
అమృతం అంటే మృతి చెందనివ్వనిది అని అర్థం చెప్పుకుంటే అది బహుశా అమ్మపాలే కావచ్చు. ఈ నెల 10న మదర్స్ డే సందర్భంగా మాతృత్వంతో బిడ్డను సాకే పిల్లల ఆరోగ్యానికి తల్లి పాలెలా ఉపయోగపడతాయో, అవి బిడ్డకు ఎంతటి మేలు చేస్తాయో, పాలివ్వడం వల్ల తల్లికీ కలిగే మేలు ఏమిటో లాంటి అనేక అంశాలను తెలుసుకుందాం.
తల్లిపాలలో బిడ్డలో తప్పక జరగాల్సిన అనేక జీవరసాయన చర్యలను ప్రేరేపించే ఎంజైములు, హార్మోన్లు, పెరుగుదలకు తోడ్పడే అంశాలు ఉంటాయి. వ్యాధినిరోధకతను పెంచే అత్యావశ్యక అంశాలూ ఉంటాయి. కళ్లకూ, మెదడు, నాడీ మండలానికి మేలు చేసే పదార్థాలెన్నో ఉంటాయి. తల్లి పాలతో ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని జబ్బులు చాలా ఆలస్యమవుతాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కనీసం ఆరు నెలలకు తగ్గకుండా బిడ్డకు తల్లిపాలే పట్టాలని సిఫార్సు చేస్తుంది. తల్లిపాల కారణంగా బిడ్డకు కలిగే మేళ్లలో కొన్ని ఇవి..
♦జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు జీర్ణకోశానికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా తేలిగ్గా అరుగుతాయి. తల్లిపాలు తాగే బిడ్డకు విరేచనం తేలిగ్గా అవుతుంది. తద్వారా బిడ్డలోని బిలురుబిన్ ఈ మార్గంలో వెళ్లిపోవడం వల్ల బిడ్డకు కామెర్లు రావు.
♦బిడ్డ పుట్టాక తల్లిలో ఊరే పసుపుపచ్చ రంగులో ఉండే ముర్రు పాలతో ఇమ్యూనోగ్లోబ్యులిన్–ఏ అనే వ్యాధి నిరోధకశక్తి అత్యధికంగా ఉండి, వాటి వల్ల మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది.
♦పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి ఊపిరితిత్తుల జబ్బులు, ఎగ్జిమా వంటి చర్మసమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. పోతపాల అలర్జీల కారణంగా ఇలా జరుగుతుంది. తల్లి పాల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తవు. అంతేకాదు, తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు, చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. అలాగే ఊబకాయం (ఛైల్డ్ ఒబేసిటీ) వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
♦తల్లిపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడు క్యాన్సర్లు (ఛైల్డ్‌హుడ్ క్యాన్సర్లు) వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
♦పెద్దయ్యాక వచ్చే గుండెజబ్బులు, టైప్–2 డయాబెటిస్ వంటివి కూడా నివారితమవుతాయి.
♦తల్లిపాల వల్ల బిడ్డకూ, తల్లికీ మధ్య ఓ చక్కటి అనుబంధం వృద్ధి చెందుతుంది.
పాలిచ్చే తల్లికి కొన్ని సూచనలు:
♦ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే వేటమాంసం, కోడిమాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, బీన్స్ వంటివి ఎక్కువగా తీౖసుకోవాలి. మాంసాహారం తినని వారు చిక్కుళ్లూ, డ్రైఫ్రూట్స్, నట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
♦రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయల వంటి వాటిని మార్చిమార్చి తింటూ ఉండాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా కొంతవరకు మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు.
♦పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. అది అపోహ మాత్రమే. బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. అందుకే దాహమైనా కాకపోయినా తల్లి నీళ్లు తాగుతుండాలి.
♦తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి.
♦ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్–సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. దాంతో అటు తల్లికీ, బిడ్డకూ ఐరన్‌తో పాటు ఇటు వ్యాధి నిరోధక శక్తి కూడా సమకూరుతుంది.
♦తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి.
♦విటమిన్ బి12తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు విటమిన్ బి12, విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.
పాలిచ్చే తల్లి తీసుకోకూడనివి
కెఫిన్ ఉండే పదార్థాలు : పాలిచ్చే సమయంలో కెఫిన్ పుష్కలంగా ఉండే కాఫీలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే మాత్రం రోజూ రెండు కప్పులకు మించనివ్వవద్దు.
సముద్రపు చేపలు : చేపలు మంచి పౌష్టికాహారమే అయినా... కొన్నిరకాల సముద్రపు చేపల్లో మెర్క్యూరీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మెర్క్యురీ బిడ్డలో నాడీవ్యవస్థ ఎదుగుదలపై దుష్ప్రభావం చూపుతుంది. కొన్నిరకాల సముద్రపు చేపలు తీసుకున్న తర్వాత పట్టే పాలు బిడ్డకు అలర్జీ కలిగించవచ్చు. అందుకే బిడ్డకు పాలు పట్టే సమయంలో సీ ఫిష్‌ను ఆహారంగా స్వీకరించక పోవడమే మంచిది.
బిడ్డకు పాలు పడుతుండటం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాల్లో కొన్ని..
♦పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాదు... బిడ్డకు పాలిచ్చే ప్రక్రియ అన్నది... ప్రసవం తర్వాత గర్భసంచి ఆరోగ్యకరంగా ముడుచుకుపోయేలా చేస్తుంది.
♦తల్లులు పాలు ఇస్తున్నంత కాలం వాళ్లు లావెక్కరు. ఇది వారిలోని సౌందర్యాన్ని ఇనుమడింపజే యడంతోపాటు బరువు (ఒబేసిటి) రిస్క్ ఫ్యాక్టర్‌గా గల అనేక జబ్బుల నుంచి సహజ రక్షణ లభిస్తుంది.
♦తల్లుల్లో పాలు పడుతున్నంత కాలం ప్రకృతి సిద్ధంగానే గర్భధారణ జరగకుండా రక్షణ ఉంటుంది. అంటే పాలు పట్టడం ఒకరకంగా గర్భనిరోధకంగా పనిచేస్తుంది. (అయితే కొన్నిసార్లు గర్భంరావచ్చు కూడా).
♦పాలిచ్చే తల్లులకు అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది. డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ.
♦చర్మం బాగా ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment