
అందమైన కుటుంబ బాంధవ్యాలు విడిపోవడానికి, తెగిపోవడానికి ఒక్క క్షణం చాలు. కలిపి ఉంచడానికి ఒక జన్మ సరిపోదేమో! అల్లు అరవింద్ తన కుటుంబాన్నే కాదు... మెగా కుటుంబం కూడా తన కుటుంబమే అనుకున్నారు. అందరి బాధ్యతలనూ తన జీవితం అనుకున్నారు. అలా పెనవేసుకున్న ప్రేమలే పిల్లల్లో కూడా అల్లుకుని ఉన్నాయి. ఆ అల్లుకున్న ఆనందమే మన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
అల్లు అరవింద్ అనే వృక్షం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొమ్మలు (అల్లు అర్జున్, అల్లు శిరీష్) మీరు. ఆ చెట్టు నీడలో ఉంటూనే ‘సొంత ఐడెంటిటీ’ తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
శిరీష్: పెద్ద బాధ్యత అండి. ఆ నీడలో ఉన్న మేం తప్పటడుగులు వేయకూడదు. తప్పు చేయకూడదని భయపడుతూ ఉంటాం. కానీ కెరీర్ పరంగా గతంలో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. ప్రస్తుతం కరెక్ట్ డైరెక్షన్ వైపు వెళుతున్నాను. దీంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. నా ఆలోచనా పరిధి పెరిగింది. పెద్దలు కష్టపడి సంపాదించుకున్న కుటుంబ గౌరవం, పేరును చెడగొట్టకూడదన్న భయంతో కూడిన బాధ్యత మాలో ఉంది. ప్రొఫెషనల్‌గా సొంత ఐడెంటిటీ మా కష్టంతోనే వస్తుంది. అన్నయ్య (అల్లు అర్జున్) కష్టపడి పేరు తెచ్చుకున్నాడు. నేనూ నా కష్టంతోనే నిలబడాలనుకుంటున్నా.
కెరీర్‌వైజ్‌గా తప్పు చేశా అన్నారు.. ఏంటా తప్పు?
శిరీష్: ‘గౌరవం’ లాంటి సినిమాతో హీరోగా పరిచయం కావడం కరెక్ట్ కాదని తర్వాత తెలుసుకున్నాను. ఆ సినిమా ఇప్పుడు చేసి ఉంటే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునేవాళ్లేమో. బిగ్ మిస్టేక్ కాదు. బట్.. కెరీర్‌లో ఫస్ట్ సినిమా చాయిస్‌గా ‘గౌరవం’ కరెక్ట్ కాదు అనిపించింది. డాడీ ‘గౌరవం’ చూసి, ‘ఆడితే పేరు వస్తుంది. కలెక్షన్స్ వస్తాయి. ఆడకపోతే కష్టాలు వస్తాయి’ అన్నారు. అలా మెంటల్‌గా ప్రిపేర్ అవ్వమని ముందే సూచించారు. డాడీ నా నిర్ణయాన్ని గౌరవించడంతోపాటు నా అభిప్రాయాలకు విలువ ఇచ్చారు. అయినా ‘గౌరవం’ సినిమా చేయడం వల్ల నేను రిగ్రెట్ అవ్వడంలేదు. ఆ సినిమాను గౌరవించేవాళ్లు చాలామంది ఉన్నారు.
చిరంజీవిగారు ‘మెగాస్టార్’ స్థాయికి రావడం వెనక మీ సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడు మీ ఇద్దరి కొడుకులకు అంతే సపోర్ట్ ఉండటం వాళ్లకు ఓ పెద్ద బలం అని చెప్పొచ్చు..
అరవింద్: పైకి రావాలంటే ఎవరైనా కష్టపడాల్సిందే. షార్ట్ కట్స్ ఉండవు. ఈ విషయమే నా ఇద్దరి కొడుకులకు చెబుతుంటాను. చిరంజీవిగారు ఎంతో కష్టపడ్డారు. ఆయనకు బదులు నేను వెళ్లి యాక్ట్ చేయలేను కదా. చిరంజీవిగారు నన్ను నమ్మడం నేను బాధ్యతగా ఫీలయ్యాను. వెనకాల చిన్న చిన్న బాధ్యతలను నేను తీసుకున్నాను.. అంతే. దాంతో ఆయన ఫ్రీగా సినిమాల మీద కాన్సంట్రేట్ చేయగలిగారు. ఎటువంటి ఆలోచనలు లేకుండా యాక్ట్ చేయగలిగారు.
నాకు చేతనైనంతలో ఆయనకు నేను చేసిన సాయం అదే. అందరూ ఓ మూస ధోరణిలో వెళుతున్న టైమ్‌లో చిరంజీవిగారు పాత్ బ్రేకింగ్ సినిమాలు చేసి పైకి వచ్చారు. మా అసోసియేషన్ దాదాపు నలభై ఏళ్లది. జనరల్‌గా అన్ని రోజుల అసోసిషియేషన్ ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి ఉంటుంది. నాకు గుర్తు ఉన్నంత వరకు చాలా తక్కువ మందికి ఉంది. ‘బాపు–రమణలగారికి’, ‘చిరంజీవిగారికి–నాకు’, ‘అచ్చిరెడ్డి–కృష్ణారెడి’్డలకి. మేమంతా ఎన్నో ఏళ్లుగా కలసి ట్రావెల్ చేస్తున్నాం. అలా ట్రావెల్ చేయాలంటే... ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉండాలి. నాకు, చిరంజీవిగారికి మధ్య ఆ అండర్‌స్టాండింగ్ ఉంది.
ఇన్నేళ్ల జర్నీలో చిరంజీవిగారితో టఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా?
అరవింద్: వ్యక్తిగతంతా ఎప్పుడూ రాలేదు. పాలిటిక్స్‌లోకి వెళ్లినప్పుడు చిన్న చిన్న టఫ్ సిచ్యువేషన్స్ వచ్చాయి. కానీ, అవి పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయాయి. ఎప్పటిలానే మేమిద్దరం ఒకటే.
శిరీష్... మీ ‘ఒక్క క్షణం’ గురించి కొన్ని మాటలు చెబుతారా?
శిరీష్: ప్యారలల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది. ఇద్దరి లైఫ్‌లో ఒకేలా ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. గతంలో సైంటిఫికల్‌గా ఇది ప్రూవ్ అయ్యింది. ఒకరి తల రాత ఇంకొకరి చేతిలో ఉంటే ఎలా? అనే కాన్సెప్ట్‌తో కథ సాగుతుంది. డైరెక్టర్‌గారు (వీఐ ఆనంద్) కథ చెప్పిన 20 నిమిషాలకే నచ్చింది. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాం. 40 మినిట్స్ విన్న తర్వాత సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. నాన్నగారు ఒక్కసారి వినాలి అని చెప్పాను. గతేడాది అక్టోబర్‌లో సైన్ చేశాను. 14 నెలలు పట్టింది సినిమా కంప్లీట్ అవ్వడానికి. నిర్మాత చక్రి చిగురుపాటి రాజీపడలేదు. నన్ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా ఇది అని నమ్మాను. అందుకే వేరే సినిమా సైన్ చేయలేదు. ‘ఒక్క క్షణం’ని నేనెంత నమ్మానో దీన్నిబట్టి మీరు ఊహించుకోవచ్చు.
ఒక అప్‌కమింగ్ హీరో 14 నెలలు ఒక సినిమాకి ఇచ్చేయడం కరెక్టేనంటారా?
అరవింద్: అస్సలు కరెక్ట్ కాదు. నేను ఇష్టపడలేదు. మధ్యలో ఇంకో సినిమా చేయాల్సిందనిపించింది. తాత (అల్లు రామలింగయ్య) గారి లక్షణం అబ్బినట్లుంది. నాన్నగారు తన మాటే నెగ్గాలనుకునేవారు. మా నాన్నతో పోల్చితే నేను చాలా మైల్డ్. ఆయన అగ్రెసివ్. అల్లు శిరీష్‌కి కొంచెం ఆ పోలికలే వచ్చాయి..
అల్లు రామలింగయ్యగారు మీ మాట కాదని చేసిన ఓ ఇన్సిడెంట్‌ని గుర్తు చేసుకుంటారా?
అరవింద్: రాఘవేంద్రరావుగారు, నాన్నగారు బాగా సన్నిహితులు. ఆయన సినిమాలో నాన్నగారు ఓ క్యారెక్టర్ చేస్తానని ఒప్పుకున్నారు. అప్పటికే పెద్ద వయసు వచ్చేయడంతో ఆరోగ్య రీత్యా అవుట్‌డోర్ షూటింగ్స్‌కు వెళ్లొద్దని చెప్పేవాణ్ణి. అలా వెళ్లనవసరం లేని సినిమాలైతేనే చేయమనేవాణ్ణి. కానీ, రాఘవేంద్ర రావుగారి సినిమా కోసం వైజాగ్ వెళ్లడానికి రెడీ అయ్యారు. ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డాను. మా మాట వినరు కదా. వెళ్లారు. అక్కడేమో అనుకున్న రోజులకన్నా ఎక్కువైంది. నేను భయపడినట్లుగానే ఆయన ఆరోగ్యం దెబ్బతింది. నేను వైజాగ్ వెళ్లేలోపే నాన్నగారిని ఐసీయూలో ఉంచారు. కొంచెం తేరుకున్నాక హైదరాబాద్ తీసుకు వచ్చాం.
మీ నాన్నగారితో క్లోజ్‌గా ఉండేవారా?
శిరీష్: నేను చెబుతా. తాతగారు, డాడీ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లు. ఎలా అంటే... తాతగారు డాడీని కొట్టేవారు. ఫార్టీ ఇయర్స్ ఏజ్‌లో కూడా డాడీ తాత దగ్గర దెబ్బలు తిన్నారు. ఏం డాడీ? (అల్లరిగా చూస్తూ).
అవునా.. పెళ్లయి, పిల్లలు పుట్టాక కూడా మీ నాన్నగారి దగ్గర దెబ్బలు తిన్నారా? ఏదైనా ఒక్క సంఘటన చెబుతారా?
అరవింద్: మా నాన్నగారు 40ఏళ్ల వయసులో నన్ను ఓసారి కొట్టారు. అది కూడా చాలా సీరియస్‌గా. ఓ రోజు నేను, నాన్నగారు బయటికి వెళ్లాం. నేను కారు డ్రైవ్ చేస్తుంటే నాన్నగారు పక్కన కూర్చున్నారు. డ్రైవ్ చేస్తూ సడన్ బ్రేక్ వేశా. ఆయన అమాంతంగా ముందుకు ఒరిగిపోయి, బ్యాలెన్స్ కోసం ముందు అద్దానికి చేయి ఆన్చారు. ఆ తర్వాత ‘ఫట్‌మని’ నా చెంప మీద ఒక్కటిచ్చారు.
ఆ క్షణం నాకేమీ అర్థం కాలేదు. కానీ ఆయన దూరమైన తర్వాత.. ఆయన కోపాలు నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. కొడుకు 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ తండ్రి కొట్టాడంటే.. ఆ కొడుకుని ఆయన ఇంకా చిన్నవాడిగానే చూసినట్లు కదా. కొడుకు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఆ తండ్రికి అతను కొడుకే కదా. నాన్నగారు అలా అనుకునే నన్ను కొట్టారు. అందుకే నా మనసులో ఆ సంఘటన అలా పదిలంగా ఉండిపోయింది.
మరి.. శిరీష్... మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టిన సందర్భం...
శిరీష్: మా అమ్మ పర్లేదు. బాగా కోపం వస్తే ఒక్క చిన్న దెబ్బ... అంతే. డాడీ మాత్రం చాలాసార్లు కొట్టారు. ఓసారి టీవీలో వీడియో గేమ్ ఆడుకుందామని, వైర్ పెట్టడానికి టీవీ ముందుకు జరిపాను. అది కింద పడిపోయింది. అప్పట్లో దాని రేట్ లక్ష రూపాయలు. టీవీ పగలగొట్టానని నన్ను పై నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకొచ్చారు. కింద నానమ్మ ఉండటంతో బతికిపోయాను. తను ఆపింది. నేను బాగా లావుగా ఉండేవాణ్ణి. అందుకు కూడా కొట్టేవారు.
అవునూ.. వంద కేజీల వరకూ బరువు ఉండేవారట.. ఎలా తగ్గించేశారు?
శిరీష్: యాక్చువల్లీ నేను పెద్దగా తినేవాణ్ణి కాదు. కానీ బరువు పెరుగుతూ ఉండేవాణ్ణి. చివరకు థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల అలా అవుతున్నానని తెలిసింది. దాంతో ఆ సమస్య సాల్వ్ చేసుకున్నాను. రెండేళ్లు కష్టపడి 25 కేజీలు తగ్గాను. అప్పుడు ముంబయ్‌లో ఉండి చదువుకున్నాను. దాంతో నా డైట్ నేనే సెట్ చేసుకోవాల్సి వచ్చింది. తగ్గడానికి అది కూడా మంచిదే అయింది. నా ఏజ్ అప్పుడు 18 ఇయర్స్. ఆ ఏజ్‌లో అందరూ బాగా కనపడాలని కోరుకుంటారు కదా.
అరవింద్: కాలేజీ స్టార్ట్ అయ్యింది కదండీ. అమ్మాయిల కోసమే తగ్గాలనుకున్నాడేమో అనుకునేవాణ్ణి (నవ్వుతూ)
శిరీష్: ఏమో.. ఇన్నర్‌గా అది కూడా ఉండేదేమో డాడీ (నవ్వేస్తూ). కానీ, అదైతే మెయిన్ రీజన్ కాదు. అందరూ స్టైల్‌గా ఉంటున్నారు. నేనెందుకలా ఉండకూడదని తగ్గాను. కొంతమంది ఈజీగా బరువు పెరుగుతారు. నాది అలాంటి శరీర తత్వం. అయితే అంతే ఈజీగా తగ్గగలగడం నా లక్. 100 నుంచి 70 కేజీల బరువుకి చేరుకున్నాను. మాక్కూడా టిప్స్ చెబుతారా? అంటే చెప్పను. ఎందుకంటే, నా బాడీకి వర్కవుట్ అయిన టిప్ ఇంకొకరికి అవ్వకపోవచ్చు. వాళ్ల శరీర తత్వం వేరుగా ఉంటుంది.
హీరోగా బన్నీ ‘సరైనోడు’ అనిపించుకున్నారు. మరి.. శిరీష్ అంత పేరు తెచ్చుకోగలుగుతారనే నమ్మకం ఉందా?
అరవింద్: ఇంకాస్త టైమ్ పడుతుంది. శిరీష్ కష్టపడాలి. బన్నీ హీరో అవుతాడని తెలుసు. కానీ ఇంత తక్కువ టైమ్‌లో ఇంత స్టార్‌డమ్ వస్తుందని ఊహించలేదు. బన్నీ ఫోకస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. శిరీష్ ఫోకస్ కూడా అంతే. అందుకని తనూ నిలబడతాడనే నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు శిరీష్ స్టూడెంట్ క్యారెక్టర్స్, యంగ్ క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. ఇప్పుడే మాస్ క్యారెక్టర్స్ చేయకూడదు. కొట్టగానే పదిమంది గాల్లో లేచి పడటం... అలాంటివి ఇప్పుడే కరెక్ట్ కాదు.
శిరీష్: ఈ విషయంలో డాడీతో నేను ఏకీభవిస్తున్నానండి. ప్రజల్ని కాపాడటం వంటి క్యారెక్టర్స్ చేయాలని నాకూ లేదు. నా వయసుకి తగ్గ పాత్రలు చేయాలనుకుంటున్నాను.
అల్లు రామలింగయ్యగారు కామెడీ చేశారు. మీరు నిర్మాత. అందుకని మీ ఫ్యామిలీ నుంచి హీరోలను ఎక్స్‌పెక్ట్ చేయలేదు...
అరవింద్: నేను బాగా నటిస్తాను. కానీ, నా ఫిజిక్ సూట్ అవ్వదని నాకు తెలుసు. అందుకే రెండు మూడు సినిమాలు చేసినా కంటిన్యూ అవ్వలేదు. నిర్మాతగా చేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ. పిల్లలు హీరో అవ్వాలనుకోవడానికి కారణం చిరంజీవిగారు. ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు వస్తున్నారు.. ఎందుకు? అనే ఆలోచనే చాలామందికి ఉంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చిరంజీవిగారిని చూస్తూ పెరిగారు. ఆయన సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు. తెలియకుండానే ఆ ఇంపాక్ట్ వారిపై పడింది. దాంతో హీరోలవ్వాలనుకున్నారు. బన్నీ హీరోగా సక్సెస్ అయ్యాడు. శిరీష్ ప్రొడక్షన్ బాగా చూసుకునేవాడు. అయితే అన్నను చూసి ఇన్‌స్పైర్ అయి, తనూ హీరో అయ్యాడు.
మీరెప్పుడు కూల్‌గా, పీస్‌ఫుల్‌గా కనిపిస్తారు. టెన్షన్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేస్తారు?
అరవింద్: బేసిక్‌గా నాది కూల్ నేచర్. ఎక్కువ టెన్షన్ పడను. ఎప్పుడైనా వీళ్ల (కొడుకులు వెంకటేశ్, బన్నీ, శిరీష్) మీద కోపం వస్తే తప్ప. హిట్లూ, ఫ్లాపులూ కామన్. ఫ్లాప్ అయితే ఏమవుతాం? అదేం జీవన్మరణ సమస్య కాదు కదా. మళ్లీ ఇంకో హిట్ తెచ్చుకోవచ్చు. ప్రాణం మీదకొచ్చినప్పుడు మాత్రమే టెన్షన్ పడాలన్నది నా సిద్ధాంతం.
మీరు మాత్రం మీ నాన్నగారంత కూల్ కాదేమో?
శిరీష్: అవునండి. నాన్నగారంత కూల్ కాదు. ఇప్పుడు ఫర్వాలేదు కానీ, ఇదివరకైతే ఎలక్ట్రిక్ వైర్‌లానే అన్నమాట. ఇప్పుడు చాలా నెమ్మదిగా డీల్ చేస్తున్నాను. డాడీ అన్నట్లు.. ప్రాణం మీదకు వచ్చేవి తప్పితే వేరే ఏదైనా మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? ఆస్తి పోతే పోతుంది. సినిమా ఫ్లాపయితే అవుతుంది. ఏదైనా ఎండ్ ఆఫ్ ది లైఫ్ అయితే కాదు కదా.
ముగ్గురూ కొడుకులే కాబట్టి ఆడపిల్లలు లేరనే ఫీలింగ్?
అరవింద్: చిరంజీవిగారికి ఇద్దరు ఆడ పిల్లలు, నా సిస్టర్‌కు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లందరూ నాకు చాలా క్లోజ్. ఇంకో సిస్టర్ డాటర్స్ అయితే మా ఇంట్లోనే పెరిగారు కాబట్టి ఆ ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. మా సిస్టర్స్, నేను చాలా క్లోజ్. రెండు రోజులు సురేఖ (చిరంజీవి సతీమణి)ను చూడకపోతే అదోలా ఉంటుంది. ఫోన్ చేసి మాట్లాడుకుంటాం.
శిరీష్: మా అత్తయ్యలకు, డాడీ వాళ్లకు నేనో పేరు కూడా పెట్టాను... ‘అధిష్ఠానం’ అని (నవ్వుతూ). ఫ్యామిలీలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ముగ్గురూ మాట్లాడుకుంటారు. పార్టీ ఏ ఇంట్లో ఏర్పాటు చేద్దాం, బెంగళూర్ వెళ్దామా ఇక్కడేనా? అని డిసైడ్ చేస్తారు.
అరవింద్: మేం ముగ్గురం ఏదనుకుంటే అదే జరుగుద్ది (నవ్వుతూ).
ముగ్గురి కొడు కుల్లో ఎవరంటే ఇష్టం?
అరవింద్: పెద్దబ్బాయి బాబీ (వెంకటే‹శ్) అంటే ఇష్టం. తను పుట్టినప్పుడు నేనంత బిజీ కాదు. బాగా ఎత్తుకునేవాణ్ణి. బన్నీ పుట్టే టైమ్‌కి బిజీ అయిపోయా. శిరీష్ అప్పుడు ఇంకా బిజీ. అందుకని బాబీ అంటే ఎక్కువ ఇష్టం.
గ్రాండ్ చిల్డ్రన్‌ని ఎత్తుకున్నప్పుడు మీ ఫేస్‌లో ఆ మురిపెం స్పష్టంగా కనిపిస్తుంటుంది.. వాళ్లతో మీ టైమ్ గురించి?
అరవింద్: ప్రతి రోజు వాళ్లతో కొంచెం సేపు స్పెండ్ చేస్తాను. వాళ్లు స్కూల్‌కి వెళ్లే ముందు కాసేపు ముచ్చట్లు చెబుతాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్‌లో ఆడుకుంటారు. అది చూస్తుంటాను. నిజానికి బన్నీని వేరే ఇంటికి వెళ్లమంటున్నాం కానీ, వాళ్లు వెళ్లిపోతే ఇబ్బంది పడేది మేమే.
ఫ్యామిలీ అంతా కలసికట్టుగా ఉండేలా చేయడం ఇంటి పెద్ద బాధ్యత. ఆ విషయంలో మీ ఫ్యామిలీకి రోల్ మోడల్‌గా ఉన్న మీరు మీ పిల్లలకు ఆ వేల్యూస్ నేర్పిస్తుంటారా?
అరవింద్: మా బిహేవియర్ నుంచి కొంచెం తీసుకుంటారు. ముగ్గురు బ్రదర్స్ క్లోజ్‌గా ఉంటారు. కజిన్స్ అంతా కలిపితే మొత్తం పదకొండు మంది. వీళ్లంతా టూర్స్ కూడా వెళ్తుంటారు.
శిరీష్: మొన్నా మధ్య మనాలీ వెళ్లాం. ఆంతకు ముందు హాంకాంగ్ వెళ్లాం. పిల్లలను వదిలిపెట్టం. మొత్తం కలిసి ఒక ఇరవై మంది దాకా వెళతాం. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాం.
అరవింద్: చిరంజీవిగారు, మేము ఎలా ఉంటామో ఈ జనరేషన్ వాళ్లు మా దగ్గరి నుంచి అది నేర్చుకున్నారు.
శిరీష్: చరణ్ (రామ్‌చరణ్) షూటింగ్ జరుగుతుంటే నేను, బన్నీ వెళ్తాం. ఇంటికెళ్లి, మేడ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం. చరణ్ మాకు ఫస్ట్ కజిన్. ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయిదరమ్ తేజ్. అయినా కూడా వాళ్లతోనూ క్లోజ్‌గా ఉంటాం. చరణ్ ఉన్నప్పుడే అని కాకుండా తను లేనప్పుడు కూడా వరుణ్, ధరమ్‌ని మేం కలుస్తాం. గత పదిహేనేళ్లుగా మేమంతా ప్రతి సంక్రాంతికి బెంగళూర్ వెళుతున్నాం.
ఎంత క్లోజ్‌గా ఉన్నా ప్రొఫెషనల్‌గా కొంచెం జెలసీ ఉండే చాన్స్ ఉందేమో...
అరవింద్: చరణ్, బన్నీ, వరుణ్... వీళ్లందరికి ఒక చాలెంజ్ ఏంటంటే ఫ్యామిలీలో చిరంజీవిగారు హార్డ్ వర్కింగ్‌లో హయ్యస్ట్ మార్క్ సెట్ చేశారు. ఆ లెవల్‌కి వీళ్లెవ్వరూ చేరలేకపోయారు. ఇంతవరకూ ఎవ్వరూ కొట్టలేదు. ఆ మార్క్‌ను చేరుకోవడం వీళ్లందరికీ కష్టమవుతోంది. చెప్పాలంటే ఆయన వీళ్లందరికీ కష్టాలు తెచ్చిపెట్టాడు (నవ్వుతూ). అదే ఆయన యావరేజ్‌గా వర్క్ చేసి ఉంటే వీళ్లకు ఇన్ని కష్టాలుండేవి కావు. వీళ్ల మధ్య జెలసీకన్నా ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది.
శిరీష్: అవును. ఆయన (చిరంజీవి) వల్లే ఈ కష్టాలు.. ఆయన వల్లే ఈ సుఖాలు కూడా. మా మధ్య జెలసీ ఉండదు కానీ, డాడీ అన్నట్లు బెంచ్ మార్క్ ఉంటుంది. అందరూ సిమిలర్ కెపాసిటీ ఉన్నవాళ్లం. ఇతని సినిమా ఇంత చేసింది అంటే మనం కూడా వచ్చే రెండు మూడు సినిమాల్లో దాన్ని రీచ్ అవ్వాలి అనుకుంటాం. పాజిటివ్‌గా తీసుకుంటాం. కలిసినప్పుడు ఆ కథ విన్నా, ఈ సినిమా చేస్తున్నా అని మాట్లాడుకుంటాం. ఈ కథ నాకంటే నీకు సూటవుతుందని ఐడియాస్ ఎక్సేంజ్ చేసుకుంటాం.
కుటుంబ సభ్యులందరిని ఎంత కలిసికట్టుగా ఉంచుదామనుకున్నా.. కోడళ్లు, అల్లుళ్ల రూపంలో వచ్చే ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే తేడా వచ్చేస్తుంది. మీ పెద్ద కోడలు, చిన్న కోడలు ఎలా ఉంటారు?
అరవింద్: నాకు డాటర్స్ లేని లోటు మేనకోడల్లు తీర్చారు. కోడళ్లు కూడా బాగుంటారు. జనరల్‌గా పెద్ద కుటుంబాల్లో ఒకరి రూమ్‌లోకి మరొకరు వెళ్లాలంటే... ఫోన్ చేసి ‘రావచ్చా’ అని అడిగి, వెళతారు. మా ఇంట్లో అలాంటిదేం ఉండదు. మాది జాయింట్ ఫ్యామిలీ. ఒకళ్ల రూమ్‌లోకి వెళ్లడానికి మరొకరం పర్మిషన్ తీసుకునే కల్చర్‌కి మేమింకా అలవాటు పడలేదు. వీలున్నంత వరకూ అందరం కలిసే ఉందామనుకుంటున్నాం. అయితే బన్నీకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇల్లు ఇరుకవుతుందని వేరే ఇల్లు కట్టుకోమంటున్నాను. అయినా పిల్లలతో ఇక్కడే అడ్జస్ట్ అవుతున్నాడు. నేను మాత్రం ఇల్లు కట్టుకుని వేరేగా ఉండమంటున్నాను. మాకూ అప్పుడప్పుడూ వేరే ఇంటికి వెళ్లినట్లు ఉంటుంది కదా. చిరంజీవిగారి ఇంటికి వెళ్లినట్టుగా ఎవ్రీడేనో లేదా రెండు రోజులకోసారో మేం బన్నీ ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది (నవ్వుతూ).
చిరంజీవిగారు ముందు కనిపిస్తారు. వెనుక ఉండి మీరు నడిపిస్తారని చాలామంది ఫీలింగ్. సవ్యంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ, జరగకూడనిది జరిగినప్పుడు ‘అల్లు అరవింద్ సూత్రధారి’ అని మీ మీద రాళ్లు విసురుతారు. దాన్ని మీరెలా తీసుకుంటారు?
అరవింద్: మిగతా వాళ్ళందరి గురించి ఫ్యామిలీలో ఒకళ్లు ఇలాంటివి తీసుకోవాలి. అది నా బాధ్యతగా అనుకొని తీసుకుంటాను. మా కుటుంబంలో నా రోల్ అది. అందరి బాగోగులు చూడటం నా రెస్పాన్సిబిలిటీ. అలా చూసినప్పుడు బయట నుంచి రాళ్లు పడతాయి. అది సహజం. నాకేం ప్రాబ్లమ్ లేదు.
ఈ బాధ్యత మీ సిస్టర్ కోసం తీసుకున్నారా?
అరవింద్: లేదండి. నేను, చిరంజీవిగారు మంచి ఫ్రెండ్స్. బావా బావమరిది అనేది నా సిస్టర్‌తో ఆయనకు పెళ్లైన ఫస్ట్ త్రీ ఇయర్స్‌లోనే పోయింది. ఇప్పుడు మా మధ్యలో బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ ఉంది.
ఇన్నేళ్ళ అనుబంధంలో చిరంజీవిగారితో మీ బెస్ట్ మూమెంట్?
అరవింద్: పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి చిరంజీవిగారు రాష్ట్రపతి భవన్ వెళ్లారు. ఆయనతో పాటు నేనూ వెళ్లాను. మా ఇద్దరికీ అది పీక్ మూమెంట్ అని నమ్ముతాను. ఒక వ్యక్తి కష్టం అది. అలాంటి ఆయనతో ఇన్ని రోజులు అసోసియేట్ అవ్వటం నాకు ఆనందంగా అనిపించింది.
భర్త, సోదరుడు కలసికట్టుగా ఉంటే ఏ మహిళకైనా ఆనందంగా ఉంటుంది.. ఈ సందర్భంగా సురేఖగారి గురించి రెండు మాటలు...
అరవింద్: సురేఖ చాలా మంచి పర్సన్. మా ఫ్యామిలీలోనే బెస్ట్ ఉమన్. మా మాదర్ నాకు చాలా గొప్పగా అనిపిస్తారు. ఆవిడ కంటే సురేఖ ఇంకా మంచిది. మేమిద్దరం క్లోజ్‌గా ఉండటం తనకు ఆనందంగా ఉంటుంది.
కొన్ని ఫ్యామిలీస్‌లో బావమరిదికి బావ దగ్గరైనప్పుడు బ్రదర్స్ దూరం అవుతుంటారు. చిరంజీవిగారి బ్రదర్స్ విషయంలో అలా ఏమైనా జరిగిందా?
అరవింద్: సురేఖ వాళ్లింటి కోడలైనప్పుడు వాళ్లిద్దరూ చిన్న పిల్లలు. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాం కాబట్టి అలాంటిదేం లేదు.
ఫైనల్లీ... శిరీష్‌ని ఎప్పుడు పెళ్లి కొడుకుగా చూడొచ్చు ?
అరవింద్: రెండు మూడేళ్ల లోపు.
శిరీష్: (నవ్వుతూ) లోపా ? విజన్ 2020నా డాడీ.
లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా?
అరవింద్: అరేంజ్ అయినా సరే.. నువ్వే చేసుకో అని చెప్పాం.
శిరీష్: సెలక్షన్ నాకే వదిలేశారు. మా డాడీ నమ్మేది ఏంటంటే.. పేరెంట్స్ అడిగారనో, సొసైటీలో ఏమనుకుంటారనో, పెళ్లి వయసు వచ్చిందనో కాకుండా నాకు ఈ అమ్మాయి నచ్చి, తనతో రెస్ట్ అఫ్ ది లైఫ్ బాగుంటుందనిపిస్తే పెళ్లి చేసుకో అంటారు. ప్రస్తుతానికైతే నా ఫోకస్ అంతా కెరీర్ మీదే ఉంది. పెళ్లి అనేది ఎంత పెద్ద బాధ్యతో నాకు తెలుసు. అయినా నాకిప్పుడేం తక్కువ. నేను ఒంటరిగా లేను. ఇంటి నిండా మనుషులే. డాడీ, మమ్మీ, అన్నయ్య ఫ్యామిలీస్ ఉన్నారు. నాకే లోటూ లేదు.
అరవింద్: ఆ లోటు తెలియాలంటే శిరీని విడిగా పంపించాలనుకుంటున్నా. విడిగా ఓ ఫ్లాట్‌లో ఉంచితే అప్పుడు అనిపిస్తుంది.. పెళ్లి చేసుకోవాలని.
శిరీష్: ఇది అన్యాయం డాడీ. నాకు పెళ్లి చేయడం కోసం విడిగా ఫ్లాట్‌లో ఉంచాలనుకుంటున్నారా (నవ్వులు).
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment