చర్మానికి మనసుంది!
స్కిన్ అండ్ స్ట్రెస్
ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ చర్మానికే ఉన్నట్లున్నాయి.
వాతావరణం మారితే... చర్మం మారుతుంది.
మనసు మారితే కూడా... చర్మం మారుతుంది.
‘‘హలో... మనసు మారితే చర్మం మారడమేంటి?
చర్మానికి ఏమైనా ఆలోచన ఉంటుందా?’’ అని అడిగితే...
‘‘అవును’’ అంటున్నారు నిపుణులు.
మానసిక ఒత్తిడి వల్ల... చర్మానికీ సమస్యలు వస్తాయని నిర్ధారణ అయ్యింది.
నిజమే... చర్మానికీ మనసుంది!
ఉద్యోగులంతా ఏకాగ్రతతో తమ పనులు కొనసాగిస్తున్నారు. ఎంత వేగంగా చేసినా కొండంత లక్ష్యంలో కొంతైనా పూర్తవుతుందా అన్నది సందేహమే. ఆఫీసులో ఉన్నది – గంటలు కొట్టే గడియారం. అదృష్టవశాత్తూ ఒంటి గంట కావొస్తోంది. ఇందాక 12 గంటల సమయంలో ఒక్కో గంటా టార్గెట్స్‌ను గుర్తు చేసింది. ఒక గంట కంటే మరో గంట మరింత కర్ణకఠోరంగా మోగుతూ 12 వార్నింగులిచ్చింది. కానీ ఇప్పుడు మోగబోయేది కేవలం ఒక గంటే కదా అనుకున్న స్టాఫ్‌కు ఆ గంటా అంత సాంత్వన ఇవ్వలేదు. పన్నెండు గంటలు కలిపి కొడితే ఎంత శబ్దం వస్తుందో... ఆ ఒక్క గంటతోనే అంతటి వార్నింగ్! అలా మరో మూడు, నాలుగు గంటలు గడిచాయి. ఉద్విగ్నపూర్వకంగా సీట్లలో ఇబ్బందిగా కదిలారు సిబ్బంది. పాక్షికంగానైనా పూర్తయిన లక్ష్యాల మాట ఎలా ఉన్నా... ఒక్కోక్కరికి ఒంటిపై ఒక్కో లాంటి రిజల్ట్! ఒకరిద్దరికి ఫేస్‌పై మొటిమలు పొటమరించాయి. మరొకరి ముఖం రాష్‌తో ఎర్రబారింది. ఇంకొకరు తలపై జుట్టు పీక్కున్నారు. మరికొందరి నోళ్లలో పొక్కులు కనిపించాయి.
అవును. ఇది నిజం. మానసిక ఒత్తిడి తాలుకు ప్రభావాలు ఇలా చర్మంపై రకరకాలుగా ఉంటాయి. ఇక దీర్ఘకాలంలో మరికొందరికి జట్టు రాలిపోతుంది. కొందరిలో గోళ్లూ ప్రభావితమవుతాయి.
ఇరువైపులా నలిగిపోయే చర్మం...
చర్మం... కోటి కాంతిపుంజాల నుంచి మొదలుకొని కొండంత రేడియేషన్ కిరణాల వరకు ఎన్నెన్నో తాకిడులనూ, కాలుష్యాలనూ ఎదుర్కొనేందుకు... ప్రతి మనిషికీ ప్రకృతి ఏర్పాటు చేసిన తొలి స్వాభావిక కవచం – మన చర్మం. పర్యావరణపరంగా బాహ్యం నుంచే కాకుండా ఒత్తిడీ, మానసిక వేదనల కారణంగా లోపలి నుంచి తాకిడి ఉండటంతో – ఇలా ఇరువైపులనుంచీ నలిగిపోతుంది చర్మం. మానసిక ఒత్తిళ్లు, తీవ్రమైన స్ట్రెస్ కారణంగా చర్మంపై పడే దుష్ప్రభావాలేమిటి, వాటిని అధిగమించడమెలాగో తెలుసుకుందాం.
చర్మంపై నేరుగా...
మొటిమలు: తీవ్రమైన మానసిక ఒత్తిడి అనే అంశం చర్మంపై మొటిమలను పెంచుతుంది. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని స్పష్టంగా తెలిసింది. ఇటీవలి అధ్యయనాల ప్రకారం ఒత్తిడి పెరిగినప్పుడు సెబేషియస్ గ్లాండ్స్ ప్రభావితమై, అవి తీవ్రంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. (హైపర్ యాక్టివ్ అవుతాయి). ఆ గ్రంథుల్లోంచి ‘సెబమ్’ అనే నూనె వంటి పదార్థం స్రవిస్తుంది. అయితే ఈ గ్రంథుల చివర్లలో ఉన్న కణజాలం మృతి చెంది, ఆ నూనె వంటి పదార్థాన్ని బయటకు రాకుండా ఆపినప్పుడు, నూనె గ్రంథి మూసుకుపోయి మొటిమ వస్తుంది. ఒత్తిడితో చర్మానికి జరిగే అనర్థమిది.
రోజేషియా: తీవ్రమైన ఒత్తిళ్ల కారణంగా చర్మంలోకి కొంత భాగం ఎర్రబారడాన్ని రోజేషియా అంటారు. రొజేషియా కండిషన్‌లో చర్మం ఎర్రగా, ఉబ్బెత్తుగా మారి ముక్కుకు ఇరువైపులా బుగ్గలపై మొటిమలు ఏర్పడతాయి. ఇలాంటివి మెడ, ఛాతీపైన కూడా కనిపిస్తాయి. అలాగే కోపోద్రిక్తతలు, తీవ్రమైన అవమానం, తీవ్రమైన అసహనం (ఇరిటేషన్), తీవ్రమైన విచారం, ఉద్విగ్నతకు లోనుకావడం (యాంగై్జటీ), వ్యాకులతకు లోనవ్వడం (డీ–మోటివేషన్), ఎదురుదాడికి దిగేందుకు సిద్ధమయ్యేంతగా ఉద్రిక్తత (అగ్రెసివ్‌నెస్), తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన అలసట... ఇలాంటి ఎన్నో భావోద్వేగాలు మేని (ముఖ్యంగా ముఖంపైన ఉండే చర్మం) రంగును ఎర్రగా మారుస్తాయి. ఒత్తిడి తొలగినప్పుడు ఈ రంగు కూడా తొలగుతుంది.
సొరియాసిస్ : అప్పటికే సొరియాసిస్ ఉన్నవారు... ఒకవేళ తీవ్రమైన (మానసిక, శారీరక) ఒత్తిళ్లకు లోనైతే వారి సొరియాసిస్ వ్యాధి మరింత తీవ్రమవుతుంది.
ఒత్తిడి సొరియాసిస్ రూపంలో వ్యక్తమైనప్పుడు చర్మంపై అవాంఛిత లక్షణాలు కనిపిస్తాయి. అవి...
⇔ దురద, పొడిబారడం, పొలుసుల్లా రాలడం
⇔ సొరియాసిస్ ఉన్నవారికి చర్మంపై ఎర్రటి మచ్చలు ఎక్కడైనా రావచ్చు.
⇔ వెండిలా మెరుస్తున్నట్లుండే మచ్చలు కనిపించచ్చు.
⇔ పురుషుల్లో మర్మావయవాల వద్ద పుండ్లు పడచ్చు.
⇔ కీళ్లనొప్పులు
⇔ మాడుపై తీవ్రమైన చుండ్రు
⇔ ఒక్కోసారి ఈ మచ్చలు వచ్చిన భాగంలో వాపు, నొప్పి వంటివి కనిపించవచ్చు.
సెబోరిక్ డర్మటైటిస్ : కొంతమందిలో తీవ్రమైన ఒత్తిడి వల్ల మాడుపై చర్మం పొలుసుల్లా రాలిపోతూ ఉంటుంది. ఇది పొట్టులా పొడిగా కాకుండా, జిడ్డుగా రాలుతుంది. తలపై చర్మం ఎర్రబారి ర్యాష్‌లా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సొరియాసిస్, లేదా ఎగ్జిమాను పోలి ఉన్నప్పటికీ ఇది వేరు, పగుళ్లలా, పొలుసులు రాలినట్లుగా ఉండే ఈ కండిషన్ మాడుపైనే గాక... శరీరంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు దీని తీవ్రత మరింత పెరుగుతుంది. సాధారణంగా ఒత్తిడి తొలగినప్పుడు ఈ సమస్య కూడా తగ్గుతుంది.
ఎగ్జిమా : తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల వల్ల సాధారణంగా 20 నుంచి 40 ఏళ్ల వారిలో వచ్చే ప్రధాన సమస్య ఎగ్జిమా. ఈ వయసు వారిలో తమ వృత్తికి సంబంధించిన, ఇతరత్రా ఒత్తిళ్లు ఎక్కువ. అప్పటికే ఎగ్జిమాతో బాధపడేవారికి దీని తీవ్రత మరింత ఎక్కువవుతుంది. ఇక ఒకేచోట కూర్చొని పనిచేసే ఐటీ ఉద్యోగుల వంటివారిలో చర్మానికి ‘న్యూరో డర్మటైటిస్’ అనే ఎగ్జిమా రావచ్చు. ఇంకా అటోపిక్ డర్మటైటిస్ అనే ఎగ్జిమా ఉండే పిల్లల్లో ఒత్తిడి వల్ల ఆ జబ్బు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఎగ్జిమా నివారణ, చికిత్స :
⇔ సువాసన లేని, అలర్జీ రహిత (హైపో అలర్జిక్) మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి.
⇔ దురద ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు వాటిని తగ్గించే పూత మందులు వాడాలి.
⇔ ఈ వయసువారు తప్పక వ్యాయామం చేయాలి.
విటిలిగో : తమ రోగనిరోధక శక్తి తమపై ప్రతికూలమైన ప్రభావం చూపడం వల్ల బొల్లి సమస్య వస్తుంది. ఇలా అప్పటికే బొల్లి ఉన్నవారిలో మానసిక ఒత్తిడి మరింత పెరిగితే ఆటోమేటిగ్గా బొల్లి తీవ్రత పెరుగుతుంది. బొల్లి వచ్చిన వారిలో శరీరంపై తెల్లటి మచ్చలు ప్యాచ్‌లలా కనిపిస్తాయి. ఈ మచ్చల్లో ఎలాంటి నొప్పీ ఉండదు. వీటితో ఆరోగ్యానికి హాని కూడా ఉండదు. కానీ చూడటానికి ఇది అంతగా బాగుండదు. కాబట్టి దీన్ని ఎవరూ కోరుకోరు. ఇంగ్లిష్‌లో దీన్ని విటిలిగో అంటారు. సాధారణ ఒత్తిడికి తోడు... దాని వల్ల చర్మంపై వ్యక్తమైన బొల్లి వల్ల రోగులు మరింతగా మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంది.
జుట్టు మీద...
నిరంతర మానసిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం: నిరంతర మానసిక ఒత్తిడి వల్ల చర్మంపై పడే తొలి దుష్ప్రభావం... దానిపైన ఉండే వెంట్రుకలను రాలిపోయేలా చేస్తుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోవడానికి వెంట్రుక పెరుగుదల దశలు కొంత ఉపకరిస్తాయి. వెంట్రుక పెరుగుదలలో కెటాజెన్, టిలోజెన్, అనాజెన్ అనే దశలుంటాయి. ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోవడం అన్నది సాధారణంగా టిలోజెన్ దశలో జరుగుతుంటుంది. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్’ అంటారు. అంటే జుట్టు ఏ దశలో ఉన్నప్పటికీ... అది ఊడిపోయే దశ అయిన టిలోజెన్ వైపునకు ప్రస్థానం జరుగుతుంది. టిలోజెన్ దశ దీర్ఘకాలం కొనసాగుతుందన్నమాట. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఒత్తిడితో ఉండే వారి మాడుపైన ఉండే జుట్టు దువ్వుకుంటున్నప్పుడు సాధారణం కంటే ఎక్కువగా రాలిపోతుంటుంది. స్నానం చేసే సమయంలోనూ బాత్‌రూమ్ ఫ్లోర్‌లోనూ, తూము దగ్గర కుచ్చులు కుచ్చులుగా రాలిపడుతుంది.
అరికట్టడం ఇలా : ఒత్తిడి తొలగిపోయాక కేవలం ఒత్తిడి కారణంగానే రాలిపోయిన జుట్టు మళ్లీ మొలుస్తుంది.
ఒత్తిడితో జుట్టు పీక్కోవడం
మరీ ఒత్తిడిని తట్టుకోలేకపోయిన కొందరు జుట్టు పీక్కుంటూ ఉండే సంగతి చాలామందిలో మనం గమనించేదే. ఇలా తమ జుట్టు తాము లాక్కునే కండిషన్‌ను ట్రైకో టిల్లోమేనియా అంటారు. బాగా ఒత్తిడితో ఉండేవారు తమ గోళ్లు విపరీతంగా కొరుక్కున్న తరహాలోనే ఇలా జుట్టునూ పీకేసుకుంటుంటారు. దాంతో వారి తల బట్టతలగా మారిపోతుంది. ఇక కొందరైతే తల పూర్తిగా ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా బట్టతలగా మారిపోయాక... కనురెప్పల వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటారు.
ఒత్తిడితో బట్టతల : ఒత్తిడి తీవ్రమైనప్పుడు చాలా మందిలో తలపై జుట్టు రాలిపోతూ ఉంటుంది. పురుష హార్మోన్ల కారణంగా వచ్చే బట్టతల ఉన్నవారిలో ఒత్తిడి పెరిగితే... ఆ బట్టతల మరింతగా పెరుగుతుంది. అలొపేషియా ఏరేటా (పేనుకొరుకుడు) అనే సమస్య కూడా ఒత్తిడి వల్ల మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి తగ్గించుకోడానికి...
⇔ చర్మంపై శ్రద్ధ పెంచుకోవాలి. మేని నిగారింపు కోసం ఆరోగ్యకరమైన మార్గాలను ప్రయత్నించాలి.
⇔ సిగరెట్ తాగడం స్ట్రెస్‌ను తగ్గిస్తుందన్నది వట్టి అపోహ. పొగతాగడం వెంటనే మానేయండి. ∙కొంత మంది పని ఒత్తిడిని తగ్గించుకోడానికి మద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. దీర్ఘకాలంలో అది దుష్ప్రభావం చూపుతుంది. మద్యం తాగేవారి చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది. మద్యం అలవా టుంటే, వయసుకన్నా ఎక్కువగా కనపడుతుంటారు.
⇔ నడక చర్మానికి సైతం మేలు చేసే వ్యాయామం.
⇔ కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి. ∙కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటుంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. కోలా డ్రింక్స్‌లోనూ కెఫిన్ ఉంటుంది. కాబట్టి మీ చర్మపు మెరుపును, నిగారింపును తగ్గించే కెఫిన్ పదార్థాలు మానేయండి. ∙రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేయండి. ∙భోజనవేళలను కచ్చితంగా పాటించండి.
⇔ ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేస్తారు.
⇔ ఒత్తిడిని కలిగించే అంశాలకు స్పష్టంగా ‘నో’ చెప్పాలి.
⇔ చురుకుదనం పెరుగుతుందని ఒత్తిడి సమయంలో షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటారు. అయితే ఇవి మేని నిగారింపును, మెరుపును తగ్గిస్తాయని గుర్తుంచుకోవాలి.