పదేళ్ల అమ్మాయి కథ.. విలేజ్‌ రాక్‌స్టార్స్‌! | Special story to Assam Filmmaker Rima Das | Sakshi
Sakshi News home page

'అస్సామి'రంగా

Published Wed, Sep 26 2018 12:02 AM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

Special story to Assam Filmmaker Rima Das - Sakshi

ప్రపంచ సినీ రంగస్థలంలో అస్సామీ సినిమా ఒకటి నా సామి రంగా అనిపించింది. పెద్ద పెద్ద బడ్జెట్‌లతో ఇండియాలో తయారైన సినిమాలతో పోటీ పడి వాటిని ఓడించి ఆస్కార్‌ బరిలో నిలిచింది. ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’  ఈ విజయంతో సినీ అభిమానులను రాక్‌ చేసింది.

రీమా దాస్‌..  ఈ మూడునాలుగు రోజులుగా బాగా వినపడుతున్న పేరు. ఆమె సినిమా దర్శకురాలు. రీమా తీసిన ‘‘విలేజ్‌ రాక్‌స్టార్‌’’ ఆస్కార్‌ విదేశీ సినిమా విభాగానికి మన దేశం నుంచి నామినేట్‌ అయిన అస్సామి సినిమా. అందుకే ఆమె వార్తల్లో ఉన్నారు. ముందు రీమా దాస్‌ గురించి తెలుసుకుందాం..అస్సామ్‌లో మధ్యతగరతి వాళ్ల  కలల కొలువు టీచర్‌ ఉద్యోగం. రీమా పుట్టిపెరిగిన ఊరు ‘కాలార్డియా’లో కూడా అంతే. గువహటికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రీమా వాళ్ల నాన్న కూడా టీచరే. తనలాగే తన కూతురు  టీచర్‌ కావాలనుకున్నాడు. తండ్రి కోరిక మేరకు రీమా పూణె యూనివర్శిటీలో సోషియాలజీ చదివింది. టీచర్‌ ఉద్యోగం కోసం నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ కూడా పాసయింది. కాని ఆమె లోపల ఉన్న ఆసక్తి వేరు. ఆమె చిత్తమంతా నటనవైపే!

థియేటర్‌.. సినిమా
చిన్నప్పుడు స్కూల్లో నాటకాల్లో నటించింది. నాటక ప్రదర్శన కోసం ముంబై కూడా వెళ్లింది. పృథ్విథియేటర్‌లో ప్రేమ్‌చంద్‌ ‘‘గోదాన్‌’’నాటకంలో అభినయించింది. ఇదంతా సినిమా పట్ల ఆమెలో  క్రేజ్‌ను పెంచింది. సత్యజిత్‌రే, ఇంగ్‌మర్‌ బెర్గ్‌మన్, మాజిద్‌ మాజిద్‌ వంటి గొప్ప దర్శకుల సినిమాలను చూడ్డం మొదలుపెట్టింది. అలా సినిమా తీయడమనే థియరీ నేర్చుకుంది. 

బైనాక్యులర్స్‌.. బయోస్కోప్‌
తండ్రి పెంపకం, పెరిగిన నేపథ్యం తనను టీచింగ్‌ వైపు తోసినా ఆమె ఆసక్తి సినిమా దగ్గరకే లాక్కెళ్లింది. 2009లో ‘ప్రథా’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీసింది రీమా. తర్వాత రెండు షార్ట్‌ఫిల్‌æ్మ్సకీ దర్శకత్వం వహించింది.  అయినా ఆమె ప్రయాణం అడుగు కూడా ముందుకు సాగలేదు. ఆ అసంతృప్తితో ఉన్నప్పుడే రీమా ఫ్రెండ్‌ అతని తండ్రి కోసం కొన్న బైనాక్యులర్స్‌ చూపించాడు. వాళ్ల నాన్నకు చాలా ఇష్టమని అందుకే కొన్నానని చెప్తూ. వాటిని చూసిన వెంటనే ఓ లైన్‌ తట్టింది రీమాకు. ఆ తలపు స్క్రిప్ట్‌ రాసే వరకు ఊరుకోలేదు. వెంటనే స్క్రీన్‌ ప్లేనూ సిద్ధం చేసుకుంది. అదే రీమా  తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ‘అంతర్‌ దృష్టి’. 2013లో తన సొంతూరు కాలార్డియాలోనే కేనన్‌ డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాతో మొదలుపెట్టింది చిత్రీకరణ. 2016లో పూర్తయింది. అదే యేడు అది కేన్స్, ముంబై, టాలిన్‌ బ్లాక్‌ నైట్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి వెళ్లింది. ఈ సినిమా ఆమెను సెల్ఫ్‌ టాట్‌ ఫిల్మ్‌మేకర్‌గా నిలబెట్టింది. ‘అంతర్‌ దృష్టి’కి రీమాయే వన్‌ ఉమన్‌  క్రూ. కథ, దర్శకత్వం, నిర్మాత, ఎడిటర్, కెమెరా, ఆర్ట్‌ డైరెక్షన్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌.. అన్నీ ఆమే! 

దృష్టి మార్చిన అంతర్‌దృష్టి
‘అంతర్‌దృష్టి’ సినిమా షూటింగ్‌ జీవితం పట్ల ఆమె దృక్కోణాన్నే మార్చేసింది. ఎన్నో పార్శా్వలు తెలిశాయి. తను పుట్టి పెరిగిన ఊరు కొత్తగా అర్థమైంది. ఆ ఊరి అందాన్ని చూడగలిగింది. తన బాల్యాన్ని మళ్లీ అన్వేషించుకుంది. అంతర్‌ దృష్టి షూట్‌ చేస్తున్నప్పుడు కొంత మంది పిల్లలను కలిసింది.  ఆడియోలో పాటలు వస్తుంటే ఈ పిల్లలంతా చేతుల్లో  రకరకాల ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఉన్నట్టు ఆ మ్యూజిక్‌కి తగ్గట్టు అభినయించడం చూసి తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. ఆ అమాయకత్వమే ‘‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’’కి ప్లాట్‌నిచ్చింది.  ఇది పదేళ్ల అమ్మాయి చుట్టూ సాగే కథ.  2014లో మొదలైన ఈ సినిమా 2017లో పూర్తయింది. షూటింగ్‌ సమయం 150 రోజులు.  2017లో ఈ సినిమా టొరంటో  ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి, స్పెయిన్‌లోని సాన్‌సెబాస్టియన్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కూ వెళ్లింది. ఈశాన్య భారతం నుంచి టొరంటో ఫిల్మ్‌ఫెస్టివల్‌కు వెళ్లిన మొదటి సినిమా ఇదే.  ప్రస్తుతం  ఓ టీనేజ్‌ లవ్‌స్టోరీ మీద సినిమా ప్లాన్‌ చేస్తోంది. ఈ సినిమాను తన సొంతూరు దగ్గర్లోని చాయ్‌గావ్‌లో తీయనుందట రీమా. అయితే  ఈ సినిమాలో ప్రొఫెషనల్‌ యాక్టర్స్‌ ఉంటారని చెప్పింది రీమా. 

బెస్ట్‌ డే ఆఫ్‌ మై లైఫ్‌
ఆస్కార్‌ కోసం సెలెక్ట్‌ అయిన ఫస్ట్‌ అస్సామీ సినిమా ఇది. ఈ రోజుని నా జీవితంలో మరిచిపోలేను.  మన దేశంలో ఇన్ని భాషలు ఇన్ని సినిమాలు ఉండగా నా సినిమా ఎన్నిక కావడం మంటే  ఒకరకంగా ప్రపంచంలోనే అస్సామీకి ఇది ఒక గుర్తింపు.


ఆస్కార్‌ బరిలో ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’తో పోటీపడ్డ సినిమాలు
మేఘనా గుల్జార్‌ ‘రాజీ’, సిద్ధార్థ్‌ మల్హోత్రా ‘హిచ్‌కీ’, సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్‌’, తబ్రేజ్‌ నూరానీ ‘లవ్‌ సోనియా’,  నాగ్‌ అశ్విన్‌ ’మహానటి’, చెళియన్‌ ‘టు లెట్‌’, రాహి బర్వే ‘తుంబాడ్‌’, సుకుమార్‌ ‘రంగస్థలం’,  వినిత్‌ కనోజియా ‘రేవ’, దేబ్‌ మేధేకర్‌ ‘బయోస్కోప్‌వాలా’ సినిమాలతో పోటీ పడి గెలిచింది ‘‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’.

విలేజ్‌ రాక్‌స్టార్స్‌
వాద్యసంగీతమంటే చెవికోసుకునే పదేళ్ల అమ్మాయికి ఎలక్ట్రిక్‌ గిటార్‌ కొనుక్కోవాలనేది కల. ఆ అమ్మాయి పేరు ధును. గిటార్‌ కొనుక్కొని ఓ రాక్‌ బ్యాండ్‌ను తయారు చేయాలనేది ఆ పిల్ల లక్ష్యం. ఆ గమ్యాన్ని చేరడమే సినిమా. ధును పాత్రను రీమా దాస్‌ మేనకోడలు భనితా దాస్‌ పోషించింది. ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. అన్నీ రీమానే. ప్రొడ్యూసర్‌ కూడా ఆమే. ఈ నెల (సెప్టెంబర్‌) 28న థియేటర్లలో విడుదలకానుందీ ‘‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’’. 


నేను దర్శకత్వం వహించిన ‘మహానటి’ సినిమా మన దేశం తరఫున నామినేషన్‌కి వెళ్లే చిత్రాల లిస్ట్‌లో ఉండటం ఆనందంగా ఉంది.  ఆస్కార్‌ బరిలో నిలిచిన ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ సినిమాను నేను చూడలేదు. కానీ ఆ సినిమా గురించి విన్నాను. ఇక, నా ‘మహానటి’ సినిమా గురించి చెప్పాలంటే.. నేను అవార్డులు ఆశించి ఈ సినిమా తీయలేదు. నిజాయతీగా మా ప్రయత్నం మేం చేశాం. విడుదలైన తర్వాత ఈ స్థాయి ఆదరణ లభిస్తుందని ఊహించలేదు.
– ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌


ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వాళ్లు మీ సినిమాను ఆస్కార్‌ నామినేషన్స్‌కు పంపుతున్నట్లు ఒక లెటర్‌ పంపి, కంటెంట్‌ ఇవ్వమన్నారు. చాలా హ్యాపీగా ఫీలై కంటెంట్‌ పంపించాం. నిజానికి మేం ఈ సినిమా తీసేటప్పుడు అవార్డుల గురించి అసలు ఆలోచించలేదు. ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ సినిమా ఎంపికైందని విన్న తర్వాత ఆ సినిమా ట్రైలర్‌ చూశాం. బావుంది, చాలా ‘రా’గా ఉంది. ఇలాంటి ఫిల్మ్స్‌కి అవార్డ్సు వస్తాయి. సుకుమార్‌ గారి డైరెక్షన్‌ మ్యాజిక్‌తో మేం  తీసిన ‘రంగస్థలం’ సినిమా రా అండ్‌ రియలిస్టిక్‌గానే కాదు.. కమర్షియల్‌గా ఉంటుంది. ఆ విధంగా ఆయన ఈ సినిమాని మలిచిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ఆ సంగతలా ఉంచితే.. మా ‘రంగస్థలం’ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. అక్కడివారు కూడా సినిమాని చూసి, ఎంజాయ్‌ చేయడం ఆనందంగా ఉంది. అలాగే బెస్ట్‌ ఫారిన్‌ కేటగిరీ విభాగంలోకి మా చిత్రాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో టీమ్‌ అంతా హ్యాపీ.
– నిర్మాతలు చెరుకూరి మోహన్, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement