విజయ తీరాల ‘తెర’చాప | Special Story On Gandhi Jayanthi | Sakshi
Sakshi News home page

విజయ తీరాల ‘తెర’చాప

Published Wed, Oct 2 2019 5:04 AM | Last Updated on Wed, Oct 2 2019 5:07 AM

Special Story On Gandhi Jayanthi - Sakshi

అహింసా సిద్ధాంతంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులకు ‘హీరో’ అయిన గాంధీజీ వెండితెర మీద మాత్రం హీరో కాకుండా ఉంటాడా?. వెండితెరపై ఆయనను చూసుకోకుండా ఈ దేశం ఎలా ఉంటుంది. అయితే ఈ పని చేసిన ఘనత భారతీయ దర్శకుడికి, గాంధీగా నటించి మెప్పించే అదృష్టం భారతీయ నటుడికి దక్కకపోవడమే ఇందులో విశేషం. ‘గాంధీ’ పేరుతో 1982లో విడుదలైన బయోపిక్కే నేటికీ గాంధీజీకి సంబంధించిన ఉత్కృష్టమైన చిత్రం. దీనిని మించిన చిత్రం నేటి వరకూ భారతీయులు తీయలేదు.

బ్రిటిష్‌వారి సినిమా ప్లాన్‌
గాంధీ స్వాతంత్య్రోద్యమాన్ని నాయకస్థాయి నుంచి ప్రజాస్థాయి వరకు తీసుకెళ్లాడు. ఇది తట్టుకోలేని బ్రిటిష్‌ ప్రభుత్వం.. గాంధీని దెబ్బ కొట్టాలని, 1923లో డి.డబ్ల్యూ.గ్రిఫిత్‌ అనే దర్శకుడిని సంప్రదించి గాంధీ వ్యతి రేక చిత్రం తీయమంది. అయితే ఆ పని జరగలేదు.

గాంధీజీకి నచ్చని మాధ్యమం
గాంధీజీకి సినిమా మాధ్యమంపై సదభిప్రాయం లేదు. ఫాల్కే తీయగా దేశమంతా చూసిన తొలి టాకీ ‘రాజా హరిశ్చంద్ర’ను గాంధీ చూడనే లేదు. 1943లో విజయభట్‌ తీసిన ‘రామరాజ్య’ అనే సినిమాను
కొద్దిరీళ్లు మాత్రమే చూశారు. తన జీవితంలో గాంధీజీ చూసి న ఏకైక సినిమా అది. ‘సినిమాల వల్ల ఏం మేలుందో చె ప్పలేను కానీ, చాలావరకు సినిమాలు నాసిరక భావాలు కలిగినవి’ అనే అర్థంలో ఆయన ‘హరిజన్‌’ పత్రికలో రాశారు. గాంధీజీకి చార్లీచాప్లిన్‌ విశేషమైన అభిమాని. 1931లో 2వ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి వెళ్లినప్పుడు గాంధీజీ చాప్లిన్‌ను కలిశారు. చాప్లిన్‌తో మాట్లాడుతూ ‘యంత్రాలనేవి మనిషి శ్రమను తగ్గించాలి. బానిసత్వం నుంచి విముక్తం చేయాలి. వారిని పని నుంచి తొలగించే, మరింత పని కల్పించే భూతాలు కారాదు’ అని చర్చించారు. ఆ ఆలోచనకు చాప్లిన్‌ ఇచ్చి న గొప్ప సెల్యులాయిడ్‌ రూపమే ‘మోడరన్‌ టైమ్స్‌’.
 
నెహ్రూ ప్రయత్నాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక గాంధీజీ మీద ఒక పూర్తి స్థాయి సినిమా తీయాలని నెహ్రూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆశించాయి. 1958లో డేవిడ్‌ లియాన్‌ వంటి గొప్ప దర్శకుడు గాంధీజీ మీద రాసుకున్న స్క్రిప్ట్‌ ను నెహ్రూకు చూపాడు. అది ఓకే కాలేదు. 1962లో లండన్‌లో స్థిరపడ్డ గాంధేయవాది మోతీలాల్‌ కొఠారి నుంచి ప్రఖ్యాత దర్శకుడు అటెన్‌ బరోకు పిలుపు వచ్చింది ‘గాంధీ’ సినిమా తీయాలని. అటెన్‌బరో ఈ ప్రయత్నాల్లో ఉండగానే 1963లో  గాంధీజీపై సినిమా తీయాలనే ప్రభుత్వ ఆలోచనను విరమించుకుంటున్నట్టు నెహ్రూ చెప్పాడు. 18 ఏళ్ల పాటు శ్రమించి, ‘గాంధీ’ సినిమా తీశాడు. సినిమా ప్రారంభానికి నిధుల సమస్య ఎదురైనప్పుడు ఇందిరాగాంధీ సిఫార్సుపై నేషనల్‌ ఫిలి మ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రాథమిక నిధిని విడుదల చేసింది. ఆ సమయంలో తెలుగువాడైన డీవీఎస్‌ రాజు కార్పొరేషన్‌ చైర్మన్‌. 

బెన్‌కింగ్‌స్లే
గాంధీ పాత్ర పోషించే అదృష్టం బ్రిటిష్‌ నటుడు బెన్‌కింగ్‌స్లేకు వరించింది. బెన్‌కింగ్‌స్లే ఆ పాత్ర పోషించడానికే జన్మించాడా అన్నట్టు ప్రేక్షకులను మైమరిపించా డు. అదీగాక అతని తండ్రి తరఫు పూర్వీకులు గుజరాత్‌కు చెందినవారన్నది సంతోషపరిచే విషయమైంది. 1982 నవంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. బెన్‌కింగ్‌స్లేను ఆస్కార్‌ అవార్డు వరించింది. 

దేశీయతెరపై గాంధీ
ఇక తెలుగు, హిందీ భాషల్లో గాంధీ ప్రభావంతో గాంధీ పాత్రధారిగా చాలా సినిమాలు వచ్చాయి. గూడవల్లి రామబ్రహ్మం తొలిరోజుల్లో తీసిన సినిమాలు ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ గాంధీ ప్రభావం కథాంశంగా రూపొందించినవే. 1974లో లక్ష్మీదీపక్‌ తీసిన ‘గాంధీ పుట్టిన దేశం’ మరో ముఖ్యమైన సినిమా. కె.బాలయ్య ‘ఊరికిచ్చిన మాట’, కె.విశ్వనాథ్‌ ‘జననీ జన్మభూమి’ సినిమాలు ఎంచదగినవి. గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యాన్ని, ఆ స్వరాజ్యం సాధించడానికి పడాల్సిన సంఘర్షణను కె.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రవీణ’ సమర్థంగా చూపించింది.   యమున నటించిన ‘మౌనపోరాటం’ గాంధీజీ దీక్షాశక్తిని చూపించేదే. అహింసే అసలైన పోరాటమార్గమని చెప్పడానికి కృష్ణవంశీ ‘మహాత్మ’ తీశాడు. గాంధీజీని ప్రస్తావించే పాటలు కూడా తెలుగులో ఉన్నాయి. ‘గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం’ (గాంధీ పుట్టిన దేశం), ‘గాంధీ పుట్టిన దేశమా ఇది’ (పవిత్రబంధం), ‘భలే తాత మన బాపూజీ’ (దొంగరాముడు), ‘కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ’ (మహాత్మ).. ఇలా అనేకం. 

లగే రహో మున్నాభాయ్‌
గాంధీ ప్రభావంతో హిందీలో అశోక్‌ కుమార్‌ తీసిన ‘అఛూత్‌ కన్య’ మొదటిది. శ్యాం బెనగళ్‌ ‘గాంధీ సే మహాత్మా తక్‌’, మహెబూబ్‌ ఖాన్‌ ‘మదర్‌ ఇండియా’, హృషికేశ్‌ ముఖర్జీ ‘సత్యకామ్‌’, శాంతారామ్‌ ‘దో ఆంఖే బారాహాత్‌’ గాంధీ ప్రభావంతో రూపుదిద్దుకున్నాయి. ‘సర్దార్‌’లో, ‘బాబాసాహెబ్‌ అంబేద్కర్‌’లో, కమల్‌హాసన్‌ తీసిన ‘హే రామ్‌’లో గాంధీజీ ఒక పాత్రగా కనపడతాడు.  గాంధీ సిద్ధాంతాన్ని వినోదాన్ని ముడిపెట్టి  హిట్‌ కొట్టిన సినిమా ‘లగేరహో మున్నాభాయ్‌’. రాజ్‌కుమార్‌ హిరాణి తీసిన ఈ సినిమా ఈ తరానికి గాంధీని మళ్లీ పరిచయం చేసింది.  
– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement