లోకమంతా స్నేహమంత్ర ! | Special Story On Friendship Day | Sakshi
Sakshi News home page

లోకమంతా స్నేహమంత్ర !

Published Sun, Aug 4 2019 11:39 AM | Last Updated on Sun, Aug 4 2019 11:39 AM

Special Story On Friendship Day  - Sakshi

​​​​​​​సత్తెనపల్లిలో బాల్య స్నేహితులతో బ్రహ్మానందం  (ఫైల్‌) 

‘స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమే నాకున్నదీ.. స్నేహమే నా పెన్నిధీ..’ అంటూ ఓ సినీ కవి కలం నుంచి జాలువారిన అక్షరాల కూర్పు చెలిమి గొప్పతనాన్ని సరళంగా.. మధురంగా తెలియజెప్పింది. మనిషి పుట్టుక నుంచి మరణశయ్యపై నిలిచే వరకు స్నేహ సుగంధాలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాల్సిందే. అంతరంగాల సమ్మేళనంలో అనుభూతులు నింపుకోవాల్సిందే.  జీవితానికి అర్థం.. పరమార్థం సాధించే క్రమంలో స్నేహమనే సాధనం అండ ఎంత అవసరమో.. మంచి స్నేహితులు కలిగిన వారికే తెలుస్తుంది. అందుకే స్నేహానికన్నమిన్న.. లోకానలేదురా.. అంటూ ప్రతి స్నేహితుడు అనకమానరు.  

చెలిమితో  ‘బ్రహ్మానందం’
సాక్షి, సత్తెనపల్లి(గుంటూరు) : నాటక రంగంలో పరిచయంతో.. ఒకరికొకరు స్నేహితులుగా మారారు. వేర్వేరు రంగాల్లో పని చేస్తున్నప్పటికీ ఐదు దశాబ్ధాలుగా వారి మధ్య స్నేహం సాగుతోంది. వారే సినీ హాస్యనటుడు కన్నెగంటి బ్రహ్మానందం మిత్రబృందం. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్లకు చెందిన కన్నెగంటి బ్రహ్మానందం 1950 ఫిబ్రవరి 1న జన్మించారు. చిన్నతనం నుంచి చదువులో రాణించిన బ్రహ్మానందం తూర్పు గోదావరి అత్తిలిలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తూ నాటక రంగంపై మక్కువతో నాటకాల్లో ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చేవారు. అధ్యాపకునిగా పని చేసే సమయంలో టీవీలో పకపకలు కార్యక్రమంలో అందరిని నవ్వించారు.

ఆ షో విజయవంతం కావడంతో మద్రాసు (చెన్నై) వెళ్లి సినీ రంగ ప్రవేశానికి ప్రయత్నం చేశారు. తొలుత స్వయంకృషి సినిమాలో చిన్న పాత్రతో సినీ రంగంలో అడుగు పెట్టారు. రెండో సినిమా అహనా పెళ్లంట మంచి విజయాన్ని అందించింది. దీంతో తారాస్థాయికి ఎదిగిపోయారు. అయినప్పటికీ తన స్నేహితులను ఎప్పటికీ మరువ లేదు. తన 20 ఏళ్ల వయస్సులో తనతో ఉన్న స్నేహితులను మరువకుండా ఏటా కలుస్తుంటారు. ప్రధానంగా బ్రహ్మానందం పుట్టిన రోజైన ఫిబ్రవరి 1న సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన బాల్య స్నేహితులు మారూరి పుల్లారెడ్డి, తుమ్మల చెరువు పూర్ణకల్యాణరావు, జింకా రామారావు, గంగారపు వెంకట్రావు, ఆదినారాయణ, సాంబశివరావు, టీవీ మురళీకిషోర్, గుండవరపు అమరనాథ్, ఇలా ఎంతో మంది ఆయనను కలసి వేడుకలు జరుపుకుంటా రు. తారతమ్యం మరిచి అరేయ్‌.. ఒరేయ్‌.. అని పిలుచుకుంటూ సరదాగా ఒక రోజంతా గడపడం ఐదు దశాబ్ధాలుగా కొనసాగుతోంది. 

స్నేహం దిద్దిన సేవామార్గం
గుంటూరు ఈస్ట్‌ :  రక్తబంధాన్ని మించిన ఆత్మబంధం స్నేహం. కష్టంలో.. సుఖంలో నిత్యం వెన్నంటి ఉండే బంధం అది. స్నేహానికి సేవా భావాన్ని ముడివేస్తే ఆ చెలిమి అద్భుతాలు చేస్తుంది. వృత్తులు వేరైనా..   ప్రవృత్తులు కలవకున్నా చిన్ననాటి స్నేహబంధానికి గర్భగుడిలో దేవతామూర్తికి ఇచ్చినంత విలువ ఇస్తున్నారు వారు. పవిత్ర స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. 

18 ఏళ్లుగా సేవతోనే స్నేహం..  
గుంటూరు నగరంలో వివిధ వ్యాపారాల్లో తలమునకలయ్యే కొందరు ఆరోగ్యం కోసం ఉదయాన్నే ఒకచోట చేరి షటిల్‌ ఆడతారు. అలా వారిమధ్య స్నేహభావం పెంపొందడంతో తాము చేయగలిగినంత సమాజ సేవ చేయాలని 18 ఏళ్ల క్రితం నిశ్చయించారు. వాసవి గ్రేటర్‌ క్లబ్‌ నెలకొల్పి  తొలుత రూ.70 వేలు సమకూర్చుకొని పేదలకు బియ్యం పంపిణీ, వృద్ధులకు పింఛన్లు, విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు అందిస్తూ సేవాపథంలో అడుగులు వేశారు. ప్రతి ఏటా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ కొన్నేళ్లుగా ఏడాదికి రూ.40 లక్షలు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు వాసవి గ్రేటర్‌ క్లబ్‌ సభ్యులు. స్నేహితుల్లో కొందరికి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైనా, నోట్ల రద్దు ఆటంకాలు కల్పించినా క్రేన్‌ ఇండస్ట్రీ అధినేత వంటి పెద్దల సహకారంతో సేవలు నిరాటంకంగా కొసాగిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో తమ స్నేహం మరింత బలపడుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

స్నేహితుడి కుటుంబానికి చేయూత   
పట్నంబజారు :  నీ ఎదుగుదల చూసి ఆనందపడతాను.. నీ ఆనందంలో సగభాగం అవుతానని చాటి చెప్పేదే స్నేహం.  జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంతటి హక్కు తీసుకునేది స్నేహితులు మాత్రమే. కేవలం 4 నెలల స్నేహం కోసం జిల్లాలు దాటి వెళ్లి సాయమందించిన స్నేహ మధురిమ ఇది. 2012–13లో కానిస్టేబుళ్లుగా ఎంపికైన గుంటూరు అర్బన్, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల వారు విజయనగరంలో శిక్షణ తరగతుల్లో ఒకచోట చేరారు. గుంటూరు అర్బన్‌ పరిధిలోని 139 మంది కానిస్టేబుళ్లకు వైజాగ్‌కు చెందిన కాకర్ల శివగణేష్‌తో స్నేహం కుదిరింది. ఆ తర్వాత విధుల్లో భాగంగా ఎవరి జిల్లాలకు వారు వెళ్లిపోయారు. ఒకే బ్యాచ్‌ వారు కావడంతో అప్పుడప్పుడు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. సరదాగా సాగిపోతున్న స్నేహబంధాన్ని చూసి విధి చిన్నచూపు చూసింది.

విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న శివగణేష్‌ను గత ఏడాది జనవరిలో రోడ్డు ప్రమాదంలో మృత్యువు మింగేసింది. విషయం తెలుసుకున్న గుంటూరు నగరంపాలెం కానిస్టేబుల్‌ కోట శ్రీకాంత్‌రెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అజారుద్దీన్, నరసింహారావు వారి స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. మన స్నేహితుడు లేకపోయినా.. అతని కుటుంబానికి అండగా ఉండాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడువుగా.. వారి బ్యాచ్‌ స్నేహితులతో కలిసి రూ.1.50 లక్షలు సేకరించారు. విశాఖపట్నం వెళ్లి శివగణేష్‌ తల్లిదండ్రులు అప్పలరాజు, ధనలక్ష్మికి నగదును అందజేశారు. స్నేహితుడు లేకపోయినా.. అతని కుటుంబం ఉందిగా అంటూ.. చెమర్చిన కళ్లతో ఆ స్నేహితులు వారి స్నేహాన్ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.    

గుండెల్లో పదిలంగా..
మంగళగిరి : చిన్నతనంలో తల్లిదండ్రుల అనంతరం ఏర్పడిన స్నేహం జీవితంలో మరువలేనిదని, స్నేహానికి విలువ కట్టలేమని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) తెలిపారు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన చిన్ననాటి స్నేహితులు అనేక రంగాల్లో ఉన్నా తనతోనూ ఉన్నారన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన అనంతరం తన చిన్ననాటి స్నేహితుడు శాస్త్రిని హైదరాబాద్‌లో కలిసినప్పుడు అతను పడ్డ సంతోషం నా గుండెలో పదిలంగా నిలిచిపోయింది.  స్నేహితులు బాధలో ఉన్నప్పుడు అండగా నిలవడంతో పాటు ఓదార్పు అందించడంలోనే స్నేహానికి విలువ దక్కుతుంది. స్నేహ బంధం జీవితంలో ఎంతో విలువైనది. నా స్నేహితులంతా ఇప్పటికి నాతో తమ సుఖాలు, బాధలను పంచుకుంటారు. వీలైనంతవరకు స్నేహితులకు ఆదుకోవడంలో ఆత్మసంతృప్తి ఉంది.   

లోకమంతా దాసోహం 
స్నేహమనే ఆ రెండు అక్షరాల పదానికి లోకమంతా దాసోహం. ఎప్పుడో చిన్నప్పుడు స్నేహంగా ఒకరికొకరం ఉన్నాం. ప్రస్తుతం ఉన్నత హోదాలో బ్రహ్మానందం ఉన్నా మమ్మల్ని పిలిచి ఆప్యాయంగా పలకరించడాన్ని మరిచిపోలేకపోతున్నాం. ఏటా మేమంతా కలిసి చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తు చేసుకొని సరదాగా గడుపుతున్నాం. 
– గుండవరపు అమరనాథ్, టీవీ మురళీకిషోర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement