మాయా మూర్, బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్
టీనేజ్‌లో అతడికి శిక్ష పడింది. యాభై ఏళ్ల జైలు శిక్ష! నల్లవాడికి పడిన శిక్ష. ఇరవై మూడేళ్లు గడిచాయి. మిగతా ఇరవై ఏడేళ్లూ లోపల ఉండేవాడే! మాయా మూర్ వెళ్లి తీసుకొచ్చింది. బాస్కెట్‌బాల్ స్టార్ ప్లేయర్ తను. రెండేళ్లు ఆటను పక్కన పెట్టింది. నల్లజాతి ‘లేడీ జస్టిస్’ అయింది.
వీడియో క్లిప్ ఆన్ అయింది. ఇ.ఎస్.పి.ఎన్. స్పోర్ట్స్ సైన్స్ క్లాస్ అది. స్క్రీన్‌పై క్లిప్‌ను చూపించి చెబుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ ప్రొఫెసర్. ‘‘ఈ ప్లేయర్‌ను చూడండి. తన వెర్టికల్ లీప్, కోర్టు విజన్, మజిల్ మెమరీ, స్టీలింగ్! ఫాలో అవుతున్నారా? చేతుల కదలికలు త్రాచు కన్నా వేగం..’’ వీడియో క్లిప్ చూస్తున్న వారికి ఆ ప్లేయర్ మాయా మూర్ అని తెలుసు. తమ సిలబస్‌లో ఉన్న బాస్కెట్ బాల్ ప్లేయర్. పాఠ్యాంశాల్లోకి వచ్చిందంటే రిటైర్ అయిన క్రీడాకారిణి అయి ఉండాలి. కానీ కాదు! కెరీర్ ఆరంభంలో ఉన్న స్టార్ ప్లేయర్ మాయా.
వయసు ముప్పై. నిలువుగా పైకి లేవడం (వెర్టికల్ లీప్), క్షణం క్రితానికి, మరుక్షణానికి మధ్య ‘తక్షణం’లో బంతిని ఎగరేయడానికి (కోర్టు విజన్), మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్ వెళ్లిపోవడం (మెమరీ మజిల్).. బాగా సీనియర్‌లు మాత్రమే చేయగలిగినవి. మాయా చేస్తోంది! ఇంతవరకు చాలు. ఇక ఈమె గురించి మరికొంచెం కూడా చెప్పుకునే పని లేదు. ‘ది గ్రేటెస్ట్ విన్నర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ బాస్కెట్‌బాల్’ అని మూడేళ్ల క్రితమే ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ చెప్పేసింది.
అమెరికాలోని జఫర్‌సన్ సిటీలో (మిస్సోరీ) ‘కరెక్షనల్ సెంటర్’ ఉంది. మామూలు భాషలో జైలు! బుధవారం (జూలై 1) జైలు తలుపులు తెరుచుకోగానే సన్నటి ద్వారం నుంచి బయటికి వచ్చాడు జొనాథన్ ఐరన్స్. 1997లో అరెస్ట్ అయ్యాడు అతడు. 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు బయటికి వచ్చాడు. అతడికి పడిన శిక్షయితే 50 ఏళ్లు! ఇంకా 27 ఏళ్ల శిక్షాకాలం మిగిలే ఉంది. సాధారణంగా అమెరికాలో ఒక నల్లజాతి మనిషి.. శిక్ష పూర్తి కాకుండా బయటికి వచ్చాడంటే అందుకు అతడి సత్ప్రవర్తన మాత్రమే కారణం అయి ఉండదు. వేరే ప్రధాన కారణం ఉంటుంది.
జొనాథన్ విషయంలో ఆ.. ప్రధాన కారణం.. మాయా మూర్! మన బాస్కెట్‌బాల్ హీరోయిన్. అతడిని బయటికి రప్పించేందుకు పన్నెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందుకోసం అమెరికన్ న్యాయవ్యవస్థతో పోరాడుతోంది. న్యాయం కోసం పోరాడటం వేరు. న్యాయవ్యవస్థతో పోరాడటం వేరు. న్యాయం కోసం పోరాడి గెలిస్తే జొనాథన్ ఒక్కడే జైలు నుంచి బయటికి వస్తాడు. న్యాయ వ్యవస్థతో పోరాడి గెలిస్తే.. జొనాథన్ లాంటి వాళ్లకు మరీ అంత అన్యాయంగా శిక్ష పడదు. తన పోరాటాన్ని జొనాథన్‌తో ప్రారంభించింది మాయ. అతడెవరో తనకు తెలీదు.
అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఎందుకిలా ఉందో స్టడీ చెయ్యడానికి 2007లో ఒకసారి జఫర్సన్ కరెక్షనల్ సెంటర్‌లోకి వెళ్లే అవకాశాన్ని లోపల పని చేస్తున్న జైలు సిబ్బందితో తెప్పించుకుంది మాయ. అప్పుడు తన కథ చెప్పుకున్నాడు జొనాథన్. అప్పటికి అతడి వయసు 27. మాయ వయసు 17. మిస్సోరీలోని ఒకరి ఇంట్లో జరిగిన దోపిడీ, కాల్పుల కేసులో ఒక నిందితుడు జొనాథన్. ‘నేనక్కడ లేనే లేను అంటాడు’ జొనాథన్. ‘ఉన్నాడు, తుపాకీతో కాల్చాడు’ అని అవతలి వైపు లాయర్. చివరికి అంతా తెల్లవాళ్లే జడ్జిలుగా ఉన్న కోర్టులో జొనాథన్ దోషి అయ్యాడు. ఎంత దోషి అయితే మాత్రం టీనేజ్‌లోనే ఒక జీవితానికి సరిపడా శిక్ష వెయ్యడం న్యాయ మాయ వాదన. సిస్టమ్‌ని మార్చాలనుకుంది.
ఈ పదమూడేళ్లలో జొనాథన్‌ను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చివరి రెండేళ్లు కెరీర్‌ను పక్కనపెట్టి, కెరీర్ వల్ల వచ్చే లక్షల డాలర్‌లను పక్కకు నెట్టి అతడిని విడిపించడం కోసమే తిరిగింది. మిన్సెసోటా లింక్స్ జట్టు ప్లేయర్ మాయా. ఆ జట్టు మేనేజర్ మాయ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. కెరీర్‌లో మాయ పీక్స్‌లో ఉన్న సమయం ఈ రెండేళ్లూ. డబ్లు్య.ఎన్.బి.కె. కు అయితే ఆమె బంగారమే. ఉమెన్స్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్. అందులో పన్నెండు టీములు ఉంటాయి. వాటిల్లో ఒకటి మిన్నెసోటా లింక్స్. మాయ స్కిల్స్ కారణంగానే యు.ఎస్.కి టర్కీలో గోల్డు, చెక్‌లో గోల్డు, రియో ఒలింపిక్‌లో గోల్డు, లండన్ ఒలింపిక్స్‌లో గోల్డు వచ్చింది. 2019లో, 2020లో మాత్రం ఏ ఆటలోనూ మాయా మూర్ లేదు. ఇప్పుడు జొనాథన్ ఐరన్స్ విడుదల కావడం డబ్లు్య.ఎన్.బి.కె. కూడా ఆనందించవలసిన విషయమే. మాయ మళ్లీ బ్యాక్ టు ఆట.
జైలు నుంచి బయటి రాగానే జోనాథన్, బయట తనకోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను కావలించుకుని ఉద్వేగానికి లోనవడం దూరం నుంచి చూస్తూ ఉంది మాయ. తర్వాత అతడు ఆమె దగ్గరికి వచ్చాడు. ‘ఐ ఫీల్ లైక్.. ఐ కెన్ లివ్ లైఫ్ నౌ’ అన్నాడు. తన జీవితం తన చేతికొచ్చింది. ధన్యవాదాలు తెలిపాడు మాయకు. అతడిని పక్కన పెట్టి, అతడిని విడిపించిన మాయతో మాట్లాడ్డానికే అమెరికన్ మీడియా ఆసక్తి చూపింది. మాయ ‘ఎండ్ ఇట్ మూవ్‌మెంట్’లో కూడా ఉంది. ఆధునిక సమాజంలోని బానిసత్వాన్ని నిర్మూలించేందుకు ఆ సంస్థ పని చేస్తుంటుంది.
మాయ పుట్టింది కూడా జెఫర్‌సన్ సిటీలోనే. అమ్మ, అక్క, చెల్లి.. ముగ్గురే ఇంట్లో. తండ్రి వారితో ఉండటం లేదు. క్రిస్టియన్ ఫ్యామిలీ. ‘‘ఈ అవార్డులు, పేరు, డబ్బు.. దేవుడిచ్చిన జీవితం కంటే విలువైనవి కావు’’ అంటుంది మాయ. మనం, మన జీవితం అంటూ ఉండిపోకుండా.. సాటి మనుషులకు సహాయం చేస్తేనే.. జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడి రుణం తీర్చుకున్నట్లు’’ అని కూడా అంటుంది.
ఎలా సాధ్యం అయింది?!
ఒక సాధారణ అమెరికన్ పౌరురాలు అయి ఉంటే, జొనాథన్‌ను విడిపించడానికి మాయ చేసిన ప్రయత్నాలేవీ ఫలించేవి కాకపోవచ్చు. మొదట అతడి కథను జైల్లో వినే నాటికి మాయ తన కాలేజ్ టీమ్ తరఫున ఆడుతున్న ఒక బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి మాత్రమే. ఆ తర్వాతి కాలంలో పదేళ్ల పాటు ఆమె సాధించిన అంతర్జాతీయ విజయాలు, ఆమెపై ఫోర్బ్స్ కథనాలు, పెప్సీ మాక్స్ కమర్షియల్ సిరీస్‌లోని ‘అంకుల్ డ్రూ: చాప్టర్ 3’లో బెట్టీ లియూగా ఆమె నటించడం.. అన్నీ ఆమెను స్టార్‌ను చేశాయి. ఆ యువ స్టార్.. న్యాయ సంస్కరణలకు కృషి చేస్తున్నారని తెలియగానే అన్ని రంగాలలోని ప్రముఖులు, న్యాయకోవిదులు కలిసి వచ్చారు. ఆమెకు సహకరించారు. ఆరంభ విజయంగా జొనాథన్ ఐరన్స్ బయటికి వచ్చాడు.
జైలు బయట జొనాథన్‌తో మాయా మూర్
Comments
Please login to add a commentAdd a comment