చిన్నప్పటి కలలు వేరే ఉంటాయి. కాని ఈ బ్రహ్మాండమంతా కలిసి మన కోసం వేరే కల కని ఉంటుంది. ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ ఒక పశువుల డాక్టర్ అయితే చాలనుకుంది. కాని అంతరిక్షం ఆమెను తన ముద్దుబిడ్డను చేసుకుంది. ఆదివారం ఒక వెబినార్‌లో సునీతా విలియమ్స్ తన బాల్యాన్ని, అంతరిక్షయానాన్ని గుర్తు చేసుకుంది.
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ సెంటర్ సెంటర్ అబ్దుల్ కలామ్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో సుప్రసిద్ధ వ్యోమగామి సునీతా విలియమ్స్ పాల్గొని తన అంతరిక్ష జీవన జ్ఞాపకాలు పంచుకున్నారు. 7 స్పేస్‌వాక్‌లు, దాదాపు 320 రోజుల అంతరిక్ష బస చేసిన అరుదైన రికార్డును తన పేరున నమోదు చేసుకున్న ఈ సాహసి ఆ వెబినార్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఈ సందర్భంగా తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె ఏమన్నారంటే...
పశువుల డాక్టర్
‘మాది ఒక సాధారణ కుటుంబం. మా నాన్న దీపక్ పాండ్యా భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. తర్వాతి కాలంలో న్యూరోఅనాటమిస్ట్ అయ్యారు. ఆయన రెసిడెన్సీ చేస్తుండగా హాస్పిటల్‌లో మా అమ్మ ఉర్స్‌లిన్ ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పని చేసేది. అలా వారు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. మేము ముగ్గురం పిల్లలం. నేను మూడోదాన్ని. బాగా కష్టపడి పైకి రావాలన్నది మాత్రం మాకు చిన్నప్పుడే అర్థమైంది. అయితే అప్పుడు నేను ఇలా వ్యోమగామిని అవుతానని రోదసిని ఛేదిస్తూ పైకి ఎగురుతానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు స్విమ్మింగ్ ఇష్టంగా ఉండేది. అథ్లెటిక్స్ ఆసక్తి. పశువులంటే ఇష్టం. వెటర్నరీ డాక్టర్ అవుదామనుకున్నాను. కాని ఆ చదువుకు నేను అనుకున్న యూనివర్సిటీల నుంచి సీటు దొరకలేదు. అప్పుడు మా నాన్న నావల్ అకాడమీ వైపు ప్రోత్సహించారు. అలా నేను నేవీలోకి వచ్చాను.’
అది ఒక కల
‘2003లో కొలంబియా ప్రమాదం సంభవించడం, కల్పనా చావ్లా మృతి ఇవన్నీ అమెరికా అంతరిక్ష పరిశోధనలకు ఒక గట్టి దెబ్బ కొట్టాయి. మేమందరం డోలాయమానంలో పడ్డాం. నేనైతే అంతరిక్షంలోకి అడుగుపెడతానా అని సందేహంలో పడిపోయాను. కాని జరిగిన దుర్ఘటనను బేరీజు వేసుకుని, తిరిగి పుంజుకొని మేమందరం ప్రయాణం కట్టడం, అంతరిక్షంలో అన్ని రోజులు నేను గడపడం ఇదంతా ఇప్పుడు తలుచుకుంటే ఒక కల అనిపిస్తోంది.
అంతరిక్షం నుంచి భూమిని మొదటిసారి చూసినప్పుడు వావ్ అనిపించింది. ఎంత ప్రశాంతంగా, సుందరంగా ఉంది భూమి అనుకున్నాను. అదొక అద్భుత అనుభూతి. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు నాన్న నాకు బహూకరించిన భగవద్గీతను తీసుకెళ్లడం, అక్కడ దానిని తరచూ చదవడం కూడా ఈ సందర్భంగా చెప్పాలనిపిస్తోంది. అంతరిక్షంలో కూచుని భారతీయులు ఇష్టపడే సమోసాలను తినడం కూడా గొప్ప సరదాగా అనిపించింది’’
భూమికి ప్రతినిధులం
‘మేము శాస్త్రవేత్తలం, వ్యోమగాములం భూమి మీద వివిధ దేశాలకు చెందినవారం కావచ్చు. కాని ఒక్కసారి భూమిని విడిచిపెట్టాక భూమికి ప్రతినిధులం మాత్రమే. అంతరిక్షంలో మా ఉనికి అంతవరకే. వివిధ దేశాల వ్యోమగాములతో పని చేస్తున్నప్పుడు మేమందరం భూమి కోసం పని చేస్తున్నామన్న భావన కలుగుతుంది. మరో విషయం. ఏ ఒక్కరూ రోదసి రహస్యాలను అన్నింటిని ఛేదించరు. అందరూ ప్రయత్నించాలి. ఆ పోటీ కూడా బాగా పని చేయడానికి ఉపయోగపడుతుంది.
అమెరికా 2024 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం పైన పురుషుణ్ణి, మొదటి స్త్రీని దించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మార్స్ మీద మనిషి కాలుపెట్టాలన్న అమెరికా ప్రయత్నాలకు పరోక్షంగా సాయం చేస్తుంది. మనం మార్స్ మీదకు వెళ్లాలి. అక్కడ ఎలా మనగలమో తెలుసుకోవాలి. నాకు తెలిసి మన జనరేషన్ హయాంలోనే ఈ ఉజ్వల ఘట్టం ఉంటుంది’ అన్నారామె. మార్స్‌పై మనిషిని చేర్చేందుకు అమెరికా చేయనున్న కీలక ప్రయోగాల్లో కూడా సునీత ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఆమె స్ఫూర్తి ఈ తరం కనే కలలను విశాలం చేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment