బిడ్డల కోసం తల్లులు ఎంతటి త్యాగమైనా చేస్తారు. తమకు ఎంతటి కష్టమొచ్చినా పంటిబిగువున భరిస్తూ పిల్లల మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటారు. వాళ్ల జీవితం బాగుండటానికి తమ జీవితమంతా ధారబోస్తారు. కానీ, ముప్పై ఏళ్లుగా తల్లిని కంటిపాపలా చూసుకుంటూ అమ్మకే అమ్మ అయ్యింది రాజేశ్వరి. వర్ధనమ్మ రెండవ సంతానంగా పుట్టింది రాజేశ్వరి. ఇద్దరూ ఆడపిల్లలే. ‘మా అక్క పదేళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ ప్రమాదంలో అమ్మకూ దెబ్బలు తగిలాయి. ఆ సంఘటన తర్వాత అమ్మ మానసికంగా మామూలు మనిషి కాలేకపోయింది. అమ్మను డాక్టర్లకు చూపించాడు. కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తున్నట్టుగానే ఉండేది. నేను స్కూల్‌కి వెళుతుండేదాన్ని. ఇంటిపనులు, నాన్న పడుతున్న ఇబ్బందులు చూసి చదువు మానేశాను. అనువైన సంబంధమని ఇరవై ఏళ్ల వయసులో నాకు పెళ్లి చేశాడు నాన్న. అత్తగారింటికి వెళ్లిపోయాను. ఏడాది గడుస్తుండగా ఓ రోజు అమ్మ డాబా మీద నుంచి కింద పడింది అని తెలిసి వెంటనే పుట్టింటికి వచ్చేశాను. ఆ ఏడాదే పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టించాడు నాన్న. మా ఇంటిపైన చుట్టూ రెయిలింగ్ పనులు పూర్తి కాలేదు.
వేసవి కాలం రాత్రిపూట ఉక్కపోస్తుందని గాలి కోసం పైన కెళ్లి పడుకున్న అమ్మ నిద్రలో లే చి కిందకు రాబోతూ రెయిలింగ్ లేని చోట కాలు వేసిందట. అంత ఎత్తు నుంచి కింద పడటంతో వెన్నుపూస విరిగింది. ఆ దెబ్బతో మంచానికే పరిమితం అయ్యింది. అమ్మకు సపర్యలు చేస్తూ నేను పుట్టింట్లోనే ఉండిపోయాను. నా భర్త వచ్చాడు తీసుకెళ్లడానికి. అమ్మను ఆ పరిస్థితిలో వదిలి రాలేనని, కోలుకున్నాక వస్తానని చెప్పాను. అలా ఏడాది అయ్యింది. అమ్మకు అన్నీ మంచం మీదే. ఏడాదిన్నర అయ్యింది పుట్టింట్లో ఉండి. ఓ రోజు తెలిసింది నా భర్త మరో ఆమెను పెళ్లి చేసుకున్నాడని. ‘మేం ఎలాగోలా ఛస్తాం.. నిన్ను అత్తగారింట్లో దింపి వస్తా పద..’ అంటూ నాన్న నా మీద కోప్పడ్డాడు. నేనే వద్దన్నాను. నా కష్టం తన కష్టం అనుకున్నవాడు నాకు భర్త అవుతాడు కానీ, తన స్వార్థం చూసుకున్నవాడు ఏమీ అవడని. నాన్న నాకు తెలియకుండా మా అత్తగారింటికి ఒకట్రెండు సార్లు వెళ్లి వచ్చాడు. కానీ, నా భర్త మళ్లీ నన్ను తీసుకెళ్లడానికి రాలేదు. నేనూ వెళ్లలేదు.
మా జీవితాలు ఇలా అయ్యాయే అనే బెంగ, నా కాపురాన్ని బాగు చేయలేక పోయానని నాన్న మానసికంగా కుంగిపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కొన్నాళ్లకు అనారోగ్యంతో నాన్న దూరమయ్యాడు. అమ్మకు నా కష్టం చెప్పుకోలేను. చెప్పుకున్నా ఆమెకు అర్థం కాదు. అమ్మను చంటిబిడ్డలా తన అవసరాలన్నీ కనిపెట్టుకుని చూస్తూ ఉంటాను. కొన్నాళ్లుగా నమల గలిగే ఆహారం ఏదీ తినలేకపోతోంది అమ్మ. ఏదైనా మెత్తగా చేసి పెట్టాలి. కొన్నాళ్లు ఉద్యోగుల చిన్నపిల్లలు చూసుకోవడానికే ఇంట్లోనే కేర్‌సెంటర్ పెట్టాను. టైలరింగ్ పనులు చేశాను. ఇప్పుడవేవీ చేయడం లేదు. ఇంట్లో కొంత భాగాన్ని అద్దెకిచ్చాను. దీంతో మా జీవితాలు గడిచిపోతున్నాయి’ అంటూ వివరించింది యాభై ఏళ్ల రాజేశ్వరి. వర్ధనమ్మ వయసు ఇప్పుడు డెభ్బైకి పైనే ఉంటుంది. ‘అమ్మకు అమ్మనయ్యే భాగ్యం ఎంతమందికి వస్తుంది’ అనే రాజేశ్వరి ఉంటున్నది సికింద్రాబాద్ మల్కాజిగిరిలోని ఆనంద్‌బాగ్‌లో. తల్లిని కూతురుగా చూసుకుంటున్న రాజేశ్వరికి మదర్స్ డే సందర్భంగా అభినందనలు చెబుదాం. - ఆరెన్నార్
Comments
Please login to add a commentAdd a comment