పాదాలే చేతులయ్యాయి | Special Story About Jilumol Thomas | Sakshi
Sakshi News home page

పాదాలే చేతులయ్యాయి

Published Sat, Jun 6 2020 2:11 AM | Last Updated on Sat, Jun 6 2020 2:11 AM

Special Story About Jilumol Thomas - Sakshi

చేతులు లేనప్పటికీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన  మొట్టమొదటి మహిళగా జిలుమోల్‌ థామస్‌ వార్తల్లోకి ఎక్కింది. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి వాసి అయిన జిలుమోల్‌కు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. ఈ శారీరక వైకల్యం ఆమెను మరింత దృఢం చేసింది. కారు నడపడం చిన్ననాటి నుంచీ ఆమెతోపాటు ఎదుగుతున్న కల. ఆ కలే ఆమెను వీధుల్లో రయ్‌.. మంటూ దూసుకెళ్లేలా చేసింది. రెండు చేతులు లేకపోయినా ఆసియాలో కార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన మొదటి మహిళగా వార్తల్లో నిలిచింది జిలుమోల్‌.

తను ఉంటున్న కరీమనూర్‌ వీధుల్లో నడుస్తున్నప్పుడు కారు నడపడాన్ని ఊహించింది జిలుమోల్‌. ఏడాది వ్యవధిలో ఆ కలను నిజం చేసుకుంటూ వీధుల్లో కారు నడపడం సాధించింది. ‘మనం చేయలేని పనుల గురించి విలపిస్తూ కూర్చుంటే ఎప్పటికీ అవి పూర్తికాని పనుల్లాగే ఉండిపోతాయి. భయాన్ని అధిగమిస్తే విజయాన్ని సాధించవచ్చు’ అంటోంది జిలుమోల్‌. 2014లో జిలుమోల్‌ తోడుపుళ ప్రాంతీయ రవాణా అధికారిని సంప్రదించి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షకు అనుమతించమని కోరింది. ‘దేశంలో ఎక్కడైనా ఇలా చేతులు లేనివారు లైసెన్స్‌ పొందిన వ్యక్తి ఉంటే ఆ లైసెన్స్‌ కాపీ తీసుకురా అప్పుడు ఆలోచిస్తా’ అన్నాడు ఆ అధికారి ఇది సాధ్యమయ్యే పనికాదంటూ. 

జిలుమోల్‌ ఇంటర్‌నెట్‌లో శోధించింది తనలాంటి వారు లైసెన్స్‌ పొందినవారు ఎవరైనా ఉన్నారా అని. అప్పుడే తెలిసింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వాసి విక్రమ్‌ అగ్నిహోత్రి గురించి. రెండు చేతులు లేకపోయినా విక్రమ్‌ కాళ్లతోనే కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడని. చేతులు లేకపోయినా దేశంలో మొట్టమొదటి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన వ్యక్తి విక్రమ్‌ అగ్నిహోత్రి అని. దీంతో తనకూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ వచ్చే అవకాశం ఉండటంతో జిలుమోల్‌లో ఆశలు చిగురించాయి.

పాదాలతో డ్రైవింగ్‌
కూతురుకోసం 2018లో మారుతి సెలెరియో ఆటోమేటిక్‌ కారును కొనుగోలు చేశాడు జిలుమోల్‌ తండ్రి థామస్‌. అదే సంవత్సరం ఆమెకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా వచ్చింది. థామస్‌కు ముందు అతని కుటుంబంలో ఎవరికీ కారు నడపడం తెలియదు. కానీ, రోడ్డు మీద  కాళ్లతో కారు నడుపుతున్న జిలుమోల్‌ ధైర్యానికి నమస్కరించాలని సోషల్‌ మీడియాలో ఆమె ఫొటోలు చూసిన ప్రతిఒక్కరూ అభినందించారు. ఆమె తన పాదాలతో డ్రైవింగ్‌ చేస్తున్న అనేక ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఇటీవల వైరల్‌ అయిన వీడియోను ఆనంద్‌ మహీంద్రా చూసి, తన ట్విట్టర్‌ ఖాతాలో జిలుమోల్‌ ధైర్యాన్ని ప్రశంసించారు.

గ్రాఫిక్‌ డిజైనర్‌
శారీరకంగా వికలాంగురాలినని తాను ఎప్పుడూ అనుకోలేదనీ, చిన్నప్పటినుంచి చదువులో ప్రథమస్థానంలో ఉండేదాన్ననీ, కాలి వేళ్ల సాయంతోనే పెయింటింగ్‌ చేయడం ప్రాక్టీస్‌ చేసి, ఇప్పుడు తన వృత్తిగా గ్రాఫిక్‌ డిజైనింగ్‌ను ఎంచుకున్నానని జిలుమోల్‌ చెబుతుంది. 

a‘నా కూతురు కోసం కారు కొనడానికి మా ఇంట్లోవాళ్లను ఎంతగా ఒప్పించానో ఆ రోజు నాకు బాగా గుర్తుంది’ అని చెబుతాడు ఆమె తండ్రి థామస్‌. ఆయన రైతు. తల్లి అన్నకుటి  గృహిణి. వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన స్టేట్‌ మౌత్‌ అండ్‌ ఫుట్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక సభ్యురాలిగానూ విధులను నిర్వర్తిస్తుంది జిలుమోల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement