న్యూయార్క్: నేడు మొదలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ట్యాక్స్‌లు, అబార్షన్ హక్కులు, అక్రమ వలసలు ప్రధాన అంశాలుకాగా చిట్టచివర్లో ఒక ఉడుత చొరబడింది! రేబిస్ అనుమానంతో దాన్ని అధికారులు చంపేయడం చర్చనీయంగా మారింది. రిపబ్లికన్లు దీన్ని తమ ప్రచారాంశంగా మార్చుకున్నారు. బుల్లి టోపీలు, గమ్మతైన ట్రిక్కులతో మిఠాయిలపై గెంతుతూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఈ ఉడుతకు ‘పీనట్’ అని పేరు.
న్యూయార్క్‌లో మార్క్ లాంగో అనే వ్యక్తి ఏడేళ్లుగా పెంచుతున్నాడు. దీంతోపాటు నక్కలా చిన్నగా ఉండే రఖూన్ అనే జీవినీ పెంచుతున్నాడు. ఈ వన్య ప్రాణుల పెంపకానికి అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. అవి లేకపోవడంతో అధికారులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఉడుత ఇటీవల ఒకరిని కరిచిందట. దాంతో ప్రాణాంతకర రేబిస్ వ్యాధి ప్రబలే ఆస్కారముందంటూ పీనట్, రఖూన్ రెండింటినీ గత వారం విషమిచ్చి చంపేశారు.
దీన్ని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బైడెన్ సర్కారు నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. ప్రభుత్వం మతిలేని, దయలేని యంత్రంగా మారింది. అనాథ ఉడుతను నిర్దయగా చంపేసింది. ఇలాంటి ఉడుతలను సైతం ట్రంప్ కాపాడగలరు’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ‘‘6 లక్షల మంది నేరస్తులు, 13 వేల మంది హంతకులు, 16 వేల మంది రేపిస్టులు స్వేచ్ఛగా అమెరికాలోకి అడుగు పెట్టేలా చేసిన డెమొక్రటిక్ ప్రభుత్వం ఒక పెంపుడు ఉడుతను మాత్రం బతకనీయలేదు’’ అంటూ వాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment