నాలుగు నిమిషాలు.. యాబై మంది వాయిస్‌లు | Malayalam Woman Mimicry Artist Akhila | Sakshi
Sakshi News home page

ముగ్గురిని అనుకరిస్తూ ముప్పైమందిని నవ్వించడమే..

Published Sat, Jan 18 2020 8:22 AM | Last Updated on Sat, Jan 18 2020 8:48 AM

Malayalam Woman Mimicry Artist Akhila - Sakshi

మిమిక్రీలో చాలావరకు పురుషుల గొంతులే వినిపిస్తాయి. మహిళలూ ఆ అనుకరణను అవలీలగా చేస్తారు... అని అఖిల ఏఎస్‌ అనే అమ్మాయి నిరూపిస్తోంది. నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రీటీలను అనుకరించి చూపించింది! ఆ వీడియో వైరలయింది.

‘‘ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు దుమ్ము.. ఓ వైపు పొగ...’’ అంటూ యాంటీ స్మోక్‌ యాడ్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ను అనుకరిస్తోంది ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి తన తరగతి గదిలో. అచ్చంగా యాడ్‌లోని పురుషుడి గొంతుతోనే మాట్లాడుతున్న ఆ మాటలకు క్లాస్‌ అంతా ఈలలు, చప్పట్లతో మారుమోగిపోతోంది. వన్స్‌ మోర్‌ అంటున్నారు క్లాస్‌మేట్స్‌. అలా గోపన్‌ నాయర్‌ (మలయాళం వాయిస్‌ ఆర్టిస్ట్, ఈ నగరానికి ఏమైంది అనే యాడ్‌కు మలయాళంలో వాయిస్‌ ఇచ్చింది అతనే) నుంచి మలయాళ నటీమణులు పార్వతి, నజిరియా నాజిమ్, కేరళ రాజకీయ నాయకులు ఇలా ఒకరి తర్వాత ఒకరిని అనుకరిస్తూనే ఉంది. ఆ అమ్మాయి పేరు ఏఎస్‌ అఖిల. ఆయుర్వేద వైద్యవిద్యను అభ్యసిస్తోంది. ఈ యేడాదితో చదువు పూర్తయిపోయి డాక్టర్‌ పట్టా పుచ్చుకోనుంది. పైన చెప్పుకున్న ఆమె మిమిక్రీ సీన్‌ ఆ కాలేజ్‌లో చేసిందే. 

మిమిక్రీఖిల
అఖిల మలయాళ అమ్మాయి అని ఈపాటికే అర్థమయ్యుంటుంది. పుట్టింది, పెరిగింది తిరువనంతపురం జిల్లాలోని నేడుమంగడ్‌లో. చిన్నప్పటి నుంచీ చుట్టూ ఉన్న పరిసరాలను, మనుషులను పరిశీలించడం అలవాటు ఆమెకు. ఆ పరిశీలనలోంచే ఈ మిమిక్రీ కళ అబ్బింది, అలవడింది. స్కూల్లో ఉన్నప్పుడే క్లాస్‌లో తన కళను ప్రదర్శించేది. క్లాస్‌ టీచర్స్‌ను, క్లాస్‌మేట్స్‌ను అనుకరిస్తూండేది. ఒకసారి ఇలాగే క్లాస్‌లో డెమో ఇస్తూండగా టీచర్స్‌కు పట్టుబడింది. ఫలితం.. స్కూల్‌లో ఆమె కళాప్రదర్శన. దాంతో అఖిలకు స్టేజ్‌ ఫియర్‌ పోయి ధైర్యం వచ్చింది. ఎక్కడైనా ప్రదర్శనలు ఇవ్వగలననే ఆత్మవిశ్వాసమూ పెరిగింది. అప్పటినుంచి తిరువనంతపురంలో జిల్లాల్లోని ప్రతి ఇంటర్‌స్కూల్‌ కాంపిటీషన్‌లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఎక్కడ గొంతు సవరిస్తే అక్కడ ప్రైజులు వచ్చిపడేవి. ఆ కళను తనతోపాటే పెంచి పెద్దచేసుకుంది. అయితే ఎక్కడా దానికి సంబంధించి శిక్షణ తీసుకోకుండానే. టీవీ, పరిశీలన ఇవే ఆమె ధ్వన్యనుకరణ నైపుణ్యాన్ని పెంచిన గురువులు. 

ఎవరెవరిని అనుకరిస్తుంది?
ఎవరిని కాదు అని అడగొచ్చు. రజినీకాంత్, కమల్‌హసన్, అద్నన్‌ సమీ, ఎస్‌. జానకి, ఓమెన్‌ చాందీ, వీఎస్‌ అచ్యుతానందన్, షాలినీ, షామిలీ (చిన్నప్పటి వాయిస్‌లను).. ఇలా చెప్పుకుంటూ పోతే వందకు పైనే తేలొచ్చేమో జాబితా. 

ఈ వీడియో వైరల్‌..
ఒక మలయాళం చానెల్‌లోని ఓ ప్రోగ్రామ్‌లో అఖిల చేసిన మిమిక్రీ వీడియోలో కేవలం నాలుగంటే నాలుగు నిమిషాల్లో యాభై ఒక్కమంది సెలబ్రిటీల స్వరాన్ని అనుకరించింది. ప్రతి నాలుగు సెకన్లకు ఆడ, మగ గొంతును మారుస్తూ. ఆ ‘షో’ను చూసిన ప్రేక్షకులు ఆమె ప్రతిభకు అబ్బురపడ్డారు. మిమిక్రీ కళలో మహిళా సూపర్‌స్టార్‌ అనే పేరు తెచ్చేసుకుంది అఖిల ఈ షోతో. ఇప్పటివరకు మలయాళంలో ఎందరో మిమిక్రీ కళాకారులు వచ్చినా.. తర్వాత తర్వాత వాళ్లంతా సినిమా ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు. కాని అఖిల అలా కాకుండా మిమిక్రీ కళాకారిణిగానే కొనసాగాలనుకుంటోందట. 

ఈ నగరానికి ఏమైంది.. 
‘‘ఈ నగరానికి ఏమైంది’’ మలయాళం యాడ్‌కు గళమిచ్చిన గోపన్‌ నాయర్‌ను అనుకరిస్తూ ఓ వీడియో కూడా చేసింది అఖిల. ఆ వీడియోకు మైఖేల్‌ జాక్సన్‌ ‘డేంజరస్‌’ పాట మ్యూజిక్‌ను జతకూర్చి ఒక కొత్త ప్రయోగానికి రూపమిచ్చింది. అన్నట్టు అఖిల .. కేరళకు చెందిన తొలి ‘లేడీస్‌ ఓన్లీ మిమిక్స్‌ పరేడ్‌ గ్రూప్‌’లో సభ్యురాలు కూడా. మీ లక్ష్యం ఏంటి అని అడిగితే ‘‘ఇలాగే ముగ్గురిని అనుకరిస్తూ ముప్పైమందిని నవ్వించడమే’’ అంటుంది నవ్వుతూ అఖిల ఏఎస్‌.

‘చిన్నప్పటినుంచీ పక్షుల కిలకిలారావాలు, జంతువుల అరుపులను బాగా అబ్జర్వ్‌ చేసేదాన్ని. నేను ఫస్ట్‌ మిమిక్రీ చేసింది కూడా పక్షుల కూతలనే. తర్వాత ఇంట్లోవాళ్లను, ఫ్రెండ్స్‌ని, టీచర్స్‌ని అనుకరించే దాన్ని. నిజానికి మా ఇంట్లో ఎవరికీ ఈ కళ లేదు. కేవలం పరిశీలనతో నా అంతట నేను నేర్చుకున్నదే. సెలబ్రిటీల విషయానికి వస్తే నేను ఎస్‌. జానకమ్మను ముందు ఇమిటేట్‌ చేశా. టీవీ బాగా చూస్తాను. నా స్కిల్‌ను పెంచి నాకు కచ్చితత్వాన్ని ఇస్తున్న సాధనం అదే’
– అఖిల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement