపించలేదు కానీ, ఇంటికి వచ్చాక తల్చుకున్న కొద్దీ వణికిపోయేదాన్ని. ఇప్పటికీ బస్సు ప్రయాణం అంటే చాలు నాటి సంఘటన గుర్తొస్తుంది. నాడు ఆ ప్రమాదం నుంచి బాబాయే బయటపడేశాడు అనిపిస్తుంది.

మీ ప్రాణాలు కాపాడాడని  బాబాపై ఎక్కువ భక్తి పెంచేసు కున్నారా?
నమ్మకం. ఏదైనా సమస్య వచ్చినా బాబా చూసుకుంటా డుగా అనే ధైర్యం. ఉదయాన్నే దీపారాధన చేసుకుంటాను. ఆ తర్వాత రోజువారీ పనుల్లో పడిపోతాను కానీ మూఢంగా ఉండను. ఇన్నేళ్ల జీవితాన్ని ఒకసారి తరచి చూసుకుంటే మాత్రం భక్తి విషయంలో నాలో చాలా మార్పు వచ్చింది. దేవుడు పూజ గదిలోనే ఉండడు, ఏదైనా అన్నీ మన లోపల నుంచే జరగాలి అనే భావన కలిగింది. అది నా వృత్తిలో భాగంగా కొంతమంది మహానుభావులను కలుసుకోవడం వల్ల, ధ్యానం, అంతర్నేత్రం వంటివి పరిచయం అయ్యాయి. అయితే, గుడి వాతావరణం వేరు. అక్కడ పాజిటివ్‌ ఎనర్జీ పుష్కలంగా ఉంటుంది. ఆ ఎనర్జీ కోసం కుదిరినప్పుడల్లా ఆలయానికి వెళుతుంటాను.  
     
ఏయే ఆలయాలను సందర్శించారు? ఏ ఆలయం మీకు బాగా నచ్చుతుంది?

నా చిన్నతనంలో సికింద్రాబాద్‌ గణేష్‌ ఆలయానికి తరచూ వెళ్లేదాన్ని. కేరళ వైపు మాత్రం వేల సంవత్సరాల క్రితం రాజులు కట్టించిన గొప్ప గొప్ప ఆలయాలు ఉన్నాయి. ్ఞఅవి ఎంత ప్రశాంతంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. ఆ గుళ్లలో అడుగుపెడితే చాలు.. ఎంతో హాయిగా ఉంటుంది.పెళ్లికి ముందు చాలా గుళ్లకు తిరిగాను. దాదాపు రోజూ ఏదో గుడికి వెళుతుండేదాన్ని. పెళ్లి తర్వాత వారానికో, పది రోజులకో వెళ్లేదాన్ని. దీని బట్టి చూస్తే పతి దేవుడు వచ్చాక మిగతా దేవుళ్లందరూ వెనకసీటు తీసుకున్నారు అనిపించింది. (నవ్వుతూ)
     
పుట్టింటి పూజలకు, అత్తింటి పూజలకు వ్యత్యాసాలు. ఎలా బ్యాలెన్స్‌ చేసుకున్నారు?

పెళ్లయ్యాక కూడా పెద్ద మార్పులేం లేవు. అత్తంటివారు అయ్యంగార్‌ ఫ్యామిలీ కావడంతో కొన్నిపూజలు కలిసిపోయాయి. పుట్టింటి తరపున రెండే పండగలు ఓనమ్, విషు. పంటలు వచ్చాయని ‘ఓనమ్,’ కొత్త సంవత్సరం అని ‘విషు’ చేసుకుంటాం. కేరళ సంస్కృతిలో నాకు నచ్చేది ఓనమ్‌ పండగ. దీని విశేషం ఏంటంటే హిందూ– ముస్లిం– క్రిస్టియన్‌ అనే తేడా లేకుండా అన్ని మతాల వారు ఈ పండగను సంబరంగా జరుపుకుంటారు.

మా వైపు దసరా పండగకు అమ్మవారి పూజ ఉంటుంది. ఆ పూజ అంటే చిన్నతనంలో భక్తి కన్నా ఇష్టం ఎక్కువ ఉండేది. కారణం, ఆ పూజ రెండు రోజులు అమ్మవారి దగ్గర పుస్తకాలన్నీ పెట్టేవారు. చదువుకోవాల్సిన అవసరం పడేది కాదు. (నవ్వుతూ) దీంతో ఇంకో రెండు రోజులు పూజ ఉంటే బాగుండేది అనుకునేదాన్ని. వినాయకచవితికి కూడా దేవుడి పటానికి పువ్వులు పెట్టి, కొబ్బరికాయ కొట్టి, అగరువత్తులు వెలిగించి ప్రసాదాలు తినేవాళ్లం. అక్కడ చవితి రోజు మాత్రమే అలా చేసేవాళ్లం. కానీ, ఈ 18 ఏళ్లలో వినాయక పూజ జరిగే పది రోజులూ ఉత్సవాల్లో పాల్గొనడం అలవాటైపోయింది.

దైవాన్ని అర్ధం చేసుకోవడం అంటే...
మానవసేవయే మాధవ సేవ అనే కోణం నుంచి మాత్రమే అర్థం చేసుకోగలం. కొన్నేళ్ల క్రితం ఖమ్మం నుంచి ఒక పెద్దావిడ నన్ను వెతుక్కుంటూ వచ్చింది వృద్ధాశ్రమ ఏర్పాటుకు సాయం కోరుతూ! ఆమె భర్త రిటైర్‌మెంట్‌ తర్వాత వచ్చిన డబ్బుతో వృద్ధుల కోసం ‘హోమ్‌’ ఏర్పాటుచేస్తున్నారు. ఆశ్రమానికి కావల్సిన భూమి కొనుక్కోవడానికి వాళ్ల డబ్బులు సరిపోయాయి కానీ బిల్డింగ్‌ కట్టడానికి లేవు. అప్పుడు ఆమెకు కొంత సాయం చేశాను. కానీ, అవి ఏ మూలకూ సరిపోవు. అప్పుడే ఒక టీవీ షో చేస్తున్నప్పుడు వీరి విషయం చెప్పాను. ఆ కార్యక్రమంలో హోమ్‌ కోసం వృద్ధ దంపతులు పడుతున్న తపనను చెప్పాను. దాంతో వారికి బిల్డింగ్‌తో పాటు ఆ ఆశ్రమం నడపడానికి కావల్సినంత ధన సాయం అందింది.

ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఎవరికైనా సాయం చేస్తే కలిగే ఆనందం ఎంత సంపాదించినా రాదని అప్పుడే అర్థమైంది. సుమ రాజీవ్‌కనకాల పేరుతో స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు సాయమందిస్తున్నాం. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వచ్చిన మొత్తాన్ని వృద్ధ నిరుపేద కళాకారులకు చేయూతనివ్వాలని– ‘మా’, టీవీ అసోసియేషన్‌కు కొంత, కనకాల ఊరిలోని స్కూల్‌ డెవలప్‌మెంట్‌కి, రాజమండ్రిలోని మరో స్కూల్‌కి కేటాయించాం. ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ స్కూళ్లను ఎంచుకొని పిల్లలకు అవసరమైన టెక్నాలజీ పట్ల అవగాహన ఏర్పడటానికి కావల్సిన సదుపాయాలను కల్పిస్తున్నాం.

దేవుడి పూజలో లీనమైనప్పుడు ఈ పనులే చేయాలనే గైడెన్స్‌ వస్తుంటాయా?
ధ్యానం ద్వారా మాత్రం గైడెన్స్‌ను పొందవచ్చు. అప్పుడే దేవుడి పూజతోకన్నా మనం దేవుడితో ఉండటం ముఖ్యం అని తెలుస్తుంది. మనలో ఉండే అంతర్‌జ్ఞానం ద్వారా ఆ గైడెన్స్‌ను మనమే స్వీకరించవచ్చు. అలాంటివి నేనూ పొందుతుంటాను. ఎలాగంటే– ఏదైనా పనికి పూనుకున్నప్పుడు ‘ఇది చేయాలి అనో, ఇది వద్దు అనో’ ఒక ఇన్నర్‌వాయిస్‌ వస్తుంది. దీనిని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. అప్పుడు ఏది బలంగా అనిపిస్తే ఆ పనిని మొదలుపెట్టడం  అలవాటైపోయింది. దీనికి రోజూ ఒక సాధన చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. మంచి ఆలోచనలు పెంచుకోవాలి. వాటిని విశ్వంలోకి పంపించాలి. అప్పుడు మంచి ఏదైనా యూనివర్స్‌ నుంచి మనకు తిరిగి వస్తుంది. ఈ నమ్మకం ఇటీవల బలంగా ఏర్పడింది.

దేవుడిని భయంతో ప్రార్థించిన సందర్భాలు...
భయంతో ప్రార్థించింది, ఆనందంగా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకున్నది ఒకే సందర్భంలో జరిగాయి. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సూర్యగ్రహణం వచ్చింది. అప్పుడు షూటింగ్‌లో ఉన్నాను. గ్రహణ సమయంలో బయట తిరిగితే పుట్టే పిల్లలు అంగ వైకల్యంతో పుడతారని విని భయ పడ్డాను. బాబాను ప్రార్థించే దాన్ని. బాబు ఆరోగ్యంగా పుట్టినప్పుడు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement