బజ్జీ తింటావా బుజ్జీ!! | special story to bajji | Sakshi
Sakshi News home page

బజ్జీ తింటావా బుజ్జీ!!

Published Fri, Jun 16 2017 11:28 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM

బజ్జీ తింటావా బుజ్జీ!!

బజ్జీ తింటావా బుజ్జీ!!

ఫ్రూట్‌ బజ్జీ!

బజ్జీలు కారంగా ఉంటాయి బుజ్జి, బుజ్జిగాడు బజ్జీ తినరు. అందుకే ఈ స్పెషల్‌ బజ్జీ! తియ్యగా, పుల్లగా వేయించిన బజ్జీ!! సూపర్‌ ట్రెండీ ఫ్రూట్‌ బజ్జీ! ఫర్‌ బుజ్జీ అండ్‌ ఫ్యామిలీ!!

జామకాయ బజ్జీ
కావల్సినవి: జామకాయలు (గులాబీ రంగు గుజ్జు ఉన్నవి) – 3–4; టెంపురా పిండి (ఇది మైదా, గుడ్డు కలిపి తయారుచేస్తారు.  మార్కెట్‌లో లభిస్తుంది. ఈ పిండిలో వెజ్‌ టెంపురా, నాన్‌వెజ్‌ టెంపురా కూడా లభిస్తుంది. ఈ పిండితో బజ్జీలు మరింత రుచిగా ఉంటాయి); దీనికి బదులుగా మైదా వాడుకోవచ్చు) – 2 కప్పులు; పసుపు – చిటికెడు; పంచదార – అర కప్పు (తగినంత); పంచదార పొడి –  పావు కప్పు; నూనె – వేయించడానికి తగినంత

తయారీ: జామకాయ చివరలు కట్‌ చేయాలి. తర్వాత సన్నని స్లైసులుగా కట్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో టెంపురా పిండి లేదా మైదా పోసి, పసుపు వేసి తగినన్ని నీళ్లతో జారుగా కలుపుకోవాలి. దీంట్లో పంచదార పొడి వేసి కలపాలి. పంచదార పూర్తిగా పిండిలో కరగనివ్వాలి. పొయ్యిమీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. పిండిలో జామకాయ స్లైసులను ముంచి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేయించుకొని తీయాలి. వేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి చల్లి, చాక్లెట్‌ సాస్‌తో సర్వ్‌ చేయాలి.

స్ట్రాబెర్రీ బజ్జీ
కావల్సినవి: మైదా – 2 కప్పులు; బేకింగ్‌ పౌడర్‌ – టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – అర టీ స్పూన్‌ ; పంచదార – ముప్పావు కప్పు; దాల్చిన చెక్క పొడి – టీ స్పూన్‌; జాజికాయ పొడి – పావు టీ స్పూన్‌; పాలు – ఒకటిన్నర కప్పు; వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ – టీ స్పూన్‌; 4 గుడ్లలోని తెల్లసొన; 3 గుడ్లలోని పసుపు సొన; నూనె – టేబుల్‌ స్పూన్‌; నిమ్మరసం – టేబుల్‌ స్పూన్‌; స్ట్రాబెర్రీలు – రెండున్నర కప్పులు (కడిగి, తడిలేకుండా తుడవాలి); బ్లాక్‌ బెర్రీ – పావు కప్పు (గింజలేనివి); నూనె – వేయించడానికి తగినంత; పంచదార పొడి – తగినంత

తయారీ: ఒక గిన్నెలో పొడి పదార్థాలన్నీ వేసి కలపాలి. మరొక గిన్నెలో పాలు, గుడ్డులోని పసుపుసొన, నూనె, నిమ్మరసం, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిపదార్థాలలో వేసి పిండి మృదువుగా అయ్యేంతవరకు గిలకొట్టాలి. మరొక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన గిలక్కొట్టి ఈ మిశ్రమాన్ని పిండి మిశ్రమం మీదుగా వేయాలి. స్ట్రాబెర్రీలను పలచని ముక్కలుగా కట్‌ చేసి, పిండిలో వేయాలి. బ్లాక్‌బెర్రీలను కూడా అలాగే వేసి ఉంచాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. దీంట్లో పిండి పట్టిన స్ట్రాబెర్రీలు, బ్లాక్‌ బెర్రీలు వేసి ముదురు గోధుమ రంగు వచ్చే వరకు అన్ని వైపులా వేయించి, తీయాలి. పైన పంచదార పొడి చల్లి వెంటనే సర్వ్‌ చేయాలి. దీనికి చాకెలెట్‌ సాస్‌ను కాంబినేషన్‌గా ఇవ్వచ్చు.

పియర్‌ బజ్జీ
కావల్సినవి: పియర్‌ పండు – 1 (పై తొక్క తీసి సన్నని స్లైసులుగా కట్‌ చేయాలి); ఆలివ్‌ ఆయిల్‌ – టేబుల్‌ స్పూన్‌; మైదా – ముప్పావు కప్పు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూన్‌; ఉప్పు – పావు టీ స్పూన్‌; మిరియాల పొడి – చిటికెడు; గుడ్డు – 1 ; పాలు – 3 టేబుల్‌ స్పూన్లు; నూనె – వేయించడానికి తగినంత

తయారీ: పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌ వేడయ్యాక పియర్‌ స్లైస్‌లు వేసి రెండు వైపులా వేయించుకొని, చల్లారనివ్వాలి. ఒక గిన్నెలో మైదా, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. మరొక చిన్న గిన్నెలో గుడ్డు సొన, పాలు కలిపి గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో కలపాలి. మూకుడు పొయ్యి మీద పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధంగా ఉంచుకున్న పిండి మిశ్రమంలో పియర్‌ పండు ముక్కను ముంచి, తీసి కాగుతున్న నూనెలో వేసి వేయించి, తీయాలి.

పనసపండు బజ్జీ
కావల్సినవి:  పనసపండు ముక్కలు – 250 గ్రాములు; బియ్యప్పిండి – 2 టేబుల్‌స్పూన్లు; సోడా – చిటికెడు; కారం – టేబుల్‌ స్పూన్‌; పసుపు – పావు టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; శనగపండి – కప్పు; జీలకర్ర – టీ స్పూన్‌; నూనె – వేయించడానికి తగినంత

తయారీ: పనసపండు తొనలను, నిలువుగా పలచని ముక్కలు కట్‌ చేసుకోవాలి. ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, సోడా, బియ్యప్పిండి, జీలక్రర, శనగపిండి, టేబుల్‌ స్పూన్‌ నూనె, కప్పుడు నీళ్లు పోసి కలపాలి. దీంట్లో పనసతొనలు వేసి కలపాలి. ఈ తొనలను ఒక్కోదాన్ని తీసుకుంటూ కాగుతున్న నూనెలో వేసి, వేయించి తీయాలి. వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.

ఆపిల్‌ బజ్జీ
కావల్సినవి: ఆపిల్స్‌ – 2; శనగపిండి – కప్పు; కారం – అర టీ స్పూన్‌; దోసె పిండి – టేబుల్‌ స్పూన్‌; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత

తయారీ: ఒక గిన్నెలో శనగపిండి, నీళ్లు, ఉప్పు, కారం, ఇంగువ, దోసెపిండి వేసి జారుగా కలపాలి. ఆపిల్‌ను స్లైసులుగా కట్‌ చేసి, మధ్య భాగం కత్తితో గుండ్రంగా (చిల్లుగారెలా) కట్‌ చేయాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న ఆపిల్‌ స్లైస్‌ను పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా దోరగా వేయించాలి. పుదీనా లేదా టొమాటో సాస్‌తో వడ్డించాలి.

పైనాపిల్‌ బజ్జీ
కావల్సినవి: పైనాపిల్‌ స్లైసులు – 6 పీసులు; మైదా – కప్పు; ఉప్పు – తగినంత; బేకింగ్‌ పౌడర్‌ – చిటికెడు; ఒక గుడ్డు సొన; నీళ్లు – తగినన్ని ; నూనె – వేయించడానికి తగినంత; పంచదార – టేబుల్‌ స్పూన్‌

తయారీ: ఒక గిన్నెలో పిండి, ఉప్పు, బేకింగ్‌ సోడా, గుడ్డు సొన, పంచదార వేసి కలపాలి. దీంట్లో నీళ్లు పోసి దోసె పిండిలా చిక్కగా ఉండేలా కలుపుకోవాలి. మూకుడు పొయ్యి మీద పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. పైనాపిల్‌స్లైస్‌ను పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా ముదురు గోధుమ రంగు వచ్చేలా వేయించుకొని తీయాలి. వేడి వేడిగా వడ్డించాలి.

అరటిపండు బజ్జీ
కావల్సినవి: అరటిపండ్లు – 2; మైదా  – 1/2 కప్పు; పంచదార – టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – చిటికెడు; బేకింగ్‌సోడా – చిటికెడు; నూనె – వేయించడానికి తగినంత

తయారీ: ఒక గిన్నెలో మైదా, ఉప్పు, పంచదార, బేకింగ్‌ సొడ వేసి కలపాలి. దీంట్లో నీళ్లు పోసి పిండి జారుగా కలుపుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. అరటిపండు తొక్క తీసి, నిలువుగా మూడు పీసులుగా కట్‌ చేయాలి. ఒక్కో అరటిపండు ముక్కను సిద్ధంగా ఉంచిన పిండి మిశ్రమంలో ముంచి, నూనెలో వేసి ముదురు గోధుమరంగు వచ్చే వరకు వేయించుకొని తీయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement