సుధాచంద్రన్
అతి చిన్నవయసులోనే నృత్య వేదికలను ఘల్లుమనిపించిన సుధాచంద్రన్.. తన అడుగుల కరతాళ ప్రతిధ్వనులను పూర్తిగా వినకుండానే పదహారేళ్ల వయసులో కాలును పోగొట్టుకున్నారు. పోయింది కాలే కానీ, ఆమె నిబ్బరం కాదు. ఒంటికాలి మీదే దీక్ష పట్టారు. నాట్యతపస్విని అయ్యారు. అనేక విజయ శిఖరాలను అధిరోహిచారు. నర్తకిగా, నటిగా, సమాజ సేవకురాలిగా ఎన్నో పాత్రలు పోషించారు. ఇప్పుడు మళ్లీ మరొకసారి తెలుగులో చిన్ని తెర మీదకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన సాక్షితో ఆత్మీయంగా ముచ్చటించారు.
గంగానది జీవధార. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉగ్రరూపం దాలిస్తే అంత భయానకంగా ఉంటుంది. అందుకేనేమో ఈ దేశంలో స్త్రీని గంగానదితో పోలుస్తారు. కల్మషమైన లోకాన్ని స్వచ్ఛంగా మార్చే శక్తి స్త్రీకే ఉంది. అందుకే కావచ్చు సుధ తరచు ‘గంగ’ కాన్సెప్ట్‌తో నృత్యరూపకాలు ప్రదర్శిస్తుంటారు. ఈ ముప్పై ఏళ్లుగా నృత్యంతో పాటు ఆమె హిందీ, మలయాళం, తమిళం, కన్నడ సినీ, టీవీ రంగాలలో పని చేస్తున్నారు. ‘‘ఇప్పుడిక ‘నెంబర్ వన్ కోడలు’ గా మీ వీక్షణకు నోచుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది’’ అంటూ తన జీవిత ప్రవాహంలోని మలుపుల తలపుల్లోకి వెళ్లిపోయారు సుధ.
కూతురే పుట్టాలని..!
అమ్మనాన్నలకు ఒక్కతే కూతుర్ని. నాన్న చంద్రన్‌ది కేరళ అయినా ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. అమ్మ తంగం గృహిణి. శాస్త్రీయ సంగీతకారిణి. కొన్నాళ్లు క్లాసికల్ డ్యాన్సర్ సుధా దొరైవాన్ దగ్గర స్టెనోగ్రాఫర్‌గా వర్క్ చేసింది. కూతురు పుడితే సుధ అని పేరు పెట్టుకోవాలని, డ్యాన్సర్‌ని చేయాలని కలలు కంది. అందుకే నాకు మూడేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్పించింది. పదహారేళ్ల వయసు వచ్చేటప్పటికే నేను చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇవ్వగలిగానంటే అది అమ్మ ప్రయత్నము, పట్టుదలే. ఓ రోజు కారులో ఇంటికి వస్తుంటే జరిగిన ప్రమాదంలో కుడికాలును పోగొట్టుకున్నాను. ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. నాకిక భవిష్యత్తే లేదనిపించింది. ఆ సమయంలో.. ‘‘నువ్వు నిలబడాలి.. నువ్వు డ్యాన్స్ చేయాలి.. ’’ అంటూ అమ్మానాన్న ఇచ్చిన మనోబలం సామాన్యమైనది కాదు. నాన్న దిన, వార పత్రికలు తెచ్చి ఇచ్చి, వాటిల్లోని ఇన్‌స్పైరింగ్ స్టోరీలను చదవమనేవారు.
టీవీలో వచ్చే ప్రతీ సమాచారాన్ని తెలుసుకోమనేవారు. ఏ చిన్న సమాచారం ఎవరు అడిగినా చెప్పేలా నన్ను తీర్చి దిద్దారు. ఇప్పటికీ నాకు చదివే అలవాటు పోలేదు. అమ్మ కూడా దిగులు పడటం మానేసి ధైర్యం తెచ్చుకొని నన్ను నిలబెట్టింది. కృత్రిమ కాలుతో రెండేళ్ల సాధన. రాత్రి–పగలు తేడా లేదు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్లతో నరకం చూశాను. తర్వాత రెండేళ్లకు ఓ రోజు కృత్రిమ కాలుతో మొదటిసారి స్టేజి మీద మూడుగంటల సేపు నిర్విరామ ప్రదర్శన ఇచ్చాను. హాల్లో వెయ్యిమంది లేచి నిల్చొని తమ చప్పట్ల హోరుతో నాకు అభినందనలు తెలియజేశారు. ఆ సమయంలో మాటల్లో చెప్పలేనంత ఉద్విగ్నతకు లోనయ్యాను. ఉప్పెనలా ముంచేసిన కష్టంలోంచి ఒక్కసారిగా బయట పడినట్లయింది.
అత్తింటి అదనపు శక్తి
ఇండియా, సౌదీ అరేబియా, అమెరికా, కెనడా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్‌లలో నృత్య ప్రదర్శనలు. దాదాపు అన్ని భాషా చిత్రాలలో నటిగా గుర్తింపు. ఒక కష్టాన్ని అధిగమించాక నాకు వచ్చిన అవకాశాలు ఎన్నో. వాటిల్లో ఒక్కదానినీ వదులుకోలేదు. సినిమాలు చేస్తున్నప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రవి డంగ్‌తో పరిచయం ఏర్పడింది. తనది బెంగాలీ కుటుంబం. మానసికంగా దగ్గరయ్యాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అనుకున్న రెండు రోజుల్లోనే పెద్దల అంగీకారంతో పెళ్లయ్యింది. నేను దక్షిణాది అమ్మాయిని, తను ఉత్తరాది అబ్బాయి. పద్ధతుల్లో పూర్తి వ్యత్యాసాలున్న కుటుంబ నేపథ్యాలు అయినా అత్తింటివారంతా నన్ను అక్కున చేర్చుకున్నారు.
నెంబర్‌వన్ కోడలు
జీ తెలుగులో ఈ వారమే మొదలైన ఈ సీరియల్ ద్వారా ‘వాగ్దేవి’గా పరిచయం అవుతున్నాను. విద్యాసంస్థలను నడిపే వ్యక్తిగా తన చుట్టూ ఉన్నవారంతా చదువులో నెంబర్‌వన్‌గా ఉండి తీరాలనుకుంటుంది వాగ్దేవి. అలాంటి వాగ్దేవి ఇంట అక్షరం ముక్క రాని కోడలు అడుగుపెడుతుంది. చేస్తున్న పనిలో నెంబర్ వన్‌గా ఉండాలనే నా తపనకు తగ్గట్లు వచ్చిన అవకాశం ఇది’’ అంటూ ముగించారు సుధాచంద్రన్.
జీవితంలో వచ్చే సవాళ్లు ఒక్కోసారి పెను ఉప్పెనలా ముంచేస్తాయి. ఆ ఉప్పెన నుంచి ఉవ్వెత్తున లేవాలంటే పోరాటం చేయాలి. ఆ పోరాటంలో నిలబడిన శక్తి సుధాచంద్రన్. నేర్చుకోవాలనుకునేవారికి ఆమె జీవితం ఎప్పటికీ ఓ కొత్త పాఠం.
– నిర్మలారెడ్డి ఫొటో: శివ మల్లాల
చిన్న వయసులోనే!
►సుధ పందొమ్మిదేళ్ల వయసులో ‘మయూరి’ సినిమా ద్వారా నాట్యమయూరిగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు.
►సుధ జీవిత చరిత్ర 8–11 ఏళ్ల వయసు స్కూలు పిల్లలకు అనేక రాష్ట్రాలలో పాఠ్యాంశమయింది.
►ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇన్‌వెర్టిస్ విశ్వవిద్యాలయం సుధను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment