హిరాస్‌మెంట్‌ | special story to Harassment | Sakshi
Sakshi News home page

హిరాస్‌మెంట్‌

Published Fri, Jan 5 2018 11:54 PM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

special  story to Harassment - Sakshi

కొందరు మగవాళ్లు ఎందుకింత హైన్యంగా ఉంటారు.
కొందరు మగవాళ్లు ఎందుకింత నీచంగా ఉంటారు?
కొందరు మగవాళ్లు ఎందుకింత దిగజారుడుగా ఉంటారు?
కొందరు మగవాళ్లు ఎందుకింత ఆకలితో రగులుతుంటారు?
మనిషి చాలా లక్షణాలను వదుల్చుకున్నాడు.
స్త్రీలను వేధించే లక్షణం వదల్చుకోలేడా?

సెక్రటరీ అనగానే ఆమె బాస్‌ ఒళ్లో కూర్చుని ఉంటుందని,  పని మనిషి అనగానే ఆమె ఇంటి యజమానికి లొంగి ఉంటుందనీ.. వందల ఏళ్లుగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం సాగింది. ఇవన్నీ ఇవాళ పురుషుడు తెగబడుతున్న అత్యాచారాలకు బేస్‌మెంట్‌ అయ్యాయి.  ఆ బేస్‌మెంట్‌ని పెకిలించడానికి ఇప్పుడిప్పుడే బాధిత  మహిళలు బయటికి వస్తున్నారు. ఆ స్నేహితుడు తన స్నేహితుణ్ణి చిట్‌ ఫండ్‌ కేసులో ఇరికించి జైలుకు పంపాడు. తల్లి లేని ఆ స్నేహితుడి ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు. పెద్దమ్మాయికి పన్నెండు. పిల్లాడికి ఎనిమిది. ఇద్దరూ తమను ఆదరిస్తున్న నానమ్మ వైద్య సహాయం కోసం ఏ స్నేహితుడైతే తమ తండ్రిని జైలుకు పంపాడో ఆ స్నేహితుడి దగ్గరకే సాయానికి వస్తారు. ఎదురుగా ఉన్నది పన్నెండేళ్ల చిన్నపిల్ల. అడిగింది కొద్దిపాటి సాయం. ఆ స్నేహితుడు ఏం చేయాలి? మరో వ్యక్తికి ఫోన్‌ చేస్తాడు. ఎదురుగా పన్నెండేళ్ల పిల్ల ఉందని చెప్తాడు. ‘పని అడిగావుగా. రెడీగా ఉంది పదా’ అని అభం శుభం తెలియని ఆ చిన్నారిని హోటల్‌ రూమ్‌కు తీసుకువెళతాడు. అక్కడ ఆ చిన్నారి బాల్యం ఛిద్రమవుతుంది. ఈ దృశ్యం కమలహాసన్‌ నటించిన ‘మహానది’లోనిది. మగవాళ్లు కొందరు ఎందుకింత హైన్యంగా ఉంటారు.

ఆ అమ్మాయికి మంచి మార్కులు వచ్చాయి. న్యాయంగా రావాల్సిన మెడికల్‌ సీటు. కాలేజ్‌ యజమాని దగ్గరకు వెళ్లి సీట్‌ అడిగితే ఇస్తానన్నాడు. కాని రోజూ క్లాసులు అయ్యాక అతని గెస్ట్‌హౌస్‌కు వచ్చి ఒక గంట ఉండిపోవాలట. చదువు ఇచ్చినందుకు బదులుగా వేరే ఏదో అడుగుతున్నాడు. అది ఇస్తేనే పని జరుగుతుంది లేకుంటే లేదు.\ చదువే జీవితం అనుకనే అమ్మాయికి ఇది ఎంత పెద్ద కష్టం. ఈ సన్నివేశం రజనీకాంత్‌ ‘బాషా’లోనిది. మగవాళ్లు ఎందరో ఎందుకింత దిగజారుడుగా ఉంటారు?

అతడికి మాటలు రావు. చెవులు వినిపించవు. కాని కళ్ల నిండా కోరికే. అందుకే తమ్ముడి భార్య మీద కోరిక నింపుకున్నాడు. తమ్ముడికి అన్న అంటే అభిమానం. నమ్మకం. కాని అతడు ఆమె కోసం కాచుకుని ఉన్నాడని ఆమెకు మాత్రమే తెలుసు. ఇది భర్తకు ఎలా చెప్పాలి. బావగారి నుంచి ఎలా కాపాడుకోవాలి. పెద్ద హరాస్‌మెంట్‌... అనుక్షణం క్షోభ. ఇది అజిత్‌ నటించిన ‘వాలి’ సినిమాలోని సన్నివేశం. కొందరు మగవాళ్లు బంధువులైనా సరే ఎందుకింత ఆకలితో రగులుతుంటారు?

ఆ అమ్మాయి బాగా పాడుతుంది. కాని అది సరిపోదట. సింగర్‌గా సెటిల్‌ కావాలంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌తో ఎక్కడికో పోవాలట. అప్పుడే ఆమెను కెరీర్‌లో ఎక్కడికో చేరుస్తాడట. అవకాశం ఇవ్వాలంటే టాలెంట్‌ను చూడాలి. మగవాడైతే ప్రమాదం లేదు. కాని స్త్రీ అనేసరికి శరీరం ముందుకు వస్తుంది. కళ్లు, ముక్కు, చెవులు... ఇతర అవయవాలు ఊరిస్తూ ఉంటాయి. వాటి కోసం ఎర వేస్తారు. ఇస్తే సరే. ఇవ్వకపోతే వేధింపులు. నాగార్జున నటించిన ‘కింగ్‌’ సినిమాలోని సీన్‌ ఇది. సంఘంలో ఎంతో ఎదిగిన మగవాళ్లైనా సరే ఎందుకిలా కుక్కబుద్ధితో కాచుకుని ఉంటారు?
    
‘ఓ.కే’, ‘ఇట్స్‌ ఓకే’, ‘నో ఇష్యూస్‌’, ‘నెవర్‌మైండ్‌’, ‘పర్వాలేదు’, ‘సరే’ వంటి మాటలు కొందరు మగవాళ్లు మర్చిపోతారు. వాటిని అనడం వారికి రాదు. ఎదుటి వారి నుంచి ‘నో’ అనే మాట వినపడితే ‘అలాగే’ అని జవాబు చెప్పడం బహుశా పెంపకంలోని లోపం వల్లో, విద్యాభ్యాసంలోని వెలితి వల్లో, నాలుగు పుస్తకాలు చదివి సరిౖయెన స్నేహాలు ఏర్పరుచుకోకపోవడం వల్ల స్థిరపడిన వ్యక్తిత్వదోషం వల్లో ఎదుటివారు ‘నో’ అన్నప్పుడు ‘ఇట్స్‌ ఓకే’ అనేంత హుందాతనం వీళ్లు కలిగించుకోలేకపోతారు. ‘ఎస్‌’ అనే మాటే వారికి కావాలి. ‘ఎస్‌’ కోసం ఎంతదూరమైనా పోతారు. పట్టుబడితే కటకటాల వెనక్కైనా సరే. స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ సహజం. కాని సంస్కారం అనే గీత సంఘం ఎప్పుడో గీచింది. ఆ గీతను తేలిగ్గా తీసుకోవడం ఆ గీతను దాటి రావాలని చూడటం మగవాడు అలవాటుగా చేసుకున్నాడు. స్త్రీను ఇచ్చే వ్యక్తిగా తనను పుచ్చుకునేవ్యక్తిగా మెదడులో స్థిరపరుచుకున్నాడు. పుచ్చుకోవడం తన హక్కు అనే వరకూ వెళ్లాడు. స్త్రీకి నష్టం కలిగిస్తున్నాడు. తాను నష్టపోతున్నాడు.

విత్తనము, స్త్రీ... రెండూ ప్రకృతిలో విలువైనవే అని పురుషుడు కనిపెట్టాడు. అందుకే విత్తనాన్ని మూటగట్టి స్త్రీని ఇంట్లో పెట్టి ప్రయివేటు ఆస్తిగా మార్చుకున్నాడు. పూర్వం సంకెళ్లతో కట్టి ఆమెను గుహలో బంధించేవాడు. కాలం గడిచే కొద్దీ నల్లపూసలు కట్టి, తాళిబొట్టు మెడన కట్టి, వేలికి ఉంగరాలు తొడిగి తన ఆస్తిగా ప్రకటించుకుంటూ ఉంటాడు. ఆమె మనసు చలించకుండా అడ్డుకునేందుకు పురాణాలను, పతివ్రతల కథలను లిఖించుకున్నాడు కాని తన సౌఖ్యం మాత్రం స్త్రీ సాంగత్యంలోనే అని ప్రచారం చేసుకున్నాడు. చివరకు చనిపోయాక స్వర్గం కోసం పాకులాడేది కూడా అక్కడ ఉండే అప్సరసల సాంగత్యం కోసమే అన్నట్టుగా భావజాలం స్థిరపరుచుకున్నాడు. శారీరకంగా బలమైన తనకు బలహీనమైన స్త్రీ లొంగి ఉండాలని అతడు నమ్ముతాడు. లైంగిక ఈ అంతరానికి సామాజిక అంతరం కూడా తోడైతే ఇక ఆ అహంకారానికి అడ్డే ఉండదు. తెల్లవాడికి నల్ల బానిస స్త్రీ, ధనవంతునికి పేదరాలైన స్త్రీ, పెద్ద కులం వానికి తక్కువ కులం స్త్రీ, భూస్వామికి పాలేరు స్త్రీ, యజమానికి ఉద్యోగిని అయిన స్త్రీ... లొంగి ఉండాలని లేకుంటే ప్రమాదం అని అతడు ప్రచారం చేసుకున్నాడు. మన వ్యాపార సాహిత్యం, సినిమాలు, కార్టూన్లు, జోకులు... కూడా ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా ప్రచారం చేసి బుర్రల్లో బాగా నాటాయి. సెక్రటరీ అనగానే ఆమె బాస్‌ ఒళ్లో కూర్చుని ఉంటుందని చేసిన ప్రచారం, పని మనిషి అనగానే ఆమె ఇంటి యజమానికి లొంగి ఉంటుందనే ప్రచారం కనీసం వంద ఏళ్లుగా వివిధ మాధ్యమాల ద్వారా సాగింది. ఇవన్నీ ఇవాళ పురుషుడు తెగబడుతున్న అత్యాచారాలకు బేస్‌మెంట్‌ అయ్యాయి. గజల్‌ శ్రీనివాస్‌ ఉదంతం మొత్తం ఈ భావజాలానికి ఒక కొనసాగింపు.

ఏ ధర్మమైనా ఆశ్రితులకు రక్షగా నిలబడమని చెబుతుంది. కాని దేశంలో చాలా వేధింపులు తమను ఆశ్రయించేవారి మీదే జరుగుతున్నాయనడానికి రుజువులు ఉన్నాయి. పని కోసం ఆశ్రయించినవారిపై, ఉద్యోగాల కోసం ఆశ్రయించినవారిపై, సహాయం కోసం ఆశ్రయించినవారిపై, ఆధ్యాత్మికత కోసం ఆశ్రయించిన వారిపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఇవి చేసేటప్పుడు పురుషుడు తన హోదాను, స్థాయిని మర్చిపోతున్నాడు. లేదా ఆ హోదాను, స్థాయినే ఆయుధంగా చేసుకుంటూ ఉన్నాడు. సూపర్‌ కాప్‌గా వాసికెక్కిన కె.పి.ఎస్‌.గిల్‌ తన కింద అధికారిణితో అభ్యంతరకరంగా ప్రవర్తించిన కేసు, ఇన్ఫోసిస్‌కు ఆయువు పట్టుగా ఉన్నటువంటి ఫణీశ్‌ మూర్తి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు, సంచలన కథనాలతో ప్రభుత్వాన్ని గడగడలాడించిన పత్రికా విలేకరి తరుణ్‌ తేజ్‌పాల్‌ తన సహోద్యోగిని లిఫ్ట్‌లో వేధించిన కేసు... ఇవన్నీ పురుషస్వామ్య భావజాలానికి ప్రతీకలే. ఇక తవ్వేకొద్దీ సంచలనాలు బయటపడ్డ డేరా బాబా ఉదంతం ఇటీవల చూశాం. పురుషుడి నుంచి లంచం ఆశించాలి, స్త్రీ నుంచి శరీరం ఆశించాలి అనే దుర్లక్షణం మగజాతిలో ఎందుకు ఉందన్న ప్రశ్నను వేసుకుని, దానికి ఎటువంటి టీకాను వేసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించామా మనం?

కడుపులో ఉన్నది ఆడపిల్ల అనగానే భ్రూణ హత్యలు, మనమ్మాయి చేసుకున్నది వేరొక కులము మతమూ వాడిని అనగానే పరువు హత్యలు, ఇంట్లో ఆడపిల్లల పట్ల ప్రదర్శించే వివక్ష, డబ్బిచ్చి కొనుక్కుంటే తప్ప ఆమెకు వరుడు దొరకడు అని అనుకునే దురాచారం, గృహ హింస, ఆలయాల్లో ప్రవేశ నిరోధం, అనేక ఉద్యోగరంగాల్లో ప్రవేశ నిరోధం... ఇవన్నీ స్త్రీని పీడింపబడే వ్యక్తిగా పురుషుణ్ణి పీడించే వ్యక్తిగా స్థిరపరుస్తున్నాయి నిర్థారిస్తున్నాయి ప్రోత్సహిస్తున్నాయి. మనిషి చాలా లక్షణాలను వదుల్చుకున్నాడు. స్త్రీలను వేధించే లక్షణం వదల్చుకోలేడా? ఇల్లు, గుడి, బడి, ఆఫీసు, వీధి, మార్కెట్‌... ఇవన్నీ స్త్రీని గౌరవించినప్పుడు లైంగిక వేధింపులు, అత్యాచారాలు క్రమంగా అంతరించిపోతాయి. లేకుంటే ఇవాళ ఒక గజల్‌ శ్రీనివాస్‌ రేపొక కజిన్‌ శ్రీనివాస్‌ పుట్టుకొస్తూనే ఉంటారు.
– సాక్షి ఫీచర్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement