రిపోర్టింగ్‌లో రోజూ చచ్చిబతికే పరిస్థితులుండే చైనాలో సైతం ఎడిటర్‌గా పనిచేయడానికి నాలుగేళ్ల క్రితమే సిద్ధపడి వచ్చిన క్యారీ గ్రేసీ .. తన మనసు చంపుకుని మాత్రం ఆ హోదాలో పనిచేయలేకపోయారు.
స్త్రీలను ‘ఆకాశంలో సగభాగం’ అని చైనా వివ్లవ నాయకుడు మావో అన్నారు. స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను నిరసిస్తూ బీబీసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ ఇప్పుడు తన నిరసన గళం వినిపిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రైవేటు సంస్థలలో స్త్రీల కన్నా పురుషులకు ఎక్కువ జీతాలు ఇవ్వడం నేరం అని ఈ జనవరి 1న ఐస్‌ల్యాండ్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపులకు నిరసనగా మొన్న జనవరి 8న గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్‌కు అంతా నల్లదుస్తులు ధరించి వచ్చారు. ఇప్పుడు బిబిసి చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా వార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చూస్తుంటే ఈ ఏడాది ‘మహిళా విప్లవం’ ఏదో రాబోతున్నట్లే ఉంది. శుభ పరిణామమే!
బీబీíసీ చైనా ఎడిటర్ క్యారీ గ్రేసీ రాజీనామా చేశారు! లక్షా ఎనభై వేల పౌండ్ల జీతాన్ని వదులుకుని లండన్ తిరిగొచ్చేశారు. ‘న్యూస్ రూమ్‌లో చిన్న ఉద్యోగం ఇవ్వండి చాలు’ అని అన్నారు. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఊహించని పరిణామం ఇది. రాజీనామా లేఖొచ్చి టేబుల్ మీద పడగానే బోర్డు రూమ్ ఉలిక్కిపడింది. బీబీసీలో సీనియర్ జర్నలిస్ట్ గ్రేసీ. ముప్పై ఏళ్ల అనుభవం. ‘ఈక్వల్ పే’ లేదని ఈ అకస్మాత్తు రాజీనామా చేశారు. తనకు లేదని కాదు. అసలు బీబీసీ లోనే లేదని. ‘డబ్బు ముఖ్యం కాదు నాకు. సమానత్వం కావాలి. నాకొక్కదానికి కాదు. బీబీసీలో పనిచేస్తున్న మహిళందరికీ కావాలి’ అని గ్రేసీ బహిరంగ లేఖ రాశారు. వెంటనే ఆమెకు మద్దతుగా 130 మంది ఉన్నతస్థాయి బీబీసీ జర్నలిస్టులు ఒక ప్రకటన విడుదల చేశారు. అవార్డు విన్నింగ్ జర్నలిస్టు గ్రేసీని తిరిగి చైనా ఎడిటర్‌గా పునర్నియమించాలని ఆ ప్రకటన డిమాండ్. అలా చేయాలంటే, బీబీసీ ‘ఈక్వల్ పే’ విధానాన్ని అమలు చేయాలి. స్త్రీ,పురుష సిబ్బందికి సమాన వేతనాలు ఇవ్వాలి. ఒకే హోదాలో ఉన్నవారిలో స్త్రీల కన్నా, పురుషులు యాభై శాతం అధికంగా జీతాలను పొందుతున్నారని, అదంతా రహస్యంగా జరిగిపోతోందని తన దృష్టికి వచ్చిన వెంటనే గ్రేసీ బయటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆమె జీతం ఏడాదికి లక్షా ముప్పై వేల పౌండ్లు. ఆ మొత్తాన్ని లక్షా ఎనభై వేల పౌండ్లకు పెంచేందుకు గత అక్టోబర్‌లోనే బీబీసీ పేపర్లు కూడా తయారు చేసింది. కానీ గ్రేసీ వద్దన్నారు. ‘‘అందరికీ పెంచాలి’’ అని కండిషన్ పెట్టారు.
‘ఈక్వల్ పే’ కోసం గత జూలైలో సిబ్బంది నుంచి బీబీసీపై ఒత్తిడి వచ్చినప్పుడు అత్యున్నత స్థాయిలో జీతాలు ఎలా ఉన్నాయన్నదీ ఆ సంస్థ ఒక నివేదికను విడుదల చేయవలసి వచ్చింది. అప్పుడే గ్రేసీ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అప్పుడే ఆమెకు జీతం పెంచడానికి బీబీసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. అప్పుడే గ్రేసీ తనకొక్కదానికే జీతం పెంచడంపై విముఖతను వ్యక్తం చేశారు. ఇప్పటికి ఆరు నెలలు గడిచాయి. ఎక్కడి జీతాలు అక్కడే ఉన్నాయి. మహిళలూ ఎక్కడివారు అక్కడే ఉన్నారు. పురుషులకు దీటుగా పనిచేస్తున్నప్పటికీ పురుషులకన్నా తక్కువ జీతాలు పొందుతున్నారు. ఇది గ్రేసీని బాధించింది. ఆగ్రహం తెప్పించింది. రిపోర్టింగ్‌లో రోజూ చచ్చిబతికే పరిస్థితులుండే చైనాలో సైతం ఎడిటర్‌గా పనిచేయడానికి నాలుగేళ్ల క్రితమే సిద్ధపడి వచ్చిన క్యారీ గ్రేసీ.. చివరికి మనసు చంపుకుని మాత్రం ఆ హోదాలో పనిచేయలేకపోయారు. చైనాలో నిక్కచ్చి ఎడిటర్‌గా పనిచేయడం నిత్యం డ్రాగన్‌లతో పోరాడటమే. పాలకుల బెదిరింపులు ఉంటాయి. పోలీసుల వేధింపులు ఉంటాయి. ఎడిటరే స్వయంగా రిపోర్టింగ్‌కి వెళితేనే గానీ సమాచారం సేకరించలేనంత గుంభనంగా, పకడ్బందీగా చైనా యంత్రాంగం ఉంటుంది. ఆ కష్టాలేవీ ఇప్పుడు రాజీనామా చేశాక గ్రేసీ ఏకరువు పెట్టడం లేదు. ‘చీకటి మీద లైట్‌ను ఫోకస్ చేసే గొప్ప వృత్తిలో ఉన్నప్పుడు మన దగ్గర చీకటిని చూడలేకపోతే.. సమాజాన్ని వేలెత్తి చూపే నైతిక హక్కు మనకు ఎలా ఉంటుంది?’’ అని గ్రేసీ ప్రశ్నిస్తున్నారు. నిజాలు దాస్తుందని చైనాకు పేరు. ఎడిటర్‌గా ఇంతకాలం గ్రేసీ ఆ నిజాలను బయటికి రప్పించారు. బీబీసీకి జీతాలను దాచే అలవాటుందని తెలిశాక ఆమే బయటికి వచ్చారు. క్యారీ గ్రేసీ బయటికి రావడం అంటే.. అసమానతలను బయటికి తేవడమే!
Comments
Please login to add a commentAdd a comment