చిన్న కష్టం వస్తే మానసికంగా కుంగిపోయి.. ఆ కష్టంలోనే జీవితాంతం కూరుకుపోయే వాళ్లు ఎటు చూసినా కనిపిస్తారు. జీవితకాలానికి సరిపడేంత కష్టం బిడ్డ రూపంలో తన కడుపులోనే పుడితే.. ఆ తల్లి కుంగిపోలేదు.. ఆ బిడ్డనే ఓ బహుమతిగా స్వీకరించారు. తనను చుట్టుముట్టిన కష్టాలనే తన విజయాలకు సోపానాలుగా మలచుకున్నారు. ఆ మెట్లపై తన బిడ్డను వేలుపట్టి నడిపిస్తున్నారు. శరీరం ఎదుగుతున్నా మనసు ఎదగని ఆ పసిబిడ్డ చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తన విజయాలన్నీ ఆ బిడ్డ ఇచ్చినవే అని మురిపెంగా చెప్పే ఆ మాతృమూర్తిని ఈ మాతృదినోత్సవం రోజు పలకరించింది సాక్షి.
డాక్టర్ ఐతరాజు స్రవంతి మదర్ ఆఫ్ చందన్.. అవును ఆమెకు ఇలా చెప్పుకోవడం ఇష్టం గర్వకారణం కూడా. తనను చందన్ తల్లిగా ఈ ప్రపంచం గుర్తిస్తే.. అది తన ద్వారా తన బిడ్డ సాధించిన గొప్ప విజయం అంటారు ఈ తల్లి. చందన్ ఆటిజంతో పుట్టిన బిడ్డ. 19 ఏళ్లొచ్చినా చంటిపిల్లాడే. బిడ్డతోపాటే కష్టాలూ పుట్టాయి. అద్దె ఇల్లు దొరికేది కాదు, దగ్గరి బంధువులు, స్నేహితులు శుభకార్యాలకు చందన్ వద్దని చెప్పేవారు. నా బిడ్డ ఏం తప్పు చేశాడు.. లోపం వీడిలో కాదు.. వీణ్ని చూస్తున్న సమాజంలోనే ఉందని చందన్ చిన్నప్పుడే గుర్తించారు స్రవంతి. అందుకే మరో మంచి బిడ్డను కనమని అంతా సలహా ఇస్తే.. ఇంత అద్భుతమైన కొడుకు నాకున్నప్పుడు మళ్లీ కనడమెందుకన్నారు. అప్పటికే ఆమె సైకాలజీ స్టూడెంట్.. చందన్ పుట్టాక, ఆ బిడ్డకు ఆటిజం అని తెలిశాక తన బిడ్డ మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు ఆటిజంలో పీహెచ్‌డీ చేశారు. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఆటిజంపై కొన్ని వేల పుస్తకాలు సేకరించి, చదివి రీసర్చ్ చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి స్రవంతి. బిడ్డ కోసం నేను ఎన్నో నేర్చుకున్నానే తప్ప ఏదీ త్యాగం చేయలేదంటారు ఆమె. చిన్నప్పుడే నేర్చుకున్న కర్నాటక సంగీతాన్ని తన బిడ్డ.. మనసులో మాటల్ని చెప్పడానికి ఆయుధాల్లా మలచిన తీరు ఆమె మాటల్లో వినాల్సిందే.
గొప్ప కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులిద్దరూ సాహితీప్రియులు. తండ్రి ప్రొఫెసర్. శంకరంబాడి సుందరాచార్యుల వారికి స్వయానా మేనకోడలు. చిన్న వయసులోనే సంగీతం, సాహిత్యం అబ్బాయి. చదువు పూర్తయ్యాక సాంఘిక సంక్షేమ శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ చేతినిండా సంపాదిస్తున్నారు.. అయినా ఏ రోజూ నాకు ఇలాంటి బిడ్డ ఎందుకని కుంగిపోలేదు. పిల్లాడిలోని పిసితనాన్ని అర్థం చేసుకోవడానికి ఇంటినే ఆటిజం ప్రయోగశాలగా మలచారు. అలాగని తన వ్యాపకాలను పక్కనపెట్టలేదు. రచయితగా, కవయిత్రిగా అనేక పుస్తకాలను, నవలలను రాశారు. సైకాలజిస్టుగా వందలాది టీవీ, రేడియో కార్యక్రమాలు నిర్వహించారు. సంగీత సృజనకారిణిగా ఎన్నో ప్రయోగాలు చేశారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత సైకాలజిస్టుల్లో ఒకరుగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్రపతి అవార్డు మొదలు.. ప్రఖ్యాత యూనిసెఫ్ ఇచ్చే ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు దాకా ఇంట్లో కొలువుదీరిన అవార్డులన్నీ ఆమె విజయాలకు దర్పణాలు. ఇవన్నీ.. బిడ్డకు అవసరమైనవి నేర్పుతూ.. తాను నేర్చుకుంటూ సాధించిన విజయాలుగా ఆమె చెప్తారు.
సాధారణ మానసిక వికలాంగులపై ప్రభుత్వాలకు ఉండే శ్రద్ధ ఆటిజం చిన్నారుల విషయంలో ఉండదు. ప్రపంచంలోనే ఆటిజం బిడ్డలపై చెప్పలేనంత నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యం ఉందంటారు స్రవంతి. అందుకే.. తన బిడ్డ తన ప్రయోగాలకు మూల వస్తువుగా ఉపయోగపడ్డాడని చెబుతారు. తన రీసెర్చ్ వర్క్ ఎంతోమంది ఆటిజం బిడ్డలకూ, వారి తల్లిదండ్రులకూ దిశానిర్దేశం చేసి వారికి మానసిక ప్రశాంతత ఇస్తుందంటారు స్రవంతి. గోల్డ్ మెడల్స్ సాధించి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డ బిడ్డల తల్లిదండ్రులు ఎంత తృప్తిగా ఉంటారో.. తాను అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు చెబుతున్నారు ఈ చందన్ తల్లి. డాక్టర్ ఐతరాజు స్రవంతి వల్ల చందన్ మోస్ట్ హ్యాపియస్ట్ బోయ్‌గా జీవిస్తున్నాడు... చందన్ కోసం ఆమె సాగించిన రీసెర్చ్ ఆటిజంతో పుట్టిన తల్లిదండ్రులకు ఓ వరం. ఆటిజంతో పుట్టిన ప్రతి బిడ్డా చందన్ అంత హ్యాపీగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటున్న స్రవంతి.. మోస్ట్ ఇన్‌స్పైరింగ్ మదర్.
Comments
Please login to add a commentAdd a comment