ఈ మహిళల చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలు ఒక్కోటి ఒక్కో కథ చెబుతుంటాయి. బొమ్మల శరీరాలు కాటన్ కాన్వాస్‌తో విభిన్న రంగులతో సాంస్కృతిక వైవిధ్యంతో ఆకట్టుకుంటాయి. మూస దోరణులకు భిన్నంగా స్త్రీల చేతుల్లో తల్లీ–బిడ్డలు, భార్యాభర్తలు, పిల్లల బొమ్మలు రూపుదిద్దుకుంటాయి. న్యూఢిల్లీలోని అఫ్ఘాన్ శరణార్థ మహిళలకు హస్తకళల్లో నైపుణ్యాలకు శిక్షణ ఇస్తూ ఫ్యాబ్రిక్ వ్యర్థాలతో అందమైన బొమ్మలు, గృహాలంకరణ వస్తువులను రూపొందిస్తుంది ఐరిస్ స్ట్రిల్. శరణార్థులకు స్థిరమైన ఆదాయవనరుగా మారడమే కాదు పర్యావరణ హితంగానూ తనదైన ముద్ర వేస్తోంది.
భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచ్ డిజైనర్ ఐరిస్ స్ట్రిల్. టెక్స్‌టైల్, క్రాఫ్ట్ పరిశ్రమలో విస్తృతమైన అనుభవం ఉన్న సీనియర్ క్రియేటివ్ డిజైనర్. ఆమె భర్త బిశ్వదీప్ మోయిత్రా ఢిల్లీవాసి. కళాకారుల ప్రతిభను పెంపొందించడం, మహిళా సంఘాలనుప్రోత్సహించడం, ట్రెండ్‌ను అంచనా వేయడం, అట్టడుగు హస్తకళాకారుల కోసం వారి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను అమలు చేయడంలో ఐరిస్ విస్తృత స్థాయిలో పని చేస్తుంది. దేశంలోని హస్తకళాకారులతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. అందమైన ఇండియన్ ఫ్యాబ్రిక్ వ్యర్థాలు, వస్త్రాల తయారీలో మిగిలి పోయిన వస్త్రాల గుట్టలను చూస్తూ ఉండేది.
పర్యావరణ అనుకూలమైన ఆలోచన..
‘‘ఈ వ్యర్థాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్నాళ్లు పాటు ఆలోచించాను. అదే సమయంలో అఫ్ఘాన్ మహిళా శరణార్థులను శక్తిమంతం చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాను. ఇక్కడ డిజైన్ పని చేస్తున్న సమయంలో తరచూ భారతీయ గ్రామీణ మహిళలకు వారి సంప్రదాయ నైపుణ్యాలను ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో శిక్షణ ఇచ్చే ప్రాజెక్ట్‌లను చేయడం మొదలుపెట్టాను.
ఆ విధంగా అనేకమంది హస్తకళాకారులతో నాకు పరిచయం ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (యుఎన్‌హెచ్‌సిఆర్) జీవనోపాధి కార్యక్రమాలలో భాగమైన ఆప్ఘన్ శరణార్థ మహిళలతో కలిసి అనేక శిక్షణా కార్యక్రమాలలో పాల్గొన్నాను. అలా నాలో శరణార్థులతో కలిసి పనిచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన నుంచే ‘సిలైవాలి’ సంస్థ పుట్టింది.
పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన, వ్యర్థ పదార్థాలను ఉపయోగించి చేతి వృత్తుల ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా జీవనోపాధిని పొందడంలో అట్టడుగున ఉన్న కళాకారులకు సహాయపడే ఒక సామాజిక సంస్థను నెలకొల్పాను. బొమ్మలు శరణార్థ మహిళల ప్రత్యేకతగా మారినప్పటికీ, ఇతర గృహోపకరణాలు కూడా వారు తయారుచేస్తారు.
స్థిరమైన ఆదాయం..
మా ఉత్పత్తులు పూర్తిగా పర్యావరణ అనుకూలమైనవి. వీటికి సరైన ధరలను నిర్ణయించి, వాటి ద్వారా కళాకారుల సంఘాలను ఏర్పాటు చేయడానికి సహాయపడేందుకు ఒక స్థిరమైన ఆదాయానికి కల్పిస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడాలనే ఉద్దేశంతోనూ, వారి స్వదేశంలో అస్థిరత కారణంగా పారిపోతున్న అఫ్ఘాన్ శరణార్థులకు న్యూఢిల్లీ ఒక ఇల్లుగా చెప్పవచ్చు.
సిలైవాలి సంస్థ ద్వారా 70 మంది మహిళా శరణార్థులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. శరణార్థుల ఇళ్లకు కూతవేటు దూరంలో పరిశుభ్రమైన పని వాతావరణం, పిల్లలను కూడా పనిలోకి అనుమతించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. ఈ సంస్థ ద్వారా తయారైన బొమ్మలు, ఇతర అలంకార వస్తువులు ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా కాన్సెప్ట్ స్టోర్‌లలో అమ్మకానికి ఉన్నాయి. దేశరాజధానిలో సొంత స్టోర్‌తో పాటు వెబ్‌సైట్ ద్వారా కూడా అమ్మకాలను జరుపుతున్నాం.
కళాత్మక వస్తువులను క్లాత్‌తో రూపొందించడం వల్ల ఫ్యాషన్ దృష్టిని ఆకర్షిస్తున్నాం. వేస్ట్ ఫ్యాబ్రిక్‌ను అందమైన స్మారక చిహ్నాలు, గృహాలంకరణలో హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువుల తయారీకి మూడు గంటల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. దీనితో కళాకారుల నుంచి మహిళలు కుట్టుపని, ఎంబ్రాయిడరీ వంటివి నేర్చుకుంటున్నారు.
సోషల్ మీడియా ద్వారా మా ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకెళుతున్నాం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం గ్యారెంటీడ్ ఫెయిర్ ట్రేడ్ ఎంటర్‌ప్రైజ్‌గా వరల్డ్ ఫెయిర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ ను కూడా పొందింది. మా సంస్థ ద్వారా గుడ్డ బొమ్మలు, బ్యాగులు, ఆభరణాలు తయారు చేస్తాం’’ అని వివరిస్తారు ఈ క్రియేటర్.
ఇవి చదవండి: పక్షులను స్వేచ్ఛగా ఎగరనిద్దాం..
Comments
Please login to add a commentAdd a comment