వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ‘ఎనిమిది పదులు దాటిన బామ్మ చేతుల్లో రూపుదిద్దుకునే పెళ్లి డ్రెస్ ఎంత అందంగా ఉంటుందో.. అది తనను ఎంతగా ముస్తాబు చేస్తుందో..’ అని అక్కడ కాబోయే ప్రతి వధువూ అంతే అందంగా కల కంటుంది. వారి కలలను నిజం చేస్తూ 58 ఏళ్లుగా అబోక్ రాధే అందమైన పెళ్లి డ్రెస్‌లను రూపొందిస్తూనే ఉంది.
ఆ డ్రెస్ డిజైన్ చూపు తిప్పుకోనివ్వదు. వెల్వెట్ లాంగ్ బ్లౌజ్, నడుము చుట్టూ కట్టిన సన్నని మస్లిన్ క్లాత్, మల్టీకలర్ సొగసుతో ఉండే స్కర్ట్స్, దండలు, నెమలీకలతో అలంకరించిన కిరీటం చూస్తున్నకొద్దీ చూడాలనిపిస్తాయి. ఇది మణిపూర్‌లోని సంప్రదాయ పెళ్లికూతురు ధరించే వెడ్డింగ్ డ్రెస్. ‘పొట్లోయి సెట్పి’ అని పిలిచే ఈ వెడ్డింగ్ డ్రెస్సులను ఓ 88 ఏళ్ల బామ్మ 58 ఏళ్లుగా సృష్టిస్తోంది. ఆమెను స్థానికులు అబోక్ రా«ధే అని ఆత్మీయంగా పిలుచుకుంటారు. ‘అబోక్’ అంటే మీటీ భాషలో ‘బామ్మ’ అని అర్ధం. ఈ వయసులోనూ అత్యంత శ్రద్ధగా అందమైన డిజైన్లను సృష్టిస్తూ, మహిళలకు శిక్షణ ఇస్తూ, వ్యాపారం చేస్తున్న ఈ బామ్మ నేటి తరానికి స్ఫూర్తి. మణిపూర్ సంప్రదాయ గ్రాండ్ పొట్లోయి కళను సజీవంగా ఉంచుతోంది.
సాయం కోసం వెళ్లి శిక్షణ
‘వధువు కోసం పొట్లోయిని డిజైన్ చేసిన ప్రతిసారీ టెన్షన్ పడుతుంటాను. పెళ్లికూతురు ఈ డ్రెస్‌ను ఇష్టపడుతుందా, ఆమెకు ఈ డ్రెస్ సంతోషాన్ని ఇస్తుందా.. అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. వేడుకలో వధువు నడుస్తుంటే ఆమె ధరించిన డ్రెస్సు గురించి గొప్పగా చెప్పుకోవడం, ఎవరు తయారు చేశారని వారు అడిగినప్పుడు, నా గురించి నాకు గర్వంగా అనిపిస్తుంది’ అని చెబుతుంది ఈ బామ్మ. ఇన్నేళ్ల వయసులోనూ వారం రోజుల్లో పెళ్లికూతురు డ్రెస్ డిజైన్ చేయగలదు రాధే. దీనికితోడు ప్రసిద్ధ మణిపురి పౌరాణిక ఖంబాతోయిబి నృత్యానికి కూడా దుస్తులను తయారుచేసి ఇస్తుంది. పెళ్లిళ్ల సీజన్ లేనప్పుడు బట్టలు, స్ట్రాలను ఉపయోగించి బొమ్మలను తయారు చేసి, స్థానిక షాపులకు అమ్ముతుంది.
‘నాకు 15 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. ఏడుగురు పిల్లలకు తల్లిని. మొదట్లో గృహిణిగానే ఉన్నాను. నా భర్త మణిశర్మ జ్యోతిష్యం చెప్పేవాడు, ఆలయ ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. పాతికేళ్ల వయస్సులో ఉన్నప్పుడు అనుకోకుండా ఓసారి మా పక్కింటి ఆమెకు పొట్లోయి తయారీలో సాయం చేశా. అప్పుడే పెళ్లి డ్రెస్సులను రూపొందించడంపై ఆసక్తి ఏర్పడి, అందులో వివిధ ప్రక్రియలను నేర్చుకున్నాను. ఆ సమయంలో ఏడేళ్ల నా కూతురు రాస్‌లీలా నాటకంలో పాల్గొంటోంది. తనది గోపిక వేషం. ఆమె కోసం మొదటిసారి ఒక డ్రెస్ డిజైన్ చేశాను. అలా 30 ఏళ్ళ వయసు నుంచి పొట్లోయిని తయారు చేస్తూనే ఉన్నాను’ అని అబోక్ రాధే తనకీ కళ వంటపట్టిన విధానాన్ని గుర్తు చేసుకుంటుంది.
తొమ్మిది పొరల వస్త్రంతో పొట్లోయి స్కర్ట్
పొట్లోయి చరిత్ర పరిశీలిస్తే దాని మూలాలు రాస్ లీలాలో ఉన్నాయి. 18వ శతాబ్దంలో శ్రీకృష్ణుడు గోపికల నృత్యంలో భాగంగా ధరించే డ్రెస్‌గా ఇది పరిచయం అయ్యింది. కాలక్రమేణ వివాహ వేడుకలలో పెళ్లి కూతురు డ్రెస్‌గా ఇది ప్రాచుర్యం పొందింది. ‘ఇప్పుడు లంగాకు గట్టి ఆకారం ఇవ్వడానికి డిజైనర్లు సన్నని రబ్బరు షీట్‌ను ఉపయోగిస్తున్నారు. గతంలో ఇది అందుబాటులో లేదు. స్కర్ట్ లోపలిభాగంలో తొమ్మిది పొరల వస్త్రాన్ని దళసరిగా వచ్చేలా కుడతాను. దీనికి చాలా సమయం పడుతుంది. అలాగే, స్కర్ట్ గట్టిగా ఉండటానికి, దానిని బియ్యం పిండిలో ముంచి ఎండలో ఆరబెట్టాలి. తగినంత ఎండ లేకపోతే డిజైన్ పాడైపోతుంది. పొట్లోయ్ ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ వంటి రంగులలో వస్తుంది. దీనికి రిబ్బన్లు, రాళ్ళు, అద్దాలతో అలంకరిస్తాను’ అంటూ వివరించింది అబోక్. మొదట్లో ప్రతి పొట్లాయి డ్రెస్‌కు 500 రూపాయలు తీసుకునేది. ఇప్పుడు డిజైన్‌ను బట్టి రూ.10,000–15,000 మధ్యలో ఉంటుంది. పెళ్లిళ్ళ సీజన్ లేకపోయినా ఆమె ఖాళీగా ఉండదు. పొట్లోయి దుస్తుల్లో అందమైన బొమ్మలను రకరకాల సైజుల్లో చేస్తుంది. వీటి ధర 200 నుంచి 1000 రూపాయల్లో ఉంటుంది.
శిక్షణకు విద్యార్థులు
అబోక్ రాధే పొట్లోయి పనికి ప్రసిద్ధి చెందడంతో ఎంతోమంది విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు ఈ కళను నేర్చుకోవడానికి ఆమె వద్దకు వస్తారు. శిక్షణ తీసుకున్న వారిలో చాలామంది తమకు తాముగా పొట్లోయి వ్యాపారాలను ప్రారంభించిన వారూ ఉన్నారు. ‘నా తదనంతరం కూడా ఈ పొట్లోయి కళ జీవించే ఉండాలి. నేను అందించిన నైపుణ్యాలు నా విద్యార్థులకు పొట్లోయి అందమైన నమూనాలను రూపొందించడానికి సహాయపడాలి‘ అంటోంది అబోక్ రాధే. అబోక్ ఖాళీ సమయంలో సామాజిక పనుల్లోనూ భాగం పంచుకుంటుంది. మాదకద్రవ్యాల వంటి వ్యసనాలను అరికట్టడం, మహిళల ఉపాధి అంశాలపై పనిచేసే రెండు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంది అబోక్. ‘ఒక మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే ఏ పరిస్థితిలోనైనా ఎవ్వరి మీదా ఆధారపడకుండా తనను తన కుటుంబాన్ని చూసుకోగలదు. ఇదే నా జీవితం నాకు నేర్పిన పాఠం’ అని చెబుతున్న ఈ బామ్మను చూసి యువత స్ఫూర్తి పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment