మనకు సహాయం చేసే పని మనిషి రావడం లేదు. ఇస్త్రీ మనిషి రాడు. వంట విసుగుపుడితే బయటి నుంచి తెచ్చుకోవడానికి లేదు. వెళ్లడానికి లేదు. స్కూలుకెళ్లే పిల్లలు ఇంట్లోనే. భర్త ఇంట్లోనే. అమ్మ గృహిణి అయినా ఉద్యోగిని అయినా ఇప్పుడు ఆమె ఇంట్లోచేస్తున్న పని ఎంత? దానిని మనం పెంచుతున్నామా? సాయం చేసి తగ్గిస్తున్నామా? అసలు ఆమె పనిని మన పని అనుకోగలుగుతున్నామా? ఈ కరోనా సమయంలో అమ్మ పని ఎలా ఉంది?
ఇంటి పని అమ్మ పని. అనాదిగా అది అమ్మ పని అని ఈ సమాజం ఆమెకు దానిని విధిగా చేసింది. ఇంటి బయట పడి నాన్నకు అప్పజెప్పింది. అంతటితో ఆగక ఇంటి బయటపని గొప్పదిగా ఇంటి లోపలి పని తక్కువదిగా తూకం వేసి నిర్థారించింది. ఇంటి బయటి పని ‘డబ్బు’ వస్తుంది గనుక, నాన్న దానిని తెస్తాడు గనుక అది గొప్పదిగా, ఇంటిలో లోపలి పనిలో ఏ డబ్బు రాదు గనుక అమ్మ ఆ పనితో డబ్బు సంపాదించదు కనుక అది తక్కువది అయ్యింది. అమ్మ గృహిణి అయినా, ఉద్యోగి అయినా ఇంటి పనిలో పెద్దగా మార్పు ఉండదు. ఇంటి సభ్యులు పని చేయించుకునేవారిగా, అమ్మ వారికి పని చేసి పెట్టేదానిగా మారిపోతుంది. ఇందులో కొద్దిపాటి సర్దుబాట్లు చేసి ‘ఆమెకు అవసరమైనవి చేసి పెడుతున్నాం కదా’ అని మనసును సమాధానపరుచుకుంటూ ఉంటారు. పని మనిషి ఉందని, పిల్లలు స్కూల్‌కు వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లాక ఆమెకు పెద్దగా పని ఉండదని ఏమిటేమిటో చెప్పుకుంటారు. కొందరు జోకులు వేసుకుంటారు. కాని అది నిజంగా నిజం కాదని అందరికీ తెలుసు. ‘అమ్మకు ఆదివారం కూడా సెలవు ఉండదని’ కథలు, వ్యాసాలు, ఉద్యమాలు కూడా వచ్చాయి. అమ్మ శ్రమను అర్థం చేసుకున్నవారు కొందరు. చేసుకోవాల్సినవారు ఎందరో.
మొన్నటి దాకా రొటీన్
నిన్న మొన్నటి దాకా అమ్మ రొటీన్ అందరికీ తెలుసు. ఉదయాన్నే లేవాలి. పిల్లలను లేపాలి. బ్రేక్‌ఫాస్ట్, క్యారేజీ రెడీ చేయాలి. భర్తకు క్యారేజీ రెడీ చేయాలి. తను ఉద్యోగానికి వెళుతుంటే గనుక తనూ రెడీ కావాలి. ఉదయం ఆరు నుంచి 9 లోపు ఆమె ఒక యుద్ధంలో పాల్గొంటున్న సైనికురాలిగా ఉంటుంది. ఆమెను గౌరవించే పిల్లలు, భర్త ఉంటే ఈ పనిలో ఎంతో కొంత సాయం చేస్తారు. లేదూ అందరిలాంటి వారే అయితే ఆమె శ్రమను చూసీ చూడనట్టుగా వదిలేస్తారు. సరే.. అది అలవాటైపోయింది కనుక దాని మీద కంప్లయింట్ చేయాలి అని కూడా మర్చిపోయి అమ్మ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు?
ఈ కరోనా సమయంలో?
బయట కరోనా మహమ్మారి అగ్గిలా రాజుకుంటోంది. అది ఎందరిని దహిస్తుందో తెలియదు. ప్రపంచంతో పాటు దేశం కూడా లాక్‌డౌన్ అయ్యింది. ముందు తలుపుకు ఎప్పుడూ గొళ్లెం వేసి పెట్టాల్సి వస్తోంది. పిల్లలకు స్కూళ్లు లేవు. నాన్న ఇంట్లోనే. పనిమనిషి బంద్. పని మనిషి ఉంటే బట్టలు, అంట్ల శ్రమ తగ్గేది. కాని లేదు. ఇస్త్రీ చేసే కుర్రాడు వచ్చి బట్టలు తీసుకెళ్లడు. ఈ సమయంలో అమ్మ శ్రమ ఎంత ఉందో మనం చూస్తున్నామా? మూడు పూటలా ఆమె వండాలి. వాటికి అంట్లు పడతాయి. పిల్లలు ఇంట్లో ఉంటే వారు గడియకోమారు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అవి సమకూర్చాలి. భర్త తిండి ప్రియుడు అయితే వాటినీ చేసి పెట్టాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంకా అన్యాయం. ఇవన్నీ చేస్తూ ఆఫీస్ పని కూడా చేయాలి. అమ్మకు ఎంత కష్టం. అమ్మ నోరు తెరిచి అన్నీ చెప్పుకోదు. అరవదు. విసుక్కోదు. లోలోపల బాధ పడుతుంది. ఆ బాధను పట్టించుకుంటున్నామా?
ఏం చేద్దాం?
టైం టేబుల్ వేసుకోవాలి. పనిని కాగితం మీద రాసుకోవాలి. అమ్మ చేయాల్సిన పనులు, నాన్న చేయాల్సిన పనులు, పిల్లలు చేయాల్సిన పనులు అని విభజన చేసుకోవాలి. ఆ పనులు తప్పక చేయాలి. చేసింది తినడం, పెట్టినదానితో సరి పుచ్చుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందనే ఈ భయాందోళన సమయంలో రుచి ప్రతిసారీ కుదరకపోవచ్చు. వంకలు పెట్టకుండా తినాలి. అసలు వంటే చేయనవసరం లేకుండా ఒక్కో పూట పండ్లు, బ్రెడ్‌లాంటి వాటిని తీసుకోవచ్చేమో చూడాలి. ఇల్లు శుభ్రం చేయడం, సర్దుకోవడం, బట్టలు ఉతకడం ఇవి ఎవరెవరు పంచుకోవచ్చో చూసి తప్పనిసరిగా పంచుకోవాలి. అన్నింటికి మించి అమ్మతో మాట్లాడాలి. ఆమెను వంట గదిలో వదిలిపెట్టి మిగిలిన కుటుంబ సభ్యులంతా ఒక పార్టీలాగా మారి కబుర్లు చెప్పుకుంటోనో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటేనో అది చాలా తప్పుగా గ్రహించాలి. మనం నవ్వాలి. అమ్మను నవ్వించాలి. పరస్పరం ప్రశంసించుకుంటూ ప్రోత్సహించుకోవాలి. ఇది ఇప్పుడు చేయాల్సింది.
నాన్నలు మారాలి
‘నాకు టీ పెట్టడం కూడా రాదు’, ‘నాకు కిచెన్ ఎక్కడుందో తెలియదు’... ఇలా మాట్లాడటం కొందరు మగవాళ్లకు గొప్ప. ఇలా మాట్లాడేవాళ్లందరూ బేచిలర్ లైఫ్‌లో తిండి కోసం నానా ప్రయోగాలు చేసినవారే అయి ఉంటారు. ఇప్పుడు మళ్లీ ఆ రోజులను తలుచుకుని పనిలోకి దిగాలి. చేయగలిగిన వంట పని చేయాలి. ఆమెకు ఆఫీస్ పని ఎంత ఉందో తెలుసుకొని ఆ పని వొత్తిడి తీరేవరకు ఇల్లు చూసుకోవాలి. బాత్‌రూమ్‌లు కడగాలి. నా ఇంటి కోసం నేను పని చేస్తాను అని తీర్మానించుకోవాలి. ఏ పనీ తప్పించుకునే వీలు లేని రోజులివి. వీటిని పంచుకునేవారే ఇప్పుడు కావలసినది. అలాంటి ఇల్లే ఇప్పుడు అవసరమైనది. అలాంటి ఇంట్లో అమ్మకు ఆయుష్షు ఎక్కువ. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment