Bhilwara district
-
ఘోర రోడ్డు ప్రమాదం; ఏడుగురి మృతి
జైపూర్ : రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కేసార్‌పుర వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా నుంచి వేగంగా వస్తున్న ట్రాలర్ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. కాగా మృతి చెందినవారిలో ఉమేశ్(40), ముఖేశ్(23), జయమ్నా(45), అమర్ చంద్(32), రాజు(21),రాధేశ్యామ్(56) ,శివాల్(40) ఉన్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బిజౌలియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యానులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి : అస్సాంలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి) -
చెట్టెక్కడంతో ప్రాణాలు విడిచిన చిరుత!
జైపూర్: నీటి జాడ కోసం వెతుకున్న క్రమంలో ప్రమాదం పడిన ఓ చిరుత ప్రాణాలు విడిచింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కరేడా ప్రాంతంలోని రాంపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నీటి జాడను వెతుక్కుంటూ చిరుత రాంపూర్ గ్రామానికి చేరుకుంది. ఆక్రమంలోనే అది చెట్టుపైకి ఎక్కింది. అయితే, సమీపంలోని గ్రానైట్ గనికి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందిందని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ దేవేంద్ర ప్రతాప్‌సింగ్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, పోస్టుమార్టం నివేదికలో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు. కాగా, వేసవిలో ఆహారం కోసం అన్వేషిస్తూ భిల్వారా ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. తాజాగా మృతి చెందిన చిరుత కూడా కొన్ని రోజులుగా స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. (చదవండి: చంటి బిడ్డలా మొసలిని మోస్తున్నాడు) -
వాహ్.. కలెక్టర్ సాబ్
దూకుడుగా వ్యవహరించడం కాదు చురుగ్గా ఆలోచించడం రావాలి.. కేడర్ ఒక్కటే కాదు తగిన సమయస్ఫూర్తీ కావాలి. ఆజ్ఞలివ్వడం సరిపోదు.. అందరినీ కలుపుకొని వెళ్లి పనిచేయించుకునే సామర్థ్యమూ డాలి.. ఈ మూడు లక్షణాలతో మరో మూడు సూత్రాలను అమలు చేసి రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో కరోనా వైరస్‌కు చెక్ పెట్టారు డైనమిక్ కలెక్టర్ రాజేంద్ర భట్.. కరోనాను కట్టడి చేయడంలో దేశమంతా కేరళ ప్రణాళికలవైపు చూస్తూంటే చడీచప్పుడు లేకుండా ఆ వైరస్ వ్యాప్తిని నిలువరించారు. కరోనా కొత్త కేసు ఒక్కటి కూడా లేకుండా చేశారు.. సాక్షాత్తూ ప్రధానమంత్రి దృష్టినీ బిల్వారా వైపు తిప్పారు ఆ జిల్లా కలెక్టర్, 56 ఏళ్ల రాజేంద్ర భట్. విజయ రహస్యం ఏమిటని అడిగితే ‘అదేం భగీరథ ప్రయత్నం కాదు.. సింపుల్ త్రీ స్టెప్స్ ప్లాన్ అంతే’ అంటారు వినమ్రంగా. ఈ మూడు సూత్రాలు.. బిల్వారా.. వస్త్రపరిశ్రమకు పెట్టింది పేరు. కాబట్టి సహజంగానే వలసకార్మికులకు ఆవాసంగా మారింది. కరోనాకూ హాట్‌స్పాట్ అయింది మొత్తం 27 పాజిటివ్ కేసులతో. బిల్వారా వాసులకు తెలిసి.. భయంకంపితులు కాకముందే తక్షణ కార్యాచరణ మొదలుపెట్టాడు రాజేంద్ర భట్. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఐసోలేషన్‌లో ఉంచడం, ఇంటింటికీ తిరిగి పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్‌ను అమలు చేయడం.. ముఖ్యమైన ఈ మూడు అంశాలే ఆయన కార్యాచరణ. ఆయనకు మాత్రమే తెలిసిన సీక్రెట్స్ కావు.. కరోనా నివారణలో జగమెరిగిన ఉపాయాలే. ఎలా మొదలుపెట్టారు? కరోనా కర్ఫ్యూను ప్రకటించే ముందు తన సిబ్బందిని డెయిరీ ఫామ్స్‌కు పంపించాడు రాజేంద్ర భట్.. ప్రతి ఇల్లు రోజుకు ఎన్ని పాలను కొంటారో లెక్క తీయమని. అలాగే నిత్యావసరాల నిల్వలు, సరఫరా ఎంతో కూడా బేరీజు వేసుకున్నాడు. రోజుల తరబడి ఇంట్లో ఉన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రప్రభుత్వాన్ని కోరాడు జిల్లా సరిహద్దులు మూసివేయడానికి అనుమతి ఇవ్వాలని. వెంటనే ఓకే చేసింది ప్రభుత్వం. అంతేకాదు బిల్వారాలోని ఆసుపత్రులు, హోటళ్లు మొదలైన అన్నిటిమీదా పూర్తి అధికారాలు ఇచ్చేసింది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వెంటనే ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయించారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా జిల్లా మొత్తం పొలిమేరలు మూసి వేయించారు. వైద్య సిబ్బందిని 24 గంటలు అలర్ట్‌లో ఉంచాడు. ఇంకోవైపు కరోనా గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు కొనసాగించారు. వీటన్నిటి నేపథ్యంలో ‘కరోనా తీవ్రత జిల్లా ప్రజలకు అర్థమయ్యేలోపే ఆ వ్యాప్తిని 27 కేసులకే పరిమితం చేశారు. గడిచిన పది రోజులుగా రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాలో ఒక్కటంటే ఒక్క కొత్త పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ‘గ్రేట్ ఎఫర్ట్.. ’ అంటూ రాజేంద్ర భట్‌ను ప్రశంసించబోయేంతలోనే ‘ఇది నా ఘనత కాదు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, మా సిబ్బంది కలిసి చేసిన ప్రయత్నం. టీమ్ వర్క్’ అని తన విజయంలో అందరినీ భాగస్వామ్యం చేస్తారు. ‘అయినా.. ఒక్క కొత్త కేసు రాలేదని ఇప్పుడే ప్రకటించుకోవడం ఎందుకు? మే వరకూ వేచి చూద్దాం.. అప్పటికీ ఒక్కటి కూడా నమోదు కాకపోతే.. నిజంగానే ఈ ప్రయత్నంలో మేము సఫలీకృతమైనట్టే’ అంటారు బిల్వారా కలెక్టర్ రాజేంద్ర భట్. స్టేట్ సర్వీస్ నుంచి సివిల్ సర్వీస్‌కు.. రాజేంద్ర భట్ .. రాజస్థాన్ స్టేట్ సర్వీస్ నుంచి 2007లో ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందాడు. ‘స్టేట్ సర్వీస్ ఉద్యోగ అనుభవం ఈ కరోనా క్లిష్ట సమయంలో ఆయన చురుగ్గా ఆలోచించి, సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో ఉపయోగపడింది. డైరెక్ట్ ఐఏఎస్ యంగ్ కలెక్టర్ల కన్నా ఆయన ఎంతో సమర్థవంతుడు’ అని ఆయన టీమ్‌లోని యువ ఐఏఎస్ ఆఫీసర్లు రాజేంద్రభట్ను కొనియాడుతున్నారు. కరోనా విషయంలోనే కాదు.. బిల్వారా జిల్లా కలెక్టర్‌గా రాజేంద్ర భట్ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి జిల్లా సర్వతోముఖాభివృద్ధికోసం జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలతో ఆయన నిర్వహిస్తున్న స్నేహపూర్వక సంబంధాలు, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం.. దేశంలోని కలెక్టర్లు, యువ ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఆదర్శం, ఆయన పాలన నైపుణ్యత అందరూ తెలుసుకొని అమలు చేయవలసిన పాఠం.. అంటున్నారు రాజస్థాన్‌లోని ఐఏస్ అధికారులు. -
స్నానం చేస్తుండగా చూశాడని..
జైపూర్: స్నానం చేస్తుండా ఆకతాయి బాత్ రూమ్ లోకి తొంగిచూసిన ఘటనలో అవమానాన్ని భరించలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన రాజస్థాన్ లో సంచలనం రేపింది. భిల్వారా జిల్లా ఎస్పీ ప్రదీప్ మోహన్ శర్మ కథనం ప్రకారం.. దేలాన్ గ్రామానికి చెందిన యువతి(20) బుధవారం సాయంత్రం స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు(18) బాత్ రూమ్ లోకి తొంగిచూసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన యువతి కేకలు వేయడంతో కుటుంబసభ్యులు పరుగునవచ్చి ఆకతాయిని పట్టుకుని చితగొట్టి కట్టేశారు. కొద్ది సేపటికి యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి యువతి బంధువులతో గొడవకు దిగారు. కట్లు ఊడదీసి యువకుణ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాలకు మధ్య తోపులాట జరిగింది. తన కారణంగానే ఇంత ఘర్షణ జరిగిందనే అవమానంతో బాధిత యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇదే అదనుగా ఆ ఆకతాయి అక్కణ్నుంచి పారిపోయాడు. 70 శాతం కాలిన గాయలతో ప్రస్తుతం యువతి ఉదయ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి వాగ్మూలం మేరకు యువకుడితోపాటు అతని కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదుచేసినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, ఆ యువతీయువకులు ప్రేమికులని, వాళ్లిద్దరూ బాత్ రూమ్ లో కలిసి ఉండటాన్ని యువతి మావయ్య చూశాడని, అమ్మాయి తప్పును కప్పి పుచ్చేందుకే బాత్ రూమ్ లోకి తొంగిచూసినట్లు చెబుతున్నరని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం యువకుడు పరారీలో ఉన్నాడని, యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసిన అతని బంధువులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.