తూర్పు సముద్రం అంచుల్లో దాగిన సూరీడు తల నిమిరి పెందలాడే నిద్ర లేపుతుంది అమ్మ. వీధి గుమ్మం తెరిచి ఇంట్లోకి ప్రాణవాయువును ప్రసరింపజేస్తుంది అమ్మ. కళ్లాపి జల్లి జగత్తును మంగళకరం చేస్తుంది అమ్మ. కసువు ఊడ్చి నేలన ఉన్న చెడును శుభ్రం చేస్తుంది అమ్మ. ఎవరో పురాణపురుషుడు భూమిని భుజాన మోశాడని అంటారు. నిత్యం దానిని తన కొంగున చులాగ్గా కట్టుకుని తిరిగే బలశాలి అమ్మ. అమ్మ నుంచి జీవం మొదలవుతుంది. అమ్మ నుంచి ఆయువు ఉనికిలోకి వస్తుంది. అమ్మ నుంచి ౖచైతన్యం అందుతుంది. అమ్మ నుంచి కంఠానికి నాలుగు మాటల మూట దొరుకుతుంది. పిల్లలకు రెక్కల సత్తువనిస్తుంది అమ్మ. నాన్నతో పాటు తాను కూడా గింజలకు ఎగురుతుంది అమ్మ. అనుక్షణం ఇంటిని తన రెక్కల కింద పొదువుకుంటుంది అమ్మ. అమ్మకు నిన్న తెలుసు. అమ్మకు రేపు తెలుసు. 365 రోజులు పొయ్యిని వెలిగిస్తూ ఉండే అగ్నిశక్తి అమ్మ. అందుకు కేలండర్ గళ్లలో వెచ్చాల పట్టీని ఎలా సర్దాలో స్పెషలైజేషన్ చేస్తుంది అమ్మ. ఇంటింట్లో ఉండే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అమ్మ. అకస్మాత్తుగా వచ్చి పడే ఖర్చులను తన మంత్రదండాన్ని తిప్పి దాచిన సొమ్ముతో గట్టెక్కించేది అమ్మ.
అమ్మ అక్షరాలు దిద్దించే టీచర్. అమ్మ పిల్లల తరఫున వాదనలు వినిపించే లాయర్. పంట పండించడం తెలిసిన ఫార్మర్. సమస్త కులవృత్తులలో నాన్నకు హెల్పర్, నాన్నతో పాటు కొంగు నడుమున బిగించి పనిలోకి దిగే పార్టనర్. అమ్మకు దిగుడుబావిలో దిగి నీరు మోయడం తెలుసు. ఆకాశానికి ఎగిరి విశ్వ రహస్యాలు శోధించడం తెలుసు. పశువులను మేతకు దారి చూపటం తెలుసు. గగనాన్ని చీలుస్తూ ప్రయాణికులను గమ్యానికి చేర్చడమూ తెలుసు. జబ్బు చేస్తే సూదిమందు వేయగలదు. ఆర్థికంగా జబ్బు చేస్తే నిపుణురాలై పరిష్కారం చూపగలదు. అమ్మకు ఇంటి పట్టున ఉండటం ఇష్టం. అమ్మకు ఒక మోటర్ సైకిల్ మీద హిమాలయాలు చుట్టి రావడం కూడా ఇష్టం. అమ్మకు తన బిడ్డలకు పాలివ్వడం ఇష్టం. అమ్మకు ప్రజలను పరిపాలించడం కూడా ఇష్టం. అమ్మకు అణువుగా ఉండటం ఇష్టం. అంతలోనే బ్రహ్మాండంగా మారడమూ ఇష్టం. అమ్మకు కుటుంబం ఇష్టం. అమ్మకు ప్రపంచమూ ఇష్టం. అమ్మ పూజలందుకునే దేవత. అమ్మ చెడును సంహరించే ఏలిక. ఆమే రక్ష. ఆమే దక్ష. అమ్మ.. రోజూ మన కళ్ల ముందు ఉండే అద్భుతం. అమ్మే ఎన్నటికీ అబ్బురం. ఆ సర్వస్రష్టకు వందనం. వేనవేల విధాలుగా అభివందనం.
రాజమాత
అమ్మ తాపత్రయం ఎప్పుడూ తన సంతానం కోసమే. అది ఒక్కోసారి ప్రేమలా కనిపించవచ్చు. ఒక్కోసారి స్వార్థంలా అనిపించవచ్చు. ఏం చేసినా దానిని తల్లి మనసుగా అర్థం చేసుకోవాలి. రామాయణంలో రాముడి తల్లి కౌసల్య రాముడు పట్టాభిషిక్తుడు కావాలని కోరుకుంది. కాని భరతుడి తల్లి కైకేయి భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, సవతి కొడుకు అడవుల పాలవ్వాలని దురాలోచన చేసింది. లక్ష్మణుడి తల్లి సుమిత్ర నా కుమారుడు లక్ష్మణుడు అన్నగారికి అడవులలో సేవలు చేయాలని కోరుకుంది. భారతంలో వందమంది కౌరవుల తల్లి గాంధారి తన బిడ్డలు చేసే తప్పులను వ్యతిరేకించలేకపోయింది. ఆమెలోని మాతృప్రేమ ఆమెను గుడ్డిదాన్ని చేసింది. మాద్రి సంతానాన్ని కూడా తన బిడ్డలుగానే చూసుకుని పంచ పాండవులకు తల్లి అయింది కుంతి. బకాసురుడు ఇంటికొక మనిషిని ఆహారంగా కోరుకున్నప్పుడు ‘నాకు ముగ్గురు కుమారులు, మాద్రికి ఇద్దరు కుమారులు, నా కుమారులలో ఒకరిని ఆహారంగా పంపుతాను. అప్పుడు నాకు కూడా ఇద్దరు కుమారులు మిగిలినట్లు’ అని భీముడిని పంపింది. ఏ తల్లిలోనైనా కన్నపేగు కారణంగా స్వార్థం ఉంటుంది. మరి అన్ని సందర్భాలలోనూ తల్లి స్వార్థంగా ఉండకపోవడం కనిపిస్తుంది.
కన్న మమకారం... పెంచిన ప్రేమ
శ్రీకృష్ణుడిని కన్నతల్లి దేవకీ దేవి. కొడుకు ప్రాణాలతో ఉంటే చాలనుకుని పసికందుగా ఉన్నప్పుడే భర్త చేతికి ఇచ్చి నందుని ఇంట దింపి రమ్మంది. ఇక నందుని భార్య యశోదమ్మ అయితే తన చిన్ని కన్నయ్య పూతన విషపు పాలు తాగాడని తల్లడిల్లింది.. క్షేమంగా బయట పడినందుకు దిష్టితీసింది. బాలకృష్ణుడి అల్లరి అంతటినీ భరించింది. ఒకానొక సమయంలో అయితే ఓపిక చచ్చిపోయి రోటికి కట్టేసింది. ముల్లోకాలనూ పాలించేవాడికే కన్నతల్లి అయిన ఆ యశోదమ్మది ఎంతటి అదృష్టం! బాల్యం నుంచే నీకు దూరంగా ఉన్నాను కన్నయ్యా... నీ ముద్దుముచ్చట్లు ఎప్పుడు చూడాలి అని అడిగి మరుజన్మలో వకుళ మాతగా పుట్టింది దేవకీ దేవి.
తన పెంపుడు కొడుకు ఆకాశరాజు కుమార్తెను చూసి ఇష్టపడి ఆ విషయం బయటకి చెప్పలేక మథన పడుతుండటాన్ని కనిపెట్టి, స్వయంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి కొడుకు గుణగణాల గురించి వివరించి, నీ ప్రియపుత్రిక పద్మావతిని నా కుమారుడైన శ్రీనివాసునికిచ్చి పెళ్లి చేయమని అడిగిన ధైర్యశాలి. భాగ్యశాలి. బాణాసురుని తల్లి కోటర, తన కుమారుడికి, శ్రీకృష్ణుడికి జరుగుతున్న ఘోర యుద్ధంలో వెయ్యి చేతులూ తెగిపోయి శ్రీ కృష్ణుని చేతిలో హతం అవబోయే స్థితిలో కొడుకును కాపాడుకోవాలనుకుంది. వొంటిమీద వలువలు విప్పేసి, జుట్టు విరబోసుకుని హాహాకారాలు చేస్తూ కృష్ణునికి ఎదురుగా నిలబడింది. అప్పుడు కృష్ణుడు దయతలిచి ధనుస్సును పక్కన పెట్టి యుద్ధం ఆపేసి, బాణాసురుడు పారిపోయేందుకు అవకాశం ఇచ్చాడు. తల్లి ప్రేమ అంటే అది.
Comments
Please login to add a commentAdd a comment