
నీటి జాడను వెతుక్కుంటూ చిరుత రాంపూర్ గ్రామానికి చేరుకుంది. ఆక్రమంలోనే అది చెట్టుపైకి ఎక్కింది. అయితే,
జైపూర్: నీటి జాడ కోసం వెతుకున్న క్రమంలో ప్రమాదం పడిన ఓ చిరుత ప్రాణాలు విడిచింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కరేడా ప్రాంతంలోని రాంపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నీటి జాడను వెతుక్కుంటూ చిరుత రాంపూర్ గ్రామానికి చేరుకుంది. ఆక్రమంలోనే అది చెట్టుపైకి ఎక్కింది. అయితే, సమీపంలోని గ్రానైట్ గనికి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందిందని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ దేవేంద్ర ప్రతాప్‌సింగ్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, పోస్టుమార్టం నివేదికలో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు. కాగా, వేసవిలో ఆహారం కోసం అన్వేషిస్తూ భిల్వారా ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. తాజాగా మృతి చెందిన చిరుత కూడా కొన్ని రోజులుగా స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
(చదవండి: చంటి బిడ్డలా మొసలిని మోస్తున్నాడు)