అంతా చేత వెన్నముద్ద కృష్ణులే.. వెన్న తీసే కృష్ణులెవరు మన ఇళ్లలో! అమ్మ చేసి పెట్టాలి. అక్క గిన్నెలు కడగాలి. చెల్లి ఇల్లు తుడవాలి. ‘కొంచెం ఒళ్లొంచరా.. కృష్ణా..’ ‘నేనా మమ్మీ! అది ఆడవాళ్ల పని కదా!’ ఈ స్టీరియో మారదా?! మారాలంటే అద్దాలు మార్చాలి.
కళ్లజోడు మార్చకుంటే సైట్ అలాగే ఉంటుంది. క్రమంగా ఎక్కువౌతుంది కూడా. మగాళ్ల దగ్గర ఎన్ని కళ్లజోళ్లు ఉన్నా.. ఆడవాళ్లను చూడ్డానికి ప్రత్యేకంగా ఒక కళ్లజోడు ఉంటుంది. అమ్మ కట్టుకున్న పట్టుచీర వారసత్వంగా ఆడపిల్లలకు వచ్చినట్లు.. నాన్న నుంచి పరంపరగా మగపిల్లలకు వచ్చే కళ్లజోడు అది. అందులోంచి చూస్తే.. స్త్రీ వంట చేస్తూ కనిపించాలి. లేదా పిల్లల్ని సిద్ధం చేస్తూ కనిపించాలి. లేదా భర్తకు, అత్తమామలకు సేవ చేస్తూ కనిపించాలి.
అలా కాకుండా ఆమె ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తూ కనిపించిందా.. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కనిపించిందా.. వేళ్లతో పియానో వాయిస్తూ కనిపించిందా.. కుషన్ చెయిర్‌లో కూర్చొని కాళ్లు రెండూ హ్యాండ్ రెస్ట్ మీదకు ఎత్తిపెట్టి ఊపుతూ కనిపించిందా.. కళ్లజోడుకు అపచారం జరిగినట్లే. కళ్లజోడుకు జరిగిందంటే నాన్నకు, నాన్నకు జరిగిందంటే వాళ్ల నాన్నకు.. వాళ్ల నాన్నకు జరిగిందంటే మొత్తం పురుష లోకానికే అపచారం జరిగినట్లే. స్త్రీ అంటే చిన్నపిల్లవాడి మైండ్‌లో కూడా ఒక చిత్రం ఉంటుంది. ఆ చిత్రంలో ఉన్నట్లుండాలి స్త్రీ. అప్పుడే ఆమె స్త్రీ. అప్పుడే ఆమె అమ్మ. అప్పుడే ఆమె సహోదరి. అప్పుడే ఆమె భార్య!!
తమిళ్ సినిమా ‘మాస్టర్’ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది. అదొక్కటే కాదు, హాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో, మిగతా వుడ్‌లలో రిలీజ్ కావలసిన సినిమాలన్నీ లాక్‌డౌన్‌లో ఉన్నాయి. అన్ని భాషల్లోనూ హీరోల ఫ్యాన్స్ చేతులు కట్టేసినట్లయింది. కటౌట్‌లు లేవు. ఔట్‌లు లేవు. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు లేవు. ‘మాస్టర్’లో విజయ్ హీరో. మాళవికా మోహనన్ హీరోయిన్. హీరోయినే.. కానీ ప్రతి ట్రైలర్‌లోనూ విజయ్ ఒక్కడే కనిపించాడు ఇంతవరకు. కనుక ఇది హీరో ఓరియెంటెడ్ అనుకోవాలి. ఆమె కూడా తన పార్ట్ ఏదో అది చేసేసి వెళ్లిపోయారు. కేరళ తనది. ముంబైలో పెరిగింది. ఉండటం అక్కడే. ‘పొట్టం పోలే’ ఆమె తొలి సినిమా. మలయాళం. పొట్టం పోలే అంటే ‘గాలి పటంలా..’ అని అర్థం. ‘పేట్ట’ ఇటీవలి తమిళ సినిమా. పేట్ట తర్వాత చేసిందే.. ఇప్పుడీ ‘మాస్టర్’.
మాళవికకు సినిమాల్లోనే చేయాలన్న పట్టింపేంలేదు. కొన్నింట్లో మాత్రం పట్టింపు ఉంది. ‘స్త్రీ ఇలా ఉండాలి’ అని ఎవరైనా కళ్లజోడు పెట్టుకుని చెబితే మాత్రం ‘‘దయచేసి ఆ కళ్లజోడు తీసి మాట్లాడతారా?’’ అనేస్తారు మాళవిక. అలా అన్నందుకే గత నాలుగు రోజులుగా హీరో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఈ సభ్యసమాజం నుంచే వెలివేసినంతగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఖిన్నురాలయ్యారు. నేను అన్నదేమిటి? వీళ్లు అంటున్నదేమిటి?
ఏప్రిల్ 26. ‘యాక్టర్ విజయ్ ఫ్యాన్స్’ ట్విట్టర్ అకౌంట్‌లో ఒక ఇలస్ట్రేషన్‌ని చూశారు మాళవిక. ‘మాస్టర్ టీమ్ ఆన్ క్వారంటైన్’ అనే క్యాప్షన్‌తో ఉన్న కార్టూన్‌లాంటి ఇలస్ట్రేషన్ అది. అందులో హీరో విజయ్ ఉన్నాడు. డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ఉన్నాడు. ఇంకో యాక్టర్ విజయ్ సేతుపతి ఉన్నాడు. డిజైనర్ గోపి ప్రసన్న ఉన్నాడు. మరో ముగ్గురు టెక్నీషియన్‌లు ఉన్నారు. ఓ వైపు తనూ ఉంది. వాళ్లంతా గేమ్స్‌తో, ల్యాప్‌టాప్స్‌తో, మ్యూజిక్‌తో, స్మార్ట్‌ఫోన్‌లలోని మూవీలతో ఎంటర్‌టైన్ అవుతూ ఉంటే తను మాత్రం ఓ పక్కన వంట చేస్తూ ఉంది! నచ్చలేదు మాళవికకు. తనను వంట చేస్తున్నట్లుగా చూపించడం నచ్చకపోవడం కాదు. వంట చేయడానికే ఆడవాళ్లు పుట్టినట్లు చూపించడం ఏంటని. ‘‘కల్పిత పాత్రల్లో కూడా స్త్రీలు వంటకే పరిమితమా! ఆడవాళ్ల పనులు, మగవాళ్ల పనులు అన్న భేదం ఎప్పటికి పోతుంది?’’ అని ఆ ఇలస్ట్రేషన్‌కి కామెంట్ పెట్టారు మాళవిక. ఇక తిట్ల వరద. జీర్ణించుకోలేనిదంతా ట్విట్టర్‌లోంచి ఆమె పైన వచ్చిపడింది. అది ఇంకా బాధించింది మాళవికను. చివరికి ఆమె తన పోస్ట్‌ను డిలీట్ చేయవలసి వచ్చింది.
చాలాకొద్దిమంది మాళవికను సమర్థించారు. ఆమె అభిమానులలో ఒకరు వంట చేస్తున్న మాళవికను పుస్తకం చదువుతున్న మాళవికగా మార్చి ట్వీట్ చేశారు. థ్యాంక్స్ చెప్పారు మాళవిక.. ‘నాకు బుక్స్ చదవడం ఇష్టమని మీకెలా తెలుసు’ అని ఆశ్చర్యపోతూ. ఇక.. విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్‌ని మనసుకు తీసుకోవద్దని కొందరు ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో మాళవికను గట్టిగా సమర్థించిన వారు మాత్రం ఒకే ఒక్కరు.. గాయని శ్రీపాద చిన్మయి. ఈ ఎపిసోడ్‌పై హీరో విజయ్ ఇంతవరకు బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. మాళవిక పైకి ఎత్తిన ట్వీట్‌ల కత్తులను అతడి ఫ్యాన్స్ దించేస్తే మాత్రం దాని వెనుక ఉన్న కారణం బహుశా అతడైతే కావచ్చు. ∙
ఒక ప్రొఫెషనల్ నటి తనది కాని పాత్రను తనకు ఆపాదించడం ఏమిటి అని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే వేధిస్తారా! దూషిస్తారా! ద్వేషిస్తారా! ఆమె అన్నది కరెక్టే. కళ్లజోడు తీసి చూడనంత వరకు స్త్రీని మరోలా మీరు చూడలేరు. – చిన్మయి
Comments
Please login to add a commentAdd a comment