దూకుడుగా వ్యవహరించడం కాదు చురుగ్గా ఆలోచించడం రావాలి.. కేడర్ ఒక్కటే కాదు తగిన సమయస్ఫూర్తీ కావాలి. ఆజ్ఞలివ్వడం సరిపోదు.. అందరినీ కలుపుకొని వెళ్లి పనిచేయించుకునే సామర్థ్యమూ డాలి..
ఈ మూడు లక్షణాలతో మరో మూడు సూత్రాలను అమలు చేసి రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో కరోనా వైరస్‌కు చెక్ పెట్టారు డైనమిక్ కలెక్టర్ రాజేంద్ర భట్..
కరోనాను కట్టడి చేయడంలో దేశమంతా కేరళ ప్రణాళికలవైపు చూస్తూంటే చడీచప్పుడు లేకుండా ఆ వైరస్ వ్యాప్తిని నిలువరించారు. కరోనా కొత్త కేసు ఒక్కటి కూడా లేకుండా చేశారు.. సాక్షాత్తూ ప్రధానమంత్రి దృష్టినీ బిల్వారా వైపు తిప్పారు ఆ జిల్లా కలెక్టర్, 56 ఏళ్ల రాజేంద్ర భట్. విజయ రహస్యం ఏమిటని అడిగితే ‘అదేం భగీరథ ప్రయత్నం కాదు.. సింపుల్ త్రీ స్టెప్స్ ప్లాన్ అంతే’ అంటారు వినమ్రంగా.
ఈ మూడు సూత్రాలు..
బిల్వారా.. వస్త్రపరిశ్రమకు పెట్టింది పేరు. కాబట్టి సహజంగానే వలసకార్మికులకు ఆవాసంగా మారింది. కరోనాకూ హాట్‌స్పాట్ అయింది మొత్తం 27 పాజిటివ్ కేసులతో. బిల్వారా వాసులకు తెలిసి.. భయంకంపితులు కాకముందే తక్షణ కార్యాచరణ మొదలుపెట్టాడు రాజేంద్ర భట్. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఐసోలేషన్‌లో ఉంచడం, ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్‌ను అమలు చేయడం.. ముఖ్యమైన ఈ మూడు అంశాలే ఆయన కార్యాచరణ. ఆయనకు మాత్రమే తెలిసిన సీక్రెట్స్ కావు.. కరోనా నివారణలో జగమెరిగిన ఉపాయాలే.
ఎలా మొదలుపెట్టారు?
కరోనా కర్ఫ్యూను ప్రకటించే ముందు తన సిబ్బందిని డెయిరీ ఫామ్స్‌కు పంపించాడు రాజేంద్ర భట్.. ప్రతి ఇల్లు రోజుకు ఎన్ని పాలను కొంటారో లెక్క తీయమని. అలాగే నిత్యావసరాల నిల్వలు, సరఫరా ఎంతో కూడా బేరీజు వేసుకున్నాడు. రోజుల తరబడి ఇంట్లో ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు జిల్లా సరిహద్దులు మూసివేయడానికి అనుమతి ఇవ్వాలని. వెంటనే ఓకే చేసింది ప్రభుత్వం. అంతేకాదు బిల్వారాలోని ఆసుపత్రులు, హోటళ్లు మొదలైన అన్నిటిమీదా పూర్తి అధికారాలు ఇచ్చేసింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వెంటనే ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయించారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా జిల్లా మొత్తం పొలిమేరలు మూసి వేయించారు. వైద్య సిబ్బందిని 24 గంటలు అలర్ట్‌లో ఉంచాడు.
ఇంకోవైపు కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగించారు. వీటన్నిటి నేపథ్యంలో ‘కరోనా తీవ్రత జిల్లా ప్రజలకు అర్థమయ్యేలోపే ఆ వ్యాప్తిని 27 కేసులకే పరిమితం చేశారు. గడిచిన పది రోజులుగా రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో ఒక్కటంటే ఒక్క కొత్త పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ‘గ్రేట్ ఎఫర్ట్.. ’ అంటూ రాజేంద్ర భట్‌ను ప్రశంసించబోయేంతలోనే ‘ఇది నా ఘనత కాదు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, మా సిబ్బంది కలిసి చేసిన ప్రయత్నం. టీమ్ వర్క్’ అని తన విజయంలో అందరినీ భాగస్వామ్యం చేస్తారు. ‘అయినా.. ఒక్క కొత్త కేసు రాలేదని ఇప్పుడే ప్రకటించుకోవడం ఎందుకు? మే వరకూ వేచి చూద్దాం.. అప్పటికీ ఒక్కటి కూడా నమోదు కాకపోతే.. నిజంగానే ఈ ప్రయత్నంలో మేము సఫలీకృతమైనట్టే’ అంటారు బిల్వారా కలెక్టర్ రాజేంద్ర భట్.
స్టేట్ సర్వీస్ నుంచి సివిల్ సర్వీస్‌కు..
రాజేంద్ర భట్ .. రాజస్థాన్ స్టేట్ సర్వీస్ నుంచి 2007లో ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందాడు. ‘స్టేట్ సర్వీస్ ఉద్యోగ అనుభవం ఈ కరోనా క్లిష్ట సమయంలో ఆయన చురుగ్గా ఆలోచించి, సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో ఉపయోగపడింది. డైరెక్ట్ ఐఏఎస్ యంగ్ కలెక్టర్ల కన్నా ఆయన ఎంతో సమర్థవంతుడు’ అని ఆయన టీమ్‌లోని యువ ఐఏఎస్ ఆఫీసర్లు రాజేంద్రభట్‌ను కొనియాడుతున్నారు. కరోనా విషయంలోనే కాదు.. బిల్వారా జిల్లా కలెక్టర్‌గా రాజేంద్ర భట్ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి జిల్లా సర్వతోముఖాభివృద్ధికోసం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలతో ఆయన నిర్వహిస్తున్న స్నేహపూర్వక సంబంధాలు, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం.. దేశంలోని కలెక్టర్లు, యువ ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఆదర్శం, ఆయన పాలన నైపుణ్యత అందరూ తెలుసుకొని అమలు చేయవలసిన పాఠం.. అంటున్నారు రాజస్థాన్‌లోని ఐఏస్ అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment