
ఉదయం ఆరింటికే సెల్‌ఫోన్ మోగింది.‘ఇంత పొద్దున్నే కాల్ చేసింది ఎవరా?’ అనుకుంటూ చూస్తే ‘రమణి’ పేరు కనిపించింది.‘‘హలో రమణీ! ఏంటే పొద్దున్నే కాల్ చేశావు?’’ అడిగింది విశాల.‘‘విశాలా! శాడ్ న్యూసే’’ అన్నది రమణి.‘‘వాట్?’’‘‘మన స్వప్నకి యాక్సిడెంటయిందంట.’’‘‘ఎప్పుడు?’’‘‘నిన్న సాయంకాలం.’’‘‘ఎలా జరిగింది?’’‘‘మూడో అంతస్తుకు కొత్తగా స్లాబ్ పోశారంట. దానికి పిట్టగోడ లేదంట. ఆరిన బట్టలు తీయడానికి వెళ్లిందంట. పొరపాటున కాలు జారి పడిందట. హాస్పిటల్‌కు తీçుకెళ్లే లోపలే ప్రాణం పోయిందంట.’’రమణి చెప్తున్న మాటలు వింటూనే విశాలకు దుఃఖం ముంచుకొచ్చింది. ఏడవ సాగింది.‘‘ఊరుకోవే! ఏం చేస్తాం? దానికి అంతవరకే రాసిపెట్టుంది.’’ రమణి ఊరడిస్తోంది.‘‘నేను దాన్ని చూడాలే..!’’ ఏడుస్తూనే అన్నది విశాల.
‘‘విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందట బాడీ. అక్కడ పోస్ట్‌మార్టమ్ చేస్తారంట. యాక్సిడెంట్ కాబట్టి పోస్ట్‌మార్టమ్ చేయాలని పోలీసులు బాడీని తీసుకెళ్లారంట.’’‘‘నాలుగు రోజుల కిందటే చాలాసేపు మాట్లాడిందే నాతో. ఇంతలో ఇలా అవుతుందనుకోలేదు. నీకు ఎవరు చెప్పారే ఈ విషయం?’’‘‘మా తమ్ముడు పైడిభీమవరంలో ఒక ఇండస్ట్రీలో పని చేస్తున్నాడే! స్వప్న వాళ్లాయన యూనిట్ కూడా అక్కడే ఉందట. రామనారాయణ భార్యకు యాక్సిడెంట్ అయిందని తెలియగానే వీడు వాళ్లింటికి వెళ్లాడట. అది నాకు ఫ్రెండ్ అని తెలుసు కదా! నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. నేను షాక్ తిన్నాను. నిద్రపట్టలేదనుకో. మనం కాలేజీలో గడిపిన రోజులన్నీ కలలోకి వచ్చాయి. రాత్రే నీకు చెప్పాలనుకున్నా కానీ నాలాగే తెల్లార్లూ బాధపడతావని చెప్పలేదు’’ అన్నది రమణి.
‘‘నేను పిల్లల్ని స్కూలుకు పంపించి నీ దగ్గరకు వస్తాను. ఇద్దరం వెళ్దాం’’ అన్నది విశాల.‘‘మనం వెళ్లేసరికి విజయనగరం నుంచి వాళ్ల ఊరికి తీసుకెళ్లి పోతారేమోనే?’’‘‘పైడిభీమవరం వెళ్దాం. విజయనగరం నుంచి ఎంతసేపు? నేను కారు తీసుకొస్తాను.’’‘‘సరే! నేను రెడీగా ఉంటాను’’ అన్నది రమణి.తన క్లోజ్‌ఫ్రెండ్ స్వప్నని తలుచుకుంటూ దుఃఖిస్తుంటే శేఖర్ అడిగాడు.‘‘ఏంటి విశాలా? ఏం జరిగింది?’’ రమణి ఫోన్ చేసి స్వప్న యాక్సిడెంటలో చనిపోయన విషయం చెప్పిందని, విశాల చెప్పింది.‘‘మీరిద్దరూ చాలా క్లోజ్‌ఫ్రెండ్స్ కదూ! వాళ్ల పెళ్లికి మనం దసపల్లా హోటల్‌కి వెళ్లాం. అయిదారేళ్లయింది కదూ?’’‘‘ఏడేళ్లయిందండీ! మన పెళ్లయిన ఏడాది తర్వాత దానికి పెళ్లయింది.’’‘‘పాపం చిన్నవయసు. ఎంతమంది పిల్లలు?’’‘‘ఇద్దరు.’’‘‘బ్యాడ్‌లక్ విశాలా! నువ్వేంటీ వెళ్దామనుకుంటున్నావా?’’‘‘ఔనండీ! డాబా గార్డెన్స్‌లో నా ఫ్రెండ్ రమణి ఉంది కదా! ఇద్దరం కలిసి వెళ్తాం.’’‘‘ఈ టెన్షన్‌లో కారు నడుపుతావా? వద్దులే! నేను వస్తాలే. పిల్లల్ని రెడీ చెయ్యి. వాళ్లు స్కూలుకు వెళ్లగానే బయల్దేరదాం’’ చెప్పాడు శేఖర్.
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ దగ్గర్లో కూర్మన్నపాలెంలో ఉంటున్నారు శేఖర్, విశాల. అతను స్టీల్‌ప్లాంట్‌లో ఇంజనీర్. పదింటికి కూర్మన్నపాలెంలో బయల్దేరి దారిలో డాబా గార్డెన్స్‌లో ఉన్న రమణిని కారులో ఎక్కించుకున్నారు.రమణి గంభీరంగా ఉంది కానీ విశాల మాత్రం డిప్రెషన్‌లో మునిగిపోయిన దానిలా అయిపోయింది వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. కారుడ్రైవ్ చేస్తున్న శేఖర్, రమణి ఏదొకటి మాట్లాడుతున్నా విశాల పట్టించుకోనట్టు ఉండిపోయింది. కారు విజయనగరం శివారులోకి ప్రవేశించగానే ‘‘కారు ఆపు..!’’ అన్నది విశాల, శేఖర్‌వైపు తీవ్రంగా చూస్తూ. శేఖర్ కారును రోడ్డుపక్కకు ఆపాడు. విశాల డోర్ తీసుకొని రోడ్డు మీద పరిగెత్తుతున్నట్టు వేగంగా నడవ సాగింది. శేఖర్, రమణిలకు ఏమీ అర్థంకావడం లేదు. ఉన్నట్టుండి విశాల వింతగా ప్రవర్తించడం చూసి ఆశ్చర్యపోతున్నారు.
శేఖర్ పరిగెత్తుకుంటూ వెళ్లి విశాల చెయ్యిపట్టుకుని ఆపాడు.‘‘విశాలా! ఏంటిది? ఎక్కడికి?’’ అన్నాడు అయోమయంగా చూస్తూ.‘‘నేను స్వప్నని. విశాల ఎక్కడుంది? నువ్వెవరు?’’ అన్నది విశాల శేఖర్‌ని తీవ్రంగా చూస్తూ.పెద్దషాక్ తిన్నట్టయిపోయాడు శేఖర్. ఎందుకో ఆమెను చూస్తే భయం వేసింది. కళ్లు పెద్దది చేసి చూస్తూ పెద్దగా అరుస్తోంది. శేఖర్‌కి ఏం తోచడం లేదు. ఇంతలో రమణి అక్కడికి చేరుకుంది.‘‘విశాలా..?’’ అన్నది.‘‘ఏయ్! కళ్లు పోయాయానే నీకు? నేను స్వప్నని. విశాల అంటావేంటే? ఎక్కడుంది విశాల. ఈయనెవరు?’’ అన్నది శేఖర్‌ని చూస్తూ.రమణికి పరిస్థితి అర్థమైంది. స్వప్న ఆత్మ విశాలను ఆవహించింది. అందుకే అలా మాట్లాడుతోంది.‘‘సరేనే స్వప్నా! పద.. నడిచి ఎక్కడికి పోతావు? కారెక్కు మీ ఊరు పైడిభీమవరానికి వెళ్దాం’’ అన్నది రమణి.‘‘ఉండు. ఏదైనా బస్సు వస్తే ఎక్కుదాం. ఈయన ఎవరు? మనల్ని కారులో ఎక్కడికి తీసుకెళ్తాడు?’’‘‘ఈయన విశాల వాళ్లాయన. గుర్తుపట్టలా?’’
‘‘ఎప్పుడో చూశాను. గుర్తుపట్టలా?’’‘‘సరే కారెక్కు’’‘‘అదికాదే రమణీ! ముందు పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలి.’’‘‘పోలీస్ స్టేషన్‌కి ఎందుకు?’’ ఆశ్చర్యపోతూ అడిగింది రమణి.‘‘చెప్తానుగా! ఏమండీ ముందు నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లండి’’ అన్నది.‘‘సరే! అలాగే...!’’ అన్నాడు శేఖర్.కారు విజయనగరం పోలీస్ స్టేషన్ ముందు ఆపి, శేఖర్ ముందుగా లోపలకు వెళ్లాడు. జరిగిందంతా చెప్పాడు.. తన భార్య విశాల, ఆమె స్నేహితురాలు స్వప్నలా మాట్లాడుతున్నదనీ, పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లమని ఒత్తిడి చేసిందనీ చెప్పాడు. ఇన్స్‌పెక్టర్‌కు ఆశ్చర్యం కలిగింది. ఈ రోజుల్లో ఆత్మలు ఆవహించడం ఏమిటి? గమ్మత్తుగా ఉందే అనుకున్నాడు. సరే! ఆమె ఏం చేప్తుందో విందాం అనుకున్నాడు.
శేఖర్, విశాల, రమణి... ఇన్స్‌పెక్టర్ చాంబర్‌లోకి వెళ్లారు. విశాల ఇన్స్‌పెక్టర్‌కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. శేఖర్ ఆమె పక్కన కూర్చోబోతుండగా విశాల వారించింది.‘‘నేను ఇన్స్‌పెక్టర్‌గారితో పర్సనల్‌గా మాట్లాడాలి. మీరిద్దరూ బైటకు వెళ్లండి’’ అన్నది.శేఖర్, రమణి వెళ్లిపోయారు.‘‘ఇన్స్‌పెక్టర్ గారూ! నా పేరు స్వప్న. మా ఆయన పైడిభీమవరంలో ఇండస్ట్రీ నడుపుతారు. మాది విశాఖపట్నం. నేను పుట్టి పెరిగింది అక్కడే. ఏడేళ్ల క్రితం మాకు పెళ్లైయింది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. రెండో పిల్ల పుట్టినప్పటి నుంచి మా అత్త సత్తెమ్మ నన్ను సతాయించడం మొదలుపెట్టింది. మాకు ఇంత ఆస్తి ఉంది. వారసుడు లేడు. నాకు మనవడు కావాలి. నువ్వు ఇద్దరు ఆడ ముండల్ని కన్నావు. తర్వాత కూడా నీకు ఆడపిల్లలే పుడతారు. మా వాడికి ఇంకొక పెళ్లి చేస్తాను. నువ్వు విడాకులు ఇవ్వు అని తిడుతోంది. మా ఆయన కూడా తల్లికి వంత పాడుతున్నాడు.
కానీ నేను విడాకులకు ఒప్పుకోలేదు. దేవుడు ఆడపిల్లల్ని ఇస్తుంటే నేనేం చేసేది? నా తప్పేంటి? అని ఎదురు తిరిగాను. ఈ విషయంలో మా ఆయన నన్ను కొడుతుండేవాడు. ఏదొక రోజున నిన్ను చంపేస్తాను. పీడ విరగడవుతుంది అనేవాడు. సార్! నిన్న సాయంకాలం నేను మేడపైకి వెళ్లాను. లోగడ రెండు అంతస్తుల మేడ ఉంది. దాని మీద మూడో అంతస్తు వేశారు. అక్కడ నేను బట్టలు ఆరేస్తుంటాను. ఆరిన బట్టలు తియ్యడానికి వెళ్లాను. అప్పుడు నా భర్త, అత్త నన్ను పట్టుకొని కిందకు నెట్టారు. దానికి ఇంకా పిట్టగోడ కట్టకపోవడంతో సులభంగా నెట్టేశారు.’’ఆమె వెక్కివెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఆమె చెప్పిన మాటల్లో ఇన్స్‌పెక్టర్‌కు క్లూ దొరికింది.‘‘అమ్మాయ్! మీ ఆయన, అత్తను జైలుకు పంపిస్తాను. నువ్వు ఇంటికెళ్లు’’ అన్నాడు ఇన్స్‌పెక్టర్.‘‘థ్యాంక్స్! ఇన్స్‌పెక్టర్ గారూ!’’ అంటూ విష్ చేసి బైటకు నడిచింది విశాల. తర్వాత ఇన్స్‌పెక్టర్.. స్వప్న భర్త రామనారాయణని, అత్త సత్తెమ్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో విచారించారు. రామనారాయణ అంతా బూటకమని దబాయించాడు.
‘‘మా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. మీరు కోడల్ని మేడపై నుంచి నెడుతున్నప్పుడు ఒకాయన వీడియో తీశాడు స్మార్ట్‌ఫోన్‌లో. ఎవరూ చూడలేదనుకున్నారు మీరు’’ అని ఇన్స్‌పెక్టర్ దబాయించేసరికి ఇద్దరూ నేరం ఒప్పుకున్నారు. విజయనగరం హాస్పిటల్‌కి వెళ్లి స్వప్న మృతదేహాన్ని చూసి విశాల, రమణి, శేఖర్ తిరుగుప్రయాణం మొదలుపెట్టారు. తర్వాత విశాల, తనకు స్వప్న ఆత్మ ఆవహించినట్టు నాటకం ఆడానని చెప్పింది. ‘‘స్వప్న ఫోన్ చేసినప్పుడు భర్త, అత్త చంపుతామని బెదిరిస్తున్నట్టు చెప్పేది. మేడపై నుంచి పడిందని వినగానే నాకు, అది నిజం కాదనిపించింది. భర్త, అత్త కుట్ర చేసి ఉంటారని అనుమానించాను. నా అనుమానం నిజమైంది’’ అన్నది విశాల. తర్వాత స్వప్న అత్త, భర్తలకు జైలుశిక్ష పడింది. ఉపాయంతో వాళ్ల కుట్రను బైటపెట్టిన విశాలను అంతా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment