తలలందు బట్టతలలు వేరయా!
జుట్టు రాలిపోవడాన్ని, బట్టతలగా మారడాన్ని అలొపేషియా అంటారు. ఇందులోనూ చాలా రకాలుంటాయి. అవి...
స్కారింగ్ అలొపేషియా: ఈ తరహా రుగ్మతతో మూడు శాతం మందిలో జుట్టు రాలిపోతుంటుంది. దీనివల్ల రాలిపోయే జుట్టు మళ్లీ రాదు. ఎందుకంటే ఈ రుగ్మతలో ఫాలికిల్ శాశ్వతంగా దెబ్బతింటుంది. ఆ స్థానంలో స్కార్ కణజాలం భర్తీ అవుతుంది. అందుకే ఈ కారణంగా జుట్టు రాలిపోతే అది మళ్లీ మొలవదు. ఇలా జుట్టు రాలేటప్పుడు ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా ఉండి, ఆ ప్యాచ్‌లు క్రమంగా పెరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిన చోట కనిపించే ప్యాచ్‌లలో దురద, మంట, నొప్పి కూడా ఉండవచ్చు. డిసెక్టింగ్ సెల్యులైటిస్, ఇసినోఫిలిక్ పస్ట్యూల్ ఫాలిక్యులైటిస్, ఫాలిక్యులార్ డీజనరేషన్ సిండ్రోమ్, లెకైన్ ప్లానో పైలారిస్, సూడోపెలేడ్ ఆఫ్ బ్రాక్ అనే కండిషన్లు ఈ తరహా స్కారింగ్ అలొపేషియాకు కారణం.
బట్టతల : ఇందులో రెండు రకాల బట్టతలలు ఉంటాయి. మొదటిది పురుషుల్లో వచ్చే బట్టతల. దీన్నే ‘మేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’ అంటారు. ఇక రెండోది మహిళల్లో వచ్చే ‘ఫిమేల్ ప్యాట్రన్ హెయిర్‌లాస్’. బట్టతలను ‘యాండ్రోజెనిక్ అలొపేషియా’ అంటారు. అయితే నిన్నమొన్నటివరకూ పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల ఇది వచ్చేదన్న అపోహ ఉండేది. కానీ అత్యాధునిక పరిశోధనల ప్రకారం దీనికి టెస్టోస్టెరాన్ కారణం కాదనీ... ‘డీహెచ్‌టీ’ (డిహైడ్రో టెస్టోస్టెరాన్) కారణమని తేలింది. పురుషుల్లో వచ్చే బట్టతలలో నుదురు మీద ఉండే హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కిపోతూ ఉంటుంది.
మహిళల్లో వచ్చే ఫిమేల్ పాట్రన్ హెయిర్‌లాస్ అనే బట్టతలలో ముందున్న హెయిర్‌లైన్ అలాగే ఉండి, మాడు మీద జుట్టు పలచబారుతూ పోతుంటుంది. బట్టతలను నిర్ధారణ చేయడానికి పుల్‌టెస్ట్, ప్లక్‌టెస్ట్, స్కాల్ప్ బయాప్సీ, డెయిలీ హెయిర్ కౌంట్ (ఒకరోజు రాలిపోయే వెంట్రుకల సంఖ్య), ట్రైకోస్కోపీ అనే పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే బట్టతల వస్తోందని నిర్ధారణ చేశాక... తొలుత మినాక్సిడిల్, ఫెనస్టెరైడ్, డ్యూటస్టెరైడ్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. వాటితో ప్రయోజనం లేకపోతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి చికిత్సలతో పాటు మీసోథెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అండ్ డర్మారోలర్ వంటి అత్యాధునిక ప్రక్రియలను ఉపయోగించి చికిత్స తీసుకోవచ్చు. ఇక లేజర్ సహాయంతో చేసే ఇన్‌ఫ్రా రెడ్ లైట్ థెరపీ, లేజర్ కోంబింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి.