సెనగ తినగ | special food to Peanut roti | Sakshi
Sakshi News home page

సెనగ తినగ

Published Sat, Aug 19 2017 12:10 AM | Last Updated on Sun, Sep 17 2017 5:40 PM

సెనగ తినగ

సెనగ తినగ

పట్టీలంటే మనకు తెలిసినవల్లా కాళ్లకు వెండి పట్టీలు... నాల్కకు పల్లీపట్టీలు కానీ శనగలతోనూ టేస్టీగా పట్టీలు ఒత్తుకోవచ్చు!రోటీలంటే మన మటుకు మనం ఎరిగినవి   గోధుమరొట్టె, జొన్నరొట్టె లేదా మినపరొట్టెలే.   అయితే శనగరోటీలనూ కాల్చుకోవచ్చు! వడలంటే మనమెరిగినవి పెసరవడలూ, గారెలే. కానీ ఒడలు పులకరింపజేసే శనగవడలూ చేసుకోవచ్చు. ఆత్మారాముడు... అదేనండీ సోల్‌ శాంతించేలా రోల్స్‌... మనసు పొంగేలా శనగపొంగలీ వండుకోవచ్చు. ఇవన్నీ తనివితీరేలా తినేయవచ్చు... తేన్చేయవచ్చు.కానీ ఒక్కటి మాత్రం ష్యూర్‌... ఈ శనగ ఐటమ్స్‌లో ఏది చూసినా... ఏది తిన్నా అటు రుచుల వానతో... ఇటు లాలాజలవర్షంతో నోరంతా చిరపుంజీ అయిపోవడం ఖాయం. కాసేపట్లో  ప్లేట్లోనివి మాయం అయిపోవడమూ ఖాయం.

పట్టీస్‌
కావల్సినవి:  ఆలివ్‌ ఆయిల్‌ – టేబుల్‌ స్పూన్‌; క్యారట్‌ తరుగు – 2 టీ స్పూన్లు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 4 (కచ్చాపచ్చాగా దంచాలి); ఉప్పు – తగినంత; ఉడికించిన సెనగలు – కప్పు; బ్రెడ్‌ క్రంబ్స్‌ పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; నిమ్మరసం – టీ స్పూన్‌; సోంపు (కచ్చాపచ్చాగా దంచాలి) – అర టీ స్పూన్‌; మిరియాల పొడి – చిటికెడు

తయారీ: కడాయిలో ఆలివ్‌ ఆయిల్, కూరగాయల ముక్కలు వేసి ఉడికించాలి. ఉడికించిన శనగలను వడకట్టి, గరిటెతో లేదా పప్పు గుత్తితో వాటిని కచ్చాపచ్చాగా చిదపాలి. దీంట్లో బ్రెడ్‌ క్రంబ్స్‌ పొడి, సోంపు, ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలపాలి. కూరగాయల మిశ్రమం చల్లారిన తర్వాత శనగల మిశ్రమంలో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో ఉండలుగా చేసి, అదిమి పెనం మీద రెండువైపులా కాల్చుకోవాలి. వడల్లాగ నూనెలో వేసి కూడా వేయించుకోవచ్చు.

గుగ్గిళ్లు
కావల్సినవి:  ఉడికించిన శనగలు – కప్పు; ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 4 (కచ్చాపచ్చాగా దంచాలి); ఉప్పు – తగినంత; ఆలివ్‌ ఆయిల్‌ – టేబుల్‌ స్పూన్‌; కరివేపాకు – రెమ్మ; నిమ్మరసం – టీ స్పూన్‌; నూనె – రెండు టీ స్పూన్లు; ఎండుమిర్చి – 2 ; పచ్చిమిర్చి – 1 (నిలువుగా కట్‌ చేయాలి); కొత్తిమీర – టీ స్పూన్‌; పోపు గింజలు – అర టీ స్పూన్‌

తయారీ:  కడాయిలో నూనె వేసి, వేడయ్యాక పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వేయించాలి. దీంట్లో ఉడికించిన శనగలు, ఉప్పు వేసి కలపాలి. చివరగా కొత్తిమీర చల్లి దించాలి. పైన నిమ్మరసం పిండి సర్వ్‌ చేయాలి.

రోల్స్‌
కావలసినవి:  సెనగలు – కప్పు; సెనగపప్పు – ఒకటిన్నర టీ స్పూన్‌; యాలకులు – 2; దాల్చిన చెక్క – చిన్నముక్క; నూనె – 4 టేబుల్‌ స్పూన్లు; తరిగిన ఉల్లిపాయలు – ముప్పావు కప్పు; టొమాటో తరుగు – ముప్పావు కప్పు; అల్లం తరుగు – టీ స్పూన్‌; పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్‌; ధనియాల పొడి – టీ స్పూన్‌; కారం – అర టీ స్పూన్‌; గరం మసాలా – అర టీ స్పూన్‌; చోలే మసాలా – ముప్పావు టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; రోటీస్‌ – 2, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు – కొన్ని

తయారి:  రాత్రిపూట సెనగలు కడిగి, తగినన్ని నీళ్లు పోసి  నానబెట్టాలి. ఉదయాన ప్రెషర్‌ కుకర్‌లో వడకట్టిన సెనగలు, ఒకటిన్నర  కప్పు నీళ్లు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మూత పెట్టి 3 విజిల్స్‌ పెద్ద మంట మీద, మరో మూడ్‌ విజిల్స్‌ సన్నని మంట మీద ఉంచి దించేయాలి. కడాయి స్టౌ మీద పెట్టి నూనె వేసి, కాగాక ఉల్లిపాయలు వేయించాలి. దీంట్లో టోమాటో, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసి మూడు నిమిషాల సేపు వేయించాలి. దీంట్లో ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం బాగా ఉడికి, నూనె పైకి తేలాలి. అప్పుడు ఉడికిన సెనగలు, మసాలా, రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లు, ఉప్పు వేసి సన్నని మంట మీద మళ్లీ ఉడికించాలి. గ్రేవీ పూర్తిగా పొడిబారేంతవరకు స్టౌ మీదే ఉంచాలి. ఒక గిన్నెలో గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చాట్‌ మసాలా వేసి కలపాలి. రోటీ మధ్యలో పైన ఉల్లిపాయ రింగులు, ఆ పైన సిద్ధంగా చేసుకున్న శనగల మిశ్రమాన్ని ఉంచి, రోటీ మొత్తం సెట్‌ అయ్యేలా స్పూన్‌తో సర్దాలి. పైన కొత్తిమీర, ఉల్లిపాయల తరుగు వేసి రోటీ చివరలు పట్టుకొని 3 సార్లు చుట్టాలి. దీని చుట్టూత టిష్యూ పేపర్‌ని చుట్టి, వెంటనే అందించాలి.

పొంగలి
కావలసినవి: సెనగలు – రెండు కప్పులు (నానబెట్టినవి); పాలు – 6 కప్పులు; బెల్లం – ఒకటిన్నర కప్పు; నెయ్యి – తగినంత; జీడిపప్పు – 10; కిస్‌మిస్‌ – 10; ఏలకులు – 5, కొబ్బరి తురుము – అరకప్పు.

తయారి: ముందుగా సెనగలను నానబెట్టుకొని వాటిలోంచి ఒకటిన్నర కప్పుల శనగలను తీసుకునిమెత్తగా రుబ్బుకోవాలి. స్టౌ మీద మూకుడు ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించుకుని తీసేయాలి. తరవాత అందులోనే గోధుమరవ్వ వేయించి తీయాలి. మరికాస్త నెయ్యి వేసి, రుబ్బిన సెనగలముద్దను వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తరవాత అందులో గోధుమరవ్వ, పాలుపోసి ఉడికించాలి. మిగిలిన శనగలు, బెల్లం, వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయాలి. దించేముందు కొబ్బరితురుము, ఏలకులపొడి వేయాలి. ఇది వేడివేడిగా తింటే మంచిరుచిగా ఉంటుంది.

రోటీ
కావలసినవి: గోధుమపిండి – 250గ్రా.; సెనగలు – 100గ్రా.; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; జీలకర్రపొడి – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; నూనె – తగినంత.

తయారి: సెనగలను ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. నానిన సెనగలను శుభ్రంగా నీళ్లతోకడిగి కుకర్‌లోపెట్టి నాలుగు విజిల్స్‌ వచ్చేదాకా ఉంచి దించేయాలి. సెనగలు చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగారుబ్బుకోవాలి. ఈ మెత్తగా రుబ్బిన సెనగల ముద్దలోగోధుమపిండి వేసి కలపాలి. తరవాత ఇందులో తగినంత ఉప్పు, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా కలపాలి. తరవాత కొద్దిగా నీరు పోస్తూ చపాతీపిండిలా కలుపుకుని గంటసేపు నాననివ్వాలి. తరవాత ఈ పిండిని ఉండలుగా చేసుకుని చపాతీలాగ ఒత్తి పెనం మీద వేసి నెయ్యితో కాని నూనెతో కాని కాల్చుకోవాలి. ఈ రోటీలను ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర పచ్చిమిర్చి, పెరుగు లేదా టొమాటో సాస్‌తో కాని, పుదీనా చట్నీతో కాని తింటే  రుచిగా ఉంటాయి.

వడలు
కావలసినవి: శనగలు – 250 గ్రా.; పచ్చిశనగపప్పు – 100 గ్రా.; బియ్యం – గుప్పెడు; పచ్చిమిర్చి – 5; ఉల్లిపాయలు – 2; కరివేపాకు – రెండురెమ్మలు; కొత్తిమీర – చిన్నకట్ట; ఉప్పు – తగినంత; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారి: ఒకరోజు రాత్రంతా శనగలను ఒక గిన్నెలో, పచ్చిశనగపప్పు బియ్యం కలిపి మరొక గిన్నెలో నానబెట్టాలి. ఉదయాన్నేవాటిని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, విడివిడిగానే మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బిన వాటిని ఒక గిన్నెలో వేసి అందులో పచ్చిమిర్చితరుగు, ఉల్లితరుగు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. బాణలిలో నూనె పోసి బాగా కాగాక, కలిపి ఉంచుకున్న ఈ ముద్దను వడల మాదిరిగా చేత్తో ఒత్తి, నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, టిష్యూ పేపర్‌మీదకు తీసుకోవాలి. వీటిని టొమాటో సాస్‌ లేదా టొమాటో కెచప్‌తో తింటే బావుంటాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement